నడక దారిలో-50

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ చేసారు. కొంత అనారోగ్యం. విజయవంతంగా ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, Y2K సంచలనం. పల్లవికి పాప జన్మించటంతో మా అమెరికా ప్రయాణం, నా ప్రమోషన్ ప్రహసనం. పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి వచ్చేసింది. అజయ్ కి ఇంతకుముందు ఆపరేషన్ జరిగిందనీ పదేళ్ళే బతుకుతాడని చెప్పకుండా మోసం చేసారని తెలిసింది. పల్లవి ఉద్యోగంలో చేరింది తర్వాత—)

***

           ఆషీ ఆటలో భాగంగా కూర్చున్నప్పుడు వెనుక చేరి మెడ చూట్టూ చేతులు వేసి గూగూలు ఆడటం వలనేమో సడన్ గా నాకు స్పాండిలైటిస్ వచ్చింది. ఇంక స్కూల్ లో కూడా పేపర్లూ, పుస్తకాలు దిద్దటం వీటన్నిటితో అంతకంతకూ బాగా ఎక్కువై పోయింది. అల్లోపతీ మందులే కాక ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గలేదు.”మెడకి కాలర్ తప్పని సరిగా పెట్టుకోవాలి అది మీ శరీరంలో ఒక పార్ట్ అనుకోవాల్సిందే “అన్నాడు న్యూరో ఫిజీషిన్ .
 
           ఆయుర్వేద నూనెలు రాసుకున్నా ఫలితం లేదు. రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదు.
 
           హోమియో మందులు బాగా పనిచేస్తాయి అంటే అవి మొదలెట్టాను. స్పాట్ వేల్యుయేషన్ లో ఒక మాష్టారు స్పాండిలైటిస్ కి ఎక్సర్సైజెస్ బాగా పనిచేస్తాయని ఎలా చేయాలో కొన్ని చెప్పారు. ఏది పని చేసిందో కాని మొత్తం మీద నాకు చాలా వరకూ ఉపశమనం కలిగింది.
 
           విజయలక్ష్మి తర్వాత నేను హెచ్చమ్ ను అయ్యాను. నాకూ సర్వీసు తక్కువే ఒకటిన్నర సంవత్సరాలు కూడా లేదు. కానీ నేనున్నన్ని రోజులైనా స్కూల్ కి కొంతైనా చేయాలని నా ఆలోచన. కానీ పురుగు పట్టిన చెట్టుని సంరక్షించడం అంత సులభం కాదని నాకీ అనుభవంలో తెలిసి వచ్చింది.
 
           నా దురదృష్టం కొద్దీ నాకు హెచ్చెమ్ అప్రూవల్ కి డ్రాఫ్టింగ్ అయ్యి కరెస్పాండెంట్, చైర్మన్ ల సంతకాలై డిపార్ట్మెంట్ పంపించాము. కానీ అంతకు ఒక్కరోజు ముందే ఎయిడెడ్ పాఠశాలల్లో రిక్రూట్మెంట్, ప్రమోషన్స్ చేయటానికి వీల్లేదని ప్రభుత్వం స్టే ఇచ్చింది. ఇంకేం చేస్తాను. చేసేది టీచర్ గా,హెచ్చెమ్ గా చాకిరీ మాత్రమే మిగిలింది. ఇన్ఛార్జ్ హెచ్చెమ్ గానే సర్వీసు కొనసాగటమే అయ్యింది.
 
           నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే మా స్కూల్ సెక్రటరీ విజయలక్ష్మిగారిని కలిసి స్కూల్ పరిస్థితులు వివరించాను. వీలుంటే స్కూలుకి తరచూ వస్తుంటే బాగుంటుంది అని కూడా చెప్పాను. ఈ ఏడాదికి  మా స్కూల్ ప్రారంభమై యాభై ఏళ్ళు అయ్యింది కనుక ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని అన్నాను. అన్నింటికి అంగీకారం తెలియ జేసారు.
 
           ఆ ఏడాది ఆగష్టు పదిహేను స్వాతంత్ర్యదినోత్సవం కార్యక్రమానికి మా కరెస్పాండెంట్ రామారావుగారినీ, విజయలక్ష్మిగారినీ ఆహ్వానించాను.నేను స్కూల్ లో చేరినది మొదలూ ఆరో తరగతి నుండి పదోతరగతి వరకూ మొదటి స్థానంలో వచ్చిన వారికి అవార్డులుగా పుస్తకాలూ, నగదు ఇస్తున్నాను. ఈసారి ఆ కార్యక్రమం మా స్కూల్ అధిపతుల చేతుల మీదుగా ఇప్పించాను.
 
          ఈ కార్యక్రమం విజయలక్ష్మిగారిని కదిలించింది. స్కూల్లో ఎంతమంది విద్యార్థులు వున్నారో వాళ్ళకి ఏడాదికి ఎన్ని నోటు పుస్తకాలు కావాల్సి వుంటాయో వివరంగా డాటా తయారుచేసి తనకు పంపమన్నారు. పిల్లలకు కావలసిన నోటుపుస్తకాలు పంపుతాన న్నారు.
 
          టీచర్లను సమావేశపరిచి ఏ తరగతిలో ఎంతమంది పిల్లలున్నారో వాళ్ళకు కావలసిన నోటు పుస్తకాలు ఏవి ఎన్ని కావాలో లిస్ట్ చేసి ఇవ్వమన్నాను. అయితే అన్ని పుస్తకాలు ఎక్కడ ఇస్తారులే అని అయిష్టంగానే జాబితాలు చేసి ఇచ్చారు. ఒక ప్రయత్నం చేయటంలో తప్పేముందని మొత్తం స్కూల్ విద్యార్థులకు కావలసిన నోటు పుస్తకాలు జాబితాను విజయలక్ష్మి గారికి పంపాను. ఆశ్చర్యంగా ఒక వారంరోజుల్లో ఒక ట్రక్కు నిండా నోటుపుస్తకాలు స్కూలుకు చేరాయి.
 
          ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ పుస్తకాలన్నిటినీ సైన్స్ రూముకీ లోపలివైపు వుండే రూములో వేయించాము. ఒకే సారి అన్ని పుస్తకాలూ ఇవ్వకుండా సబ్జెక్టులకు ఒకటి చొప్పున పిల్లలకు ఇచ్చి అది నిండిన వెంటనే ఇంకోటి ఇచ్చేలా నిర్ణయించాను. టీచర్లందరికీ టీచింగ్ నోట్స్ రాసేందుకు పొడుగు పుస్తకం ఇచ్చాను. టీచర్లకు కూడా నేను కోరగానే పుస్తకాలు రావటం ఆశ్చర్యం కలిగించింది.
 
          ఇకపోతే కొందరు టీచర్లూ, ఆఫీసులో ఇద్దరు రికార్డు అసిస్టెంట్స్ స్కూలుకు చాలా ఆలస్యంగా అంటే తొమ్మిది గంటలకు స్కూల్ అయితే సుమారు గంటా, గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు. టీచర్ల కొరత వలన వారికి కూడా చిన్న క్లాసులు ఇవ్వటం తప్పలేదు. అందుకని నెలకు మూడు లేట్లు అయితే ఒక సిఎల్ కట్ చేస్తానన్నాను. అయినా సరే అదే పద్ధతిలో లేటుగా రావటం చేస్తుంటే రెండు నెలలు చూసి కరెస్పాం డెంట్ కి కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాళ్ళు తీరు మారలేదు. వారి వెనుక మా పాత హెచ్చెమ్ మద్దత్తు వుందని తెలుసు. ఎలా అయినా నా మీద పగతీర్చుకోవాలనే స్కూల్ వదిలినా ఆమె కొంతమందికి చీరలూ,బహుమతులూ ఇచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేయిస్తోంది.
 
          అదెలా తెలిసిందంటే- స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ ఆష వారానికి మూడురోజులు లేటే వస్తోందని సిఎల్స్ కట్ చేసాను. వెంటనే మరి ఎలా వచ్చారో ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఈటీవీ విలేఖర్లమంటూ ఒక ఐడీ కార్డు చూపించారు. అంత తొందరగా వచ్చారంటే అంతా ప్రీ ప్లాన్ అని అర్థమైంది. అంతలో ఉషా కూడా వచ్చింది. ఈ విషయం ఆమెకు ఎలా తెలిసింది? 
 
          అందుకే నేను ఎక్కువ ఆర్గ్యూ చెయ్యకుండా “నెలకు పన్నెండు లేట్లు అయితే సిఎల్ కట్ చేయటం తప్పెలా అవుతుంది.” అని ఒకే మాట చెప్పి నా పని నేను చూసుకోసాగాను.
 
          ” ఆషాకి క్షమాపణ చెప్పు లేకపోతే పేపర్లో వస్తుంది “అని ఉషా, ఇంకో క్లర్క్ అంటున్నా నేను విననట్లు ఊరుకున్నాను. తర్వాత అంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెలిసింది. ఆ వచ్చిన కుర్రాళ్ళలో ఒకడు ఆషా అల్లుడని.
 
          హెచ్చెమ్ గా అయిన తర్వాత స్కూల్లో ఆఫీస్ సిబ్బంది చేసే అనేక అవకతవకలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. అయితే అంతకుముందు హెచ్చెమ్స్ గమనించి కూడా గొడవలెందుకని నిమ్మకు నీరెత్తినట్లు వూరుకున్నారా? గమనించ లేదా? వాళ్ళకు కూడా అందులో హస్తం వుందా? నాకు అర్థం కాలేదు. నా సర్వీసు ఏడాదిన్నర కూడా లేదు. ఈ పాటి దానికి ఇవన్నీ నెత్తినేసుకుని చెడ్డదాన్ని కావటం ఎందుకని అనిపిం చింది. విద్యకు సంబంధించిన విషయాలు మీదే దృష్టి పెడితే పిల్లలన్నా బాగుపడ తారని అనుకున్నాను.
 
          స్టేషనరీకనీ, జిరాక్సులకనీ, విద్యాశాఖలో అటెండర్లకి, క్లర్కులకూ ఇవ్వాలనీ రోజూ డబ్బులకోసం బిల్లులు పెడుతూనే వుండే వాళ్ళు ఆఫీసు సిబ్బంది. స్కూల్లో పిల్లలు ఫీజులు కట్టలేదు, కట్టరూ కనుక డబ్బు ఏమీ స్కూల్ ఖాతాలో వుండేదికాదు. దాంతో నా జీతం నీళ్ళ ధారలా ఖర్చు అయిపోతూనే వుండేది. సముద్రంలో వున్నప్పుడు మింగేసే తిమింగలాలతో గడపకతప్పదుకదా. కబంధులకు పట్టుకోవటానికి చేతులూ, మింగటానికి నోరూ, నింపుకోవడానికి పొట్టా వున్నప్పుడు ఎంతా సరిపోదు కదా.
 
          ఇది కాదని బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ ద్వారా తెల్లకాగితాలూ, రూళ్ళ కాగితాలు బండిల్స్ హోల్ సేల్ లో తెప్పించి పెట్టాను. అవే పిల్లలకు మూడునెలల పరీక్షలూ, అర్థసంవత్సర పరీక్షలకూ, సంవత్సరాలైంది పరీక్షలూ కూడా సరిపోయాయి.
 
          ఈ ఏడాది కూడా పదోతరగతి పిల్లలను కొందరిని కోచింగ్ సెంటర్ లో చేర్చాను. రెగ్యులర్ గా క్లాసులకు రాకపోతే స్కూల్ కి వచ్చి తెలియజేయమన్నాను. అంతకుముందు వాళ్ళకు ఫీజులకు సహాయం జేసిన కొందరు టీచర్లు ఈసారి కూడా సహకరించటంతో నేను కొంత వూపిరి పీల్చుకోగలిగాను.
 
          స్కూల్ సమస్యలు గురించి చర్చించటానికి మా జోన్ విద్యాశాఖ అధికారి సమావేశం ఏర్పరచినప్పుడు నేను, ఉమా హాజరై ముఖ్యంగా పదోతరగతికి సబ్జెక్టు టీచర్ల కొరత గురించి మాట్లాడాము.
 
          ప్రభుత్వం ప్రతీ స్కూల్ లోనూ విద్యార్థులు, టీచర్ల శాతాన్ని నమోదు చేసుకుని మాకు మరికొంత మంది టీచర్లను ఇవ్వటానికి బదులుగా ప్రాధమిక తరగతుల్లో టీచర్లు ఎక్కువగా వున్నారన్న మిషతో రేషనలైజేషన్ పేరుతో ప్రైమరీ టీచర్లైన అలివేలు, జయప్రభని మరో స్కూల్ కి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు పంపారు. దాంతో మళ్ళా వుత్పాతం సంభవించింది. అందులో ఒక టీచరైన అలివేలు ఉషకి ఇన్ఫార్మర్ అని నాకు ఒక అనుమానం వుంది. అందుకు ఆమెని ఎగసిన దోసిందేమో.
 
          జయప్రభని వెనకని పెట్టుకొని అలివేలు వచ్చి నా మీద ఆగ్రహంతో  తగువుకు దిగింది. నేను ఆ విషయాన్ని పరిష్కరిస్తాను కొంచెం ఓపిక పట్టమని సముదాయించాను. ఉపాధ్యాయసంఘంలోని ఒకరిద్దరు నాయకులతో మాట్లాడాను. అఫ్జల్గంజ్ దగ్గర ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే దీనికి సంబంధించిన అడ్వకేట్ వున్నాడని, అతన్ని సంప్రదించమని నెంబర్ ఇచ్చారు. మర్నాడు ఉదయమే బయల్దేరి ఆ అడ్వకేట్ ను కలిసాను. ఈ విధంగా రేషనలైజేషన్ బారిన పడిన ఇతర వుపాధ్యాయులనూ కలిపి కోర్టులో పిల్ వేస్తానని ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలు ఇవ్వాలి అన్నాడు 
మళ్ళాస్కూల్ కి వెళ్ళి వాళ్ళిద్దరికీ  తెలియజేసాను. దానికి కూడా ” మేమెందుకు ఇవ్వాలి ?
మీరే బాధ్యులు కనుక ఏంచేసి చేస్తారో ఆర్డరు కేన్సిల్ చేయించాల్సిందే ” అని వితండ వాదం మొదలెట్టారు. ముఖ్యంగా అలివేలు, ఆమె భర్త శ్రీనివాసులు (మా స్కూల్లోనే డ్రిల్లు మాష్టారు)
 
          నేను సగం డబ్బు యిస్తానని చెప్తే అప్పటికి ఎలాగో వాళ్ళిద్దరూ శాంతించారు. బహుశా దీని వెనుక కూడా ఉషాటీచరు వుండే వుంటారు. అలివేలునీ, జయప్రభని తీసుకుని సాయంత్రం అడ్వకేట్ ను కలిసి అవసరమైన జిరాక్సులు ఇచ్చి డబ్బు చెల్లించి వచ్చాము. నేను రెగ్యులర్ ఆటోని పెట్టుకోవటం వలన యీ విధంగా స్కూల్ పనుల మీద ప్రతీ దగ్గరకు తిరగటానికి సులభం అయ్యింది.
 
          అయితే ఇప్పుడు ఇంఛార్జి హెచ్చెమ్ గా ఉండటం వలన స్కూల్ పిల్లలూ, టీచర్లూ వెళ్ళాక అన్నీ తాళాలు వేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాల్సి రావటంతో ఆషీని స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేభారం పూర్తిగా వీర్రాజుగారికే అయ్యింది.
 
          ఇక రాష్ట్రంలో అనేక సంచలనాలు. తెలంగాణా వుద్యమం కేసీఆర్ నేతృత్వంలో అంతకంతకూ వూపందుకుంది. నక్సల్ సమస్యపై కేసిఆర్ నేతృత్వంలో MLAలు, MPలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్‌లను కలిసి చేసిన చర్చలో ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమంపై చులకనగా చేసిన వ్యాఖ్యలు వలనే కాక  నక్సల్స్‌ సమస్యపై కూడా ఆశించిన స్పందన లభించలేదు. ఇది కేసీఆర్‌ కి అసంతృప్తి కలిగించింది . 
 
          హైదరాబాదులోని చంచల్‌గూడా జైల్లో నిషేధిత విరసం నేతలను కేసిఆర్ కలిసారు. మావోయిస్టుల పైన, విరసం పైన నిషేధం ఎత్తివేయిస్తే, మావోయిస్టులను చర్చలకు తాను ఒప్పిస్తామని విరసం నేతలు అన్నారు. 
 
          తెలంగాణా వుద్యమాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నుండి విడిపోయి పురపాలక ఎన్నికలలో తీవ్రంగా కృషి చేసినా కాంగ్రెసు విజయం సాధించింది. తెలుగు దేశం, తెరాస ఘోరంగా ఓడిపోయాయి.
 
          తీవ్రవాదులతో ప్రత్యక్షంగా చేసిన ప్రభుత్వ చర్చలు అప్పట్లో మరొక సంచలనం.
ఈ సంచలనాలూ, స్కూల్లో నా మీద విరుచుకు పడడాలూ సరే. ఇవే కాక ప్రకృతీ నా మీద పగ పట్టినట్లు ఆ ఏడాది విపరీతమైన వానలు. ఒక శనివారం రాత్రి పడిన వానకి వరదనీళ్ళు గొప్ప వుధృతితో వచ్చి మా స్కూల్ వెనుకవైపు గేటును బలంగా తాకేసరికి గేటు విరిగిపడి స్కూల్లోకి నీళ్ళు వచ్చేసాయట. గేటుపక్కనే గదిలో వుండే వాచ్ మెన్ ఇంట్లోకి వచ్చేశాయని గగ్గోలు పెడుతూ ఆదివారం వుదయమే ఫోన్ చేసాడు.
 
          నాకు ఏంచేయాలో తోచక ముందు స్కూల్ యాజమాన్యం వారికి తెలియజేసాను. తొందరగా తయారై మా ఆటో సలీమ్ ని పిలిచి స్కూల్ కి వెళ్ళాను. అంత వర్షం కురిసి తెల్లారేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. అందుచేత స్కూల్ లోకి వచ్చేసిన నీళ్ళు కూడా క్రమంగా తగ్గిపోయాయి. కానీ భద్రత వుండాలి కదా అందుకని కార్పెంటర్ ను పిలిపించి అర్జెంట్ గా గేటు బాగు చేయించాల్సి వచ్చింది.
 
          ఈ వత్తిళ్ళవల్లో ,ఇంకేం కారణం వల్లనో నాకు చూపులో కొంత ఇబ్బంది కలిగింది. ఎడమ కంటిచూపు పూర్తిగా తగ్గినట్లు అనిపించింది. మీనన్ గారి అమ్మాయి అపర్ణ కంటి డాక్టరు. ఆమెని కాంటాక్ట్ చేస్తే నన్ను తీసుకు వెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేయించింది. రెటీనా మీద సన్న రంధ్రాలు వున్నాయనీ, కాటరాక్ట్ కూడా కంటిపాప మధ్యలో వచ్చిందనీ తెలిసింది. సాధూరామ్ కంటి హాస్పిటల్ లో ఒక గుజరాతీ డాక్టర్ చాలా ఫేమస్ సర్జన్ అని అపర్ణ చెప్పింది. అయితే అక్కడ పరీక్షల కోసం ఒకరోజు, ఆపరేషన్ అయిన రోజు అక్కడే వుండాలి. నా దగ్గర ఒకరు ఉండాలంటే ఆషీ చిన్నపిల్ల, వీర్రాజు గారికీ కష్టమే అందుకని పగలు పల్లవో, వీర్రాజుగారో ఉండేలా రాత్రి మాత్రం వీర్రాజు గారి తమ్ముడి కూతురు కవితని వుండమని అడిగాము. ఆమె ఒప్పుకుంది.
 
          కాటరాక్ట్ విజయవంతంగానే జరిగింది. కానీ ఆ రాత్రి వేసుకున్న టాబ్లెట్ ఏదో పడలేదేమో క్రమక్రమంగా పాదాల నుండి తిమ్మిరి ప్రారంభం అయ్యింది. అప్పటికీ కాసేపు కవితని పట్టుకుని నడిచాను. ఎందుకైనా మంచిదని అపర్ణతో ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె డాక్టరుతో సంప్రదించితే డాక్టరు వచ్చి ఇంజెక్షన్ చేసారు అప్పటికే నడుము వరకూ తిమ్మిరిగా అయ్యింది. తర్వాత క్రమంగా తగ్గి నిద్రపట్టింది. మర్నాడు ఇంటికి వచ్చేసాను.
 
          ఒక నాలుగు రోజుల తర్వాత సంక్రాంతి సెలవులే కనుక పదిహేను రోజులు విశ్రాంతి వుంటుంది అని అనుకున్నాను. తీరా ఓ పదిరోజులు అయ్యేసరికి ఆర్టీసీ ఎమ్.డీ ఆఫీస్ నుండి మా స్కూల్ బిల్డింగ్ కి సంబంధించి చర్చల సమావేశానికి రమ్మని పిలుపు వచ్చింది. ఆ సమస్య తెగేదికాదు కానీ తప్పనిసరిగా ఆటో చేసుకుని వెళ్ళక తప్పలేదు.
 
          ఎప్పటిలా ఆ చర్చ అక్కడే ఆగింది. నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. ఎటొచ్చీ ఎండలో ఆటోలో వెళ్ళి రావటం కాటరాక్ట్ అయిన కంటికి కొంత శ్రమ కలిగించినట్లు అయింది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.