ప్రియ నేస్తాలు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మాసం మనం కేదారగౌళ రాగ విశేషా లను ముచ్చటించుకుందాము.
ముందుగా ఈ రాగ నామ విశేషాలు గమనిద్దాము. కొందరు శాస్త్రకారుల ప్రకారము కేదార అంటే పొలము, గౌళ/గౌడ అంటే గౌడ దేశము. గౌడ దేశములోని పొలము పాటలలో ఈ రాగ స్వరూపము లభించి ఉండవచ్చని అభిప్రాయము. అనేక రాగాలు జానపదాల నుంచి లభించి శాస్త్రీయత సంతరించుకున్నాయి. కొందరు శాస్త్రకారుల ప్రకారం కేదారం అంటే హిమాలాయాలలోని శైవ క్షేత్రము. గౌళ/గౌర అంటే శ్వేత వర్ణము. శ్వేతవర్ణ హిమాలాయాలలోని కేదారనాథ్ క్షేత్ర నామం ప్రకారమే ఈ పేరు వచ్చిందని కొందరి ఉద్దేశ్యము.
ఈ రాగం పుట్టుపూర్వోత్తరాలు తరచి చూస్తే 13 వ శతాబ్దంలోనే ఈ రాగ ప్రస్తావన కనిపిస్తుంది. హర కేదార గౌళ పేరుతో సంపూర్ణ రాగంగా కనిపించేది. కానీ 16-17 శతాబ్దా లలో హర కేదారగౌళ 28 వ మేళకర్త హరికాంభోజి గాను, కేదార గౌళ హరికాంభోజి జన్య రాగం గాను విడిపోయింది. అప్పటినుంచి నేడు వినిపిస్తున్న కేదారగౌళ ప్రచారంలోకి వచ్చింది.
ఈ రాగ విశేషాలను చూస్తే, ఇది 28వ మేళకర్త హరి కాంభోజి రాగ జన్యము. ఈ రాగ ఆరోహణ అవరోహణలు “సరిమపనిస” “సనిదపమగరిస”. ఇందులోని స్వరాలు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదం. ఆరోహణలో గాంధారం, దైవతం వర్జములు. అందువలన ఔడవ సంపూర్ణ రాగం, జన్య రాగం, ఉపాంగ రాగం, వర్జ రాగంగా పిలువబడుతుంది. గమకరాగం. తార స్థాయిలోని రిషభ గమకం రాగ స్వరూపాన్ని తెలియజేస్తుంది. రక్తి రాగము. మూడు స్థాయిలలోనూ పాడదగిన రాగము.
శుభప్రదమైన రాగము. రాగాలాపనకు, స్వరకల్పనకు అనువైనది, విస్తృతమైనది. అన్ని రకములైన రచనలు రచింపబడ్డాయి. ప్రసిద్ధ వాగ్గేయకారులందరు ఈ రాగంలో అనేక రచనలు చేశారు. భక్తి శృంగార రసముల కలయికతో శ్రవణానందకరంగా ఉంటుంది. అన్ని వేళల పాడదగినదే కానీ ప్రశాంత నిశీధిని మిక్కిలి అందాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. ఎక్కువగా పద్యములకు, శ్లోకములకు అనువైనది. రాగమాలికలలో ఒక రాగంగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. సినిమా సంగీతంలో రాగమాలికలలోనూ, పద్యాలలోనూ ఉపయోగించబడింది.
ఈ రాగంలోని “వేణుగానలోలుని” అన్న కీర్తన రచన గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీ త్యాగరాజ స్వామి తిరుఒత్తియూర్ లోని వీణ కుప్పయ్యరు గారి ఇంటికి విచ్చేశారట. ఆనాడు వారి ఇంట చైత్ర పౌర్ణమి ఉత్సవం జరుగుతోంది. శ్రీ కృష్ణ భక్తులైన వీణ కుప్పయ్యరు గారి ఇంట వేణుగోపాల స్వామి విగ్రహం ధగ ధగ లాడే నగలతోను, పరిమళభరిత పుష్పాలతోను అద్భుతమైన అలంకరణతో విరాజిల్లుతోంది. ఆ విగ్రహం దర్శించగానే త్యాగరాజస్వామి తన్మయత్వంతో “వేణు గాన లోలుని గన వేయి కనులు కావలెనే” అని ఆశువుగా పాడారట. అద్భుతమైన ఆ కీర్తనని లింక్ లో విని ఆనందించండి.
ఇంకొక దృష్టాంతం. రామనాధపురం శ్రీనివాస అయ్యంగారు తన రెండు మోకాళ్ళకు గాయలతో, ఎన్ని రోజులైనా ఉపశమనం లభించక, కదలలేని స్థితిలో నిస్పృహతో కేదార గౌళ రాగంలో “సరగున పాలింప” అనే కీర్తనని రచించి పాడారట. మొసలి బారినుండి గజేంద్రుణ్ణి, హిరణ్యకశిపుడి నుంచి ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి సమయం లభించింది కానీ పరమ భక్తుడినైన తనను కాపాడటానికి సమయం లేదా అని ఆర్థిస్తూ ఆ కీర్తన రచించారు. ఆ తరువాత కోలుకున్నాక తోడి రాగంలో “శ్రీ వెంకటేశం ” అనే కీర్తనని ధన్యవాదాలు తెలుపుతూ రచించారట.
ఈ రాగంలో లలితగీతాలు కూర్చబడినట్టు కనపడలేదు.
శాస్త్రీయ సంగీతం
- వర్ణము విరిబోణి ఝంపె ఆర్ వెంకటరామయ్యగారు
- కృతి తులసి బిల్వ ఆది త్యాగయ్యగారు
- కృతి వేణుగాన లోలుని రూపక త్యాగయ్య గారు
- కృతి వారిజనయన రూపక త్యాగయ్య గారు
- కృతి నీలకంఠం భజే రూపక దీక్షితులు గారు
- కృతి సరగున పాలింప ఆది రాంనాడ్ శ్రీనివాసఅయ్యంగారు
- కృతి ఎంత పిలిచినా ఆది పల్లవి శేషయ్య గారు
- కృతి జలజనాభ చాపు స్వాతి తిరునాల్ గారు
- పదము ఏమందునమ్మ ఆది క్షేత్రయ్య గారు
- జావళి ఏరా తగునాటరా ఆది ధర్మపురి సుబ్బరాయన్ గారు
వేణుగాన లోలుని https://youtu.be/jonBFTpgUa4?si=6mfMyN9cjDoWBS3i
లలిత గీతాలు
- జిలిబిలి చిరునవ్వు తిరుప్పావై (తెలుగు) తెలికిచర్ల కందాడైసీతమ్మగారు
https://youtu.be/f2YnmPiZcIw?si=73wkhwH_PimNehZm&sfnsn=wiwspwa
సినిమా సంగీతం
- ఆడబ్రతుకే మధురం సుమంగళి నాగయ్య గారు
- చతుర్భుజే మహాకవి కాళిదాసు ఘంటసాల గారు
- చిలుకన్న చిలుకవే జయం మనదే మాధవపెద్ది గారు
- వచ్చితిని రాయబారినై పల్నాటి యుద్ధం మాధవపెద్దిగారు
https://youtu.be/Fv5sr6dCagU?si=gMGf0bOvR6YwVUCb
ఇవండీ కేదార గౌళ రాగ విశేషాలు. వచ్చే నెల మరొక మంచి రాగ విశేషాలు తెలుసుకుందాము. మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు.