ఆరాధన-7 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
దేవుడు చేసిన మనుషులు
మళ్ళీ ఆదివారం క్లాస్ ముగించుకుని స్టూడియో నుండి బయలుదేరుతుండగా గాల్వెస్టన్ నుండి విమలక్క ఫోన్ చేసింది. ఐదు నిమిషాల్లో నా వద్దకు వస్తున్నానని చెప్పడంతో తన కోసం ఆగిపోయాను. ఆమెని చూసి, ఆమెతో మాట్లాడి కొంత కాలమయింది. విమలక్క నాకు దూరపు బంధువు. నా కన్నా కొన్నేళ్ళ ముందే అమెరికాకి వచ్చి మెడిసిన్ లో మాస్టర్స్ చేసి పిల్లల వైద్యురాలిగా హూస్టన్ లోని ప్రముఖ హాస్పిటల్లో పని చేస్తుంది.
ఆమె భర్త విన్సెంట్ మలయాళీ వ్యక్తి. ఆయన వయసులో విమలక్క కన్నా పదిహేనేళ్ళు సీనియర్ అని చెప్పుకున్నారు. విన్సెంట్ గారు కొద్ది కాలం క్రితం హార్ట్-ఎటాక్ తో హాస్పిటల్లో ఉండగా వెళ్ళి చూసి కూడా దాదాపు రెండేళ్లయింది. అప్పటి నుండీ విమలక్క అందరి నుండీ దూరంగా ఉండిపోయింది’… అని గుర్తు చేసుకున్నాను.
ఇంతలో, స్టూడియో బయట కారు ఆగిన చప్పుడికి లేచి వెళ్ళి తలుపు తీసి విమలని లోనికి ఆహ్వానించాను. ఆమె మోమున ఉదాసీనత, అలసట కనబడుతున్నాయి.
“విన్సెంట్ ఎలా ఉన్నారు విమలక్కా? నిన్ను చూసి కూడా కొంత కాలమయింది.” అంటూ దగ్గరగా వెళ్ళాను.
“ఔను ఉమా..” అంటూ నా భుజాల చుట్టూ చేయి వేసి నాతో పాటు లోనికి నడిచి, ఆఫీసు రూమ్ లోని సోఫాలో కూర్చుంది. “హార్ట్-ఎటాక్ వచ్చి విన్సెంట్ హాస్పిటల్లో ఉండగా రెండేళ్ల క్రిందట వచ్చి చూసావు. ఆ తరువాత ఆయనకి కాన్సర్ వ్యాధి కూడా సోకింది. దాని కోసం కూడా చికిత్స పొందారు. అతని పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు.ఇన్ని వ్యధలతో.. నా జీవితం ఒక చెప్పుకోలేని గోడుగా మారింది. అందుకే అందరికీ దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడిక నా వల్ల కావడంలేదు.” అంటూ కళ్ళ నుండి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది.
దగ్గరగా వెళ్ళి కూర్చుని భుజం మీద చేయి వేసాను. “ఏమిటి విషయం విమలక్కా?” మృదువుగా అడిగాను.
నా భుజం మీద వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చింది. ఓదార్చడానికి ప్రయత్నించాను.
కాస్త తేరుకున్నాక కళ్ళు తుడుచుకుని నా వంక నిబ్బరంగా చూస్తూ, విషయం చెప్పడం మొదలు పెట్టింది ఆమె.
“హార్ట్-ఎటాక్ తరువాత విన్సెంట్ కి అసామాన్యమైన ‘బ్రెయిన్ కాన్సర్ వ్యాధి’ ఉందని తెలిసింది. “గ్రేడ్ 2గ్లియోబ్లాస్టోమ మల్టిఫార్మే (glioblastoma multiforme) అంటారు. ఆపరేషన్ చేయించుకుంటే సాధారణంగా అయితే కనీసం పదేళ్ళైనా ఉంటాడని, మరో ఇద్దరు నిపుణులు కూడా తేల్చారు.
కానైతే, సర్జరీ చేయడం వల్ల తీవ్రమైన ప్రతికూల విషయాలు బయటపడ్డాయి. అతని బ్రెయిన్ కాన్సర్ గ్రేడ్ 2 కాదు.. గ్రేడ్ 4 గ్లియోబ్లాస్టోమ మల్టిఫార్మే గా నిర్దారణ య్యింది.
చికిత్సకందని ఈ గ్రేడ్ 4 కాన్సర్ వ్యాధి, అతని మెదడుని అతివేగంగా కబళించి వేస్తుందని, ఇక ఆరునెలల సమయంలోనే జీవనానికి సంబంధించిన సామాన్య ప్రక్రియలు కూడా ఒక్కోటి క్రమేణా స్తంభించి పోతాయని, వాక్కు, చూపు, నడక అన్నీ వేగంగా తగ్గిపోతాయని, సీజర్స్ ఎక్కువవుతాయని… ఇవన్నీ వ్యాధి లక్షణాలని వైద్యులు చెప్పినట్టే ఇప్పుడు ఒక్కోటి జరుగుతున్నాయి. నా బాధని ఎవరితోనూ పంచుకోలేనంత కష్టంగా అనిపిస్తుంది ఉమా.” అంటూ విలపించసాగింది విమలక్క.
నా గుండెలు పిండేసినట్టయింది. వింటున్న సంగతులకి నా కళ్ళు చెమర్చాయి.
“నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి, నన్ను ప్రార్ధనా గదికి పిలిచి ఎదురుగా కుర్చోమన్నారు విన్సెంట్. మాట కాదననని ముందుగానే మాట తీసుకొని, ఆయన మనసులోని ఓ అసాధారణమైన విషయం బయట పెట్టారు.
‘తనకింక బతకాలని లేదని, జీవితాన్ని అంతం చేసుకోదలచానని నిశ్చయంగా చెప్పారు. అందుకోసం ‘డెత్ విత్ డిగ్నిటీ యాక్ట్’క్రింద తను ప్రశాంతంగా పరలోకాలకి వెళ్ళిపోడానికి సహకరించమని కోరారు, నా భర్త” .. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె.
విన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నా మనస్సు స్థంబించిపోయింది. ‘డెత్ విత్ డిగ్నిటీ’ అనే యాక్ట్ గురించి మొన్నామధ్య న్యూస్ లో విన్నాను. తిరుగులేని, నయంకాని వ్యాధితో.. శారీరికంగా, మానసికంగా తీవ్ర వొత్తిడికి లోనైన రోగులు మాత్రమే ‘డెత్ విత్ డిగ్నిటీ’’ కోరుకుంటారు.
తేరుకుని “ఐ ఆం సారీ, నీవింత బాధలో ఉన్నావని ఊహించలేదు.” తన భుజం పై చేయివేసి ఓదార్చే ప్రయత్నం చేశాను.
కళ్ళు తుడుచుకుని తన బాగ్ నుండి మడిచి ఉన్న కాగితాన్ని తీసింది విమలక్క. “రెండు రోజులుగా.. విన్సెంట్ మాట స్పష్టత కూడా కోల్పోయారు. మెల్లమెల్లగా ఒక్కో భాగం చచ్చు పడుతుంది. వైద్యులు ఆయన్ని వీలయినంత ప్రశాంతంగా ఉంచ మన్నారు. ఇకపోతే, కొంతకాలం క్రితమే ‘డెత్ విత్ డిగ్నిటీ’ ఆక్ట్ అమలు చేయగల సేలం లోని సంస్థతో… చర్చి ద్వారా స్వయంగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారట. మాట స్పష్టత పోయాక, నాకు ఆయన రాసిన ఈ లెటర్ చదువు.” అంటూ కళ్ళు తుడుచుకొంది విమల.
మడత వేసున్న కాగితాన్ని విప్పాను. ‘బాధాకరమైన జీవితం నుండి ‘డెత్ విత్ డిగ్నిటీ’ వెసలుబాటుని వీలయినంత త్వరలో కల్పించమని.. విమలక్కని అర్ధిస్తూ… సేలం-ఆరెగన్ లోని సంస్థ వివరాలని కూడా అందులో పొందుపరుచారు విన్సెంట్.
కన్నీళ్లు ఆపుకోలేక పోయాను. ఆ లెటర్ ని తిరిగి ఆమె చేతిలో ఉంచాను. కాసేపు మా నడుమ మౌనం రాజ్యమేలింది.
మరి కాసేపటికి ఆమె మరిది నుండి ఫోన్ కాల్ అందుకుని .. ‘మళ్ళీ కలుద్దామంటూ వెళ్ళిపోయింది విమలక్క.
***
మరునాడు వెళ్ళి విన్సెంట్ గారిని చూశాను. ఆయన బలహీనంగా ఉన్నారు. అస్పష్టంగా గొణిగినట్టు మాట్లాడుతూ ఉండుండి నిద్రలోకి జారుకుంటున్నారు. నర్సింగ్-హోమ్ కి సంబంధించిన నర్స్ ఆయన పక్కన ఉంది. బరువెక్కిన హృదయంతో ఇంటిదారి పట్టాను.
ఆ తరువాత పది రోజులకి ఏర్పాట్లు చేసుకుని విన్సెంట్ గారిని తీసుకొని విమలక్క ‘ఆరెగన్’ లోని – ‘సేలం’ కి వెళ్ళిపోయారు. నేనూ తోడు వస్తానంటే వద్దని వారించింది విమలక్క.
ఆమె మనశ్శాంతి కోసం రోజూ ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మనుషుల చేతుల్లో ఏమీ లేదు. దేవుడు చేసిన మనుషుల చావు పుట్టుకలు ఆయన చేతుల్లోనే ఉంటాయి’ అనుకుని నిట్టూర్చాను.
***
విమలా, విన్సెంట్ ల గురించి, వారి జీవితాల్లోని విషాదం గురించి చాలా రోజులు బాధపడ్డాను. ఆరెగన్ నుండి తిరిగి వచ్చిన విమలక్కని ఓ సారి వెళ్ళి కలిశాను. తాను ప్రశాంతంగా ఉన్నానని చెప్పింది. కొన్నాళ్ళు ఇండియాలోని పుణ్యక్షేత్రాలు దర్శించు కుని వస్తానని కూడా అన్నది. ఆ మాటలు విన్నాక నా మనసు కాస్త తేలికయింది.
***
మరో మూడు నెలలకి జరగనున్న అకాడెమీ వార్షికోత్సవం జరపడానికి ఏర్పాట్లు, ప్రాక్టీస్ లు మొదలు పెట్టాను. ఈ మారు బే-పోర్ట్ బ్రాంచ్ లో నృత్య శిక్షణ పొందుతున్న వారు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా ప్లానింగ్ చేశాను.
మియా కూతురు .. తార ఇప్పుడు ఆసక్తిగా డాన్స్ నేర్చువడం మొదలుపెట్టడంతో.. “ఇది చాలు మేడమ్.” అంటూ మియా సంతోషపడిపోయింది.
ఇంతలో .. మాధవ్, రాగిణీ ల వివాహం కూడా త్వరలోనే జరిపేందుకు మియా కుటుంబం సంసిద్దమవుతున్నారు. త్వరలో హూస్టన్ చేరనున్న మాధవ్ తల్లి, అతని కజిన్ కాత్యాయనిలతో అన్నీ విషయాలు సంప్రదించమని వారికి సూచించాను.
మరో పక్క టెలీ-ఫిల్మ్ పనులు కూడా మొదలయ్యాయి. ఓలేటి పార్వతీశం గారు కథ రాస్తున్నారని, త్వరలో నాకు ఓ కాపీ పంపుతానని నాన్న చెప్పారు. నా శిష్య బృందం, వారి తల్లితండ్రులు కూడా ప్రాజెక్టులో పాల్గొనే విధంగా ఆలోచన చేయసాగాను.
***
బే-పోర్ట్ లో వారాంతం క్లాస్ముగిశాక .. అందరూ నా చుట్టూ చేరారు. నా ఎదురుగా కూర్చున్న అమృత తల్లి వసంత ముందుగా మాట్లాడింది.
“మీరు ‘’యమగోల’ సినిమాలో ఎన్.టి.రామరావు గారితో నటించారు.. ఊర్వశిగా నర్తించారు కదా. ఆ సినిమా మరోమారు నిన్న చూసాము మేడమ్. మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది. ఆ అనుభవం ఎలా అనిపించింది? మరి ఆ తరువాత సినిమాల్లో ఎందుకు కొనసాగలేదు? ఆ విషయాలు చెప్పండి.” అన్నది వసంత.
నాకు నవ్వొచ్చింది. ఎక్కడ మొదలెడదామా అని క్షణం ఆలోచించాను.
“మంచి విషయమే అడిగావు. అప్పుడు నేను బి.ఎ రెండవ సంవత్సరంలో ఉన్నాను. యమగోల సినిమాలో నర్తించే ముందు ఆ వేసవిలో జరిగిన కొన్ని విశేషాలు కూడా చెబుతాను.
1978 మే’ నెలలో నాన్నగారి ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా అంతటా నెలరోజుల పాటు నృత్య ప్రదర్శనలు, టి.వి. చిత్రాలు చేసి, అసంఖ్యాక ప్రేక్షకులు, పత్రికల నుండి ఎనలేని ఆదరణ పొందాను. మారిషస్, జొహన్నస్బర్గ్ లో కూడా కళాప్రియుల ఆదరణా భిమానాలు మిన్నంటాయి. అలా విజయవంతంగా మా మొదటి విడత విదేశీ పర్యటన ముగించి వచ్చాము.
దక్షిణాఫ్రికా ఆంధ్రమహాసభ వారి ఆహ్వానంపై ‘The Uma Bharathi Show’ పేరిట జరిగిన ఆ పర్యటన …కళాకారిణిగా నన్ను ఓ ఉన్నతమైన స్థానంలో నిలిపింది. నా పూర్వజన్మ సుకృతమే అని భావించాను. ఆ దేశ చరిత్రలో… 15౦ సంవత్సరాల తరువాత, దక్షిణాఫ్రికా గడ్డ పై జరిగిన ఓ మహోత్తర సాంస్కృతిక కార్యక్రమంగా పరిగణిం పబడిన మా పర్యటన మాకు ఎంతో గర్వకారణమైంది.
స్వదేశం తిరిగి వచ్చిన పిదప హైదరాబాదులో సత్కారాలు, సన్మానాలు, పత్రికల ఇంటర్వ్యూలతో ఓ రెండు వారాలు హడావిడిగా గడిచింది.
నాకు బాగా గుర్తున్న ఫోటో సెషన్ – ఇంటర్వ్యూ, ‘వనిత’ మాస పత్రిక కోసం.
ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ – కె.ఆర్.వి. భక్త గారు యింటికి వచ్చి రెండు గంటల సేపు వివిధ నాట్యభంగిమల్లో స్టిల్స్ తీసి, ఇంటర్వ్యూ జరిపారు.
అలా ప్రతిరోజూ బిజీగా ఉన్న సమయంలోనే ‘యమగోల’ సినిమా నిర్మాత, ఛాయా గ్రహకులు వెంకటరత్నం గారు నాన్నకి ఫోన్ చేశారు. వారి సినిమాలో ఎన్ .టి.ఆర్ గారితో ఓ డాన్స్ సీక్వెన్స్ లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. ఆలోచించి చెబుతానన్నారు నాన్న.
అప్పటికే, నటి శ్రీమతి అంజలి గారి ‘భక్త తుకారాం’ చిత్రంలో నృత్యం చేయమని అడిగితే ఒప్పుకోని నాన్న, వారం పాటు ఆలోచించిన మీదట, ‘యమగోల’ డాన్స్ సీక్వెన్స్ కి ‘ఓకే’ అన్నారు.
నాన్న నిర్ణయాలని నేనెప్పుడూ ప్రశ్నించలేదు.
అమ్మానాన్నలతో ‘యమగోల’ పాట చిత్రీకరణకు మద్రాసు వెళ్లాను. మొత్తంగా రిహార్సల్స్, షూటింగ్ కలిపి… వారం రోజులు పట్టింది,
ఆ నృత్య సీక్వెన్స్ లో ఊర్వశి, మేనక, రంభగా.. నేను, మంజుభార్గవి, లక్ష్మి పాల్గొన్నాము. సరదాగానే గడిచింది షూటింగ్. యెన్.టి.ఆర్. గారితో చేసిన బిట్స్ కూడా ఎంజాయ్ చేసాను.
రంభగా నృత్యం చేసిన లక్ష్మి, మెడికల్ కాలేజీ మొదటి సంవత్సరం చదువు తుంది. ఆమె నటి ఎల్. విజయలక్ష్మి రిలేటివ్ అని విన్నట్టు గుర్తు. మంజుభార్గవి అప్పటికే సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి నృత్యాలు చేసింది. నేను సరే, నాట్య ప్రదర్శనలిస్తూ బి.యే చదువుతున్నాను.
వాళ్ళిద్దరూ మంచి డాన్సర్స్. బ్రేక్ లో ఫ్రెండ్లీ గా మాట్లాడుకున్నాము. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము కూడా. అయితే ఆ తరువాత కొద్ది కాలానికే నా వివాహం జరగడం, నేను యు.ఎస్.కి రావడంతో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకునే అవకాశం కలగలేదు.
ఆ తరువాత కూడా సినిమాల్లో నృత్యానికి, నటనకి మరి కొన్ని అవకాశాలు వచ్చాయి.
యమగోల షూటింగ్ అయి తిరిగి ఇల్లు చేరాక, మరెన్నో ప్రోగ్రాములు ఒప్పుకు న్నాను. డాన్స్ డాక్యుమెంటరీ నిర్మాణ సన్నాహాల్లో మునిగిపోయాము.
ఓ రోజు, యెన్.టి.ఆర్ గారు స్వయంగా నాన్నకి ఫోన్ చేసారు. ఆయన నిర్మించ బోయే ‘దాన-వీర-సూర కర్ణ’ సినిమాలో నాకు అవకాశం కల్పిస్తానని అన్నారు.
నాన్న మరి ఎందుకు వద్దనుకున్నారో? “ఉమకి పెళ్ళి సెటిల్ అయ్యేలా ఉంది. అన్నీ కుదిరితే, వచ్చేవారం నిశ్చితార్ధం జరిగే అవకాశం ఉంది. మీ ఆఫర్ కి కృతజ్ఞతలు,” అని ఆయనకి సర్ది చెప్పి వద్దనేసారు.
‘అలాగే ‘నర్తకి’ అనే సబ్జెక్ట్ రాస్తున్నాము’ …. అందులో నర్తకి పాత్ర పోషించమని యమగోల నిర్మాత నాన్నని అడిగారు.
***
నేను సినీరంగంలో కొనసాగడం పట్ల నాన్న సుముఖంగా లేరని, అమ్మ, నాన్న నిత్యం మాట్లాడుకునే తీరుని బట్టి అర్ధమయింది. సాంప్రదాయ నృత్య రంగంలో చేస్తున్న కృషి, విదేశీ పర్యటనలు వరకు బాగు.’ అన్నది అమ్మ. ఆ దిశగా మా కృషి, ఫలితాలు సంతృప్తిగా కొనసాగాయి.
అప్పట్లో, నా కెరియర్ విషయంగా నిర్దిష్టమయిన అభిప్రాయం ఏమీ లేదు..ఏనాడూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిందీ లేదు.
కాని నా జీవితంలో, సాంప్రదాయ నృత్యం మాత్రం శాశ్వతమై, నా ఆరోప్రాణంగా కొనసాగింది. నాలోని సృజనాత్మకతకి సరయినది నృత్యమే అని నేనూ భావించాను. ఏదైనా, అమ్మా నాన్నల నిర్ణయాలు నాకు అప్పుడూ, ఎప్పుడూ శిరోధార్యమే.” అంటూ ముగించాను.
వసంత .. తన ఐ-పేడ్ మీద ‘యమగోల’ లోని .. డాన్స్ సీక్వెన్స్ అందరికీ చూపించింది. ‘ఆడవే‘అందాల సురభామిని’పాట వేటూరి గారి రచన. ఎస్. పి. బాలసుబ్రమణ్యం పాడారు.
‘అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపజేయుటే’ – ‘ఆడవే అందాల సురభామిని, ఆడవే కళలన్ని ఒకటేనని’
……గానమేదైనా స్వరములొక్కటే
నాట్యమేదైనా నడక ఒక్కటే
ఆశ ఏదైనా భావమొక్కటే
అన్ని కళల పరమార్థమొక్కటే
అందరినీ రంజింపజేయుటే…. ఆడవే అందాల సురభామిని…
మరో మారు తీరిగ్గా ఆ చక్కని పాట, నృత్యం నా స్టూడెంట్స్ తో కలిసి తిలకించి, సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టాను.
*****
(సశేషం)
నా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ మహా నగరంలో ‘అర్చన ఫైన్_ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. రచయిత్రిగా మూడు నవలలు, రెండు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువడ్డాయి. మా తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మూగాజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటాను. యోగాభ్యాసన నా అభిరుచి. నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ నా జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నాను. నేను B.A Economics M.A Political Science చేసాను. USA కి 1980 లో వచ్చాను… నాకు ఓ కొడుకు, ఓ కూతురు. నా భర్త తో సహా వారు కూడా Health care workers..