ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 7

(ఒరియా నవలిక )

మూలం – హృసికేశ్ పాండా

తెనుగు సేత – స్వాతీ శ్రీపాద

          నవంబర్ 26 న బీ డీ ఓ , ఒకే డాక్టర్ ఆసుపత్రి డాక్టర్, సీపీడీఓ గమడాకు వచ్చి ప్రేమశిలను చూసారు. డాక్టర్ తన మోటర్ బైక్ మీద వచ్చాడు. తనతో బాటు ఒక సెలైన్ బాటిల్ కూడా తెచ్చాడు. ఆమె ఇంట్లో ఒక వాసానికి తగిలించి ఆమెకు డ్రిప్ పెట్టాడు. ఆమెను గమడా రోడ్ లోని ఆసుపత్రికి తరలించాలని ఆమె మరిదికి చెప్పాడు. బీడీవో తన ఆఫీస్ వాహనంలో ఆమెను గమడా రోడ్ ఆసుపత్రికి చేర్చి అక్కడ ఆసుపత్రిలో  చేరుస్తానని స్వయంగా ముందుకు వచ్చాడు. కాని ఆమె మరిది మిగతా ఖర్చులు తను పెట్టుకోలేనని తిరస్కరించాడు.

          నవంబర్ 27 న డాక్టర్ మళ్ళీ వచ్చి చూసాడు, మరో డ్రిప్ గ్లూకోజ్ సెలైన్ పెట్టాడు. హెల్త్ వర్కర్ ఆమెతో బాటే ఉంది. ఈలోగా డాక్టర్ మిగతా గ్రామస్తులను పరీక్ష చేసాడు. ఆ తరువాత డాక్టర్ ఆమె మరిదితో ఆమెను గనక ఆసుపత్రిలో చేర్చకపోతే ఆమె చావు ఆకలి చావుగా ప్రచారం చేస్తారనీ, అతన్ని అరెస్ట్ చేస్తారనీ చెప్పాడు. చివరికి అతన్ని కనీసం విచారణకు పిలుస్తారని కూడా అన్నాడు. ప్రేమశిలను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు. తను అందుబాటులో ఉండి ప్రేమశిల అడ్మిట్అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చాడు.

          అభియోగం, విచారణ భయంతో ఆమె మరిది గ్రామాధికారిని సంప్రదించి , గ్రామం లో తన బంధువులతో చర్చించి, వారి సాయంతో ప్రేమశిలను తిరగేసిన నులక మంచం మీద గమడా రోడ్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు నవంబర్ 27 న సాయంత్రం తరలిం చాడు. హెల్త్ సెంటర్ లో కొన్ని తప్పిపోయిన గొడ్లు, పందులతో , పిచ్చికూతలు కూసే పనికిరానివాళ్ళు తచ్చాడుతున్నారు. 

          దాని ముందర అంతా చీకటిగా ఉంది. గ్రామాధికారి చుట్టుపక్కల గాలించి డాక్టర్ ను తీసుకు వచ్చాడు. నిజానికి అతను డాక్టర్ అని తెచ్చిన వాడు, మందులు సరఫరా చేసే వాడు.

          అతను అక్కడ స్టాఫ్ నర్స్ లేనందువల్ల రోగులను అక్కడ ఉంచుకునే విభాగం పనిచెయ్యడం లేదని అన్నాడు. ముందు గ్రామస్తులకు నర్స్ అనే మాటే అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక ప్రేమలత ఆడబిడ్డ నర్స్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఆ మందులు సరఫరా చేసే అతను, ఆసుపత్రి శుద్ధి చేసేవాడు, పిచ్చి కూతలు కూసే పనికిమాలిన వాళ్ళు అది వినగానే పొట్టచెక్కలయేలా నవ్వారు. గ్రామాధికారి గమడా రోడ్ లో ఉంటున్న  చిన్న గమడా డాక్టర్ ఇంటికి దారి అడిగాడు. డాక్టర్ ఇల్లు జనాలతో కిక్కిరిసి ఉంది. అతను తన ప్రైవేట్ ప్రాక్టీస్ తో బిజీగా ఉన్నాడు. రోగులు, వారి సహాయ కులు చాలా సేపు అక్కడినుండి కదల్లేదు. రోగులు పలచబడ్డాక డాక్టర్ తన నర్సింగ్ హోమ్ కి వెళ్ళిపోయాడు.

          గాయపడి, అవమానపడిన గ్రామాధికారి తిరిగి వెల్ళాడు, గ్రామ ప్రజలు ప్రేమశిలను తిరిగి వచ్చిన విధంగానే చిన్న గమడాకు తీసుకువెళ్ళడానికి సిద్ధం అయ్యారు.

          అప్పటికే చీకటి పడుతోంది, మందుల సరఫరా చేసే మనిషి , ” రోగిని బొలంగీర్ తీసుకువెళ్ళండి, లేదంటే ఆమె బ్రతకదు.” అని అన్నాడు.

          ప్రేమశిల చీకట్లోకి ఉమ్మేసింది.

          ” నీ సలహా నువ్వే పెట్టుకో , నీ సలహాలు నాకు అవసరం లేదు” అని ప్రేమశిల అన్నట్టుగా. గ్రామాధికారి ఆ తరువాత ఆమె చర్యను విశ్లేషించాడు. ఆమె గ్రామస్తులతో, ” నన్ను ఇంటికి తీసుకు వెళ్ళండి.  నాకోసం మీరంతా ఇంకెంత శ్రమ పడతారు? నా పిల్లల గతేమవుతుంది? డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? నాకు ఆయుషు ఉంటే బ్రతుకుతాను. అదే అయిపోతే పోతాను.” అంది.

          వాళ్ళు గ్రామానికి తిరిగి వెళ్ళారు.

          30 నవంబర్ న రాజీవ్ గమడా గ్రామానికి వచ్చాడు. అతను మంచం మీద సాగిల పడిన  ప్రేమశిల ఫొటో తీసుకున్నాడు. అదే రోజు ఆ ఫోటో కడిగించి ఒక కాపీ భువనేశ్వర్ పంపాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.