ఆమె కాని ఆమె (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

-భూపాల్ మాసాయిపేట్

కుందేలులా దుంకుతూ ఆనందంతో ఆకాశాన్ని తాకేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా నడుస్తుందో అన్నారు.
ఆమె తాబేలుగా మారి వయ్యారంగా నడిచింది.

గాన కోకిలలా పాడుతూ ప్రపంచాన్ని మైమరిపించేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా మాట్లడుతుందో అన్నారు.
ఆమె రామచిలుకగా మారి చిలక పలుకులు పలికింది.

నెమలిలా ఆడుతూ తన బావాల కురి విప్పేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత చక్కగా వంట చేస్తోందో అన్నారు.
ఆమె తన కాలి గజ్జెలకు గరిటతో తలకొరివి పెట్టింది.

వేకువ నిద్రలో హంసలా మారి సముద్రాలు ఈదేది…
డేగాలా మారి మబ్బులను కాలుతో తన్నేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత ఉదయం నిద్ర లేస్తుందో అన్నారు.
ఆమె కోడిలా మారి కూత పెట్టింది.

తన రూపం ప్రకృతికి ప్రతి రూపంలా ఉండేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..ఎంత అందంగా ఉందో అన్నారు.
ఆమె తన శరీరానికి తూట్లు పొడుచుకుంది…
మెరిసే మేకులను మొహనికి తగిలించుకుంది.

తన రెండో ప్రపంచపు ప్రేమాదేశం ఊహలలో ఉయ్యాలలు ఊగేది.
అందరూ ఆ అమ్మాయిని చూడు..తల్లి దండ్రులు తల దించుకునే పని అసలే చేయ్యదు అన్నారు.
ఆమె ప్రేమని పాతిపెట్టి తన శవాన్ని అందంగా అలంకరించుకుంది…
తల దించుకొని అంగట్లో కూర్చుంది.

తన కోరికలు ఇంద్రదనస్సుకే కొత్త రంగులు అద్దేవి.
అందరూ ఆ అమ్మాయిని చూడు.. పతివ్రతకు నిలువెత్తు రూపం అన్నారు.
ఆమె ప్రతీ రోజూ తెల్లచీరతో ఊరి వేసుకుంది.

చివరికి ఆమె ఆద్దంలో తనని తను చూసుకుంది.
తనలా ఉన్న ఎవరో తనది కాని రూపంలో కనిపించింది.

అప్పుడు అర్ధం అయింది…
“ఆ అందరూ మంచితనం అనే ముసుగు కప్పి,
అందాన్ని ఆశాగ చూపి,
పేరు ప్రతిష్టలను ప్రతిబంధకాలుగా చేసి,
సంప్రదాయం అనే సంకెళ్లు వేసి,
ఆమె అసలైన స్వభావాన్ని అపహరించుకెళ్ళారు అని”

ఎంత వెతికినా దొరకని “ఆమె” మొదటి పేజీలో…
ఎన్ని మజిలీలు దాటిన ఆమెని చేరలేని “ఆమె కానీ ఆమె” చివరి పేజీలో..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.