![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2024/03/Kadedi-Kathakanarham-e1709633321740.jpg)
కాదేదీ కథకనర్హం-11
జనరేషన్ గ్యాప్
-డి.కామేశ్వరి
“డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై” నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో అమెరికాలో పెరిగే పిల్లలు అసలు సహించరని తెలుసు కనక తన కోపం దాచుకుని.
“యూ డోంట్ బి సిల్లీ నందూ, పెళ్ళికి ముందే తెలియడానికి, పరిచయాలు పెంచు కుని డేటింగులు చేయడానికి , చేసి నచ్చకపోతే వదిలేసి మరోడ్ని వెతుక్కోవడానికి యిది అమెరికాయే అయినా మనం ఇండియన్స్ అని మరిచిపోకు. మన అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు వేరని నీకు తెలియదా. యిక్కడున్నా మన ఆచారం ప్రకారం నడవాల్సిం దే…..” గొంతులో అధారిటీ కన్పించింది.
“ఓ…..డోంట్ టాక్ రబ్బిష్ మమ్మీ ఈ ఆచారాలు, సంస్కృతులు…..అల్ నాన్సెన్స్ ….. యూనో దట్ ఐ డోంట్ హేవ్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్ — మనిషి ఎలాంటివాడో తెలియకుండా ముక్కు మొహం తెలియనివాడిని ఐదు నిమిషాలు చూసి పెళ్ళాడాలని ఎలా చెప్తున్నావు — నీవు చదువుకుని మోడర్న్ అయి వుండీ ……. సమ్ టైమ్స్ యూ టాక్ అల్ నాన్ సెన్స్ మమ్మీ ——-చూడు నాకెవరన్నా పరిచయం అవాలి. నాకు నచ్చాలి, మా మనసులు కలవాలి , ఐడియాలు, టెస్టులు కలవాలి. యిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కుదరాలి ——-లవ్ పుట్టాలి అప్పుడు గాని నేను చేసుకోను —మీరు చూపిం చిన వాడిని కట్టుకుని మనసులు కలవకపోతే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆ టార్చర్ అంతా సహిస్తూ లోకం కోసం కల్సి బతకడం వగైరాలు నేను చచ్చినా చేయను. అంచేత నాకు నచ్చిన వాడు కనిపిస్తే నేనే చెపుతా మీకు’ ఖచ్చితంగా అంది.
‘ఆ, చూస్తున్నాంగా ఈ డేటింగులు ఎంత సక్సెస్ పుల్ అవుతున్నాయో —- కలిసి తిరిగి మనసులే కాక శరీరాలు పెళ్ళి కాక ముందే కలుపుకుని నచ్చలేదని యింకోడిని వెతుక్కోడం, లేదంటే పెళ్ళి చేసుకుని ఏడాది రెండేళ్ళకే డైవర్సు లు యివన్నీ చూడడం లేదా, పెళ్ళికి ముందు ప్రతి మగాడు జెంటిల్ మెన్ లాగే ప్రవర్తిస్తాడు. అసలు రంగులన్నీ పెళ్ళి అయి కల్సిమెల్సి బతకడం అరంభించాక గాని బయట పడవు. కొత్త మోజులో నాల్గురోజులు ప్రేమ కబుర్లు చెపుతారు మగవాళ్ళు —-ఆ తరువాత అందరూ ఒకటే. ఆడదాని అదృష్టం బాగుంటే సౌమ్యుడు, సహృదయుడు దొరుకుతాడు. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది మనం నమ్మి తీరాలి. అంచేత ఈ మనసులు కలవడాలు, అర్ధం చేసుకోడానికి డేటింగ్స్ అంతా రబ్బిష్ అంటాను నేను —- ‘ కూతురన్న రాబ్బీష్ మాటని వత్తి పలుకుతూ తీవ్రంగానే అంది మాధవి.
“కమాన్ మమ్మీ నీకు రబ్బీష్ అయింది నాకు కావాలని ఏమన్నా రూలుందా. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నీ కోసం నా ఉద్దేశాలు మార్చుకోవాలా —–‘ సూటిగా అంది.
“నా కోసం కాదు, నీ కోసమే మార్చుకోమంటున్నాను. నే చెప్పేది నీ మంచి కోసమేనని గ్రహించమంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ పన్నెండేళ్ళ నుంచి చుట్టూ చూస్తూ తెల్సుకున్న విషయం నుంచి నేర్చుకున్న పాఠాల అనుభవం వల్ల చెప్తున్నాను. ఈ డేటింగులు , ఈ ప్రేమ యిదంతా మనలాంటి వాళ్ళకి కాదు….’ నచ్చ చెప్పబోయింది.
“మమ్మీ నీవెలా మాట్లాడుతున్నావంటే అమెరికాలో అందరూ చెడిపోయి నట్టు —–రోజూ అందరూ డైవర్సులు లిచ్చుకుంటున్నట్టే మాట్లాడుతున్నావు. ఏం వీళ్ళెవరు పెళ్ళిళ్ళు చేసుకోడం లేదా, సంసారాలు చేయడం లేదా, ఎటొచ్చి మనకి వాళ్ళకి తేడా ఏమిటంటే ఒకరితో ఒకరికి పడకపోయినా, లోకం కోసం నటిస్తూ తిట్టుకుంటూ, కొట్టు కుంటూ పడివుంటాం మనం, వాళ్ళు లోకాన్ని కేర్ చెయ్యకుండా వాళ్ళు సుఖం చూసుకుంటారు. మమ్మీ మీ అందరికీ అమెరికా కావాలి, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, యిక్కడి డబ్బులు పనికొస్తాయి . ఈ దేశంలో వుంటూ, ఈ దేశం తిండి తింటూ యిక్కడి మనుష్యులని విమర్శిస్తారు. ఐ హెట్ దీజ్ డబుల్ స్టాండర్త్స్……. మీ పిల్లలని అమెరికాలో పెంచుతూ వాళ్ళకి ఇండియన్ థింకింగ్ లే కావాలంటారు. అన్నీ ఎలా కుదురుతాయి…..’ వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది —కూతురు మాటల్లో నిజం వున్నా చిన్నపిల్ల తమని వేలెత్తి చూపిస్తూ ఎత్తి పోడిచేసరికి సహించ లేకపోయింది మాధవి.
“నందూ యిన్ని మాటలు అనవసరం, అమెరికాలో వున్నంత మాత్రాన మన ఆచార వ్యవహారాలూ వదిలేసి అమెరికన్స్ అవక్కరలేదు. ఎవరి సంగతో నా కానవసరం — మేం మా పిల్లలని ఇండియన్ పద్దతిలోనే పెంచాం — పెంచాలనుకుంటున్నాం. ఈ డేటింగు లు, యీ లవ్ ఎపైర్లు, పెళ్ళికి ముందు మేం ఒప్పుకోం. ఇప్పుడు నీకు చూపించిన ఫోటోలో అబ్బాయి యింజనీరింగు చదివి, ఎమ్.ఎస్ చేయడానికిక్కడికి వస్తున్నాడు, తల్లి తండ్రి డాక్టర్లు —- మన వాళ్ళు — చదువు, సంస్కారం, డబ్బు, హోదా అన్నీ వున్న ఫేమిలీ వాళ్ళది. ఆ అబ్బాయి అమెరికా వస్తే మళ్ళీ గ్రీన్ కార్డ్ వచ్చేలోగా రావడం కుదరదని పెళ్ళి చేసి పంపాలని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అబ్బాయి చక్కగా, స్మార్టుగా వున్నాడు. అన్ని విధాల మంచి సంబంధం అని మామయ్యా రాశాడు. నీ ఫోటో చూసి నచ్చావట. మా అందరికీ నచ్చింది సంబంధం. నీవోక్కర్తీవి వూ అంటే ఇండియాకి టికెట్ బుక్ చేసుకొని వెళ్లి పెళ్ళి చేసుకుని రావడమే —అన్నీ కుదిరిన యింత మంచి సంబంధం మనం కావాలన్నప్పుడల్లా రాదు ….అంచేత ఈ సంబంధం ఒప్పుకో —- డేటింగుల పేర ఏ తలమాసిన వాడితోనో తిరగడం — అదంతా కుదరని వ్యవహారం. అది మన కల్చర్ కాదు.” శాసిస్తున్నట్టుగా అంది మాధవి. తల్లి గొంతులో తీక్షణత , ఆమె మాటల్లో శాసిస్తున్న తీరు చూసేసరికి నందిత ఇన్సల్ట్ ఫీలయింది. ఆ అమ్మాయి మొహం ఎర్రబరచుకుని,
“మమ్మీ ఐ నో వాట్ ఐ వాంట్ , ఐ నో వాటీజ్ గుడ్ ఫర్ మీ —— డోంట్ ట్రీట్ మి యాజ్ ఏ కిడ్ , ఎండ్ డోంట్ ఇన్ సిస్ట్ మి ఇన్ దిస్ మాటర్ ఎనీ మోర్,” అంటూ విసవిస అక్కడ నించి వెళ్ళిపోయింది నందిత. ఆ తిరస్కారాన్ని ఆ పొగరుని సహించలేకపోయిం ది మాధవి. డ్రాయింగ్ రూమ్ లో పేపరు పట్టుకు కూర్చున్న ప్రకాశరావు తల్లీ కూతుళ్ళ సంభాషనంతా వింటూనే వున్నాడు. మాధవి విసురుగా వచ్చి సోఫాలో కూలబడింది. “అన్నీ వింటూ కూడా మీరలా నిమ్మకు నీరెత్తినట్టు ఎలా వూరుకుంటున్నారో నాకర్ధం కావడం లేదు” కోపం అంతా భర్త మీదకి తిప్పి దులిపింది మాధవి.
“కూల్ డౌన్ మై డియర్ —” పేపరు పక్కన పెడ్తూ శాంతంగా అన్నాడు.
‘చాల్లెండి .దాని మాటలు వింటూ, దాని పొగరు చూస్తూ కూడా కల్పించుకోకుండా వూరుకుంటున్నారు గాబట్టే దాని కసలు నా మాటంటే భయం లేకుండా పోయింది. అలాంటప్పుడు వచ్చి కాస్త మగవాళ్ళు మందలిస్తే పిల్లలకి భయం వుంటుంది.మిమ్మల్ని చూసే అదలా ఆడుతోంది.” ఉక్రోషంగా అంది మాధవి.
“ఏం అనమంటావు. అంటే, నీకు వచ్చిన జవాబు నాకూ వచ్చేది. అనకపోబట్టి నా గౌరవం మిగిలింది. మధూ, ఈ కాలం పిల్లలని కాస్త జాగ్రత్తగా టాకిల్ చెయ్యాలి, టెంపర్ లూజ్ చేసుకుని మనం చేయగల్గింది ఏమీ లేదు.
“ఆ…..అన్నీ అయ్యాయి, శాంతంగా చెప్పాను, చిలక్కి చెప్పినట్టు నచ్చచెప్పాను. మంచి చెడ్డ విడమరిచి బోధపరిచాను. అసలు నా మాటంటే దానికి లెక్కలేదు.”
“మనం సజెస్ట్ చేసినట్టు చేసి వదిలెయ్యాలి. ఆలోచించుకునే చాన్సు వాళ్ళకే వదిలేస్తే అప్పుడు కాస్త వింటారు. అంటే మనమే అలోచించి, నిర్ణయించేసినట్టు మాట్లాడితే వాళ్ళ “ఇగో” దెబ్బ తింటుంది. దాంతో వాదన, మొండి జవాబులు యిస్తారు. అది నీవు గ్రహించావు గదా—“
“ఏమిటండి గ్రహించేది — నేనేం దాన్ని విషం తీనమన్నానా — మంచి సంబంధం పెళ్ళి చేసుకోమన్నాను. అడ్డమైన వెధవలతో డేటింగులు చేసి, ఏ తల మాసిన వాడినో , ఏ అమెరికన్నో కట్టుకుంటానంటే వూరుకోమంటారా ” కోపంగా అనేసింది.
“అంతదాకా వస్తే మనం చెయ్యగల్గింది ఏమీ లేదనుకో. బలవంతంగా పెళ్ళికి ఈ కాలం పిల్లలని ఎలా ఒప్పించగలం. మంచి సంబంధం అని, అన్ని విషయాలు చెప్పావు —— దానికి కాస్త అలోచిన్చాడానికి టైమివ్వు. ఊరికే పదిసార్లు చెప్పి దాన్ని ఊరికే సాధిస్తుంటే అది మరింత పెట్రేగిపోతుంది. రెండు మూడు రోజులు టైమిచ్చి దాంతో నేను మాట్లాడతాను ఈసారి. నీవింక ఈ ప్రసక్తి దాని దగ్గర తేవద్దు.
“ఏమిటో ఈ అమెరికా వచ్చి పొరపాటు చేసేమేమో అనిపిస్తుంది. ఇండియాలో వుంటే ఇంతలా పిల్లలు మరీ మితిమీరిపోవడం లేదు. యిక అందరినీ చూసి వీళ్ళూ ఇలా తరారవుతున్నారు. ఏదన్నా అంటే ‘జనరేషన్ గ్యాప్” అంటూ పెద్ద కబుర్లు….”
‘మధూ నీవొక సంగతి మరిచిపోకూడదు. వాళ్ళకి జ్ఞానం వచ్చి రాకముందు మనం వాళ్ళని యిక్కడికి తీసుకొచ్చాం. వాళ్ళ చుట్టూ వాతావరణం, భాష, ఫ్రెండ్సు, క్లాసు మేట్స్ , యీ టీ.వీ లు యివన్నీ ఆ పసివాళ్ళ మనసుల మీద ముద్ర వేయవంటావా. ఈ దేశంలో వుంటూ ఈ అలవాట్లు అలవరచు కోవద్దంటున్నాం. అమెరికన్ సిటిజన్స్ అయినా యింక యిండియాలోలాగే వుండాలని మనం అనుకుంటున్నాం గాని యిక్కడ చిన్నప్పటి నుంచి పెరిగి యిండియా వాతావరణానికి దూరంగా వున్న పిల్లలు ఈ ప్రదేశపు అలవాట్లని అనుసరించి చూస్తారు. మనం అంటే ఇండియాలో పుట్టి ముప్పై ఏళ్ళు పెరిగాం. మన రక్తంలో ఆ భావాలు జీర్ణించుకువున్నాయి. మన పిల్లలు అలా కాదు కదా చుట్టూ వున్న వాతావరణం వాళ్ళని యిన్ ప్లూయన్స్ చేయదా.’
“ఆ ఇన్ ప్లుయన్స్ వుంటుందనేగా నా బాధ. ఆ యిన్ ప్లుయేన్స్ వీళ్ళ మీద పడకుండా ఉండాలనే గదా నా తాపత్రయం. మంచి నేర్చుకున్నా తప్పులేదు, కాని మన వాళ్ళు వాళ్ళ బాడ్ హేబిట్స్ తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళలా పదిహేనేళ్ళు వచ్చేసరికి స్వతంత్రులై పోయినట్టు యిష్టం వచ్చినట్టు తింటూ, తిరుగుతూ , డేటింగుల పేరిట అడ్డమైన వాళ్ళతో తిరుగుతూ పెళ్ళి కాకముందే సెక్స్, ఎబార్షన్….. వాడు నచ్చక పోతే షర్టు మార్చినట్టు యింకోడ్ని మార్చడం…..అది కాకపొతే ఏ వెధవనో కట్టుకుని నాల్గురోజులు కాపురం చేసి డైవర్సులు యిక్కడ ఫేమిలీ లైప్ లు చూస్తుంటే మన పిల్లలు అలా తయారవుతారేమోనని భయపడడం తప్పంటారా….”
“నీవు తప్పుగా ఆలోచిస్తున్నావని, నీ ఆలోచన అత్యాశని అనను. కాని వాళ్ళ ఆలోచనలు ఇలా వుండవు గదా. “మమ్మీ డాడీ అమెరికాలో వుండాలి యిక్కడి డబ్బులు పనికి వస్తాయి గాని అమెరికన్స్ లా వుండకూడదంటారు అంతా నేరో థింకింగ్ అంటూ ఎత్తి పొడుస్తారు. వాళ్ళనీ తప్పుపట్టలేం మనం. మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి మధ్య జనరేషన్ గాప్ అనే వారధి వుంది. దేశం, భాష, మతం, అచారణ సంస్కృతీ అన్నీ వేరయినా దేశంలో పొట్ట కూటి కోసం వున్నాం అనుకుంటున్నాము…..మన వాతావరణా నికి దూరంగా పెరిగిన పిల్లల మనస్తత్వం అర్ధం……”
‘అర్ధం చేసుకున్నానండీ బాబు, అందుకే భయం నాకు. ఎక్కడిది తప్పటడుగు వేస్తుందో అనే ఆదుర్దా , నన్నంటారు గాని రేపు మీ అమ్మాయి ఏ అమెరికన్నో పెళ్ళాడుతా నంటే , అంగీకరిస్తారా మీరు, బాధపడరా….” నిలేసింది.
“ఎలా అంగీకరిస్తాను. ఎప్పటికీ అంగీకరించను. కాని మన అంగీకారంతో అది సంబంధం లేదనుకుంటే మనం ఏమీ చెయ్యలేమనే నేను చెప్పేది. అంచేత ప్రిపేర్ యువర్ సెల్ప్ ఫర్ ది వరస్ట్ ” అంటున్నాను.
‘అది అంత దూరం వెళ్ళక ముందే కంట్రోల్ చేయడం మన బాధ్యతకదా తల్లి దండ్రులుగా, యిప్పటి కింకా దానికి ఎకనమికల్ యిండిపెన్ డేన్స్ రాలేదు గనుక కాస్త మన మాట వినే స్టేజిలో వుంది. ఇంకా పూర్తిగా చెయ్యి దాటిపోక ముందే మూడు ముళ్ళు వేయించేస్తే …..’ మాధవి తల్లి మనసు ఆరాటం అర్ధం అయింది ప్రకాశరావుకి. మాధవితో అన్ని విధాల ఏకీభవించడానికి అతనికేం అభ్యంతరం లేదు. ఎటొచ్చి కూతురి సంగతి తెల్సిన అతను యిరవై ఏళ్ళు నిండకుండా గ్రాడ్యుయేట్ పూర్తీ కాకుండా తమ మాట విని పెళ్ళికి వప్పుకుంటుందా యిప్పుడు….అతనికేం నమ్మకం లేదు. భార్య అన్నట్టు అన్నీ వున్న మంచి సంబంధాలు అనుకున్నప్పుడల్లా దొరకవు — ఆ సంగతి పిల్లలకి అర్ధం కాదు. అర్ధం చేసుకుంటే వాళ్ళు అదృష్టవంతులే….
“మీరొకసారి పిల్చి చెప్పండి” మాధవి అంది.
“ష్యూర్…. కాని రెండు రోజులు వూరుకుని మాట్లాడుతాను —- ఈలోగా దాన్ని కాస్త ఆలోచించుకొనియి. ఈలోగా నీవు మళ్ళీ దాని దగ్గర ఈ ప్రసక్తి తేవద్దు. భార్య చేతి మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు. మాధవి తల ఆడించింది.
***
ప్రకాశరావు పన్నెండేళ్ళ క్రితం అమెరికా వచ్చాడు. ప్రకాశరావు ఏమ్ .టెక్ చదివాడు. భారత్ హెవీ ఎలక్రికల్స్ లో మంచి జాబ్ చేస్తుండేవాడు —- అనుకోకుండా అమెరికా వెళ్ళే చాన్సు వచ్చింది. ఎంత మంచి జాబ్ లో వున్నా పన్నెండేళ్ళ సర్వీసు వున్నా ఇండియాలో సంపాదన ఖర్చులకే సరిపోతుంది. అమెరికా వెళ్లి నాలుగయిదేళ్ళు , వుండి కాస్త డబ్బు కూడపెట్టుకుని రావాలన్న ఉద్దేశంతోనే అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ సెటిల్ అవ్వాలన్న ఉద్దేశం లేదు. అప్పుడు నందితకి ఎనిమిది, నవీన్ కి ఆరేళ్ళు — అమెరికా వచ్చాక అదృష్టం తన్నుకొచ్చి చాలా తొందరగా పైకి ఎగబాకి పోయాడు. మంచి కంపెనీల నుంచి చాలా మొత్తంలో జీతాలతో ఆఫర్లు వచ్చి వుండి పొమ్మని బలవంతం పెట్టారు. అమెరికా వచ్చాక అక్కడి డబ్బు, అక్కడ కంఫర్టు వదులుకుని ఇండియా వెళ్లాల నిపించలేదు. నాలుగైదు ఏళ్ళు అనుకుని వచ్చినా డబ్బు వస్తున్నా కొద్దీ యిండియా తిరిగి వెళ్ళాలన్న యావ తగ్గిపోయింది. దానికి తోడు రెండేళ్ళకి ఓసారి శలవులకి యిండియా కెళ్ళినప్పుడు పిల్లలకి అసలు అక్కడి వాతావరణం నచ్చేది కాదు. అమెరికా లో సదుపాయాలు, లేక టి.వి. లు అవి లేక బోర్ అనేవారు. ఆ రోడ్ల మీద దుమ్ము ధూళి అవన్నీ చూసి మేం యిండియా రాం.’ అనేవారు వాళ్ళు . వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళలో అభిప్రాయం మరింత బలపడింది. నందిత అయితే “నేను చచ్చినా రాను మీరు వెళ్ళినా నేను యిక్కడే వుండి చదువుతాను” అని వాదించేది. ఈలోగా కంపెనీ వత్తిడి చేసి సిటిజన్ షిప్ ఏర్పాటు చేసి యిప్పించారు. ఇండియాలో ఆస్తులు అమ్ముకుని బంగారం చేసుకుని అమెరికా వాసులయిపోయారు. ఏడాదికి మిలియన్ డాలర్లు, పెద్ద ఫోర్ బెడ్ రూము, ఆధునిక సదుపాయాల ఇల్లు మూడు కార్లు …..ప్రకాశరావు చాలా బిజీగా పెద్ద హోదా గల వ్యక్తిగా అయిపోయాడు. అక్కడ నందిత చిన్నప్పటి నించి అందరితో కొత్త పాత లేకుండా గలగల మాట్లాడేది. అతి తొందరగా స్నేహం చేసుకునే స్వభావమేమో నందితకి ఎంతో మంది ఫ్రెండ్సు, స్కూలు ఫ్రెండ్స్ యిరుగుపొరుగు ఫ్రెండ్స్ , ఫేమిలీ ఫ్రెండ్స్ లో ఆమె యీడు పిల్లలు యిలా రకరకాల స్నేహితులుండేవారు. టీనేజ్ కి వచ్చాక యింకా ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దదయి పోయి ఎప్పుడూ అబ్బాయిలూ, అమ్మాయి లతో సినిమాలు, యింట్లో పెద్ద షేటిల్ కోర్టు ఉండేదేమో గేమ్స్ లని, పార్టీలని తెగతిరిగేది. ఎంత తిరిగినా స్వతహాగా తెలివైనది అవడం వల్ల క్లాసులో రేంకు తెచ్చుకునేది. వయసు తో పాటు రకరకాల షోకులు ఫేషన్లు పెరిగాయి. ఫ్రాకులు, మిడీలు, బాబ్ లు, లిప్ స్టిక్ లు, జీన్స్, హైహీల్స్ — అమెరికన్ ఎసతో యింగ్లీషు, ఆ అమ్మాయి అచ్చు అమెరికా పిల్లలా మారిపోయింది. శలవ వస్తే బ్యూటీ క్లినిక్కులు, ఫేషియల్స్, అంటూ ఏవేవో చేసేది. ప్రకాశరావు డబ్బు పుష్కలంగా సంపాదిస్తున్నాడేమో, కోరిన డ్రస్సల్లా , రకరకాల షూస్, బ్యాగులు ఏది కావాలంటే అవి కొనేది. మాధవికి కూతురి వేషాలు , కూతురి ఫ్రెండ్స్ సర్కిల్ చూసి యీ పిల్ల ఎలా తయారవుతుందిరా భగవంతుడా అని బెంగపడేది. ఎంత డబ్బున్నా మరీ అంత నీళ్ళలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంటే మందలిస్తూనే వుండేది. “నీ పాకేట్ మనీ యింతకంటే యివ్వను” అనేది. కాని నందిత తండ్రి దగ్గర గారాలు పోయి డబ్బులు లాగేది. “పోనీద్దూ యీ ఏజ్ లో కాకపొతే యింకేప్పుడు సరదాలు పిల్లలకి తీరుతాయి. పెళ్ళయ్యాక మనం యిచ్చినా తీసుకుంటుందా అనేవాడు ప్రకాశరావు.
![](https://click.nativclick.com/loading_iframe/img/placeholder.png)
నందిత కాలేజీ లెవల్ కి వచ్చేసరికి మరింత మంది ఫ్రెండ్స్ , అందులో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. అందులో నలుగురయిడుగురు అమెరికను బాయిస్ వుండే వారు. అది చూసి మాధవిలో కంగారు మొదలైంది. దానికి తోడు ఆ టర్మ్ ఎగ్జామ్స్ లో మార్కులు బాగా తక్కువ వచ్చాయి. మాధవి కోపంగా నిలేస్తే , “ఇట్స్ ఒకే మమ్మీ, ఒకసారి కాస్త మార్కులు తక్కువ వస్తే కొంప మునిగి పోయినట్టు హడావుడి చేస్తావేం. ఈసారి బోరు కొట్టి చదవాలనిపించలేదు.” నిర్లక్ష్యంగా అంది.
“కొడ్తుంది కొడ్తుంది . నీకీ మధ్య మరీ ఫ్రెండ్సు, తిరగడం ఎక్కువయింది. నీ వరస చూస్తున్నాను. కాస్త ఫ్రెండ్సుని తగ్గించు. ఆ అమెరికన్ అబ్బాయిలతో నీకేమిటి స్నేహం ….’ నందు దొరికిందని సాధించింది మాధవి.
“ఏం అమెరికన్స్ అయితే. మా కాలేజీ మేట్స్ వాళ్ళు. అమెరికాలో వుంటూ, అమెరికా తిండి తింటూ, అమెరికన్ ఫ్రెండ్స్ మాత్రం వుండకూడదేం…. యూ టాక్ అల్ రబ్బీష్” హేళనగా ఎత్తి పొడిచింది నందిత. అలా మాట్లాడే కూతురిని యింకా ఏమన్నా అంటే మరీ నోరు పారేసుకుని యిన్సల్ట్ చేస్తుందని అప్పటికి వూరుకుని , తర్వాత భర్తతో కంప్లయింట్ చేసి, “మీరు దాన్ని కేకలేస్తారా లేదా” అంటూ హటం సాగించింది మాధవి. ప్రకాశరావు నందితని పిలిచి తల్లితో అలా మాట్లాడినందుకు, చదువు పాడుచేసుకుని స్నేహితులతో తిరుగుడు ఎక్కువయిందని మందలించాడు. ఎప్పుడూ అనని తండ్రి కేకేలేస్తే కాస్త భయపడింది నందిత. ఓ పది పదిహేను రోజులు కాస్త ఫ్రెండ్స్ ని తగ్గిం చింది. తరువాత మళ్ళీ మామూలే. కూతురికి యిరవై వచ్చిందగ్గిరనించి పెళ్ళి చేసేయా లన్న ఆరాటం పట్టుకుంది మాధవికి. ఇంతవరకు స్నేహితులంటూ గ్రూపులో తిరగడం తప్ప, ప్రత్యేకంగా ఏ ఒక్కడితోనూ డేటింగులు అవీ జరపలేదు. అదేదో చేసేలోగా, ఎవడినో ప్రేమించాననేలోగా చెయ్యి జారిపోయేలోగా కూతురికి మంచి సంబంధం చూసి చేసేయాలన్న ఆరాటం మొదలైంది. ఇండియా వెళ్ళినప్పుడల్లా అన్న అక్క అందరూ ఎన్నో సంబంధాలు చెప్పేవారు. అమెరికాలో వున్న తెలుగు వాళ్ళెవరున్నారో , వాళ్ళ అబ్బాయిల చదువులు, తమకంటే వాళ్ళకే బాగా తెలుసు. అమెరికాలో వున్న తెలుగు వాళ్ళు చాలా మంది తమ అబ్బాయిలకి , అమ్మాయిలకి యిండియా కెళ్ళినప్పుడల్లా సంబంధాలు చూసి చేసుకువచ్చేసేవారు. అమెరికాలో అబ్బాయిలు వున్నా తమ సంప్రదాయం ప్రకారం యిండియాలో మంచి కుటుంబం నించి వచ్చిన పిల్లల్నే కొడుకు లకి చూసేవారు. తాము అమెరికన్ సిటిజన్స్ కనక పెళ్ళవగానే “వీసా” అదీ తొందరగా వచ్చేస్తుంది కనక చాలా మంది నందితని చేసుకుంటాం అని వాళ్ళే కబురు పంపారు. యిరవై ఏళ్ళన్నా లేకుండా ఏం పెళ్ళిలే అని యిన్నాళ్ళూ సీరియస్ గా ఆలోచించలేదు. కాని నందిత వరస చూసి ఆమె చెయ్యి దాటిపోక ముందే పెళ్ళి చెయ్యాలని నిర్ణయించు కుని మంచి సంబంధం చూడమని తనవాళ్ళకి రాసింది మాధవి. అన్నింట్లోకి యీ యింజనీరు అబ్బాయి సంబంధం బాగుందని చూద్దాం అంటే కూతురు వాడెవడోముక్కూ మొహం తెలియదు ఎలా చేసుకుంటాను అని వాదిస్తుంది. దీన్నెలా వప్పించడం? తండ్రి చెప్పినా వింటుందో లేదోనని మనసులో మధనపడసాగింది.
***
‘నందూ వాట్ హేపెండ్ , వై ఆర్ యూ లుకింగ్ సో డల్ సిన్స్ టూ డేస్ . ఆర్ యూ అల్ రైట్. ” జేనెట్ ఆదుర్దాగా అడిగింది.
“నథింగ్ , ఐ యాం ఒకే….’ నందిత నవ్వి అంది. ఆ నవ్వులో జీవం లేదని జేనెట్ గుర్తించింది.
కమాన్ డియర్, ఐ నో సమ్ థింగ్ యీజ్ రాంగ్ …… బిఏ గుడ్ గర్ల్ అండ్ టెల్ మి.’
జేనెట్ , నందిత యిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ . ఐదో క్లాసునించి కాలేజీ వరకు క్లాస్ మేట్స్ . ఒకరి దగ్గిర ఒకరికి రహస్యాలు లేవు. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటారు, చర్చించు కుంటారు. రెండు రోజుల నించి నందిత మొహం వాడిపోయి వుందని కనిపెట్టి అడిగింది జెన్.
‘ఏం లేదు, మమ్మీ డాడీ పెళ్లి పెళ్ళి అని బోరు కొట్టి చంపుతున్నారు….. ఎవడో యిండియాలో యింజనీరింగు చదివి ఏమ్.ఎస్ చేయడానికి వస్తాడుట. వాడ్ని చేసుకో మని చంపుతున్నారు. ఇన్నాళ్ళూ మమ్మీయే అనుకుంటే యిప్పుడు డాడీ కూడా అమ్మ పక్షమే మాట్లాడుతున్నారు. నిన్న ఓ అరగంట లెక్చరిచ్చి చంపారు….’ విసుగ్గా అంది.
‘హౌ లక్కీ యూ ఆర్….దీనికోసమా మొహం అలా పెట్టావు. చక్కగా అమ్మానాన్నా మంచివాడ్ని తెచ్చి చేసుకోమంటే నీకెందుకీ బాధ….”
నందిత జేనెట్ వంక ఆశ్చర్యంగా చూసింది. “ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? వాడెవడో ముక్కు మొహం తెలియకుండా పది నిమిషాలు చూసి ఎలా చేసుకోను. అతనేలాంటి వాడో , టెస్ట్ లు, ఏమిటో, ఐడియాలు , అభిప్రాయాలు కలుస్తాయా? లేదా తెలియకుండా ఎలా చేసుకోను….. అసలు తెలియకుండా ఎలా చేసుకోమని సలహా యిస్తున్నావు. మీరంతా చక్కగా డేటింగులు చేసి నచ్చినవాడ్ని చేసుకుంటారు. నేను యిండియన్ ని అనా యిలాంటి సలహా యిస్తున్నావు” నిష్టూరంగా అంది నందిత.
“నందూ డియర్ , చూడు అమెరికా అమ్మాయిగా నేను చెప్తున్నాను. ఈ డేటింగులు, ఈ లవ్ లు, ఈ టెస్టులు, ఐడియాలు కలవడం అంతా బుల్ షీట్ అంటాను. యిట్స్ షీర్ నాన్సెన్స్ , నధింగ్ ఎల్స్. ప్రతి మగవాడూ అమ్మాయి స్వంతం అయేవరకు చాలా జంటిల్మన్ లాగ, నమ్రతగా మన మాటలతో ఏకీభవిస్తాడు. కాస్త అందమైన, డబ్బున్న అమ్మాయి అయితే యింకా ఎక్కువ నటిస్తాడు. ఈ మగాళ్ళ అసలు రంగులన్నీ పెళ్ళయ్యాక గాని బయటికి రావు. కొత్త మోజులో కొన్నాళ్ళు మనమాట విన్నట్టు నటిస్తారు. ఆ తరువాత చూపుతారు తమ ప్రతాపాలు. ఏదన్నా అందేవరకే అపురూపం తరువాత రొటీన్ అయి పోయి ఏ థ్రిల్లు వుండదు. ఆడదయితే సేక్యూరీటీ కోసమో, పిల్లల కోసమో , పరువు కోసమో కాపురం కొనసాగించాలనే అనుకుంటుంది. మగవాడికి ఆ అవసరం ఏముంది. డేటింగుల పేరుతొ అమ్మాయిలని వెంటాడుతారు. నచ్చకపోతే నాలుగురోజుల తర్వాత వదిలేస్తారు….’ నందిత ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.
“ఔనూ నందూ…..చక్కగా నీకా బాధ, రెస్పాన్స్బిలిటీ లేకుండా అమ్మ, నాన్న నీ మంచి అలోచించి అబ్బాయిని తెచ్చి చేసుకోమంటే ….రియల్లీ! నాకు నిన్ను చూస్తె అసూయగా వుంది. మాకు అలాంటి అదృష్టం లేదు నందూ. మా పెళ్ళి బాధ్యత పెద్ద వాళ్ళు తీసుకోరు. మంచో చెడో మేమే ఎవడినో వెతుక్కోవాలి. మా భవిష్యత్తు మేమే డిసైడ్ చేసుకోవాలి. అదృష్టం బాగుండి మంచివాడయితే సరే, లేకపోతే వచ్చే ప్రాబ్లంని మేమే సాల్వు చేసుకోవాలి. మాకు కాస్త వయసు వచ్చిందగ్గిర నించి రెక్కలొచ్చిన పక్షులని గూటిలోంచి తరిమేసినట్టు మావాళ్ళెం మా గురించి పట్టించుకోరు. మా భవిష్యత్తుకి వాళ్ళా పూచీ ఏమీ లేదు. మీ ఇండియన్ గర్ల్స్ ఎంత అదృష్టవంతులు. మీ బాధ్యత అంతా అమ్మా నాన్న తీసుకుంటారు. మంచి వరుడ్ని చూసి పెళ్ళి చేస్తారు. పెళ్ళి అయిన తరువాత కూడా మీ మంచి చెడ్డలు చూస్తూనే వుంటారు. మీ భవిస్యత్తులో వారి అండ మీకుందన్న నిబ్బరం మీకిస్తారు. ఇంతకంటే యింకేం కావాలి నందూ, ఏఆడపిల్లకైనా….”
“కాని….మనకీ ఓ ఆభిప్రాయాలుంటాయి, ఐడియాలుంటాయి , కోరికలుంటాయి. అవి కలవని భర్తతో కాపురం ఎలా చేయమంటావు. మీకయితే నచ్చనివాడితో విడిపోయే అవకాశాలు సులువు. మాకు ఆ అవకాశాలు తక్కువ. అందుకే ముందే బాగాచూసుకుని….”
“నీ పిచ్చి గాని ఏం చూసుకుంటావు. నేను ముందే చెప్పినట్టు మనిషి సహజగుణాలు లోపాలు కల్సి బతకడం అరంభించాక గాని బయటికి రావు. ముందు ఎంతో మంచి వాడిలా నటించి తరువాత మారిపోతే ఏం చెయ్యగలవు. నందూ ….యీ పెళ్ళిళ్ళు గాంబెల్ అనుకో. అదృష్టం బాగుంటే, కాస్త మంచివాడు దొరికితే సర్దుకుపోయి బతుకు తాం. లేదంటే బతుకు నరకం , విడిపోయి , డైవర్సు తీసుకుని మేం సాధించింది ఏమిటంటావు. ఫేమిలీ లైఫ్ లేక, సేక్యూరీటి లేక, పిల్లలంటే వారికి తల్లి, తండ్రి యిద్దరి లో ఎవరిదో ఒకరి ప్రేమ కరువయి, మరిన్ని బరువు బాధ్యతలు నెత్తిన పడి నలిగిపోతుంది అమెరికా స్త్రీ. డైవోర్సు లు తీసుకున్నాక మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆ రెండో మొగుడు తిన్నగా వుంటాడని ఏముంది….’
“అంటే అమెరికాలో మేరీడ్ లైఫ్ బాగోలేదంటావా , ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని ఎందరు హాయిగా లేరు?”
‘అమెరికాలో పెళ్ళిళ్ళు చేసుకోడం లేదని, సంసారాలు చేయడం లేదని నేననను. కాని హాయిగా సంసారాలు చేసుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ కంటే ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ యి విడిపోయే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. మీ యిండియాలో కష్టమో సుఖమో , ఒకసారి పెళ్ళయ్యాక అంత సుళువుగా విడిపోరు. ఆ విధంగా అక్కడి ఆడవాళ్ళకి సెక్యురిటీ వుంది. ఏదన్నా యిటు అటు అయితే ఆదుకోడా నికి పెద్దవాళ్ళు వుంటారు…..అక్కడి పిల్లలకి యింకేమున్నా లేకపోయినా తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పుష్కలంగా దొరుకుతాయి. వాళ్ళు పెరిగి చదువులై, ఉద్యోగం వచ్చేవరకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీలు లేవు. టెన్షన్స్ లేవు. యిక్కడిలా పదిహేనేళ్ళు వచ్చిందగ్గరి నించి ఏదో చేసి డబ్బు సంపాదించాలన్న బాధ, బాధ్యత అక్కడి పిల్లలకి లేదు. అమ్మ, నాన్న హాయిగా చూసి పెళ్ళి చేస్తారు. యిక్కడి పిల్లలతో పోలిస్తే మీ యిండియన్ పిల్లలు అన్ని విధాల అదృష్టవంతులంటాను. మాకున్న డబ్బు లేకపో వచ్చును, కంఫర్ట్ లేకపోవచ్చును ఇండియాలో, కాని అక్కడి సెక్యూరిటీ యిక్కడ ఏ స్టేజి లోనూ లేదు మాకు. అందుకే యిప్పుడు మా థింకింగ్ లో మార్పు వస్తుంది. ఈ పెళ్ళిళ్ళు , ఊ…… అ…. అంటే విడిపోవడం , పిల్లలు మద్యన నలిగిపోవడం, అది చూస్తూ ఫేమిలీ లైఫ్ కోసం సర్దుకు బతకాలనే ఆలోచన మా వాళ్ళలోనూ వస్తుంది. ఆ ఫ్రీడమ్ , ఆ స్వేచ్చ లో శాంతి, భద్రతలు కరువయ్యాయి అని అర్ధం అయ్యాక అందరూ యిదివరకటి ఫామిలీ లైఫ్ మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు……ఇద్దరు కొత్త వ్యక్తులు ఒక యింట్లో కల్సి బతికినపుడు రకరకాల ప్రాబ్లమ్స్ , అభిప్రాయ బేధాలు రాక తప్పవు. ప్రేమించి చేసు కున్నంత మాత్రాన బతుకంతా పుస్తకాలలో మాదిరి ప్రేమ తిని బతకరు. లైఫ్ లో వుండే కష్ట నిష్టూరాలు ఎలాగో భరించాలి. ఒక యింట్లో వుంటే వయస్సు వచ్చాక , తల్లీ కూతుళ్ళ మధ్యే మాటా మాట వస్తాయే, అలాంటిది పుట్టిన యిరవై ఏళ్ళ వరకు పరిచయం లేని మనిషితో అభిప్రాయబేధాలు ఎందుకు రావు. ఆ మాత్రం దానికోసం ఎవరైతేనేం? సెక్యూర్ డ్ , ఫేమీలీ లైఫ్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇండియన్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఆపద్దతే నచ్చుతుంది మావాళ్ళకి. ఇదంతా ఎందుకు చెపుతున్నానో నందూ నీకు తెలుసా. అమెరికాలో వుండి మిమ్మల్ని చూసి మా పద్దతులు మంచివను కుని నువ్వీ తప్పటడుగు వేయద్దు. నీ మంచికోరి చెప్పే నీవాళ్ళ మాట విని మంచి చదువు, కుటుంబం నుంచి వచ్చిన అతన్ని చేసుకో. నీ స్నేహితురాలిగా యిది నా సలహా…..”
నందిత సందిగ్ధంలో పడ్డట్టు, ఆలోచనలో పడింది. “నందూ నీ మనసులో విషయం నాకు తెలుసు. నీవు మైక్ గురించి అలోచిస్తున్నావని నాకు తెలుసు. ఈ మధ్య మీ యిద్దరినీ గమనిస్తున్నాను. నీవు అతని పట్ల అట్రాక్ట్ అవుతున్నావు. కానీ నందూ ఆ మైక్ నీకు తగినవాడు కాడు.’ జేనెట్ మొహంలో మారిన రంగులు చూస్తూ ఆశ్చర్యపడింది నందిత.
“ఎందుకు….ఎందుకలా అంటున్నావు. మైక్ చాలా సరదాగా వుంటాడు’…. స్మార్ట్ గా ….చదువులో కూడా బ్రిలియంట్ కదా…..’ అనుమానంగా చూసింది నందిత.
‘చెపితే నాకు జెలసీ అనుకుంటావని చెప్పలేదు. ఎన్నోసార్లు నీతో చెప్పాలను కున్నాను గాని నా మీద నీకు సదభిప్రాయం పోతుందని చెప్పలేదు. సరే నీవింకా డేటింగులు, ప్రేమలు ఆరంభించలేదు గదా, మీ స్నేహం ఎలా దారితీస్తుందో చూసి చెప్పచ్చు అనుకున్నాను. ఆ మైక్ ఒట్టి రోగ్.’
“ఏమిటి…..ఆశ్చర్యంగా అడిగింది.
‘నందూ ఈ మైక్ నిన్ను చూడకముందు మా అక్కతో డేట్ చేసేవాడు. మీ ఫాదరు మాకంటే డబ్బున్న వాడని, నీవు అక్క కంటే బాగుంటావని అక్కని వదల్చుకుని నీవెంట తిరగడం మొదలు పెట్టాడు తెలుసా. దాంతో ఎనిమిది నెలలు తిరిగాడు. అది వీడిని సీరియస్ గా తీసుకుని మనసుతో పాటు శరీరం యిచ్చింది. అమ్మ నాన్నకి చెప్పింది. పెళ్ళి డేట్ నిర్ణయించేలోగా మొహం చాటుచేయడం ఆరంభించాడు. అక్క ఎన్నిసార్లు ఫోను చేసినా వుండి లేడనిపించేవాడు. ఒక్క నెలలో అక్కను వదల్చుకున్నాడు. తరువాత నీతో స్నేహం మొదలుపెట్టాడు. అక్క పాపం ఎంత ఏడ్చిందో ….నీకు కావాలంటే వాళ్ళు రాసుకున్న ఉత్తరాలు, ఫోటోలు అవీ చూపిస్తాను.”
నందిత మొహం తెల్లగా పాలిపోయింది. “నిజమా……”అంది నమ్మలేనట్టు.
“నేను గత నాలుగైదు నెలల నించి నిన్ను గమనిస్తున్నాను . నిన్ను హెచ్చరించా లనుకుంటూనే నీవు నన్ను అపార్ధం చేసుకుంటావని చెప్పలేదు. వాడిని నీ అందం, నీ డాడీ డబ్బు ఆకర్షించింది అంతే. లవ్ గివ్ నమ్మకు.’
మైగాడ్ మైక్ దంతా నిజమైన ఇంటరెస్ట్ ని నమ్మాను. నయమే ముందుగా చెప్పావు. ఎన్నోసార్లు డేటింగ్ కి రమ్మని పిలిచాడు , అమ్మ, నాన్న భయంతో నేను యింకా సాహసం చెయ్యలేదు. ఇంకా నా యింటరెస్టు మమ్మీ, డాడీకి చెప్పి, మైక్ ని యింట్రడ్యూస్ చేద్దా మనుకున్నాను.”
‘నందూ…..అందుకే నాకు ఈ డేటింగులు అవీ నమ్మకం లేదు. ఎన్నో కేసులు యిలాంటివి చూసాను. మనకి టెన్తూ క్లాసు మేట్ విక్టోరియా నీకు గుర్తుందా . సూయిసైడ్ కమిట్ చేసింది. ఎందుకో తెలుసా, లవ్ ఎఫైర్ ఫేలయి, అది తట్టుకోలేక చచ్చిపోయింది. వాడు దీన్ని మోసం చేసి, డబ్బు ఖర్చు పెట్టించి మొహం మొత్తగానే వదిలిపోయాడు. యిలాంటివి చాలా తెలుసు నాకు. ఫర్ గాడ్ సేక్, నీవు యిలాంటి వాటిలో యిరుక్కోకు నందూ చక్కగా మీ అమ్మ నాన్న చూపించిన అబ్బాయిని చేసుకో. ఈ డేటింగులు , ఈ టెన్షన్స్ — అవీ వద్దు నీకు స్నేహితురాలిగా యిది నా సలహా.’ నందిత చేయి పట్టుకుని అంది జేనెట్.
***
“వాళ్ళ దగ్గిర నించి ఉత్తరం వచ్చింది నందూ. ఏం రాయమన్నావు వాళ్ళకి. యిదే నిన్ను ఆఖరిసారి అడగడం, ఏదో ఒకటి జవాబు చెప్పు ముభావంగా అంది మాధవి.
“నందూ…..ఈ అబ్బాయి నచ్చకపోతే యింకోకరిని చూస్తాం. నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు’ ప్రకాశరావు అనుమానంగా అన్నాడు.
‘ఒకే డాడీ ……యిండియాకి టికెట్స్ బుక్ చేయండి.’ నందిత అంది. మాధవి ప్రకాశరావు నమ్మలేనట్టు మొహాలు చూసుకున్నారు. కూతురు కోపం వచ్చి అలా అంటు న్నాదని అనుకున్నారు…..”నిన్నేం అబ్బాయిని చూడకుండా చేసుకోమనడం లేదు. చూసి నచ్చితేనే ….’ మాధవి ఏదో అనబోయింది.
“ఫోటో చూసాను…..మీరు చూసారు. మామయ్యా వాళ్ళంతా చూసారుగా మీ అందరికీ నచ్చిందిగా.’
“మేం చూడడం వేరు. నీవు చూడకుండా చేస్తామా నందూ….మేం నీ మంచి కోసం చెపుతున్నాము. మా మీద కోపంతో లైఫ్ లో ముఖ్యమైన విషయాన్ని తొందరపడి నిర్ణయించుకోనక్కర లేదు.’
“కమాన్ డాడీ—- యిన్నాళ్ళూ నేను ఒప్పుకోలేదని కేకలేశారు. యిప్పుడు సరే అంటే మీరెందుకు తటపటాయిస్తున్నారు….నేను వప్పుకుంటున్నానని చెప్పాగా యింకా ఎందుకు అర్గ్యు,మెంట్స్…..”
భార్య భర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. మళ్ళీ —- ‘మేం అన్నామని కోపంతో అంటున్నావేమోనని ….”
“కోపం ఏం లేదు డాడీ…..నా మంచి కోసమే చెప్తున్నారుగా మీరు యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ మాచ్. ఇంతకంటే ఏం చెప్పాలి.” నందిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంది.
కూతురు ఇంత సుళువుగా వప్పుకుంటుందని ఆశించని వారిద్దరి మొహాలు సంతోషంతో వికసించాయి.
(వనిత మాసపత్రిక )
*****
( సశేషం)
![డి.కామేశ్వరి](http://www.neccheli.com/wordpress/wp-content/uploads/2019/08/kameshwari.d-1.jpeg)
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.