మా ఇంట్లో తాతలనాటి బెల్జియమ్ అద్దం ఒకటి ఉంది…నిలువెత్తుగా, ఠీవిగా తలెత్తుకుని!
పట్టీల పాదాలతో బుట్టబొమ్మలా నేను పరుగెట్టి… అందులో పాపాయిని ముద్దెట్టుకునేదాన్ని!
నేను ఆడపిల్లనని ఎరుక కలగగానే… అలంకారాలన్నీ దాని ముందే!
అమ్మ కన్నా పెద్ద నేస్తం ఆ అద్దం!
నా కిశోరదశలో… అమ్మాయి పెద్దదయిందన్నారు.
దుస్తులు మారాయి. ఆంక్షలు పెరిగాయి… పెత్తనాలు తగ్గాయి. అద్దంతో అనుబంధం గాఢమయింది.
యుక్తవయసు వచ్చింది. పెళ్ళన్నారు. అద్దం ముందు కూర్చోపెట్టి పూలజడలేసారు. ముస్తాబులు చేసారు. బంగారుబొమ్మన్నారు! అద్దం కూడా ఆమోదంగా తలూపింది, నాతో పాటూ సిగ్గుల మొగ్గయింది.
మొదటిరాత్రి నా పరువాన్నీ, పౌరుషాన్నీ చిదిమేసిన కర్కశత్వానికి సాక్షీభూతురాలై కుమిలిపోయింది నా అద్దం…
నాలాగే క్షతగాత్రురాలయింది.
సారెలో దాక్కుని నా అత్తింటికి చేరిన అద్దం
నలిగిపోయి, సతమతమై పోయింది ఆ ఇంటి దైనిక హింసకు.
కడుపు పండి కొత్త అందాలు చేరినపుడు
ఎండిపోయిన గోదారి నీళ్ళు చేరి నిండుగా నవ్వినట్టు నవ్వింది నా అద్దం.
పక్కల మీద హింసలు తగ్గి, అసలు నా అవసరమే తగ్గి, ఎంగిలికూళ్ళకు ఇంటాయన బయలుదేరినపుడు…
నాకంటే ఎక్కువ నిశ్చింత పొందింది నా అద్దం!
వయసు మీరి, ఓపిక సన్నగిల్లింది నాకు.
బీటలేసి, కళాయి పూతలు కరిగి వెలవెల బోతోంది అద్దం.
వృద్ధాప్యం మా ఇద్దరిలో…
నాకంటే ఎక్కువ అనుభవాలే దానికి…
రక్కసి రెక్కల మధ్య నలిగి పగిలిన మూడుతరాలస్త్రీలను చూసి చూసి!
నాల్గవతరపు నవ్యవనిత నా కూతురు.
కొత్త స్వేచ్ఛావాయువులు శ్వాసిస్తూ
జీవితాన్ని కొత్త అద్దాల్లో చూస్తూ, అలరిస్తోంది.
ఐదవతరము…అయినవాళ్ళకే అందని తరం!
అద్దానికి మాత్రం అందుతుందా!
మిథ్యా ప్రతిబింబాల్లో మరింత మిథ్యను నింపుతూ
కృత్రిమ మేథస్సు చేతిలో చిక్కిన చేతగాని తరం!
ఏ తరంలోనయినా అద్దానికి తెలియని కథలు లేవు!
లోకంలో అద్దాన్ని మించిన ఋుషి మరొకటి లేదు.
ఎన్ని అందాలు తనలో ప్రతిబింబించినా చెదరని నిగ్రహం…
ఉన్నదున్నట్టు చెప్పే నిజాయితీ…
రాగద్వేషాలను అంటించుకోని స్థితప్రజ్ఞత…
నువ్వు ఇచ్చిన కాంతిని నీకే తిరిగి ఇచ్చేసే దాతృత్వం…
కుడిఎడమైనా పొరపాటు లేదని బోధించే గురుత్వం….
ముక్కలైనా వెయ్యిరెట్లు తిరిగి ఇచ్చే సాఫల్యం…
సుందరాంగుల సౌందర్య వీక్షణ గవాక్షం…
అభాగినుల కన్నీరు తుడిచే అమృతహస్తం…
స్వగతాలను స్వాగతించే రంగస్థలం…
రహస్యాలను భద్రం చేసే ఆంతరంగిక నేస్తం
కాలాన్ని కాలంలా… వయసును వయసులా , ఉన్నదాన్ని యధాతథంగా చూపించే తథాగతం!
అద్దం… నా అద్దం…నా తరంతోనే తన జీవితం అంతం కావాలని కోరుతున్న అలిసిపోయిన నా అద్దం!