![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2024/05/AIImage_BengaliWoman-e1715279799609.png)
దేవి చౌధురాణి
(మొదటి భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
దుర్లబ్ ప్రఫుల్లను ఎత్తుకుపోయిన రాత్రే వ్రజేశ్వర్ ప్రఫుల్ల ఇంటికి చేరుకున్నాడని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ప్రఫుల్ల వుండే పూరింటిలోకి వెళ్లి చూస్తే, లోపల ఏ జాడా లేదు. ఇరుగూపొరుగుని అడుగుదామంటే అర్థరాత్రి, చుట్టూ అంధకారం. అంతకు కొన్ని క్షణాల క్రితమే ప్రఫుల్లని ఎత్తుకుపోయిన విషయం వ్రజేశ్వర్కి తెలియదు. ఒకవేళ ఎవరైనా బంధువుల ఇంటిలో పడుకోవటానికి వెళ్లి వుంటుంది అని అనుకున్నాడు. నిరుత్సాహంతో తన వూరు ఆ రాత్రికి రాత్రే వెళ్లటానికి గుఱ్ఱము మీద తిరుగుముఖం పట్టాడు.
అక్కడ హరివల్లభ బాబు ఇంటిలో ఎప్పటివలనే రోజులు గడుస్తున్నాయి. అందరి దినచర్యలలో మార్పు లేదు. ఒక్క వ్రజేశ్వర్లో తప్ప. భోజనం సరిగ్గా చేసేవాడు కాదు, కొంచెం అన్నం కెలికి లేచిపోతుండే వాడు. వ్రజేశ్వరుడి తల్లి అతని స్థితిని గమనించి వంటింటి వైద్యం మొదలుపెట్టి, చివరకు వైద్యుడికి కబురు పెడతానన్నది. వ్రజేశ్వర్ నవ్వి ఏమీ అవసరంలేదన్నాడు.
కానీ వంటింటిని శాసించే బామ్మ, ఠాకురాణి, ఈ విషయాన్ని అంత తేలికగా వదిలి పెట్టలేదు. “నయనతో పోట్లాడి తినటం మానేసావా?” అని అడిగింది.
“లేదు, నీ వంట అలా అఘోరించింది” అని విసుక్కునాడు వ్రజుడు.
“ఎప్పుడూ వండుతునట్టే వండుతున్నానుగా…”
“నీకు ఒక చెయ్యి పడిపోయిందేమోలే…”
“మరి పాలూపళ్లూ అన్న తినవే? అవి నేనేమీ వండటంల్లేదుగా …”
“ఆవులు ఈ మధ్య సరిగ్గా పాలు ఇవ్వటంలేదులే …”
“నువ్వు రోజూ పరధ్యాన్నంగా వుంటున్నావు. ఏం ఆలోచిస్తున్నావూ?” అసలు విషయం అడిగింది ఠాకురాణి.
“నిన్ను గంగలో ఎప్పుడు కలుపుతానా అని ఆలోచిస్తున్నా.”
“ఎక్కువ వాగమాకు. నే చచ్చినప్పుడు వేప చెట్టు క్రింద పడేయండి, నాకదే చాలు. నన్ను గంగ దాకా ఈడ్చుకెళ్లటానికేనా ఇంత చిక్కిపోయావూ …”
“నీ కోసం వేప చెట్టుక్రింద గొయ్యి తవ్వటమేమన్నా తక్కువ పని అనుకున్నావా …?”
“ఓరి పిచ్చివాడా, నిన్న నువ్వు గంగా నది ఒడ్డున కూర్చుని కన్నీళ్లు ధారగ కార్చటం చూసాను“
“నదిలో స్నానం అయ్యిన తరువాత నీ వంట తినాల్సివస్తుంది కదా అని ఏడుస్తున్నా.”
“ఊం, సర్లే, ఇక నుంచి సాగర్‌ని వంట చెయ్యమంటాలే.”
“ఎందుకు, సాగర్ వంట గురించి నీకు తెలీదా?”
“అయితే ప్రఫుల్లని పిలిచి వంట చేయించుకుందువులే …” వేళాకోళమాడింది ఠాకురాణి.
ప్రఫుల్ల పేరు వినగానే వ్రజేశ్వర్ ముఖ కవళికలు మారాయి. “ఏం చేస్తాం? వెళ్లి పోయింది కదా” అన్నాడు.
“తనేం వెళ్లిపోలేదు. మీ నాన్నే సంఘానికి, సమాజానికి భయపడి తరిమేసాడు. అయినా కొడుకు కంటే సంఘం, సమాజం ఎక్కువా? నన్ను వెళ్లి మీ నాన్నతో మాట్లాడ మంటావేమిటీ?”
“వద్దు, నా కోసం నాన్నగారి పేరు ప్రతిష్ఠలకి ఏమాత్రం మచ్చ రానియ్యను.”
ఆ రోజు ఇంకేమీ మాటలు జరగలేదు. ఠాకురాణికి కొంత బోధపడింది, కానీ పూర్తి విషయం తెలువదు. ఆ రాత్రి వేళ వ్రజేశ్వరుడి హృదయమంతా ప్రఫుల్లమయమే, ఇంకెవరికీ స్థానం లేదు. ఎంత అందంగా వుందో అంత మధురంగా మాట్లాడుతుంది. ప్రఫుల్లకి ఇంటి పెద్ద కోడలి భాధ్యతలు అప్పగించినట్లయితే తన సుగుణాలు అందరి లోనూ నింపేది. ప్చ్, మేఘాలలో ఒక మెరుపులాగా మెరిసి ఇక కనబడకుండా వెళ్లి పోయింది. ఠాకురాణికి ఈ విషయాలేమీ తెలవవు కదా!
కొన్ని రోజులకి ఫూల్మణి ప్రఫుల్ల గురించి లేపిన పుకార్లు రకరకాలుగా మారి హరివల్లభ బాబు ఇంటికి చేరాయి. ఇక్కడకు అందిన సమాచారం ప్రకారం ప్రఫుల్ల తిండికి కరువై, క్షామంతో చనిపోయిందనీ, ప్రఫుల్ల చనిపోవటానికి ముంది తల్లి ప్రత్యక్షమయ్యిందనీను. వ్రజేశ్వర్ కూడా ఈ వార్త విన్నాడు.
వార్త విన్న హరివల్లభ బాబు స్నానం అయితే చేసాడు కానీ శ్రాద్ధ కర్మ చెయ్యటానికి మాత్రం ఒప్పుకోలేదు. “తరిమేసినదానికి శ్రాద్ధ కర్మ కూడానా?” అన్నాడు.
నయనతార కూడా స్నానం చేసింది. “ఒక పీడ విరగడయ్యింది, ఇంకో పీడ మిగిలి వుంది, దానికికూడా స్నానం చేస్తే కానీ, మనసు చల్లబడదు” అన్నది.
ప్రఫుల్ల ఈ ప్రపంచంలో లేదు అని ఆ ఊరి వాళ్ల ద్వారా విన్న వ్రజేశ్వరుడు అన్న పానాలు మాని వేసాడు, నలత, జ్వరం పట్టుకున్నాయి. విశేషమైన రోగమేమీ కాదు, కొంత జ్వరం మాత్రమే. వైద్యుడిచ్చిన మందులతో ఉపయోగం లేకపోయింది. “ప్రాణం పోతే పోయింది” అనటం మొదలుపెట్టాడు.
వ్రజేశ్వర్ మాటలు దాగలేదు, ముందు ఠాకురాణి విన్నది. ఆ తరువాతా వ్రజేశ్వరుడి తల్లికి తెలిసింది. ఆవిడకి తెలిస్తే హరివల్లభ బాబుకి తెలిసినట్టే. ఆ మాట వినేసరికి ఆయనకి గుండె మీద గాటు పడునట్లయ్యింది. వ్రజేశ్వర్కి ఏదన్నా జరిగితే విషం తాగి చనిపోతానన్నది ఇంటావిడ. హరివల్లభ బాబు ఏడవటం మొదలుపెట్టి దేవుడు దయతలచి వ్రజేశ్వర్‌కి రోగం ఉపశమించితే, ఇక వ్రజేశ్వరుడికి ఇష్టం లేకుండా ఏ పనీ చెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు.
వ్రజేశ్వర్ నెమ్మదిగా కోలుకున్నాడు. ప్రఫుల్లని మరిచిపోవటానికి ప్రయత్నించాడు, కానీ ప్రఫుల్ల మృత్యువుకి తన తండ్రే కారణమని తలుచుకుని వ్యాకుల పడ్డాడు.
*****
(సశేషం)
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2021/03/hand-writing-feather-pen-14463760-e1617210132259.jpg)
విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.