నేను బాగానే ఉన్నాను

-విజయ తాడినాడ 

నా ప్రియమైన నీకు .. ..

‘ఎలా ఉన్నావు? బాగున్నావా?’ ఇదొక అర్థం లేని ప్రశ్న కదూ?

          అసలు “బాగుండటం” అనే పదానికి అర్థం ఏంటో?’ అని చాలాసార్లు ఆలోచిస్తాను.. విఫలమవుతూనే ఉంటాను.

          చిన్నతనంలో నేనే ఒక రాకుమారిని.. అమ్మ అనురాగం, నాన్న మమకారం .. అన్నల మాలిమి, అక్కల మక్కువ …. అన్నాలాటలు, తొక్కుడుబిళ్లలు, కోతి కొమ్మచ్చులు, పచ్చీసాటలు, తలస్నానాలు-తలలో మందారపూలు, పొడవు పావడాలు-జడకుచ్చులకై జగడాలు,అమ్మ డొక్కలో దూరి, ఆ చీర చెంగునే దుప్పటిలా కప్పుకుని ముడుచుకుని పడుకుని, లోకాన్నే ఎదిరించగలననే ధైర్యంతో స్వర్గంలొ తేలిపోయే ఆ క్షణాలలో ….నేను బాగానే ఉన్నాను !!

          బడికివెళ్ళి చదువుకునేటప్పుడు .. నేనొక యువరాణిని.. ..  నేనే ఒక విశ్వ సుందరిని! వేసుకోవటానికి అందమైన బట్టలు లేకున్నా, ముఖానికి తళుకుబెళుకులు లేకున్నా …. సహజ సౌందర్యంతో, మెరిసిపోయే కళ్ళతో, నుదిటిని ముద్దాడే ముంగురు లతో మురిపెంగా యుద్ధం చేస్తూ, పక్కన ఉన్న చెలులపై చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ, గమనించే చిలిపికళ్లను, చురుకు చూపులను మనోనేత్రంలో బంధిస్తూ, బడిలో సోపతులతో చదువులో పోటీ పడుతూ, తరగతిలో చదువులో అందరికన్నా ముందు న్నానని గురువులు మెచ్చినపుడు, అమ్మానాన్నలు మురిసినప్పుడు.. రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరించే రోజుల్లోనూ  .. నేను బాగానే ఉన్నాను!!

          పెళ్ళిచూపుల్లో తలవంచుకుని, చీర కొంగుని మెలిపెడుతూ, బొటనవేలితో నేలపై ముగ్గులేస్తూ, సిగ్గు పడుతూ, పెద్దల మాటను జవాదాటకుండా మూడుముళ్ళు వేయించు కుని, కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టి, ఏడాదిలో పండంటి పాపని ఎత్తుకుని, వారాసులకోసం ఎదురు చూసే చురకత్తి చూపులనెదుర్కొని, మరుసటి ఏడు ముద్దులొలికే పాపడిని అందించి, అత్తింటి నా అర్హతను పదిలపరుచుకుని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఒడిపిల్లడితో, ఎడ పిల్లతో సతమతమవుతూ, అత్తమామలను మెప్పిస్తూ, అర్థమొగుడిని లాలిస్తూ, శ్రీవారిని మురిపిస్తూ, ఇల్లే ప్రపంచంగా బతికే రోజుల్లోనూ —–నేను బాగానే ఉన్నాను!!

          నెలలు-సంవత్సరాలు గడుస్తూ, పిల్లల చదువులతో నా కాలం కరిగిపోతూ, పెరుగు తున్న వయసు  భారాన్ని నెత్తినేసుకుంటూ, కాంటెంపరరీ జబ్బులని లోపల దాచు కుంటూ, ‘అమ్మా! ఈ అబ్బాయికి నేనంటే ప్రాణం, నాన్నకు చెప్పవూ!’ అంటూ గారాలు పోయే కూతురి అర్థింపునీ, “అమ్మా! నేను పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసు కుంటా, నాన్నకేం చెప్పుకుంటావో చెప్పుకో” అని కొడుకు అల్టిమేటం పడేసినప్పుడు – దిక్కుతోచక, ముగ్గురికీ సర్ది చెప్పలేక, నీళ్ళు నములుతూ , గుటకలు మింగుతూ, తన అసమర్థతను నా చేతకానితనమని కొత్త భాష్యం చెప్తున్నా స్వీకరిస్తూ, పిల్లల పురుళ్ళూ-పుణ్యాలు తీరుస్తూ, మనవల ముద్దూ మురిపాలూ అనుభవిస్తూ —-మలిదశ ఆనందాన్ని పొందే రోజుల్లోనూ —– నేను బాగానే ఉన్నాను!!

ఎందుకంటే———-

          ‘నేను’ ఒక స్త్రీ ని. నాలాంటి ఎంతోమందికి ఒక ప్రతినిధిని. ఎదురయ్యే ప్రతి మలుపునీ మజిలీగా చేసుకుంటూ – జీవిత ప్రయాణాన్ని కొనసాగించే నిరంతర ప్రయాణీకురాలిని. ఇప్పుడే కాదు ఎప్పుడూ ‘బాగానే ఉంటాను’ మరి!!!

                                                                                      — నీ ప్రియమైన నేను

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.