![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Aparna-Thota-e1739080021804.jpeg)
ఈ తరం నడక – 11
జెన్నీ- అపర్ణ తోట
-రూపరుక్మిణి
దుఃఖం పెల్లుబికినప్పుడు కవిత్వం ధారై ప్రవహిస్తుంది అంటారు. దుఃఖమే కాదు మనసు నిండా ప్రేమ నిండినా, మానవత్వం పరిమళం నిండినా కవిత్వం చిగురిస్తుంది. అయితే కవిత్వానికి రసజ్ఞత మూలం అనుకుంటాను. ఏ కాలాన్నైనా కవి కన్నుల నుండి చూడగలగాలి. గాలికి రూపురేఖలు కట్టి చూపడం కవిత్వ ప్రతిభ అయితే ఆ కవిని పట్టి చదవడం పాఠకుడి ప్రతిభ, ఇక్కడ పాఠకుడిదా!? కవిదా!? అంటే పై చేయి కవి చూసిన దృష్టిని వెతికి పట్టుకోవడంలో అసలు లావణ్యమంతా పాఠకుడిదే కదా అనిపిస్తుంది.
ఏదైనా సంగీతం వింటూ చాలా మంది టైం ట్రావెల్ చేస్తున్నామంటారు. ఒక పాటో, సంగీతమో మనల్ని కాలాలు మార్చి ప్రయాణింపజేయగలుగుతుందంటే అందులో అక్షర రూపమైన భావ కవిత్వంలో మనం మునిగిపోవడమే కదా!!
ఇక్కడ జెన్నీగా మారిన అపర్ణ కూడా తనలోని భావాలని టైం ట్రావెలర్ లా కాలాన్ని సమతూకంలో వేసి చూడాలంటుంది.
స్త్రీ ఎదుగుతున్న క్రమంలో వయసు రావడం, వన్నె చిన్నెల వయసుకి శరీర వాంఛల భ్రమలు కొత్తగా వచ్చి చేరడం, అవి తొలగడం, అటు నుండి తను ఎవరి నుండి వచ్చిందో (తనకు జన్మ నిచ్చిన) వారిలో ఒదిగి పోవడం, అంటే వయసు పైబడి పోతుందన్న భావాన్ని, స్త్రీ జీవిత గమనాన్ని అలతి పదాలతో చాలా చక్కగా అక్షరాల్లో చెక్కింది.
ఓ ఆడపిల్ల ఎదుగుదలని, అలల పైన నురగలా ఎదిగే వయసు అరువు తెచ్చుకున్న హంగుల్ని కవిత్వమై చెప్తూ యుక్త వయసుని వర్ణించే సమయాన్ని
“ వేటగాడు వెతికే లేళ్ళను మీరు చూసే ఉంటారు అది కూడా ముగిసింది” అని చెప్తుంది ఓ సందర్భంలో
వయసు తెచ్చే భ్రమల్ని, భయాలని ఓ కన్ఫ్లిక్ట్ రూపంలో ఆమెగా భయపడడాన్ని చెప్తూనే ఒక వయసు వచ్చాక
“ ఏళ్లు జర్రున జారిపోయాయి ఆ కాలంలో చర్మం సాగిపోతున్న వయసు ఎక్కడికో పారిపోయింది. నేను నా నుండి వచ్చిన వారిలో ఆగిపోయాను అని చెప్పేస్తుంది”.
ఈ కవితలోని చివరి వాక్యంలో “ఎన్నిసార్లు వస్తుంది రా ఈ వయసు?” అని కొంటెగా ప్రశ్నిస్తూ ముగిస్తుంది.
జెన్నీకి ఒంటరి ఏకాంతాలు ఇష్టం, అందులో భాగంగానే చీకటికి కట్టుబడే కోరికల చిట్టాల్లో హార్మోన్లు, న్యూట్రాన్లు చేసే మాయకి ఎవరూ అతీతులు కారన్నట్లే ప్రణయ గీతాల్ని ఆలపిస్తూ ప్రేమించిన వారిని కాస్త స్వేచ్ఛగా వదిలేయమంటుంది. ప్రేమించిన వారిని నిందించొద్దు అంటుంది. కాకి గోల చేయొద్దు అంటుంది. జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రేమను ఆస్వాదించినాక ఎప్పుడైనా సంఘర్షణలు ఎదురైతే నిందించుకోవద్దు. ప్రేమించుకుంటే మాటలు మిగిలి ఉంటాయనే భావాన్ని వ్యక్తం చేస్తుంది.
“ జీవాన్ని నింపి దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినా, నాకు ఈ గోల ఏంటని అలగొద్దని
“ సహానిదురలకు సుదూరతీరాలని చేరాక, పతంగుల ఆశను ఆకాశానికి ఎగరేసి దారం తెంచి వదిలేశాక గోలెందుకు చేస్తున్నావని అడగకు” గోల కాక మరి ఏమిటి అన్న కవితలో
ప్రేమించిన మనిషి శాశ్వత ప్రేమనే కాదు అశాశ్వత బంధాల్ని పంచిపెడితే ఆస్వాదించమంటుంది.
డిప్రెషన్ వర్షన్లో స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. డెలివరీల సమయంలో అనవచ్చు, అమ్మగా పాత్ర పోషించే సమయంలో అవ్వవచ్చు. ప్రేమించిన ప్రేమను వదిలి వెళుతున్నప్పుడైనా కావచ్చు అటువంటి సందర్భాన్ని చెప్తూ
“అయినా బ్రోకెన్ హాట్స్ సర్జరీల గురించి అవసరాలకి సరుకులు అయిపోయామని తెలిసిపోయాక, సంభాషణలన్నీ ఏ చెరువులోనో తర్పణ వదిలాక, నడుము బిగించి, పిడికిలి సంధించి ఒంటరి కవాతు చేయమని ధైర్యాన్ని నూరిపోస్తుంది జెన్నీ. నీ కోసం నీవు లేచి అడుగేయమని చెప్తుంది.
విరిగిన మనసుల మధ్య నలిగిన జీవితాలకి వెలుగులు ఎట్లా అన్న ప్రశ్నలు సంధిస్తున్న సందర్భంగా
“ కంచెల మధ్య ఖాళీ నింపడం ఎలాగో తెలియట్లేదు” ఇంకా తిరిగి ఎప్పటికీ నడవలేము కదా అంటూనే బేలగా మారినట్లే మారి, అంతలోనే ఆత్మబలం పుంజుకున్న స్త్రీ మూర్తిగా నిలబడి కాలానికి సమాధానమవమంటుంది.
“దూరం వచ్చేశాక నాతో దయగా ఉండకు, కాలం మొనదేల్చిన గునపం గుండెలోకి దిగబడి పూడ్చిన జ్ఞాపకాలను బద్దలు కొడుతుంది.”
అలా కాలంతో పోటీ పడుతూ నీతో ఉన్న కాసేపు కవితలో అతని మనసు జేబు నింపే కబుర్ల కాలం అవుతుంది.
ఔటింగ్ విత్ డిప్రెషన్ కవితలో..జెండర్ లెస్ గా ఈ స్టేజ్ ని వివరిస్తుంది. అందరూ అనుభవించేదే అయినా ఈ ప్రేమ స్ట్రాటజీల నుండి బయటపడడం అంత మామూలు విషయం కాదు. పుట్టిన దగ్గర నుండి చేసే ప్రయాణంలో ఎన్నో మలుపులు. కొందరిని అకారణంగా వదులుకుంటాం. అలా వదులుకున్న సమయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. ఎవరి సొంతమైన అనుభవం వారిదే. ఏ ఆగంతకుడో వచ్చి మన ప్రియమైన వస్తువును దొంగిలించినట్లు బాధపడతాము. అటువంటి సమయంలో మనసు పడే వెంపర్లాట, అందులో నుండి బయటపడే మనోబలం, రెండూ తన కవితతో చెప్తుంది జెన్నీ.
జెన్నీ కవిత్వంలో ముద్దు పాటలు ఉంటాయి. చూపుల మర్మం ఉంటుంది. చూపులు తాకితేనే ముద్దగా తడిసిపోయే ఆ వర్షంలో మేని గాయాలు ఉంటాయి, మనసు గాయం కంటే ఏదీ పెద్దది కాదన్న నమ్మకం జెన్నీది.
నగ్న శరీర ఊచకోతల్ని వినిపిస్తుంది. గావుకేకల నాగరికతలని లోయల్లోకి నెట్టేద్దాం. ఇది మనల్ని 2000 ఏళ్ళుగా పట్టిపీడిస్తున్న మన సంస్కృతిని ఎండగడుతుంది. దేహ సంస్కృతిలో మను సంస్కృతి గాయాల్ని ఎత్తి చూపిస్తుంది. అంతలోనే మగవాళ్ళ అస్తిత్వ ధోరణిని చూపిస్తూ, ఈ సమాజం ఏడవడం కూడా చేతకాని పిరికిపందని చేసిందని వాళ్లపైన జాలి చూపిస్తూ….,
పాపం మగవాళ్ళు రా,
పిచ్చినా కొడుకులు రా,
చిన్ని తండ్రులు రా, దయ చూపండి రా, బేల అంటే స్త్రీ లింగమే కాదు అని
గొంతు విప్పి భావ కవిత్వమై వినిపిస్తుంది.
ఇలా జెన్నీలో ఆల్టర్ ఈగో డెప్త్ తో అనేక రకాల కంటెంట్స్ ఉన్నాయి. అయితే ఇదంతా తాదాత్మకం చెందిన కవిత్వం అనలేము, అలా అని పూర్తి భావ ప్రకటన కలిగిన అస్తిత్వ పోరాటమూ అనలేము. ఇదో భావ సంఘర్షణ, సంక్లిష్ట సమాధానాల వెల్లువ. అయితే ఇదేమీ హై సొసైటీ విమెన్ మాట్లాడుతున్నట్లు ఉండదు. అట్టడుగు స్త్రీ భావ ప్రకంపనలు కాదు, మధ్యతరగతిలోని బరువు బాధ్యతల మధ్య నలిగిన సమయాలు కావు.
సమాజంలోని లోపాల్ని చూస్తూ సొసైటీలో మార్పు రావాలన్న దిగులు ఉంటుంది తన కవిత్వంలో. చుట్టూ వుండే సంప్రదాయ సంస్కృతిలో చూసే పద్ధతిలో మార్పు రావాలని కోరిక ఉంటుంది. అవనిపై ఆడపిల్ల ఆత్మాభిమానంగా బతకాలి అంటుంది. తన కవిత్వంలో సమస్యలను కొత్త కోణంలో చూడటం, అలా చూసిన, తెలిసిన సందర్భాలని మర్మమెరిగిన వాక్యంతో ఆకట్టుకోవడం అపర్ణ సొంతం.
మైండ్ లో కంన్ఫ్లీక్ట్ అయ్యే టెంపరరీ ఫైల్స్ ని డిలీట్ చేస్తూ, ‘యు ఆర్ ఏ ఫేడెడ్ మెమొరీ’ అంటూ పాటలు పాడి వండర్ రైడ్స్ చేస్తూ ఆల్టర్ ఇగోని పక్కన పెట్టేసిన జెన్నీ కి శుభాకాంక్షలు అపర్ణ!
*****
![](http://www.neccheli.com/wordpress/wp-content/uploads/2020/04/IMG_20200307_212045-1-e1586285289116.jpg)
పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.