క్రీ.శ. రెండవ హరిహర రాయలు కుమారుడు మొదటి దేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. పర్షియన్ చరిత్ర కారుడు ఫెరిస్తా (1406) లో ఆనాటి సంఘటనలను పుస్తకానికెక్కించాడు. ఇతని కాలంలో ఆనాటి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతమంతా ఇతని పాలనలోకి వచ్చిందట! వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందట! తుంగభద్ర నదికి ఏనుగుల సాయంతో ఆనకట్ట కూడా ఎర్పడిందట! అక్కడినుంచీ విజయ నగరం హంపీకి 24 మైళ్ళదాకా కాలువ తవ్వించి, త్రాగు నీరు తెప్పించే ఏర్పాటు కూడా చేశాడట!
నికొలో కౌంటీ వ్రాతల ప్రకారం ఇతని సమయంలోనే విజయనగర సామ్రాజ్యం, బాగా విస్తరించిందట! కళలకు కళా, కాంతీ వచ్చాయి! సైన్యమూ అభివృద్ధి చెందింది!
ఇంతలో దేవరాయల జీవితంలోని ఒక ప్రణయ పుట!
బహమనీ రాజ్య పాలనలో ఉన్నముద్గల్ ప్రాంతంలో దేవరాయలు మారువేషంలో పర్యటిస్తున్నాడు. పొరుగు దేశాల్లోనూ మారు వేషాల్లో తన సైనికులతో పర్యటిస్తూ అక్కడి స్థితి గతులనూ, ప్రజల మనోభావాలనూ పసిగట్టి, తదనుగుణంగా తమ పథకాలను రూపొందించుకోవటం కూడా రాజుల పద్ధతి. వేషభాషల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. అవసరమైతే అక్కడి వారి ధర్మానికి చెందిన వారి వలెనే మెలగ వలసి వస్తుంది కూడా! దేవరాయలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ జాగ్రత్తగా ముద్గల్ లో సంచరిస్తున్న సమయం.
ఒక చోట ఒక ఇంటిలో చాలా మంది చేరి ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు.
మారువేషంలో ఉన్న దేవరాయలకు వారి అమాయకమైన ఆనందం చూసి ముచ్చట వేసింది. తన సైనికులు వారిస్తున్నా వారి వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు, వాళ్ళమధ్య అనుబంధాలు, వారి కట్టుబాట్లు, ఆడవారి ఆభరణాలు, అందాలు ..అన్నీ తెగ ఆకర్షించాయి. అన్నిటికన్నా మించి, వాళ్ళ కుటుంబంలోని ఒక కన్నె పిల్ల దేవరాయల మనసు దోచేసుకుంది.ఐనా తాను ఆ కన్నెకు నచ్చానో లేదో తెలిసేదెలా?
అదను చూసుకుని, చెయ్యి పట్టుకున్నాడు. మృదువుగా విడిపించుకుని, వెనక్కి తిరిగి అందంగా చూసి చిరునవ్వు రువ్వి వెళిపోయింది. ఇంక రాయలు తేరుకోలేకపోయాడు.
తన సైనికులను పంపి ఆ కుటుంబం వివరాలు సేకరించమని ఆజ్ఞ. ఇంతకూ వాళ్ళది వ్యావసాయిక కుటుంబం. ఆ అమ్మాయి పేరు పర్తల్. బహమనీ రాజ్య పాలనలో ఉన్న ఆ ప్రాంతం పిల్లను విజయనగర ప్రభువు వివాహమాడితే ఇంకేమైనా ఉందా? పెద్ద యుద్ధమే వస్తుంది. అధికారులీ విషయాన్ని రాజుకు విడమరచి చెప్పారు. దేవరాయలు మనసు ఆ పిల్ల నుండి మరలి రానంటూ ఉంది. తన శిబిరానికి వెళ్ళినా ఆ కన్నె తన మనసులో కలలకు నెలవైంది. ఎలాగైనా ఆ అమ్మాయిని తనదాన్ని చేసుకోవాలనిపిస్తూ ఉంది.
ఎంతగా ఆపాలనుకున్నా ఆ అందగత్తె మనసులో తిష్ట వేసుకుని కూర్చునే ఉంది. ఇక తమాయించుకోలేక తన ఉన్నతాధికారిని రాయబారం పంపాడు,’విజయనగర ప్రభువు దేవరాయలు మీ అమ్మాయిని వివాహమాడదలచాడు. మీ సమ్మతి కావలెను.’ అని చెప్పారా అధికారులు. ఎన్నెనో కానుకలు సమర్పిస్తూ, ఇటీవల వాళ్ళింటి సంబరాల్లో తమ రాజు పాల్గొన్నట్టూ, మీ ఇంటి ఆడబిడుచును రాజు ఇష్టపడినట్టూ, పెళ్ళాడ దలచినట్టూ చెప్పి, యీ సంగతిని రహస్యంగా ఉంచాలన్న హెచ్చరిక కూడా చేశారు వారు. రాజుగారి చిత్రపటాన్నీ ఇచ్చారు.
‘విజయ నగర ప్రభువా? తమ బిడ్డను వివాహమాడటమా? ఇది కలా, నిజమా? కానీ..?’
విజయనగరానికీ, తమ రాజ్యానికీ అస్సలు మంచి సంబంధాలు లేవు. శత్రు రాజులైరి! ఆ విషయం తెలిస్తే తమ రాజు ఊరుకుంటాడా? తమను చీల్చి చెండాడడూ? బిడ్డ సంగతేమి కావాలి?’ ఇన్ని సందేహాల మధ్య ఆ కుటుంబ పెద్ద ఊగిసలాడుతున్నాడు. ఐనా విజయనగర పాలనలో ప్రజలు ఎంతో హాయిగా ఉన్నారని అప్పుడప్పుడు వార్తలు వింటూనే ఉన్న కారణంగా యీ సంబంధం ఒప్పుకోవాలనే బలంగా అనిపించిందా తండ్రికి! పైగా కలలో నైనా ఊహించని విధంగా తన బిడ్డను రాణీ హోదాలో చూసుకోవ టం, తమకూ ఆ గౌరవ మర్యాదలు దక్కటం- ఏనాడైనా ఊహించని విషయం. తన భార్యతో చర్చించి, ఆమెనూ ఒప్పించి, చివరికి పర్తల్ తో చెప్పాడు తండ్రి, విజయనగర రాజు దేవరాయలు నిన్ను వివాహమాడదలచాడట, మారువేషంలో మన ఇంటి వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిన్ను చూసినప్పుడు నీవు నచ్చావట! ఇదిగో రాజు చిత్ర పటం! నువ్వూ చూశావట వారిని! ఏమంటావమ్మా?’
పర్తల్ ముందు సిగ్గు పడింది. తరువాత చిత్రపటం చూసింది. నిజమే, ఇతడినే కదా తానూ ఆ నాడు చూసింది? తన అందం ఒక రాజును ఆకర్షించేంత గొప్పదా? కానీ..? ఇతణ్ణి పెళ్ళి చేసుకుని తాను వెళ్ళిపోతే ఇంక పుట్టింటితో తన సంబంధం పూర్తిగా తెగిపోయినట్టే! విజయనగరం పొరుగు దేశమైనా తమ రాజుకు శత్రుదేశం. ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలూ ఉండవు కానీ రాజుల వల్ల, వాళ్ళ అధికార దాహం వల్లా ముందు సామాన్య ప్రజలకు ఇబ్బంది. వాళ్ళు తమ చోట క్షేమంగానే ఉంటారు, ముందుగా సామాన్య ప్రజానీకం ప్రాణాలను కోల్పోతుంది. ఇప్పుడీ పెళ్ళిని తాను ఒప్పుకుంటే, గొప్ప యుద్ధానికి తానే కారణమైపోతుంది. ఇవన్నీ అవసరమా? ఏదో పెళ్ళి చేసుకుని, ఆ కుటుంబంతోనూ, ఇక్కడి తల్లిదండ్రులతో హాయిగా ఉండక, యీ ఇబ్బందులు కొని తెచ్చుకోవడమెందుకు? ఐనా ఆ నాటి ఘటన ఏదో అనుకోకుండా జరిగింది. అతగాడు రాజని తనకు తెలిసే అవకాశమే లేదు. తెలిసినా, తాను చేయగలిగేదేముంది? ఇప్పుడే యీ ఆలోచన చేయటం మంచిది. తన సుఖం కోసం తన వాళ్ళనూ, కుటుంబాన్నీ కష్టాల పాలు చేయటం ద్వారా తనకేమి దక్కుతుంది,ఇష్టాల మధ్య కాక కష్టాల మధ్య భయం భయంగా బ్రదకడమా?’ పర్తల్ మరో ఆలోచన లేకుండా తిరస్కరించేసింది. ఆ అమ్మాయి తన భావాలు కూడా ధైర్యంగా తండ్రికి చెప్పింది. సామాన్య జీవితంలోని సరదాలు భవనాల్లో ఉంటాయా? అదీ రాజ భవనాల్లో! రాజుకు ఎంత మందో భార్యలు! వాళ్ళలో ఒకతెగా మాత్రమే తన స్థానం. ఎంత సుఖమైనా అంత మందిలో తానూ ఒకతెగా ఉండటం కన్నా, అమ్మా నాన్నలకు దగ్గరగా హయిగా పొలమూ చెట్ల మధ్య హాయిగా జీవించాలని ఉందని చెప్పింది గట్టిగానే!!
*****
(సశేషం)