స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-టి. రాజగోపాల్
గాయపరచి వికలం చేసిందెవరో
జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను
చెయ్యందించి వదనాన చిరునవ్వులు మళ్ళీ పూయించిందెవరో
స్మృతిలో పదిలం చేసుకున్నాను
ప్రేమ , అనురక్తి , మాయనే మాయని స్ఫూర్తి ,
దూర దృష్టి , విసుగెరుగని పరిశ్రమలతో
నెయ్యం వియ్యం కలుపుకుని అడుగులేస్తాను
పరిపూర్ణంగా మనోనేత్ర దర్పణంలో
నన్ను నేను దర్శించుకుంటాను
బహిరంతర ఆహార్యాలు సరిదిద్దుకుంటాను
నేనెవరో నాకు సందిగ్ధాలూ సంతాపాలూ లేకుండా తెలుసు
అభద్రతా కారు మేఘాలు ముసురుకున్నప్పుడు
నిర్భీతిని ఛత్రం చేసుకుని నిటారుగా నడుస్తాను
నన్నెప్పుడూ వీడనిదీ నేనెప్పుడూ వదిలెయ్యనిదీ
నా పట్ల నాకున్న స్వీయ గౌరవం ;
మహిళనైనందుకు , ప్రేమకూ మమకారానికీ
చిరునామానైనందుకూ నాలోపలి సహేతుక గర్వం
ఔను , కొందరికి నేను కొరకరాని కొయ్యనే ..
రేపు నా తైలవర్ణ చిత్రం ఎవరైనా గీస్తే
రంగులూ లేకి హంగులూ
ఓ నిరాయుధ పాదచారిణి బొమ్మ
అమూల్యంగా రూపు దిద్దుకుంటుంది
ఈ నాటి వీర వనితను నేను ,ధీర స్త్రీ మూర్తిని నేను
నిరుపమాన సౌందర్య ఖనిని నేను….
*****