అనుసృజన

సూఫీ కవిత్వం

అనుసృజన: ఆర్ శాంతసుందరి

 
          సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు.
 
          కొంతమంది ప్రముఖ సూఫీ కవుల కవితలని తెలుగులో స్వేచ్ఛానువాదంగా పరిచయం చేసే ప్రయత్నమే ఇది….
 
1.     ఫరీద్ ఉద్దీన్ అత్తర్ (1145-1221)
 
సాధువు , మోక్షగామి. పర్షియన్ సాహిత్యంలో మతపరమైన విషయాలను తీసుకుని ఎక్కువ రచనలు చేసినవారిలో ఒకరు అత్తర్. ఆత్మ పరమాత్మలో ఐక్యమవటం అనేది వీరి కవితలలో ప్రధానమైన విషయం.
 
1.మన దృష్టిలో మనం చనిపోనంత కాలం,
ఒక మనిషి వల్ల గాని, వస్తువువల్ల గాని గుర్తింపు పొందినంత కాలం
మనకి విముక్తి లభించదు.
బాహ్య ప్రపంచంతో ముడిపడి జీవించేవారికి ఆధ్యాత్మిక మార్గం పనికిరాదు.
 
2.జీవితం చేజారిపోకముందే దాని మార్మికతని తెలుసుకునేందుకు ప్రయత్నించండి
జీవించి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే
చనిపోయిన తరవాత మీ అస్తిత్వం గురించిన రహస్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు?
 
3.ప్రేమ అనే మధువుతో మత్తెక్కి ఉన్నాను
ప్రేమ అందరి నుంచీ ఒక మార్మికమైన నిశ్శబ్దాన్ని కోరుతుంది.
అందరూ అంత నిజాయితీగా కోరేదేమిటి? అదే , ప్రేమ.
ఒకరితో ఒకరు రహస్యంగా చెప్పుకునేదేమిటి? ప్రేమ.
వాళ్ళ హృదయపు లోతుల్లో మెదిలే భావమే ప్రేమ.
ప్రేమలో ‘నీవు’ , ‘నేను’ అనేదే ఉండదు.
నువ్వు ప్రేమించే వ్యక్తిలో విలీనమైపోతావు.
ఇక ప్రేమ కప్పుకున్న ముసుగు తొలగిస్తాను,
నా ఆత్మలోని అంతరంగ మందిరంలో
మిత్రుడున్నాడు చూడు; సాటిలేని ప్రేమే అది.
రెండు లోకాల రహస్యమూ తెలిసినవాడు
ఆ రహస్యాన్ని, ప్రేమని పొందగలడు.
 
4.అర్ధరాత్రి చీకట్లో ఒక సూఫీ విలపిస్తున్నాడు.
అతనన్నాడిలా, ఈ లోకం మూసిన శవపేటికలా ఉంది
దానిలో మనం బందీలై అజ్ఞానంతో
మూర్ఖంగా , శూన్యంలో జీవితం గడిపివేస్తాం.
ఆ శవపేటిక మూత తెరిచేందుకు మృత్యువు వచ్చినప్పుడు
రెక్కలున్న ప్రతి ఒక్కరూ ఎగిరిపోతారు అనంతలోకాలకి
అవి లేనివాళ్ళు మాత్రం శవపేటికలో ఉండిపోతారు బందీలై.
అందుచేత మిత్రులారా,ఈ శవపేటిక మూత తెరుచుకునేలోగా
మారండి భగవంతుడివైపు ఎగిరిపోయే పక్షిలా;
చెయ్యగలిగిందంతా చెయ్యండి రెక్కలనీ,
ఈకలనీ మొలిపించుకునేందుకు.”
 
5.తెలుసుకోవలసిన నాలుగు విషయాలు :
హాతిమ్-అల్-అసమ్ ఇలా అన్నాడు ,” నేను తెలుసుకునేందుకు నాలుగు విషయాలని
ఎంచుకున్నాను. మిగిలినవన్నీ వదిలేశాను.
 
మొదటిది : నాకు ప్రతిరోజూ కొంత ఆహారమే నిశ్చయింపబడిందని తెలుసు. దాన్ని తగ్గించటమో, పెంచటమో సాధ్యం కాదు. అందుచేత నేను దానికి అదనంగా చేర్చటం మానివేశాను.
 
రెండోది : నేను భగవంతుడికి రుణపడి ఉన్నానని తెలుసు. నా తరపున దాన్ని మరెవరూ
తీర్చలేరు, అందుచేత నేనా పనిలో తలమునకలుగా ఉన్నాను.
 
మూడోది : నన్ను ఎవరో వెంబడిస్తున్నారని తెలుసు… మృత్యువు…దాన్ని తప్పించుకోలేను, అందుకే దాన్ని కలుసుకునేందుకు సన్నద్ధం అవుతున్నాను.
 
నాలుగోది : భగవంతుడు నన్ను గమనిస్తున్నాడని తెలుసు. అందుకే చెయ్యకూడని పని చేసేందుకు సంకోచిస్తున్నాను..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.