జీవితం అంచున -26 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          మా అమ్మాయి చిన్నప్పుడు ఎదైనా కొత్త గౌను కొంటే ఎంతో సంబరంగా వెంటనే వేసేసుకునేది. అమ్మాయి కొని వుంచిన కొత్త యూనిఫారం చూసే సరికి నా ప్రయాణ బడలిక మొత్తం పటాపంచలయ్యింది. చిన్న పాపాయిలా సంబరపడుతూ వెంటనే వేసేసుకున్నాను. యూనిఫారం అద్దినట్టు అందంగా నప్పింది. నూతనోత్సాహంతో ఫ్లైట్ దిగిన రోజునే షాపింగ్ చేసి నర్సింగ్ షూస్ కొనుక్కున్నాను.

          సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే సమయానికి సరిగ్గా ఆస్ట్రేలియా చేరుకోగలగటం ఆ మహాదేవుని కృపే. కాస్త ముందు వెనుకగా దాదాపు అస్సెస్మెంట్స్ అన్నీ సబ్‌మిట్ చేసేసాను. ఈ వారం రోజుల ట్రైనింగ్ తరువాత రెండు వారాల ప్లేస్మెంట్వుంటుంది. సిములేషన్డమ్మీలతోనూ, ప్లేస్మెంట్ నిజమైన పేషెంట్స్తోనూ వుంటుందట. మొత్తం ముప్పయి మంది విద్యార్థులం ఉన్నాము. అయితే డాక్యుమెంట్స్ కొరత, కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోకపోవటం, అస్సెస్మెంట్స్ అన్నీ క్లియర్ చేయకపోవటం… కారణం ఏదయినా కావచ్చు, ప్లేస్మెంట్స్అలొకేషన్ కేవలం పన్నెండు గురికే జరిగింది. ఆ పన్నెండుగురిలో నేనున్నాను.

          నర్సింగ్ యూనిఫారం, షూతో అమ్మాయి సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ మొదటి రోజున తీసిన పిక్ ఈ జీవితం అంచున సాగిన నా ప్రస్థానానికి ముఖచిత్రంగా పెట్టాను.

          దాదాపు ఏడు నెలల తరువాత తిరిగి నా స్నేహితురాళ్లను చూడబోతున్నానే ఎక్సైట్మెంట్ ఓ పక్క, సరిగ్గా చదవని థియరీని ప్రాక్టికల్స్ కి అప్లైచేయగలనా అన్న బెంగ మరో పక్క.

          ట్రైనింగ్ ప్రారంభానికి ముందు విద్యార్థులను అందరినీ సమావేశ పరిచి చిన్న క్వశ్చనేర్ ఇచ్చి జవాబులు రాసి అరగంటలో ఇమ్మన్నారు. సిలబస్ పెద్దగా చదవని నేను మొదట కంగారు పడ్డాను. కాని అవి సిలబస్ తో సంబంధంలేని జనరల్ క్వశ్చన్స్. తోచిన జవాబులు చకచకా రాసేసాను. అవి రాయటానికి కిందామీదా పడుతున్న మిగతా విద్యార్థులను చూసి నాకు నేనే ‘సెహబాష్’ అని భుజం చరుచుకున్నాను.

          తరువాత టీచర్ విద్యార్థులను అందరినీ రెండు ప్రశ్నలు అడిగింది. అంతమంది మధ్యన లేచి నిలబడి బదులియ్యాలి. రాతల్లో దిట్టనే కాని పదిమందిలో మాటాడటం, అందునా ఆస్ట్రేలియన్స్ మధ్యన ఇండియన్ స్లాంగ్ లో ఆంగ్లం మాటాడటానికి చాలా భయపడ్డాను.

          చిన్నప్పటి నుండీ క్లాసులో మొదటి బెంచీలో కూర్చోవటం అలవాటయిన నేను ఇప్పుడు మొదటి వరుసలో కూర్చొన్నందుకు బాధ పడ్డాను. జవాబులు చెప్పాల్సిన మూడో విద్యార్థిని నేనే. మధ్యనో చివరనో ఎక్కడో కూర్చునివుంటే అంతా ఏమి చెబుతు న్నారో, అసలు ఏమిచెప్పాలో తెలిసే అవకాశం వుండేది.

          ఇన్స్టంట్ ఆన్సర్స్… కాళ్ళలో వణుకు, గుండెల్లో దడతో మొదటి ఇద్దరు విద్యార్థు లు ఏమిచెప్పారో కూడా వినలేదు.

          మొదటి ప్రశ్న… నర్సింగ్ కోర్సు ఎందుకు ఎంచుకున్నావు ?

          రెండో ప్రశ్న… ఈ కోర్సులో ఏమయినా ఇబ్బందులు ఎదుర్కున్నావా ?

          “వై డు యు వాంట్ టు డూ నర్సింగ్” అనేదానికి గూగుల్లో బోలెడన్ని నర్సుల జవాబులు వుంటాయట. అంత క్రితం ఫెయిల్ అయిన కొందరు పాత విద్యార్థులు ఎంతో ఇంప్రెసింగ్  జవాబులతో సిద్దంగా వున్నారు. విద్యార్థులంతా ఒకరితో మరొకరు కాంటాక్ట్ లో వుండటంతో అడగబోయే ప్రశ్నలు వాళ్ళకు ముందుగానే తెలుసు. నేను ఒక్కర్తినే ఎవ్వరితో ఏ కాంటాక్ట్ లేని వాజమ్మను, క్రితం రోజునే ఇండియా నుండి వచ్చిన పప్పను.

          బ్లాంక్ మైండ్ తో బిత్తర చూపులు చూస్తున్న నా వంక చూస్తూ మిస్ కేట్ “యస్ జేంసీ, వై డు యు చూజ్ నర్సింగ్ ?” అని అడిగింది.

          ఆస్ట్రేలియన్ల యాసలో ‘ఝాన్సీ’ కాస్తా ‘జేంసీ’ అయ్యింది.

          నీళ్ళు నములుతూ లేచి నుంచున్నాను.

          నమిలింది చాలని ఓ గుటకేసి “నాకు చిన్నప్పటి నుండీ వైద్యవృత్తి అంటే చాలా ఇష్టం, గౌరవం. డాక్టర్ కాలేకపోయినా కనీసం నర్సయినా అవ్వాలని కోరిక. మా అమ్మ గారు ఇప్పుడు ఎనభై ఐదేళ్ల వృద్దాప్యంలో వున్నారు. పైగా కొన్ని క్రానిక్ కండిషన్స్ తో బాధపడుతున్నారు. ఆవిడ ముందు ముందు మంచం మీద నుండి కదలలేని పరిస్థితి వస్తే, నాకు అంతో కొంతో బేసిక్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్ లాంటివి తెలిసి వుంటే అమ్మను ఏ వృద్ధాశ్రమంలోనూ పెట్టవలసిన అవసరం రాదు. అలాగే ఇంట్లో అమ్మ బాగోగులు చూసుకోవటానికి నర్సునిఅప్పాయింట్ చేయాల్సిన పని వుండదు. పైగా అలా స్వయంగా నేనే అమ్మకు సేవ చేసుకోవటంలో నాకెంతో మానసిక సంతృప్తి వుంటుంది. అమ్మను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చినా, నర్సుగా కొంత మెడికల్ టెర్మినాలజీ తెలిసి ఉండటం తో అనారోగ్యపు అవగాహన సులువవుతుంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఒంటరిగా పెంచి పెద్ద చేసిన కన్నతల్లి ఋణాన్ని తీర్చుకోవటానికి నర్సింగ్ గొప్ప అవకాశంగా భావిస్తు న్నాను. అందుకే ఏరి కోరి చేరాను…”

          తడుముకోకుండా ఎమోషనల్ గా  చెప్పిన నా జవాబుకి ఒక్కసారిగా కరతాళధ్వను లు మిన్నునంటాయి.

          కేట్ నా వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ “వెల్ సెడ్జేంసీ, ఐ అప్రిషియేట్యువర్ ఆన్సర్. డిడ్ యు ఫేస్ ఎనీప్రొబ్లెమ్స్ ఇన్ అచివింగ్యువర్ గోల్” అని రెండో ప్రశ్న అడిగింది.

          “యస్, ఆంగ్లం నా మాతృభాష కాకపోవటం వలన, ఆస్ట్రేలియులస్లాంగ్ అర్ధం చేసుకోవటంలో అప్పుడప్పుడూ ఇబ్బంది పడ్డాను. ప్లేస్మెంట్బహూశా వృద్ధాశ్రమాల్లో ఇస్తారని విన్నాను. వృద్ద ఆస్ట్రేలియుల భాష అర్ధం చేసుకోవటం మరింత ఇబ్బంది కలిగిస్తుందేమో అని ఆందోళనగా వుంది..” అన్నాను.

          “లేదు, నువ్వు ఇంత స్పష్టంగా అనర్గళంగా మాటాడుతున్నావు. మొదట్లో ఇబ్బంది కలిగినా, క్రమంగా చాలా సులువుగా అర్ధం చేసుకోగలవని నా నమ్మకం. నీ ఆనెస్ట్ జవాబు లు నాకు చాలా నచ్చాయి. గుడ్ లక్ ఫర్ యువర్ట్రైనింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్” అంది.

          స్పాన్టేనియన్ గా చెప్పిన నా జవాబులు ఉన్న పాటున నాకో ప్రత్యేకతను ఆపాదిం చాయి. తోటి విద్యార్థులందరికీ నా పైన గౌరవం పెరిగింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.