కథామధురం
ఆ‘పాత’ కథామృతం-25
శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”
-డా. సిహెచ్. సుశీల
ప్రేమ, కాదల్, ఇష్క్, లవ్ … ఏ పేరుతో పిలిచిన “ప్రేమ” అన్న భావనే మధుర మైనది. యుక్త వయసులో ఉన్నవారు భవిష్యత్తులో తమ ప్రేమ ఎంత అందంగా, ఆహ్లాదకరంగా పరిణమించబోతుందో అని మధురంగా ఊహించుకొని మురిసిపోతారు. వయసు అయిపోయిన వృద్ధులు కూడా ప్రేమ అన్న పదం వినగానే తమ గతాన్ని తలుచుకొని, తమ ప్రేమ కథల్ని, ప్రేమ భావనల్ని జ్ఞప్తికి తెచ్చుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఏది ఏమైనా “ప్రేమ” అనేది మనసుకు సంబంధించినది. మనసును గిలిగింతలు పెట్టే ప్రేమ భావన రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే అద్భుతమైన స్థితి. మనసు పొరల్లో పుట్టి, కనురెప్పల మాటున కళకళలాడి విశాలంగా, విస్తృతంగా, విస్తరిస్తూ విహరించేది ప్రేమ.
ప్రేమ అనేది రెండు హృదయాల స్పందన. రెండు మనసులు కలిసి ఏకోన్ముఖంగా అందంగా ఆనందంగా సాగిపోయేది. ఒక్క మనసులో పుట్టి, వ్యక్తం కాకుండా మిగిలిపోతే అది విఫల ప్రేమ అవుతుంది.
“నేను ప్రేమిస్తున్నాను, నువ్వూ ప్రేమించాలి ” అని దబాయిస్తే బెదిరిస్తే అది ప్రేమ కాజాలదు. ” ప్రేమించు లేదా చచ్చిపో ” అని కర్కశంగా గొడ్డలితోనో, యాసిడ్ తోనో నిర్దేశిస్తే అది అమానుషమైన పాశవిక చర్య. ” నేను ప్రేమిస్తూనే వుంటాను , దట్ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం” అని ప్రేమిస్తూ కూర్చోవడం పనీపాటా లేని అర్థంలేని ప్రేమ. అందుకే ఒక మాట లోకంలో ఉంది – ప్రేమా పిచ్చీ ఒకటే అని. ప్రేమ అనే పేరు తో వెర్రి తలలు వేస్తూ యువతరం తమను తాము సమర్ధించుకోవడానికి ఏ కథనో, ఏ కావ్యాన్నో, ఏ రచయితనో, ఏ కొటేషన్నో తెలివిగా ఉదాహరిస్తూ తమని తామ సమర్థించుకోవటం మూర్ఖత్వం అవుతుంది. వాలెంటైన్ అనే అతనికి మరణశిక్ష విధింపబడిన రోజు ఫిబ్రవరి 14న ” ప్రేమికుల దినోత్సవం ” పేరిట జరుపుకునే సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమై, అది అన్ని దేశాలతో పాటు భారతదేశానికి వచ్చి చేరింది. ఆరోజు ఖరీదైన గ్రీటింగ్స్, కానుకలు ఇచ్చి తమ ప్రేమను ప్రకటించుకోవటం రాను రానూ వేలంవెర్రిగా మారుతోంది. ఇద్దరికీ అంగీకారం అయితే ఒప్పు. కానీ ఒకవైపు నుండి మాత్రమే ఉండి, మరొకరిని వేధించడం తప్పు. నీతి నిజాయితీలు ధర్మాధర్మాలు ఆలోచించకుండా ప్రేమిస్తున్నాను అనటం చూస్తే నిజంగా ప్రేమ గుడ్డిది అన్నది నిజమేనేమో అనిపిస్తుంది.
***
1952 నవంబర్ గృహలక్ష్మి పత్రికలో శ్రీమతి కొమ్మూరి ఉషారాణి రాసిన కథ* “అభ్యుదయం” అనేది ఈ విషయాలను వ్యంగంగా చెప్పిన మంచి కథ. పెళ్లయిన స్త్రీని ప్రేమించాను అనడం, నేను ప్రేమించాను కాబట్టి నీ భర్తకు విడాకులు ఇచ్చి నాతో వచ్చేయ్ అని బలవంత పెట్టడం – అనే ఇతివృత్తంతో వ్యంగ్యం గా శేఖర్ అనే పాత్రను చిత్రించారు రచయిత్రి.
చదువుకుంటున్న యువత అప్పుడప్పుడే వస్తున్న ఆంగ్ల, తెలుగు సాహిత్యంలో రొమాంటిక్, ప్రేమ, మోహం అనే కాన్సెప్ట్ తో వస్తున్న సాహిత్యాన్ని చదివి ఆయా రచయితలు చెప్పిన ఉదాత్తతను అర్థం చేసుకోలేక పైపైన చదివి తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఉచితానుచితాలు ఆలోచించకుండా ప్రవర్తించడం జరిగింది (జరుగుతోంది). 1920 – 50 మధ్య గుడిపాటి వెంకటచలం స్త్రీల జీవితాలను, సమస్య లను, వారి మనసులకు ప్రాధాన్యత ఇవ్వని కుటుంబ వ్యవస్థ గురించి అనేక కథల వ్రాశారు. దుర్మార్గమైన కుటుంబ వ్యవస్థ అనే చట్రం లో స్త్రీలు స్వేచ్ఛగా ప్రేమను పండించుకునే దశగా ఆలోచించాలని నవలలు రాశారు. కానీ దానిని వక్రీకరించి తమ భావాలకు చలం రచనలను అన్వయించుకోవటం ఆయనకు అన్యాయం చేయటమే అవుతుంది.
అభ్యుదయము
శేఖర్ అనే మనస్తత్వ శాస్త్ర విద్యార్థి బస్సు లో ఒక మహిళ ను చూసి అమాంతం ప్రేమలో పడిపోతాడు. తర్వాత తెలుస్తుంది ఆమె తన స్నేహితుడి భార్య అని. అయినా ఏమాత్రం సంకోచం లేకుండా ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకరోజు ఆమెకు చెప్పేస్తాడు కూడా. ఈ ప్రేమల విషయాలేమీ తనకు తెలీవని, తను తన భర్త అన్యోన్యంగానే ఉన్నామని చెప్తుంది. ఇంతే కథ.
అయితే , ఈ కథ లో రచయిత్రి ఉషారాణి వ్యంగ్యాన్ని పదునైన అస్త్రంగా ఉపయోగించుకుని, కుహనా మేధావులను దాదాపు చీల్చి చెండాడినంత పని చేసారు.
ఆనందరావు గారు తన కుమారుడు శేఖర్ అందంగా, స్టైల్ గా ఉంటాడని, సైకాలజీ మెయిన్ సబ్జెక్టు గా తీసుకుని చదువుతున్నాడని అందరికీ గొప్ప గా చెప్పుకుంటాడు. శేఖర్ కాలేజీకి వెళ్ళేటప్పుడే కాదు సినిమాకి, బీచ్ కి వెళ్ళేటప్పుడు కూడా చేతిలోఎప్పుడూ ఏదో పుస్తకం ఉంటుంది. తనకు తానే మేధావి నని భావించుకునే మనస్తత్వం అతనిది. ఒకరోజు బస్సు లో ఎదురు సీటు లో కూర్చున్న అందమైన స్త్రీ ని చూసి, ‘ఏమైనా అనుకుంటుందేమో ‘ అన్న సందేహం కూడా లేకుండా ఆమె దిగి వెళ్ళే వరకూ అలా చూస్తుండిపోయాడు.
తన లాంటి వ్యక్తి ఇలా అయిపోవడం ఏమిటని తన దగ్గరున్న పుస్తకాలు, మనస్తత్వ పుస్తకాలు తిరగేసాడు. ” ప్రేమ” అని నిర్ధారించుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఒకసారి తన ఫ్రెండ్ సుదర్శనం ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది – ఆమె అతని భార్య అనీ, పేరు పార్వతి అని.
” మీలాగే మీ పేరు అందంగా ఉంది” అన్నాడు పోజు గా. ఇతనికేమైనా పైత్యమా అనుకుంది పార్వతి. తర్వాత తరచూ వారింటికి వెళ్లడం, ‘అర్ధ నిమీలిత నేత్రాలతో చూడడం’ అతని పని అయింది. ‘ఏదో అర్ధం ఉన్నట్టు వంకరగా చూపులు’ చూసి పార్వతి పడీ పడీ నవ్వింది.
లోకంలోని సమస్త విషయాలు తనకు తెలుసునని, తన్ను మించిన తెలివి గలవాడు లేడని అనుకునే ” స్వయం ప్రకటిత మేధావి” అతను. స్నేహితుడి భార్య అని తెలిసినా తన “లవ్” పెరిగిపోతూనే ఉంది. ” పెళ్లి కాని స్త్రీని ప్రేమించడం కంటే, పెళ్ళయిన స్త్రీని ప్రేమించి, ఆమె చేతనూ ప్రేమించబడి, సంఘాన్ని ఎదిరించడం లోనే గొప్ప అభ్యుదయం ఉందని, పెద్ద విప్లవం తెచ్చినవాడినౌతానని మనసారా నమ్మాడు.
అన్నా కెరీనా, మాడమ్ బవరీ వంటివారి పుస్తకాలు మళ్ళీ మళ్ళీ తిరిగేసాడు.
ఒకనాటి సాయంకాలం పల్చటి లాల్చి, పైజామా వేసుకుని, నోట్లో సిగరెట్టు తో సుదర్శనం ఇంటికి వెళ్ళాడు. సుదర్శనం కి విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు.
” మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మనిద్దరం వివాహం చేసుకుందాం. సంఘాన్ని ఎదిరిద్దాం. లోకాన్ని ధిక్కరిద్దాం. మీరు ఎప్పుడైనా చలంగారి కథలు చదివారా? మంచి ప్లీడర్ ని పెట్టి మీకు విడాకులు ఇప్పిస్తాను. మనకెవరు అడ్డు రాలేరు. పుస్తె కట్టినంత మాత్రాన భర్తలవుతారా… చలం అన్నట్టు! మీరు నన్ను ప్రేమిస్తున్నారు. మీకు ఆ సంగతి బాగా తెలుసు. మీ స్త్రీల మనస్తత్వం అదే. బయటికి చెప్పడానికి భయపడతారు. ఇది 20వ శతాబ్దం. మన సంస్కారం, విజ్ఞానం చాలా ముందుంది. బాగా అలవడి కావాలంటే మనుషుల్లో మార్పు రావాలి. స్వేచ్ఛని పొందాలి” అన్నాడు గుక్క తిప్పుకోకుండా.
అప్పుడప్పుడే భావకవిత్వం, ఊహా ప్రేయసులను సృష్టించుకుని కవిత్వం రాసే “ఏవో తెలియని భావగీతములు రాసే” భావ కవులు ఒకవైపు, స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకొని సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మానసిక హింసలను, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను ఇతివృత్తాలుగా తీసుకొని చలం మరో వైపు నవలలు రాస్తున్నారు.
ఆ కవుల, రచయితల ” తాత్వికత ” వేరు. ఎంతో గొప్ప ఉద్యమాన్ని, వాదాన్ని నిబిడీకృతం చేస్తూ రచనలు చేస్తున్న ఆ మహానుభావులను తమకు అనుకూలంగా ఉదాహరిస్తూ, తమ పబ్బం గడుపుకునే శేఖర్ లాంటి మనుషులను రచయిత్రి ఉషారాణి వ్యంగ్యంగా విమర్శించారు కథలో.
మొదటినుంచి అతని వేషధారణ, స్టయిలు, ప్రవర్తనను హాస్యంగా వర్ణించారు రచయిత్రి. చలం రాతలను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ కనుకూలంగా వక్రీకరణ చేసుకునే స్వార్థపరులను, తమని తాము అభ్యుదయవాదులుగా, విప్లవకారులుగా ప్రకటించుకునే వారిని శేఖర్ పాత్ర ద్వారా దాదాపు వెక్కిరించినంత పని చేశారు రచయిత్రి.ఈ కథకు ” అభ్యుదయము ” అని శీర్షిక నుంచడమే ఆ వ్యంగ్యానికి పరాకాష్ట.
“శేఖర్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది. మీరు అడిగిన చలం పుస్తకాన్ని నేనేమీ చదవలేదు. నాకూ సుదర్శనానికి ఐదేళ్ళ క్రిందట వివాహం అయింది. అప్పుడు ప్రేమంటే నాకేమీ తెలియదు. ఆయనే నన్ను ఇంటర్మీడియట్ వరకు చదివిం చారు. మేమిద్దరం పెళ్లి ముందర కథల్లో లాగా ప్రేమించుకోకపోయినా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. విజ్ఞానం పెంపొందించాలంటే మీరు అన్నట్లు కొంతవరకు పాశ్చాత్యులను అనుకరించి, బాగుపడాలనుకునేవారు మంచిని అనుకరించవచ్చు. కానీ మన సంఘ మర్యాదలు, నైతిక జీవనం వారి జీవనానికి విరుద్ధంగా ఉంటుంది. మీరు నిజంగా చదువుకొని సంస్కారం అలవర్చుకోవాలంటే ఇటువంటి పిచ్చి అభిప్రాయాలను మానుకోండి. అభ్యుదయం… ముందంజ… సంస్కారం… అంటే ఇవి కావు” అన్నది పార్వతి నిష్కర్షగా.
“ఈ కాలం కుర్రాళ్ళకి మరీ పైత్యం ఎక్కువౌతోంది” అని పార్వతి నవ్వుతుంది – అని కథను ముగించారు ఉషారాణి.
ప్రేమ పేరుతో వెర్రితలలు వేస్తూ, ప్రేమ పేరుతో ముందు వెనుక ఆలోచించకుండా కలిసి బ్రతకడం, సహజీవనం లేదా అక్రమ సంబంధం పెట్టుకుని సమర్ధించుకునే కొంతమందికి ( మాత్రమే) చెంపపెట్టు పార్వతి పాత్ర తో చెప్పించిన ముగింపు డైలాగ్స్. కుటుంబ హింసలతో, భర్త దౌర్జన్యం తో విసిగి వేసారి, విడాకులిచ్చి , తన కాళ్ళ పై తాను నిలబడి ప్రశాంతం గా జీవించడం తప్పు కాదు. స్త్రీలకు ఆ స్వేచ్ఛ, హక్కు ఉంది. తన భావాలకు విలువనిచ్చే వ్యక్తి ఎదురైతే అతనితో కలిసి జీవితం పంచుకోవడం సమర్ధ నీయం కూడా.
నిజానికి చలం గారి తమ్ముడు వెంకట్రామయ్య కూతురు కొమ్మూరి ఉషారాణి. నాటకాలలో స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలి అన్న బళ్ళారి రాఘవ గారి పిలుపు అందు కున్న మొదటి తరం రంగస్థల నటి కొమ్మూరి పద్మావతి ఈమె తల్లి. ఉషారాణి గారి అక్క వరూధిని కొడవటిగంటి కుటుంబరావు గారి భార్య. తమ్ముడు కొమ్మూరి సాంబశివరావు ప్రముఖ డిటెక్టివ్ రచయిత. కుటుంబమంతా అభ్యుదయ దృక్పథం గల, సాహిత్య చైతన్యం, సామాజిక పరిజ్ఞానం గలవారే. అయినా సరియైన “అభ్యుదయం” అంటే శేఖర్ లాంటి అవకాశవాదుల ప్రేలాపన కాదనీ, “ప్రేమంటే” – బస్సులో మొదటిసారి చూసిన వెంటనే వెంటబడడం కాదనీ, స్నేహితుని భార్య అని తెలిసినా ” ప్రేమించుకుందాం రా”, ” పెళ్ళి చేసుకుందాం రా ” అనడం కాదనీ రచయిత్రి స్పష్టంగా చెప్పారు.
కన్యాశుల్కంలోని గిరీశం వంటివాడు ఈ శేఖర్. నిండైన వ్యక్తిత్వం గల, స్పష్టమైన వైఖరి గల, అభ్యుదయం అంటే ఏమిటో తెలివిడి ఉన్న మనస్తత్వం గల పార్వతి ద్వారా ఆనాటి కుహనా మేధావులకు ప్రతీక అయిన శేఖర్ వంటి వారిని దెబ్బ కొట్టారు శ్రీమతి కొమ్మూరి ఉషారాణి.
పంజాబ్ కు చెందిన సుమీందర్ సింగ్ భాటియాని వివాహం చేసుకున్న ఉషారాణి గారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా తెలుగు శాఖకు తొలి ఎడిటర్ గా 1990 వరకు పదవీ బాధ్యతలు నిర్వహించారు.
*****