నా అంతరంగ తరంగాలు-23

-మన్నెం శారద

నాకు తెలిసిన రమాప్రభ 

శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను.

          శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా తమిళంలో ఆయనకు విరివిగా పాత్రలు లభించాయి.

          నా మొదటి పరిచయం ఎక్కడంటే ఒకసారి నేను ఉదయం పత్రికలో ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ‘సీరియల్ రాస్తున్నప్పుడు దాసరి గారు నన్ను అర్జెంట్ గా రమ్మని కారు పంపించారు. ఏదో ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతున్నది. ఆఁ ఇల్లెక్కడో, ఏ సినిమా షూటింగో నాకిప్పుడు ఎంత గింజుకున్నా గుర్తు రావడం లేదు. బహుశా బంజారా హిల్స్ లో అనుకుంటాను.

          నేను వెళ్లేసరికి దాసరి గారు ఆఁ ఆవరణలో వున్న చెట్లక్రింద కూర్చుని ఎవరెవరి తోనో మాట్లాడుతున్నారు.

          నేను వెళ్లి ఆయనకు నమస్కరించాను.

          నన్ను చూడగానే ఆయన నవ్వి “రామ్మా రా రా. నీకు ఒకరిని చూపించాలని అర్జెంట్ గా పిలిపించాను “అని ఆప్యాయంగా పలుకరించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.
ఆఁ  ప్రేమకు, అభిమానానికి ఆయన దగ్గర నాకెప్పుడూ లోటులేదు. ఉదయంలో సీరియల్ రాయాలని రచయితలు పొటీ పడుతున్న తరుణంలో ఆయన రెండుసార్లు పిలిపించి తనే నాకు అవకాశం కలిపించారు.

          “నువ్వు నా సోదరివి, అపర సరస్వతివి. నా వీక్లీకి మొదటి రచన నువ్వే చేయాలి ” అని ఆయన గౌరవించడం నేను ఎన్నడూ మరచిపోలేను.

          “నీకొక వ్యక్తిని పరిచయం చేయాలని నిన్ను పిలిపించాను. ” అంటూ దూరంగా కూర్చున్న ఒక వ్యక్తిని సైగ చేసి దగ్గరకి పిలిచారు. అతను మాదగ్గరగా వచ్చి నిలబడ్డాడు.

          ” ఇతని పేరు రఘువరన్. తమిళ సినిమాల్లో పైకొస్తున్నాడు. మన సినిమాలో ఇప్పుడితనే హీరో, బాగున్నాడా?” అని అడిగారు నన్ను అదే చిరునవ్వుతో.

          నేను చాలా కన్ఫ్యూషన్ కు లోనయ్యాను. మన సినిమా ఏమిటా అని.

          అడిగే ధైర్యం లేదు.

          “ఈవిడే ఆఁ కథా రచయిత్రి.. నువ్వే అందులో హీరో పరీక్షిత్తువి!” అని అనగానే నాకు ఆయన నా నవల ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సినిమాగా తియ్యాలని అనుకుంటున్నారని అర్ధమయ్యింది.

          సీరియల్ గా వస్తున్నప్పుడు అది సినిమాగా రాబోతుందంటే ఎవరికయినా సంతోషమే కదా! రఘూవరన్ వెంటనే నాకు నమస్కరించాడు.

          అలా నాకు ఒక గొప్పన్నటుడ్ని చూసే అవకాశం లభించింది.

          శరత్ బాబు గురించి చెబుతానని రఘువరన్ గురించి చెబుతుందేమిటని ఆశ్చర్య పడకండి. అక్కడికే వస్తున్నా.

          నేను తిరిగి వెళ్ళడానికి లేస్తే “హాల్లో అందరూ భోంచేస్తున్నారు, నువ్వుకూడా భోంచేసి వెళ్ళమ్మా ” అన్నారు దాసరి గారు.

          ఎవరో నన్ను లోపల డైనింగ్ హాల్ కి తీసుకెళ్లారు.

          అక్కడ చాలా పెద్ద డైనింగ్ టేబుల్ వుంది. చుట్టూ చాలా మంది నటులు వున్నారు.
నాకు బాగా గుర్తున్నది జయసుధ గారు, శరత్ బాబు గారు.

          అందరూ హలో చెప్పి పలుకరించారు.

          ” ఏదయినా సినిమాకు రాస్తున్నారా!” అని అడిగారు శరత్ బాబు గారు. నేను జరిగిన విషయం చెప్పాను.

          ఆయన జయసుధ గారి వైపు తిరిగి “ఈమె చాలా మంచి రైటర్, ఈ మధ్యనే వీరి వానకారు కోయిల చదివాను” అంటూ నా వైపు తిరిగి “ఎవరూ సినిమాకు అడగలేదా ఆఁ కథ? “అన్నారు.

          తమిళంలో కార్తీక్ అడిగారు. సువర్ణ (సినిమా హీరోయిన్, ఇప్పటి తమిళ నటుడు రవి అత్త గారు ) టెలిసీరియల్ గా తియ్యాలని ప్రయత్నిస్తున్నారని చెప్పాను.”ఎవరు తీసినా అందులో జగదీశ్ కేరక్టర్ మాత్రం నేనే చేస్తాను. మీరు రికమెండ్ చేయాలి. వాసవి పాత్రకు జయసుధ గారు బాగుంటారు.” అంటుంటే మిగతా వారు ఆఁ కథగురించి ఆరా తియ్య సాగారు. అలా సరదాగా వారితో కాసేపు పాలు పంచుకుని ఇంటికి వచ్చేసాను. తర్వాత ఎప్పుడైయినా, ఎక్కడయినా ఆయన తారస పడినప్పుడల్లా నన్ను చూసి నవ్వుతూ “జగదీశ్ పాత్ర నాదే మేడం, గుర్తుంచుకోండి ” అనేవారు నవ్వుతూ.

          సహజసిద్ధంగా సాత్వికడు, నిర్మలమైన అందమైన రూపం.. అందరినీ గౌరవించే మనస్తత్వం… శరత్ బాబు గారిలో వున్న మంచి లక్షణాలకు అందరం ఆకర్షితులమే అవుతాం.

          1994 లో నేను కథ మాటలు, రాసిన టెలిసేరియల్ ” ధవళ సత్యం గారి దర్శకత్వం లో చెన్నై షూటింగ్ జరుగుతున్నది. మణికం నారాయణగారని ఎంజీయార్ కు బాగా స్నేహితుడు ఆఁ సీరియల్ కు నిర్మాత. అందులో నటిస్తున్న రాళ్ళ పల్లి గారు స్క్రిప్ట్ చూసి రచయిత్రులు చాలామంది సినిమాలకు కథలు ఇచ్చారు గానీ ఇంత బాగా డైలాగ్స్ రాయగా చూడలేదు, ఆమెను ఒకసారి పిలిపించండి “అన్నారట.

          అందుకోసం అలా అంటే రానని కథలో ఏవో మార్పులు చేయాలని రమ్మన్నారు. నేను మా అక్కయ్యతో వెళ్లాను. చెన్నయ్ ఆవుట్ స్కర్ట్స్ లోని పోరూర్ లో ఒక పెద్ద బంగాళా లో షూటింగ్!

          చారుహాసన్, మురళి మోహన్, రాజా, రాళ్ళపల్లి, నర్రా, రమాప్రభ, హరిత, వసంత్ తదితరులతో భారీ ఎత్తున షూటింగ్ జరుగుతోంది అక్కడ. అసలు విషయం చెప్పి ధవళ సత్యం గారు , రాళ్ళపల్లి గారూ నవ్వారు. అక్కడ పరిచయమయ్యారు రమాప్రభ గారు నాకు.

          నా రెమ్యూనరేషన్ తెలిసి అందరితో ” మన సీరియల్లో హీరోయిన్ ఎవరనుకుంటు న్నారూ. శారద గారే… మనందరికన్నా ఆమె రెమ్యూనరేషనే ఎక్కువ.” అని చెప్పేవారు.
అలా అక్కడ ఆమె చాలా సన్నిహితురాలయి నన్ను తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రేమగా భోజనం తన చేతులతో వండి పెట్టారు.

          ఆఁ ఇల్లు పెద్దదే. ఇంటిముందు పెద్ద పెద్ద కార్లు వాడకుండా పడేసి ఉన్నాయి.
అంతకన్నా పెద్ద మేడ పోయిందట. ఇంట్లో వాళ్ల చుట్టాలు కొందరు వున్నారు. ఆమె సాయిబాబా భక్తురాలు. ఇంట్లో గుడిలోలా పెద్ద విగ్రహం వుంది. అన్నీ షిరిడీలో లానే అక్కడ ఏర్పాట్లు చేసారు. జొన్న రొట్టె చేసి ప్రసాదంగా పెట్టేవారు. కొంత తన పరిస్థితుల గురించి చెప్పినా శరత్ బాబు గారిని ఆమె ఏమీ నిందించలేదు. 

          “ఎప్పుడయినా చూసావా అతన్ని? ” అని అడిగారు.

          చెప్పాను.

          “ఎలాంటివాడనిపించింది? “

          నేను నవ్వాను. “ఎక్కడో నాలుగు మాటలు మాట్లాడితే ఏం తెలుస్తుంది, మంచిగానే అనిపించారు ” అన్నాను.

          “మంచివాడేలే ” అన్నారు తిరిగి.

          “మనం ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుందాం ఉండరాదూ నాతో కొన్నాళ్ళు” అన్నారు.

          “అప్పుడే నీకెందుకులే నాకన్న బాగా చిన్నదానివి కదా!” అని తిరిగి ఆమె అన్నారు.
షూటింగ్ లో నాల్రోజులు బాగా సన్నిహితమయ్యాం. అప్పట్లో ఆమె ఇంకా చాలా అందం గానే వున్నారు. నేను రాసిన ఆమె పాత్ర ఆమెకు మంచిపేరు తెచ్చింది. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డు తెచ్చిపెట్టింది.

          ఆమె ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి దగ్గర అవార్డు తీసుకుని “ఇది మన్నెం శారద గారిది… నాది కాదు “అని ఎలుగెత్తి అరవడం, ఆ తర్వాత ఆఁ సీరియల్లో వివిధ శాఖలకు నందులు గెలుచుకున్న పదిమంది ఆమెనే అనుకరించడం తో నాకు బహుమతి ఇస్తూ “ఏంటి మీ పేరు మారుమ్రోగి పోతున్నదీ, అంత బాగా రాసారా?” అంటూ నవ్వారు చంద్రబాబు నాయుడు గారు.

          అంతటి భోళా మనిషి రమాప్రభ.

          అవార్డ్స్ తీసుకునే ముందు మాకు గోల్కొండ హోటల్లో చిన్న విందు ఇచ్చారు. అందరం అక్కడ గేదర్ అయ్యాం. వాణీ జయరాం గారిని మొదటి సారి చూసి పలకరించి విష్ చేశాను.

          అందరూ నా సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు కావడం వలన నన్ను పలుకరిస్తు న్నారు. ఇంతలో శరత్ బాబు గారు నన్ను పిలిచి కొంతసేపు నాతో మాట్లాడేరు. ఆఁ  వెంటనే రమప్రభ గారు నన్ను పిలిచి “ఏమంటున్నాడు నన్ను గురించి ఏమయినా అడిగాడా?” అని ఆత్రంగా అడిగారు. నాకు నిజంగా కళ్లనీళ్లు తిరిగాయి.

          “ఎదురుగానే వున్నారు వెళ్లి పలకరించకూడదా? ” అన్నాను.

          వద్దులే, వద్దులే ” అన్నారామె కొంచెం దిగులుగా.

          ఆమె ఒకసారి హైదరాబాద్ ఏదో షూటింగ్ కని వచ్చి “నన్ను చూడ్డానికి రావా, ఈ రోజు నా పుట్టిన రోజు సారథి స్టూడియోలో వుంటాను” అన్నారు. స్టూడియో మాకు దగ్గరే కావడం వలన నేను నాకని కొనుక్కున్న నెమలి కంఠం రంగు మీద జెరీ నెమళ్ళు వున్న వేంకటగిరి చీర తీసుకుని వెళ్లి ఇచ్చాను. అప్పటికే అక్కడ లాన్ లో వలయాకారంలో వేసిన కుర్చీలలో అందరు కూర్చుని వున్నారు. రామానాయుడు గారు, జయసుధ, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారూ, మాలాశ్రీ…తదితరులు. రమాప్రభ గారు చీర చూసి చాలా మురిసిపోయారు. అందరకి చూపించేరు.

          కొన్నాళ్ళు ఇక్కడ సెటిలయ్యారు. ఆమెకు నాకు కామన్ ఫ్రెండ్ అయిన రత్న గారు వలన వారు మియాపూర్ లో కట్టించిన ఒక సాయిబాబా గుడిలో అప్పుడప్పడూ కలిసే వాళ్ళం.

          ఆర్ధిక ఇబ్బందులు, కారణాలు ఏమయినా ప్రేమించి పెళ్లిచేసుకుని కొన్నేళ్ళు కలిసి మెలిసి జీవించిన వ్యక్తి ఎదురుగా కనపడినప్పుడు మనసు కలత పడటం సహజం.
శరత్ బాబు గారు వెంటనే ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందుకు నేను తప్పు పట్టటం లేదు. కానీ రమాప్రభ గారు ఒంటరిగానే మిగిలిపోయారు. ఒకే ఫీల్డ్ లో ఉన్నం దున ఒకరికొకరు తారసపడటం సహజం. అలా చూసినప్పుడు మనసు కలతపడటం అంతకన్నా సహజం.

          అందువలనేమో ఆమె ఒక్కసారి ఏదోలా మాట్లాడేవారు. సాయిబాబాతోనే సాంగత్యం చేస్తూ తనదుఖాన్ని తానే మింగుతూ … అక్షరం తెలియకపోయినా అంతులేని జ్ఞానాన్ని సంపాదించి తనను తాను సంభాళించుకుని ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపు తున్నారు.

          పది రూపాయిల కోసం అవాకులు చవాకులు యు ట్యూబుల్లో పేలే చౌకబారు విశ్లేషకుల తప్పుడు మాటలు విని చాలా మంది ఒక నిర్ణయంకు వచ్చేస్తారు. అందులో సినీతారలంటే మరీనూ. ఆఁ ఫీల్డ్ లో తారసపడే కష్టాలు సామాన్యమైనవి కాదు. మనవి అనుకున్నవి మనకళ్ళముందే జారిపోతుంటే ఆ హృదయం కార్చే కన్నీరు అత్యంత బాధాకరమైనది.

          అందుకే త్వరపడి దెబ్బతిన్న స్త్రీలని చులకనగా మాట్లాడటం నాకు ఎంత గానో బాధ కలిగిస్తుంది. చివరిగా ఒక్కమాట… ఆమె ప్రేమని, డబ్బునీ రెండూ కోల్పోయింది అందుకే ఆమె అందవిహీన అయ్యింది. అతను డబ్బుని, సుఖాన్ని కోల్పోలేదు.. అందుకే అందగాడుగానే మిగిలాడు.

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.