నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-ఎస్.కే.ఆముక్తమాల్యద
స్వాప్నిక జగత్తులో విహరిస్తూన్న వేళ…
ప్రకృతికి పరవశిస్తూ…
కొండలు, లోయలు, వాగులు, వంకలు
ఎన్నెన్నో దాటి కీకారణ్యంలోకి ప్రవేశించాను
పులులు, సింహాలు, తోడేళ్లు, పాములు..
ఆప్యాయంగా..ఆర్ద్రంగా
దయాపూరిత దృక్కులు ప్రసరిస్తూ. ..
స్నేహ పరిమళాలు వెదజల్లుతూ..
వాటిని ఆఘ్రాణిస్తూ నేను..
కృూర మృగాల ప్రేమ జడిలో తడిసి ముద్దవుతూ
నిర్భయనై హాయిగా సంచరించాను.
సుషుప్తి నుంచి జాగృదావస్థలోకి రాక తప్పలేదు
జనారణ్యంలోకి ప్రవేశింపకా తప్పలేదు.
కాంక్రీటు భవనాలు..రాతి హృదయాలు..
తుంటరి చూపుల తోడేళ్లు…
ఒంటరి ఆడాళ్లను వేటాడుతూ…వేధిస్తూ
ఆకలి గొన్న కొదమల్లా
అందాలకు ఆశపడుతూ మృగాళ్ళు..
నేను వీళ్ళ మధ్యే తిరుగాడాలి
‘నిర్భయ’ నై…నిస్సహాయనై…
అందుకే కలల కీకారణ్యాన్ని అన్వేషిస్తూ…
సుషుప్తినే ఆశ్రయించాను.
*****