“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల

(బంగారు ఆచార్యులు గారి “ప్రశ్న” కవితా ఖండికపై పరామర్శ)

-వి.విజయకుమార్

          ఒక కవితా ఖండికకు వినూత్నంగా “ప్రశ్న” అనే శీర్షిక  కావడమే ఒక చైతన్యం. ప్రశ్నించడం అంటేనే చైతన్యం. బంగారు ఆచార్యులు గారు వామపక్షవాది. వామ పక్షీయుల దృక్కోణం ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతుంది. ఉద్యమ నేపథ్యంతో, ప్రజా సంబంధాలతో, క్షేత్రస్థాయిలో అనేక పోరాటాల్లో స్వయంగా పాల్గొని సోషలిస్టు మార్గంలో సమాజం నడవాలని ఆకాంక్షిస్తూ, నడుస్తున్న చరిత్రలోని అమానవీయ, అన్యాయపు ధోరణుల్ని ధైర్యంగా ప్రశ్నిస్తూ, సరళ సుందరమైన భాషలో, ఎంతో భావావేశంతో మరెంతో బాధ్యతాయుతంగా సామాజిక దౌష్ట్యాలనూ, స్త్రీ సమాజం పట్ల దౌర్జన్యాలనూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. కష్టజీవికి అటూ ఇటూ నిలబడే వాడే కవి అని గాఢంగా నమ్మిన ఆచార్యుల వారు బడుగు బతుకుల పట్ల సానుభూతితో, ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతులు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహనతో, తాను పరిశీలించిన సమస్యలని సమాజం ముందు పెడుతూ ఎలా పోరాడితే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

          సరళత్వం తన ఆయుధం. తన పాఠకులెవరో, తను ఎంచుకున్న కవితా వస్తువే మిటో, అది ఎవరి హృదయంలో చైతన్యపు నిప్పు కణికను రగల్చాలో ఎరిగిన వారు గనకే తెచ్చి పెట్టుకున్న కృతక భాషతో కాకుండా, పద బంధాల ఫీట్లతో పనిలేకుండా, శబ్దాల మోతతో, గాఢత్వపు పదాడంబరాల ముచ్చట లేకుండా ఏ ప్రజల కోసమైతే కలం పట్టారో వారికి చేరువ కావడమే లక్ష్యంగా రచనలు చేస్తూ వచ్చారు. యే రచన చేసినా సామాజిక ప్రయోజనం కోసమే తప్ప దానికి భిన్నంగా ఒక్క ముక్క కూడా రాసి ఎరుగని నిబద్ధత కలిగిన రచయిత ఆచార్యుల వారు.

          “ప్రశ్న” తడమని సామాజిక అంశం లేదు. ఆది నుంచి తుది దాకా ఒకటే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ కవితా ఖండికలో కేవలం పరిశీలించటం మాత్రమే నేర్పకుండా ప్రశ్నించడం నేర్పి సమస్యను అధిగమించడానికి యేం చేయాలో కూడా సూచించే పరిష్కారాలను ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. 

          చాలా కవిత్వాలు ఉన్నదున్నట్టుగా చెప్పేసి తమ పని అయిపోయిందనుకుంటా యి. సమస్యని ప్రతిభావంతంగా వ్యక్తీకరించడం మంచి కవిత్వం అవుతుందేమో కానీ సామాజిక ప్రయోజనం దృష్ట్యా పరిష్కారం సూచించకపోతే అది గొప్ప కవిత్వం కానేరదు. కవిత్వానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుందని విశ్వసించే వారికి ఇది తెలియని విషయం కాదు. మనసా, వాచా, కర్మణా కవిత్వ ప్రయోజనాన్ని ఆవాహన చేసుకున్న ఆచార్యులవారు తన రచనల్లో ఎక్కడా కూడా దీన్ని మర్చిపోకపోవడం ప్రశంసార్హం.

          నిజాలను ఎప్పుడూ ప్రశ్నలే నిగ్గు తేలుస్తాయి. అందుకే  ప్రశ్న అంటే భయం అబద్ధాల్లోళ్ళకి – అంటారు ఆచారి గారు. ఎందుకు భయం? అబద్ధపు తలకిందుల ప్రపంచంలో “నిజాలు” ప్రపంచాన్ని కాళ్ళ మీద నిలబెట్టేలా డిమాండ్ చేస్తాయి కాబట్టే! ఇది ఎలాంటి దంటే హాయిగా భద్రంగా వేలాడే గబ్బిలాన్ని తిన్నగా కొమ్మమీద కూచోవ డాన్ని ఆశించడం. వ్యవస్థ గబ్బిలమైనప్పుడు తలకిందుల అస్తిత్వంలో ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్  అనుకుంటూ భద్రతను వెతుక్కున్న దాన్ని ప్రశ్నించడం దానికి నచ్చదు. అందుకే ప్రశ్న దాని అస్తిత్వానికి  భంగకరం. ఈ తలకిందుల ప్రపంచం కంటే నిటారుగా నిలబడి ఉండే ప్రపంచం చాలా మెరుగైనదనీ, భద్రమైనదనీ, మరింత ఆనందదాయకం అని చెప్పకపోతే ఈ గబ్బిలాల బతుకులు మారవనీ అందుకే ప్రశ్నించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అనీ కుండ బద్దలు కొడతారు ఈ కవితలో.

          నేనో ప్రశ్నను కవితలో నిన్నేమైనా ఆస్తిలో వాటా కావాలని అడిగానా? పాండవుల్లా ఓడిన రాజ్యమడిగానా? గుడులడిగానా? గోపురాలడిగానా? నా నిలువెత్తు శిలా విగ్రహమడిగానా? అంటారు.

          మరి కవి ఏమడిగారు? రాకెట్ల మీద గ్రహాంతరాళాల్లో దూసుకెళ్ళే రోజుల్లో అడవి బిడ్డల అమ్మతల్లులు బిడ్డని కనేందుకు మంచం సవారి పై వాగులు దాటే దయనీయ స్థితి నుంచి బిడ్డకు జన్మనివ్వడానికి ఒక చిన్నాసుపత్రీ, నడిచెళ్లే రోడ్డూ మాత్రమే అడిగారు! ఎంతటి హృదయ వేదన? 75 ఏళ్ల స్వాతంత్ర భూమిలో ఒక అడవి బిడ్డ ఆసుపత్రిలో ప్రసవం కోసం దేబిరించే పరిస్థితులు ఇంకా కొనసాగటం! 

          అబలలమే! అనే కవితలో, స్త్రీ స్వేచ్ఛలోని డొల్ల తనాన్ని తూర్పార పడుతూ ఇది మకిలి పట్టిన తప్పుడు చరిత్ర – పుచ్చిన తాటాకు చరిత్ర పుటల్లో – రాసుకుంటూ వచ్చిన మలిన చరిత్ర –  అంటూ

          మేము గనక ఏకకంఠంతో గర్జిస్తే – మేఘంలా ఉరిమితే – ఉప్పెనలా ఉప్పొంగి తే – అగ్ని కీలలై చెలరేగితే…అబల సబలయ్యే జీవన సూత్రం పరిఢవిల్లడం న్యాయం  అంటారు.

          కృషితో నాస్తి దుర్భిక్షం కవితలో నీవు తలవంచి నన్నాళ్లూ… నీ బతుకు బలి చక్రవర్తే! నీ భావదాస్యాన్ని విడనాడు – నీ సమాజానికి నీవే కర్తా, కర్మా, క్రియా…వాడు కాగితప్పులి – నువ్వు నిదురించే వ్యాఘ్రం. జనాభా రీత్యా బడుగులు కోట్ల మంది ఉన్నా ప్రభువర్గాల కోసం బతుకులు త్యాగం చేయడం తప్ప సొంతంగా ఎదిగే మార్గం ఏమిటన్న ఆలోచన లేకుండా బతుకీడ్చుకుంటూ పోయే భావదాస్యాన్ని ప్రశ్నిస్తు న్నాడు కవి. 

          ఎవరీ దోపీడీ సమాజపు అంతస్థుల్ని వెన్నెముకలా దన్నుగా కాచుకుంటున్న అమాయకులెవ్వరు? ఒక్కసారి దులపరిస్తే కుప్పకూలిపోయే ఈ నిర్మాణాన్ని ఎందుకు మోస్తున్నారీ బడుగు ప్రజలు? ఈ అజ్ఞానపు భావదాస్యాన్ని ఇంతగా రంగరించి పోసిన ఘనులెవ్వరు? మునులెవ్వరు? ఈ కాగితప్పులుల భరతాన్ని పట్టే ఆ నిదురించే సింహాన్ని నిద్రలేపే చైతన్యం ఎక్కడ?

          నిస్సారమైన నేలలో నీరు పారించినట్టు, నిరాశా నిస్పృహల నిస్తేజపు మెదళ్ళలో చైతన్యపు నిప్పుకణికలు రగిలించాలి. కవి రుజుపథికుడు కావాలి! కవి నవయుగ వైతాళికుడు కావాలి! గొప్ప సమాజం వైపు కళ్ళు తిప్పేలా ప్రజా సమూహాలకు చైతన్యపు దివిటీలు ఎత్తి పట్టాలి! విప్లవ నగారాలు మోగించాలి!

          ప్రశ్న ఆ పనే చేసింది. ఎవరో ఒకరు ఐస్ బ్రేక్ చేయకపోతే ఏమవుతుందో చరిత్ర రుజువు చేస్తూనే వచ్చింది. గడ్డకట్టి పేరుకుపోయిన ఈ కొవ్వెక్కిన ఈ మహా పర్వతాన్ని కరిగించడానికి, పెకిలించడానికి కాక పుట్టించే కలాలు కావాలి. కేక పుట్టించే గళాలు కావాలి. ప్రశ్న అదే పని చేసింది. బంగారు ఆచార్యుల వారి కలం నుంచి ఇలాంటి మరెన్నో ప్రశ్నలు వెల్లువెత్తాలని కోరుతూ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.