సస్య-5

– రావుల కిరణ్మయి

మలుపు

(సస్య విదుషి మాట మీద శ్రావణ్ ఇంటికి వంట చేయడానికి ఒప్పుకుంది. ఆ తరువాత …)

***

          ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచింది. కాసేపు మంచంలో కూర్చుండి తరువాత ఒక గంటలో ఇంటి పనులు స్నానం పూజ ముగించుకుంది. చెల్లెను, తమ్ముడిని చదువుకోవడానికని నిద్ర లేపింది.

          అమ్మను లేపాలనుకోలేదు. నిద్రలో ఆమె కలలు అవి ఎప్పటికీ ఆమెకు కలలే. కానీ అమ్మ కలలను నిజం చేయాలనే తపన సస్యది.

          దగ్గరగా వెళ్ళి తల్లి నుదుటి పై ముద్దు పెట్టుకుంది.

          చక చకా తయారయి బ్యాగ్ తగిలించుకుంది. శ్రావణ్ వాళ్ళ ఇంటికి బయలు దేరడానికన్నట్టుగా. ఇంతలో తల్లి నిద్ర లేచింది. టీ పెట్టి తీసుకు వచ్చింది. టీ ఇస్తూ
నువ్వు ఉదయం, సాయంత్రం పిల్లలకు ట్యూషన్లు మాట్లాడుకున్నావని విదుషి చెప్పిందమ్మా. ఎవరో అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు.. కూడా నాకే ఇవ్వమన్నావట గదా ! ఉండు తెచ్చిస్తాను అన్నది..

          సస్య కు అయోమయంగా అనిపించింది. కానీ బయటపడకుండానే, ఉండనీలేమ్మా ! ఏమంత పెద్ద మొత్తమని అంది. తనకు తెలియదు కాబట్టి మధ్యేమార్గంగా.

          పెద్ద మొత్తమే పదివేలు అని డబ్బులు తెచ్చింది.

          విదుషి ఎందుకు ఇచ్చినట్టు ? ఎలా అడగడం ? బహుశా తను అమ్మను పనికి మాట్లాడుకొమ్మన్నందున తననే పనిమనిషిగా అనుకుందా?

          సరేలే ఊరికే ఇచ్చినవైతే కాదు కదా! అని చెల్లెలు శ్రేయ వైపు తిరిగి

          శ్రీ..! ఇలా రారా! అని పిలిచి, నువ్వు పుట్టిన రోజు బహుమతి అడిగావు కదా! ఇదిగో ఈ పదివేలు ఉంచుకో అని చేతిలో పెట్టింది.

          ఇంత డబ్బు బహుమతా? నేనేదో సరదాగా అడిగానక్కా. నాకు మన్వే పెద్ద బహుమతి అంది మనసారా నవ్వుతూ. అబ్బా ! ఆ బోరింగ్ సినిమా డైలాగులు చెప్పకే తల్లి! అని అమ్మా ! చెల్లెకు సాయంత్రం బంగారు గొలుసు కొనిపెట్టమ్మ . ఇంకేమైనా సరిపోకుంటే నాకు ఫోన్ చేయమ్మా.. అని అమ్మ ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చింది.

          అమ్మ వద్దని చెప్పబోతుందని తనకు తెలుసుకాబట్టి. చెల్లెలు ముచ్చట తీర్చడమే తనకు ఆనందం కాబట్టి.

          శ్రావణ్ ఇంటి అడ్రస్ మరోసారి చూసింది. తనకు అంతగా పరిచయం లేనట్టుగా అనిపించింది. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి అడ్రస్ చూపించింది. అతను అడ్రస్ ను , సస్యను పరిశీలనగా చూడడంతో ఎందుకలా చూస్తున్నావయ్యా ? నీకైనా తెలుసా? లేదా? అంది. అడ్రస్ మళ్ళీ లోపల పెట్టి.

          తెలుసమ్మా! కాకుంటే రోడ్డు వరకు మాత్రమే వస్తాను. అన్నాడు.

          ఇంటివరకు ఎందుకు రావూ? అడిగింది.

          ఆ ఇల్లు రోడ్డు నుండి చాలా లోపలికి ఉంటుంది. పైగా జనసంచారము చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అది.

          నడవడానికి ఎంత టైం పడుతుంది.

          ఎంత లేదన్నా పదిహేను నిమిషాలు పట్టవచ్చు.

          సరే!ఇంటివరకు ఎంతిమ్మంటావు?

          వంద రూపాయలు.

          వందరూపాయలా? ఆశ్చర్యపోతూ అడిగింది.

          మీరు ఎవరినడిగినా ఇంకా ఎక్కువే తీసుకుంటారు. నేను మళ్లీ తిరిగి ఖాళీగానే రావలసి ఉంటుంది. వేరే ఎవరూ దొరకరు. నేను ఆ డబ్బులు కూడా అడిగితే 200/-లు అవుతాయి. ఈ రోజున మీదే బోని కాబట్టి అడగదలుచుకోలేదు అని వివరంగా చెప్పేసరికి మారుమాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.

          ఆటో బయలు దేరింది.

          అతను అడిగాడు. అమ్మా! ఆ ఇంటి వారు మీకు బంధువులా ? అని లేదు. అయినా నీకెందుకయ్య ? అక్కడ దిగబెట్టు చాలు.

          అమ్మా ! కోపగించుకోకండి. మీ మేలు కొరే చెప్తున్నాను. రోడ్డు నుండి లోపలికి నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరూ నడిచి వెళ్ళరు. అక్కడికి దగ్గరలో రెండు మూడు దాబా లాంటి ఇల్లున్నా రాత్రయితే పెద్ద పెద్ద వాహనాలన్నీ అక్కడే ఆగుతాయి. అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి. మద్యం, స్త్రీలు, మత్తు పదార్థాలు ఇలా దొరకనిది ఉండదు

          మాటలకు అడ్డుతగులుతూ ఎవరూ ఎందుకు కంప్లయింటు ఇవ్వడం లేదు

          “ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్టు “కంప్లయింట్ లేకుండానే అడ్డు కోవచ్చు.

          మరి….!

          అదంతేనమ్మా ! మా ఆటోవాళ్ళ అవతారమెత్తి కొంతమంది మీలాంటి అందమైన అమ్మాయిలను, స్త్రీలను కూడా డబ్బుకు ఆశపడి చేరవేస్తుంటారు. మీ మొబైల్ లో మీ రక్షణ కై ఆప్ లు డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీకేమి భయం అక్కర్లేదు. మరొక్కమాట. మరీ ఇంత ఉదయం వేళ, రావడం కూడా ప్రమాదమేనమ్మా. అంత అవసరమైతే తోడు ఉంచుకొని వెళ్ళండి. నాకు మీ లాంటి చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేటి సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తున్నాను కాబట్టి ఇలా హెచ్చరిస్తున్నాను మరోలా అనుకోకండమ్మా! అన్నాడు.

          నేను ఒక వారం పదిరోజుల పాటు రావలసి ఉంటుంది. ఎలాగా ? అంది కొంచెం ఆందోళనగా. పోనీ ప్రతిరోజూ నీవే రావచ్చగా ఉదయం సాయంత్రం అంది.

          లేదమ్మా ! నేను అస్సలు రాలేను. నేనే కాదు ఎవరూ రారు. ఇంతకు ముందు ఒకసారి ఒక అమ్మాయి అడిగితే ఇలాగే సరేనని ఒప్పు- కున్నాను. కానీ, ఒకరోజు అనుకున్నంత పని అయ్యింది. మా ఆటోను నలగురు వ్యక్తులు అడ్డుకున్నారు. నన్ను మెడపై బలంగా కొట్టి పక్కకు తోసి వాళ్ళు ఆటోతో సహా ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళాలని ప్రయత్నిస్తే , ఆ అమ్మాయి. తినిపించిన కరాటే దెబ్బలకు మళ్ళీ లేవలేక పోయారు. ఆ నలుగురినీ, నన్ను ఆమే డ్రైవింగ్ చేసి ఆటోలో ఆస్పత్రిలో చేర్పించింది. “ధైర్యే సాహసే లక్ష్మి “అనే దానికి ఋజువు ఆ అమ్మాయి . ఇలా ఎవరికి వారు స్వీయరక్షణకు పూను కుంటే ఇలాంటి వారు తోకలు ముడువక ఏం చేస్తారు? అప్పటి నుండి మాచెల్లెల్లకు నేను కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను అని చెప్పి మాటల్లోనే ఆ ఇంటి ముందు దింపాడు.

          ఇల్లు బయటి నుండి చూస్తే పెద్దది గానే కనిపించింది. గేటు తీసుకొని లోపలికి నడిచింది. ఒక్క పెద్దావిడ గేటుముందు ఊడ్వడానికని కాబోలు, చీపురుతో ఎదురయింది.
లోపలకు వెళ్ళమని సైగ చేసింది.

          సస్య కూర్చుని ఉండగా ఆ పెద్దావిడ చేయి పట్టి నడిపించి శ్రావణ్ గదిలోకి తీసు కెళ్ళింది.. అప్పుడు గమనించింది. ఆమెకు కాలు,చేయి కొంచెం పోలియో సోకి ఉండడం.
కాలిన గాయాలతోను, చేతికి పాదానికి కట్టుతో నున్న శ్రావణ్ ను ఒక చేత్తో తడుముతూ కన్నీరు పెట్టింది.

          సస్యకు మొదటి సారి అతడిపై జాలి కలిగింది.

          తరువాత ఆమె కిచెన్ లోకి తీసుకువెళ్ళి వంట సామాగ్రి చూపించి తను ఇబ్బందిగా నడుస్తూనే ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది.

          సస్యకు తను చేయవలసిన పని అర్థమయ్యింది. విదుషీ తన గురించి చెప్పినట్టే ఉందని తెలిసి వంట పూర్తి చేసి స్కూల్ టైం కావడంతో మళ్ళీ బయల్దేరుతుండగా బైట కారు హారన్ మోగింది.

          పెద్దావిడ తను వాటర్ బాటిల్ పెట్టుకోవడం మరిచి పోయానని తానే ఫ్రీజ్ నుండి తీసిచ్చింది.

          కారు డ్రైవర్ లోనికి వచ్చి మిమ్మల్ని విదుషీ అమ్మ గారు కారులో స్కూల్లో దింపి రావడానికి నన్ను పంపారమ్మా. అని బ్యాగ్ తీసుకొని కార్లో పెట్టాడు. తన మొహానికి ఇదొక్కటే తక్కువైందనుకొని ఒకసారి ఆ పెద్దావిడ వంక చూసింది. ఆమె చిరునవ్వుతో బాయ్ చెప్తున్నట్టుగా చేయి ఊపింది.

          తను మౌనంగా కారు ఎక్కింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.