![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Ambatla-Janardhan-e1739006176626.jpg)
తిరగబడిన పిల్లులు
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-డాక్టర్ అంబల్ల జనార్దన్
“ఏమోయ్ అనిల్! ఈ స్టేట్మెంట్ ఇలాగేనా తగలబెట్టేది? నేను గాని చూడకుండా ఇలాగే మన హెడ్డాఫీసుకి పంపించి ఉంటే, నీకు గాదు గానీ, నాకు అక్షింతలు పడేవి. కొండొకచో నా ఉద్యోగానికి ఎసరు పట్టేది. ఎక్కడ మార్పులు చేయాలో ఎర్ర ఇంక్ తో గుర్తులు పెట్టాను, అవి సవరించి మళ్ళీ టైప్ చేసుకు రా” ఠీవ్ రావు గర్జించాడు.
గంగిగోవు మూర్తి ఓ సారి ఆ స్టేట్ మెంట్ తో తాను ప్రథమంగా తయారు చేసిన దానితో పోల్చి చూసుకున్నాడు. నిజానికి తాను సరిగ్గా తయారు చేసిన స్టేట్ మెంట్ ని ఠీవి రావు సవరించాడు. ఇప్పుడు మళ్లీ తాను సూచించిన వివరాలనే తిరగ రాయమంటు న్నాడు. పై అధికారి నోటికి జడిసి కిక్కురు మన లేదు అతను. చండశాసనుడిగా పేరు తెచ్చుకున్న కొరివితో తలగోక్కోవడమెందుకని అతని కింది ఉద్యోగులు అతని పదవికి భయపడి మిన్నకుండేవారు. శాడిస్ట్ ఐన ఠీవి రావు, తన ఆధీనంలో ఉన్న ఉద్యోగులను పీడించి పైశాచికానందం పొందేవాడు.
ఠీవి రావు ధోరణే అంత. ప్రతి విషయంలో తనదే పై చేయి కావాలనుకుంటాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే ఆఫీసులో అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా అతన్ని సవరించ ప్రయత్నిస్తే ఇక వారికి మూడిందన్న మాటే. వారిపై మెమోలతో, సస్పెన్షన్ ఉత్తర్వులతో దాడికి దిగేవాడు. తొందరలో రిటైర్ అవబోయే శాడిస్ట్ శాల్తీకి ఎదురు తిరిగి, కోరి తల కొరివి పెట్టుకోవడ మెందుకని అతని కింది ఉద్యోగులు, మనసు లోనే శాపనార్థాలు పెడుతూ రోజులు వెళ్లదీస్తున్నారు.
ఎలాగైతేనేం, ఠీవి రావు పదవీ విరమణ రోజు దగ్గరగా వచ్చింది. అతని వీడ్కోలు సభ ఏర్పాటు చేయకూడదని ఎక్కువ శాతం సిబ్బంది అనుకున్నారు. అది ఎలాగో ఠీవి రావు చెవిన పడింది. తన పరువు కాపాడుకోవడానికి తన చంచాలను పిలిచి కొన్ని వేల రూపాయలను వారి చేతిలో పెట్టాడతను. ఎలాగైనా తన వీడ్కోలు సభ ఏర్పాటు చేసి, తనను పొగుడుతూ, తనకు ఉపయోగపడే వస్తువును జ్ఞాపికగా ఇవ్వమని అర్థించాడు. ఇక వారు రంగంలోకి దిగి ఠీవి రావు వీడ్కోలు సభ, ఆ తర్వాత భోజన సన్నాహాలు చేశారు. ఐతే అక్కడే ఠీవి రావు పప్పులో కాలేశాడు. రిటైరైన అతను, తమను ఏమీ చేయలేడనే ధీమాతో తమ అక్కసునంతా వెళ్ల గక్కారు అతని బాధితులైన ఉద్యోగులు. గదిలో బంధించిన పిల్లి లా తిరగ బడ్డారు. అతని వీడ్కోలు సభలో చాలా మంది ఠీవి రావు ఆగడాలను ఉటంకించి అతన్ని అవమాన పరిచారు. అతని చంచాలు వారించాలని చూసినా వారు ఖాతరు చేయలేదు. విశ్రాంత జీవితంలో నైనా శాంతంగా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండ మని హితబోధ చేశారు. డబ్బులూ పోయె, పరువూ దక్కక పాయె అని తన చంచాలపై కళ్లెర్రజేసి, తన సిబ్బందిని మనసులో తిట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు “ద గ్రేట్ మానేజర్ ఠీవి రావు” అతని మనసులో తనకు జరిగిన పరాభవం వేళ్లూనుకుంది.
ఐతే కుక్క తోక వంకరనే అన్న చందంగా, అతని ధోరణి అస్సలు మారలేదు. ఠీవీ రావు రిటైర్ ఐన తర్వాత, తన కింది ఉద్యోగులపై చూపే కోపం, తన భార్యాపై విరుచుకుపడే పని, తన భార్యపైనే చూపి, తన దురద తీర్చుకుంటున్నాడు. కొన్ని రోజులు మూగగా సహించిన రమ, ఇక ఓర్చుకోలేక పోయింది. వెంటనే తమ పిల్లలకు ఫోన్ చేసి పిలుపించుకుంది. ఠీవి రావు ఉదయాన్నే నడకకు పోయిన సమయంలో తల్లీ పిల్లలు, ఠీవి రావు ఆగడాలపై చర్చించారు. తమను ఎలా కాల్చి తిన్నాడో నెమరు వేసుకున్నారు.
“అమ్మా! నాన్న గారి గురించి నువ్వేమీ చెప్పనక్కర లేదు. చీటికీ మాటికీ నీపై చేయి చేసుకున్న సంగతి మేమింకా మరిచిపోలేదు. అప్పుడప్పుడు మాపై కూడా హంటర్ ఝులిపించేవాడు. అందుకే మాకు నాన్నంటే హడల్. మేము కోరిన చదువులు చెప్పించ కుండా, తనకు నచ్చిన కోర్సుల్లో చేర్పించాడు. ఎలాగో రాజీపడి మేము చదువులు ముగించాము. మేమిద్దరం మా చదువులు, పెళ్లిళ్ళు కాగానే కావాలనే, నాన్నకు దూరంగా ఉద్యోగాలు చూసుకొని పలాయనం చిత్తగించాము. ఐతే రిటైరైన తర్వాత కూడా నాన్న గారు మార లేదన్న మాట. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం” ఇద్దరు కొడుకులూ తమ తల్లికి హామీ ఇచ్చారు.
కూతురు క్షమకు ఉన్న ఊళ్లోనే సంబంధం కుదరడం వల్ల ఆమె అప్పుడప్పుడు, తన తండ్రి ఇంట్లో లేనప్పుడు తల్లిని కలిసి, ఆమెను ఓదారుస్తూ ఉంటుంది. ఇప్పుడు తను కూడా అమ్మ పిలుపు పై వచ్చింది.
ఠీవీ రావు వాకింగ్ నుంచి వచ్చి …
“ఎయ్ రమా! ఆ పేపర్ తీసుకురా!”
“పక్క టేబిల్ పైనే ఉంది కదండీ. మీ కుడి చేయి చాపితే అందుతుంది.”
“ఏంటీ నాకే ఎదురు చెబుతున్నావా?. ప్రభుత్వంలో చక్రం తిప్పిన వాణ్ణి. ఎంత రిటైర్ అయినా ఆ పవర్ తగ్గలేదు. మునుపటిలా నా అడుగులకు మడుగులు ఒత్తాల సిందే. ఖబర్దార్!” ఠీవి రావు హుంకరించాడు.
పిల్లలుండగానే వంట సరిగా లేదనో, బట్టలపై మరకలు పోలేదనో, ఏదో కారణంతో రమపై చేయి చేసుకున్నాడు ఠీవీ రావు.
పెళ్ళైన పిల్లల ముందే తనపై చేయి చేసుకున్న భర్తపై విపరీతమైన కోపం వచ్చింది రమకు.
“మీరసలు మనుషులేనా? భార్యగా గౌరవంగా చూడక పోయినా, తగు విలువను ఇవ్వకపోయినా ఊరుకున్నాను. దాదాపు నలభై ఏళ్లు మీ ఆగడాలు భరించాను. రిటైరైన తర్వాతైనా మీ ధోరణిలో మార్పు వస్తుందేమోనని ఎదురు చూశాను, కానీ మీరు మరింత పశువులా మారారు. ఆఫీసులోని వారిపై ఆజమాయిషీకి అవకాశం లేక నన్ను వేపుక తింటున్నారు. ఇన్నేళ్లు మిమ్మల్ని భరించాను కానీ ఇక నా వల్ల కాదు. నాకూ వయసొ చ్చింది. ఇంతకు మునుపులా శరీరం సహకరించడం లేదు. నా ఇబ్బందుల గురించి చెవినిల్లు కట్టుకొని పోరినా మీకు చీమ కుట్టినట్టైనా లేదు. ఏవో సాకులు చెబుతున్నానని కొట్టేశారు. మీకు మీ స్వార్థం తప్ప, ఎదుటి వారి గురించి పట్టించుకునే నైజం లేదు. మీ నుండి విముక్తి పొందాలని పిల్లలను పిలిచాను. వారు నన్ను తీసుకుపోయారా సరే సరి. లేదా ఏ ధర్మార్థ వృద్ధాశ్రమంలో చెరుతాను, కానీ మీతో మాత్రం ఇక ఉండే ప్రసక్తే లేదు”
గదిలో బంధిస్తే పిల్లి కూడా పులి ఔతుందనడానికి నిదర్శనగా సాధు స్వభావం గల రమ, పులిలా గర్జించింది.
మగ పిల్లలు లోలోన తమకు తండ్రిపై ఎంత కోపం ఉన్నా, అమ్మ బాధ్యత ఎక్కడ తమపై పడుతుందో అని వారి భార్యలకు భయపడి కిక్కురు మన లేదు. అదీగాక తండ్రి, తమ భార్యల ఎదుట అవమానిస్తాడేమోననే భయం ఒకపక్క. కూతురు మాత్రం ఇక సహించలేక పోయింది.
“నాన్నా! అమ్మ కంట కన్నీరు చూడలేనిక. అమ్మను నాతో తీసుకెళ్తాను. నా ఇద్దరు పిల్లలతో పాటు తనని కూడా నా పిల్లగా చూసుకుంటాను. మీ అల్లుడు కూడా ఒప్పుకు న్నాడు. రిటైరయిన తర్వాత మీ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. మీ ఆఫీసులోని ఉద్యోగులపై ఆజమాయిషీ చలాయించినట్టు అమ్మపై చలాయిస్తానంటే ఇక సాగనియ్య ను. అమ్మను మీకు దూరంగా, మా ఇంటికి తీసుకెళ్తాను. అప్పుడు మీ పెత్తనం ఎవరిపై చూపిస్తారో, ఎవరు దాన్ని సహిస్తారో అదీ చూస్తాను. రెండు రోజులు అమ్మ లేకుండా మీరుండేసరికి మీకూ అమ్మ విలువ తెలుస్తుంది.” అని తన బ్యాగూ, అమ్మ బ్యాగూ సర్దడంలో మునిగి పోయింది క్షమ. తమ చెల్లి ధైర్యం చేయడం చూసి కొడుకులలో కూడా చలనం వచ్చింది. తమ చేతికి చమురు అంటకుండా అమ్మ సమస్య తీరుతున్నందుకు లోలోపల సంతోషిస్తూ…
“అవును నాన్నా! మేము కూడా క్షమను సమర్థిస్తున్నాము. అమ్మ ఖర్చులకు మేము కూడా నెలకింతని చెల్లికి ఇస్తాము. మేముండే చోట అమ్మ ఇమడలేదని ఇంతకు ముందటి అనుభవాలు నిరూపించాయి. అమ్మ కంట కన్నీరు చూడలేమిక.” అని వారు కూడా తమ తమ బ్యాగులు సర్దుకోసాగారు.
ఠీవీ రావు అవాక్కయ్యాడు. అతను. తన భార్య, పిల్లలు తనకే ఎదురు తిరుగుతారని అనుకోలేదు. కుటుంబంలో తను ఒంటరి వాడయ్యాడని అర్థం అయింది. ఎప్పుడూ ఇంట్లో పుల్లను కూడా ఇటు నుండి అటు పెట్టని అతను, రమ లేని జీవితం ఊహించుకో లేక పోయాడు. అతనిలో భయం మొలకెత్తింది.
ఐనా చింత చచ్చినా పులుసు చావలేదు. మీకు నేను భయపడతానా? అనే ధోరణిలో…
“తీసుకుపోవమ్మా! తీసుకుపో. మీ అమ్మ లేకపోతే ఒకరు కాదు, నలుగురు పని మనుషులను పెట్టుకొని దర్జాగా బతుకుతాను. మీ అమ్మకయ్యే ఖర్చు, పనివారికి ఇచ్చి హాయిగా ఉంటాను. ఇన్నాళ్లకు నన్నే ఎదిరించేంత మొనగాళ్లయ్యారా మీరు? ఈ ఠీవీ రావంటే మీకింకా అర్థం కానట్టుంది. నేను విరుగనైనా విరుగుతాను కాని, మీ ముందు అస్సలు వంగను. ఏమనుకున్నారో?”
రమ మాత్రం సంకోచంగా అలానే నుంచుంది. జరిగేదంతా ఆమెకు జీర్ణం కావడం లేదు. ఏదో బెదిరిస్తే తన భర్త దారిలోకి రాకపోతాడా అనుకుంది. ఐతే క్షమతో తను వెళ్లాలా? వద్దా?
“అమ్మా ఇంకా ఏమాలోచిస్తున్నావు? పద మనింటికి వెళ్దాం” క్షమ తొందరపెట్టింది. రమ సంకోచం వీడి, రమను అనుసరించింది. ఠీవీ రావు అలా చూస్తూ ఉండిపోయాడు.
పిల్లల స్కూళ్లకు సెలవులవడం వల్ల ఓ వారం రోజులపాటు ఆటవిడుపుగా, మగ పిల్లలు తమ తమ అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. వారు ఆ తర్వాత మళ్లీ క్షమ ఇంటికి వద్దామనుకున్నారు.
ఇక పనివాళ్లతో ఠీవీరావు కష్టాలు మొదలయ్యాయి. తన భార్యపై అధికారం చలాయించినట్టుగా తమపై ఆజమాయిషీ చలాయించాలని చూసిన యజమానిపై తిరగ బడ్డారు వారు.
బట్టలుతికే మంగ ఐతే “ఏమయ్యోయ్! మీ భార్యలాగా నేను నువ్వేదంటే అది పడతాననుకున్నావా? నీ గురించి చుట్టుపక్కల వారు చెప్పారు. ఐనా జీతం ఎక్కువ ఇవ్వ జూపినావని నీ ఇంట్లో పనికి ఒప్పుకున్నాను. ఇంకోసారి నా పనికి వంకలు పెట్టావో? నా తడాఖా చూపెడతాను.” ఎదుటి వారిపై విరుచుకు పడడం మాత్రమే తెలిసిన ఠీవీ రావు, తనపై మంగ తిరగబడేసరికి అవాక్కయ్యాడు. పాత్రలు కడిగే అమ్మి ఐతే మూడు రోజుల్లో నే ఠీవి రావు ఆగడాలకు విసుగు చెంది, నాలుగో రోజు నుంచి పని మానేసింది. అతని విషయం తెలిసిన వేరే పనివారు ఎవ్వరూ అతని ఇంట్లో పనికి మొగ్గు చూపలేదు. ఇక వంట మనిషి ఐతే రెండు రోజుల్లోనే పారిపోయింది. స్విగ్గీ, జొమాటోలే దిక్కయ్యాయి పాపం ‘ఠీవీ రావు’ గారికి!
తన భార్య ఎంత బాగా వండినా వంకలు పెట్టే అతనికి హోటల్ వంటకాలను గమ్మున తినడం తప్ప గత్యంతరం లేకపోయింది. భార్య ఉండగా టీ కూడా కాచుకోవడం రాని అతనికి, ఇంటి పనంతా సొంతంగా చేసుకోవాల్సి రావడంతో తల ప్రాణం తోక కొచ్చింది. ఇంట్లో వాషింగ్ మషిన్ ఉన్నా దాంట్లో బట్టలు ఎలా ఉతకాలో తెలియదతనికి. ఇక పాత్రలు కడిగే పని ఐతే చాలా గడ్డుగా అనిపించింది. లో దుస్తులు ఏదో సబ్బు రాసి, నీల్లలో ఝాడించాడు కాని, వాటికి సబ్బు మరకలు కూడా పోలేదు. టీ టిఫిన్లకు హోటలుకు వెళ్తే ఆ ఖర్చు తడిసి మోపెడయింది. స్విగ్గీ, జొమాటోల ఖర్చైతే ఇక చెప్పనవసరం లేదు.
ఓ వారం రోజుల్లో ఠీవీ రావు భూమిపైకి దిగి వచ్చాడు. ప్రతి పనిలో, ప్రతి క్షణం రమ గుర్తుకు వచ్చింది. దేని విలువైనా కోల్పోతేకాని తెలియని చందాన, అతనికి తన తప్పు తెలియవచ్చింది. దర్పమంతా దిగిపోయింది. పని మనుషులు రమ స్థానం ఎప్పటికీ తీసుకోలేరని అర్థమైంది. ఇక కాళ్ల బేరానికి దిగాడు.
మొత్తం ఢీలా పడి, మాసిన బట్టలతో కూతురు క్షమ ఇంటికి వెళ్లి…
“రమా! క్షమా!నన్ను క్షమించండి. మీ అమ్మను వేపుకుతిన్న మాట నిజమే. ఆమె ఎదురు తిరుగకపోయే సరికి, అది నా హక్కనుకున్నాను. ఆఫీసులోని నా హోదాతో కళ్లు నెత్తికెక్కాయి. కాని పదవి శాశ్వతం కాదని, నా రిటైర్ మెంట్ నిరూపించింది. ఇల్లుకి, ఆఫీసుకి తేడా తెలియని నేను రమని వేధించాను. అదే దర్పంతో మీ అమ్మపై చిన్న చూపు చూశాను. రమ నా కళ్లు తెరిపించింది. మీరు రమ పక్షాన నిలిచారు. ఈ వయసులో రమను, నా నుండి దూరం చేయకండి. ఇక ముందు మీ అమ్మను పువ్వులా చూసుకుం టాను. అంతే కాదు, తన పనుల్లో పాలు పంచుకుంటాను. దయచేసి నా కోరిక మన్నిం చండి” కళ్లల్లో నీళ్లు నిండగా ఎంతో దయనీయంగా అభ్యర్థించాడు ఠీవీ రావు.
తన భర్త దైన్య స్థితి గమనించి రమకు కన్నీళ్లాగలేదు. ఆమె హృదయం ద్రవించింది ఎంతైన అమ్మ మనసు కదా? ఆమెకు తన భర్తలో ఒక చిన్న బాలుడు కనిపిం చాడు.
“ఏమండీ ఒక్క వారం రోజుల్లోనే ఎంత చిక్కి పోయారు. సింహం లాంటి మీరు గోవులా మారారు.
పిల్లలూ! మీ నాన్న మారినట్టున్నాడు కదా? అయనకు తన తప్పు తెలియ వచ్చింది కదా? అదీ చూద్దాం. ఇక ఆయనను ఒంటరిగా వదిలి నేను క్షమ ఇంట్లో ఉండను. నలభై ఏళ్లు అతనితో కాపురం చేసి, అతని నుండి మీ ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చిన నేను, మా సంధ్యా సమయంలో వేరుగా ఉండలేను.”
అప్పటికే క్షమ ఇంటికి వచ్చిన అతని కొడుకుల్లో చలనం వచ్చింది. వారు క్షమతో మంతనాలు జరిపారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న తమ తండ్రి నుండి తమ అమ్మ భావి జీవితానికి భరోసా కల్పించాలని నిశ్చయించారు.
“నాన్న గారూ! గత అనుభవాల వల్ల ఇప్పుడు మేము అమ్మను, మీ దయా దాక్షిణ్యల పై వదిలిపెట్టలేము. ప్రతి నెల అమ్మకు కనీసం ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చేలా ఆమె పేరుపై బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేయండి. ఆ మొత్తం అమ్మ తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటుంది. మీ పేర ఎన్నో ఆస్తులున్నాయి కాబట్టి, ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మాత్రం అమ్మ పేర రిజిస్టర్ చేయండి. ఐతేనే అమ్మ మీ దగ్గరకు వస్తుంది. ఇక ముందు అమ్మ పట్ల మీ ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా మేము ఊరుకోము.” ముగ్గురు పిల్లల తరఫున వారి పెద్దబ్బాయి స్పష్టం చేశాడు. మిగతా వారు వంత పాడారు.
ఠీవీ రావుకు గత్యంతరం లేక పోయింది.
“చచ్చిన పామును ఇంకా చావగొట్టకండి. వారం రోజుల్లో నా గతి ఎలా అయిందో చూశారు గదా? రమ ఇల్లొదిలి వెళ్లిన తర్వాత తనని తలచుకోని క్షణం లేదు. ఎంతైనా పని వారు తన వారు కాలేరు, అనే సత్యం తెలుసుకున్నాను. నేను ఒంటరిగా గడిపిన రోజులు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక ఆ రోజులు నా జీవితంలో ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను. మీ అమ్మను అస్సలు వేధించనని మాటిస్తున్నాను. మీరన్నట్టు మీ అమ్మకు ఆర్థిక రక్షణ కల్పిస్తాను. నా పేరు మీద ఉన్న అన్ని ఆస్తులూ మా ఇద్దరి జాయింట్ పేర్లపై బదలాయిస్తాను. అమ్మను నాతో పంపించండి. రేపు మీరంతా మనింటికి వస్తే మీరన్న బ్యాంక్ డిపాజిట్లు మీ అమ్మ పేర వేస్తాను. లాయర్ గారిని పిలిచి ఆస్తులను మా ఇద్దరి పేర చేసే పని ఒప్పజెప్పుతాను. మనందరం తిరుమల వెళ్లి ఆ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం.”
ఠీవీ రావులో వచ్చిన మార్పుతో అందరూ సంతోషించారు.
*****
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Ambatla-Janardhan-e1739006176626.jpg)
డాక్టర్ అంబల్ల జనార్దన్ తల్లి దండ్రులు అంబల్ల నర్సవ్వ, అంబల్ల నర్సయ్య. 9 నవంబరు, 1950 జననం. చదువు యం.కాం., ఎల్ ఎల్.బి.,(ముంబయి విశ్వవిద్యాలయం) సి.ఏ.ఐ.ఐ.బి. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్). సొంత ఊరు ధర్మోరా, మోర్తాడ్ మండలం, నిజామాబాద్ జిల్లా.-503 311 తెలంగాణ రాష్ట్రం. పుట్టిన్నుండి ముంబయిలో నివాసం.
వృత్తి : బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో 55 సంవత్సరాల అనుభవం.
రచనా వ్యాసంగం: 160 కథల ఏడు కథా సంపుటాలు, రెండు నానీల సంపుటాలు, రెండు కవితా సంపుటులు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురితం. నా కథలు మరాఠీ, ఇంగ్లీషు, హిందీ, ఒడియా మరియు గుజరాతీ భాషల్లోకి అనువాదమై, సంపుటాలుగా వెలువడ్డాయి. నా కథలపై పరిశోధన చేసిన హైద్రాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం విద్యార్థి జి. ఆంజనేయులుకి యం. ఫిల్ పట్టా ప్రదానం చేయడమైనది. కొన్ని కథలు మహారాష్ట్రలోని ఎనిమిది నుండి పన్నెండు తరగతుల తెలుగు విద్యార్థులకు గత పాతిక సంవత్సరాలుగా పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
పురస్కారాలు : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతో సహా దాదాపు ముప్పై ఐదు పురస్కారాలు
బిరుదులు : ముంబయి తెలుగు రత్న, ముంబయి కథా కెరటం, సాహిత్య రత్న, కవిరత్న.
బహుమతులు : మప్పై కథలకు వివిధ పోటీల్లో బహుమతులు.