నా జీవన యానంలో- రెండవభాగం- 50

-కె.వరలక్ష్మి

          ఇంకొంత ముందుకెళ్తే పసుపురంగు పూలు, మరికొన్ని చోట్ల ఊదారంగు పూలు – కొండలకి ఆ పూలరంగు అలముకుంది. అక్కడి అందమంతా పూలలోనే ఉంది. 5.30 కి లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అంతా దాటుకుని అనాహేమ్ లోని కేరేజ్ ఇన్ హోటల్ కి చేరుకున్నాం. రెండు సెపరేట్ విశాలమైన రూమ్స్, మధ్యలో ఓ గుమ్మం, డ్రెస్సింగ్ ప్లేస్, రెస్ట్ రూమ్స్. అక్కడి ఇర్వేన్ లో మా పెద్ద తమ్ముడి పెద్దకూతురు వాళ్లు ఉన్నారు అప్పటికి. అంతకు కొంత ముందే మా తమ్ముడూ, మరదలూ కూతురింటికి వచ్చి ఉన్నారు. మేము తొందర తొందరగా రిఫ్రెష్ అయ్యి వాళ్లింటికెళ్లి, వాళ్ల చిన్న ఇంటిని, ఇంటికి ముందూ వెనకా ఉన్న ఫ్లవర్ గార్డెన్స్ నీ చూసి, వాళ్లింట్లో చేసిన పూరీలు, చనా కర్రీతో డిన్నర్ తినేసి 10.30 కి రూమ్స్ కి తిరిగొచ్చాం.

జూన్ 13 ఉదయం 6 కే రెడీ అయ్యి హోటల్ వాళ్లు ఇచ్చిన కాఫీతో బ్రేక్ ఫాస్ట్ ముగించి డిస్నీలేండ్ చేరుకున్నాం. అక్కడ కార్ పార్కింగ్ వెతుక్కునేసరికి చాలా టైం పట్టింది. 10 కి డిస్నీలేండ్ ట్రెయిన్లో లోపలికి చేరుకున్నాం. అక్కడి నుంచి మొదలు ఒకటే తిరుగుడు. రకరకాల ఈవెంట్స్. కొన్ని పిల్లలు ఎంజాయ్ చేసేవి. కొన్ని పెద్దలు కూడా చేసేవి. ఏదో ఒక టాప్ లెస్ ట్రెయిన్ ఎక్కడం, బెల్ట్ బిగించుకుని కూర్చోవడం, ఇక రకరకాల విన్యాసాల్లో ప్రయాణించడం.  ఎలిస్ ఇన్ ద వండర్ లేండ్, కొండపైకి గుహల్లోంచి వేగంగా దూసుకుపోయి తిరిగి రావడం, రోదసిలోకి వెళ్లే లాంటి ప్రయాణం, నీటిలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నట్టుండి జలపాతంతో బాటు కిందికి జారడం, రోలర్ స్పేసర్ లో చాలా ఎత్తుకి అతివేగంగా వెళ్లి రకరకాల విన్యాసాల్లో తిరగడం, ఒక బాక్స్ లో కూర్చుని వెయ్యిగజాల పైకి వెళ్లి అంతే స్పీడుగా కిందికి జారడం ఒకటి కాదు, రాత్రి పొద్దుపోయే వరకూ చాలా వాటిల్లో సత్య, కోమల్, వరు భయం లేకుండా ఎంజాయ్ చేసేరు. సాయంకాలం రకరకాల వేషాల్తో ఊరేగింపు, రాత్రి లైటెనింగ్ షో, ఆకాశంలోకి దూసుకెళ్లిన జువ్వలు రకరకాల ఆకారాల్లో విచ్చుకోవడం, నీటిలో ఫౌంటెన్స్ రంగుల నాట్యం మ్యూజిక్ కి అనుగుణంగా. భోజనాలకు మాత్రం బాగా ఖర్చైంది. మేం తినగలిగినవి చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే. ఎక్కడా రైస్ దొరకలేదు. నేను కూడా కొన్ని తేలికపాటి రైడ్స్ ఎక్కడం వలన తల తిప్పడం మొదలు పెట్టింది. అర్థరాత్రికి రూంకి చేరుకుని అలసిపోయి నిద్రపోయాం. ఆ మర్నాడు ఫ్రెష్ గా లేచి యూనివర్సల్ స్టూడియోకి వెళ్లేం. నిన్నటంత రష్ లేదు. హాయిగా ఉంది. ఒక ప్లాన్ ప్రకారం స్టూడియో వాళ్లిచ్చిన ప్రోగ్రాం ఉంది కాబట్టి అలసట అన్పించలేదు. నెమ్మదిగా అన్నీ చూస్తూ వెళ్లేం. అన్నిటికీ కెమెరాతో ఫోటోలు తీసుకున్నాం. ప్రోగ్రాంలో ఫస్ట్ ఫస్ట్ హర్రర్ హౌస్ వచ్చింది. వరు భయంతో ఒకటే అరుపులు, ఏడుపు. కోమల్ పట్టుకుని నడిపించేడు. చెప్పకపోవడమేం, నాకూ చాలా భయం వేసింది. చాలా చోట్ల ఎస్కలేటర్స్ మీద ఎక్కడం, దిగడం చెయ్యాల్సి వచ్చింది. కోమల్ నా చెయ్యిపట్టుకుని ఉండేవాడు. క్రమంగా నిన్నటి ఫియర్ పోయి అలవాటైంది. క్యూలో నిల్చుని ట్రెయినెక్కి స్టుడియో సందర్శనానికి వెళ్లేం. కారు మంటల్లో కాలిపోతున్నట్టు, భూకంపం వచ్చి రైల్వేస్టేషను కూలిపోయినట్టు, వరద వచ్చి ఒక్కసారిగా ముంచెత్తినట్టు వగైరా సంఘటనలన్నీ సినిమాట్రిక్స్ గురించి బాగా తెలుసుకోడానికి ఉపయోగపడ్డాయి. ట్రెయిన్ దిగేక మళ్లీ కొన్ని రెయిడ్స్. ముందు తెలీలేదు – జురాసిక్ పార్క్ అనే రైడ్ లో నీటిమీద పడవలో తిరుగుతూ ప్రాచీనకాలం నాటి డైనోసార్స్, ట్రైనోసార్స్ లాంటివి చూస్తూ వెళ్లి జలపాతం మీదినుంచి పడవతో బాటు కిందికి జారిపోవడం భయంతో కళ్లుమూసేసుకున్నా గుండెదడ తగ్గలేదు.

          మధ్యమధ్యలో వీధుల్లో మార్లిన్ మన్రో లాంటి ప్రఖ్యాత తారలవేషాల్లో నటులు తిరుగుతూ అందర్నీ పలకరించడం, కలిసి ఫోటోలకి ఫోజులివ్వడం బావుంది. అన్ని దేశాల మోడల్ వీధులున్నాయి. అక్కడక్కడా థియేటర్స్ లో కొన్ని సినిమాల ట్రయల్స్ చూపించారు. ఒక ఫ్రెంచ్ కార్టూన్ ఫిల్మ్ ను 4డి లో చూడడం నాకు చాలా నచ్చింది. మరో థియేటర్లో సీట్లోనే కూర్చుని చెట్లు, భవంతులు, సముద్రం మీదుగా, మన కాళ్లు వాటికి తగుల్తాయేమో అన్నంత భ్రమలో ప్రయాణించిన ఫీల్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ రోజు భోజనం బర్డెన్ కాలేదు. టిక్కెట్స్ తో బాటు అదనంగా 20 డాలర్ల టిక్కెట్టు ఒకటి కొనుక్కుంటే రోజంతా 5 రెస్టారెంట్స్ లో అందరికీ తిన్నంత ఫుడ్ లభించింది. రాత్రి 7 కి స్టూడియో లోపల క్లోజ్ కాబట్టి బైటికొచ్చేసి వీధుల్లో నడుస్తూ 8 కి కారెక్కాం. దగ్గర్లో మరో మంచి హోటల్ ‘Good Nite Inn’ లో దిగేం. అక్కడున్న స్విమ్మింగ్ ఫూల్ లో సత్య, పిల్లలు రాత్రి 11 వరకూ స్విమ్ చేస్తూనే ఉన్నారు. గీత, నేనూ వేడినీళ్ల జకోజీలో కాళ్లు పెట్టుకుని కూర్చున్నాం. 15 ఉదయం లీజర్ గా లేచి, రెడీ అయ్యి కారెక్కేం వెనక్కి. ఈసారి దారి మార్చి కొండలకి మరో వైపు నుంచి వెంచురా, శాంటాబార్బరా లాంటి బీచెస్ లో ఆగుతూ, కుడివైపు కొండలు, ఎడమవైపు సముద్రం చూసుకుంటూ ప్రయాణించేం. మధ్యాహ్నం శాంటా బార్బరాలో 35 డాలర్లకు సైకిల్ రిక్షా అద్దెకు తీసుకుని బీచ్ రోడ్ లో అటూ ఇటూ తిరిగేం. అక్కడే సీడెక్ మీద ఉన్న హోటల్లో అతిపెద్ద ఉడికించిన రొయ్యి, పీత లాంటి వాటితో లంచ్ చేసాం. రాత్రి 9.30 కి సన్నీవేల్ లో ఇండియన్ రెస్టారెంట్ దోసె సెంటర్లో డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నాం.

          జూన్ 19న ఉదయం 10 కి గీతా, నేనూ మిల్ పిటాస్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరుగుతున్న సాహిత్య సభకి వెళ్లేం. నీట్ గా చక్కగా ఉంది హాలు. మృత్యుంజయుడు గారు మొదటి పరిచయమే అయినా, చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ప్రోగ్రాం కన్వీనర్స్ లంచ్ టైంలో పలకరించేరు. అందరూ కొత్తవాళ్లే అయినా ఎప్పటినుంచో తెలిసిన వాళ్లలా ఆత్మీయత చూపించారు. తిరుమల పైనా, శ్రీనివాసుడి పైనా భక్తితో గొప్ప రచనలు చేసిన పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు, ప్రఖ్యాత జానపదగాయని వింజమూరి అనసూయగారు నా పక్కనే కూర్చున్నారు. సభకు వచ్చిన చాలామంది పద్యం, ప్రాచీన సాహిత్యం గురించి మాట్లాడేరు, బోయ జంగయ్య తన నవల గురించి మాట్లాడేరు. మధ్యాహ్నం సెషన్ లో ‘నేను- నా కథా పరిణామం’ అన్న విషయం మీద మాట్లాడేను. కవిత్వం సెషన్ లో గీత పొట్టలోని పాపాయి మీద అద్భుతమైన పోయెమ్ చదివింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. ఆ సభలో తమిళ అనువాదకురాలు గౌరీకృపానందన్ పరిచయమయ్యారు. వాళ్ల అబ్బాయిలు ముగ్గురూ అమెరికాలోనే ఉన్నారట. ఆమె తమిళ కథ గురించి మాట్లాడేరు. ఒకాయన స్టేజీ పైకి వచ్చి మాట్లాడుతూండగా తెలిసింది. ఆయన మురళి చందూరి అని. ఉదయం నుంచి చూస్తున్నా ఎవరో తెలీక పలకరించలేదు. ఆయన మాట్లాడుతూ ‘‘వరలక్ష్మి గారికీ, వారి ఫోటోకీ ఎక్కడా పోలికలు లేవు. అందుకే గుర్తు పట్టలేకపోయాను. ఆవిడ ఈ సభలో పాల్గోవడం ఎంతో అందంగా ఉంది. లాస్ ఏంజెల్స్ నుంచి నేనిలా ఈ సభ కోసం రావడం నాకెంతో ఆనందంగా ఉంది అని మాట్లాడుతూ వారు అప్పటికే వాళ్ల సంస్థ ATA అమెరికా భారతి పత్రికలో రెండుసార్లు నా కథలకు బహుమతులు ఇవ్వడం గురించి ప్రస్తావించేరు. నాకు చాలా ప్లెజెంట్ గా అన్పించింది. మేం పట్టుకెళ్లిన నావి, గీతవీ పుస్తకాలు అమ్ముడైపోయాయి. ఇంకా చాలామంది బుక్స్ ఉన్నాయా అని అడిగేరు. నేను స్టేజిపైన మాట్లాడడం పూర్తిచేసి వచ్చి కూర్చోగానే అప్పటికే నా బుక్స్ కొని, జీవరాగంలోని కథ ఒకటి చదివిన భువన్ అనే అబ్బాయి హఠాత్తుగా వంగి నా పాదాల్ని స్పృశించాడు. అది ఒక మరచిపో లేని అనుభవం.

          ఒకరోజు కాసాని సోమయ్య యాదవ్ గారి ఆహ్వానం మీద శాంటాక్లారాలోని వారి అమ్మాయి ఇంటికి వెళ్లేం. ఆయన భార్య విజయలక్ష్మిగారు వేడివేడిగా వడలు చేసి పెట్టేరు. వారమ్మాయి ఆఫీసు నుంచి వచ్చేక 5 కి అక్కడి నుంచి బయలుదేరి గీత ఒరియా ఫ్రెండ్ మందాకిని వాళ్లింట్లో కొంతసేపు గడిపి, మాల్స్ లో గ్రోసరీస్ కొనుక్కుని వచ్చాం. ఇంకోరోజు కేంప్ బెల్ లోని గీత నార్తిండియన్ ఫ్రెండ్ ఈరమ్ మీర్ ఇంటికెళ్లి సాయం కాలం వరకూ కబుర్లు చెప్పుకొని వచ్చాం. ఈరమ్ రెండో కొడుకు రెండున్నర ఏళ్లవాడు పాలబుగ్గల్తో, కాటుక కళ్లతో తీర్చిదిద్దినట్టున్న ఐబ్రోస్ తో, సిగ్గులదొంగ చూపుల్తో ఎంతందంగా ఉన్నాడో!

సి.భాస్కర్రావు అనే సాహిత్య ప్రేమికుడొకాయన మొన్నటి సాహిత్య సభ ముగిసేక బైట లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే గీత పలకరించి, ఆయన కూడా మౌంటెన్ వ్యూకే అని తెలిసి కారెక్కించుకుంది. ఆయన, భార్య వారి అబ్బాయి ఇంటికి వచ్చి ఉన్నారు. ఆయన బుక్స్ మీద రివ్యూలు రాస్తారు అని తెలిసి వారింటికెళ్లి  గీత పోయెట్రీ బుక్ ‘శీత సుమాలు’ ఇచ్చి వచ్చాం, మధ్య గేప్స్ లో స్టీవెన్ స్పీల్ బర్గ్ హిట్లర్ పైన తీసిన ‘షండ్లర్స్ లిస్ట్’ వంటి వరల్డ్ బెస్ట్ మూవీస్ ఎన్నో చూసాను. అప్పటికి నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. యూట్యూబ్ అప్పటికి ఉందో, లేదో తెలీదు. కాని, అన్నీ అక్కడి లైబ్రరీస్ నుంచి తెచ్చుకున్న సీడీలలోనివే.

          ఉదయం ఐదుకో, ఆరుకో మెలకువొచ్చి కాస్సేపు కిటికీలోంచి బైటికి చూస్తే స్తబ్ధంగా ఉన్న ప్రకృతి, మౌనంగా తలలు వాల్చి తపోదీక్షలో ఉన్న చెట్లు, తలుపు తెరిచి బాల్కనీలోకెళ్తే లోపలికి తరిమే చలి, రోజులో ఏ సమయంలోనూ లోపలికి రాని శబ్దాలూ, తపస్సు కోసం హిమాలయాల్లో ఉన్నట్టుండేది. నేనొచ్చిన మర్నాడే అట్లాంటా నుంచి నా చిన్ననాటి ఫ్రెండ్ మీనాక్షి, వాళ్లాయన ఫోన్ చేసి మాట్లాడేరు. మా కజిన్ సత్యవతి వాళ్లాయన కొండల్రావు గారు 60 లలో వచ్చి షికాగోలో సెటిలయ్యారు. మీనాక్షి వాళ్లూ ఆరునెలలు ఉండి వెళ్లడానికి వచ్చారు. ఇద్దరూ తరచుగా ఫోన్లు చేసి మాట్లాడుతుండే వారు. ఇక ఇండియాలో ఉన్న స్నేహితులు, బంధువులకు నేనే చేసేదాన్ని, వాళ్లు టైమ్ కన్ఫ్యూజ్ అవుతారని.

          క్రమంగా మంత్స్ నిండడం వల్ల గీతకు నడవడం కష్టంగా ఉండేది. అయినా లైబ్రరీకో, వాల్ మార్ట్ కో, ఇంకేవో షాపింగ్ లకో తీసుకెళ్తూ ఉండేది. ఒకసారి మెక్ డొనాల్డ్స్ లో చికెన్ శాండ్ విచెస్ లాంటి ఇంగ్లీష్ భోజనం తిన్పించేరు. వాళ్లంతా అలాంటివి తినడానికి అప్పటికే అలవాటుపడ్డారు. నాకు మాత్రం ఏమాత్రం రుచించలేదు. అలాంటివి తిన్నప్పుడు కడుపులో తిప్పుతున్నట్టుండేది.

          ఒకరోజు ఉదయం సేన్ హోసే  (San Jose) డౌన్ టౌన్ టెక్ మ్యూజియంలో ఉన్న ఐ మాక్స్ థియేటర్లో HUBBLE – ఆస్ట్రానమీ గురించిన అద్భుతమైన మూవీ చూసాం. ఛెయిర్లో వెనక్కి వాలి గ్లోబ్ స్క్రీన్ మీద చూడడం గొప్ప అనుభూతి, స్పేస్ షటిల్ ట్రైనింగ్, నాసా కేంద్రం నుంచి షటిల్ ఆకాశం లోకి దూసుకెళ్లడం, ఆస్ట్రోనట్స్ స్పేస్ వాక్, రోదసి నుంచి నక్షత్రాలూ, ఇతర గ్రహాలూ ఎలా కన్పిస్తాయో చూడడం చెప్పలేనంత బావుంది. గ్లోబ్ స్క్రీన్ కావడం వల్ల నిజంగా రోదసిలోకి వెళ్లి చూస్తున్న ఫీల్ వచ్చింది. అదయ్యాక అదే బిల్డింగ్ లో ఉన్న టెక్ మ్యూజియం చూసాం. సాయంకాలం 4 కి బైటికొచ్చి ఆ సిటీ మొత్తం తిరిగి చూసాం. నాకు అన్నీ చూపించాలనే గీత తపన నాకర్థమైంది. ఒక రోజు SAN ROMAN లో ఉన్న ప్రఖ్యా మధుబాబు ఆహ్వానం మీద వాళ్లింటికెళ్లేం. మధుబాబు హుషారైన యువకుడు. అతని భార్య పద్మజ కూచిపూడి డేన్సర్, పిల్లలకు నాట్యం నేర్పిస్తుంది. వాళ్లకు ఒక బాబు, పాప ఉన్నారు. చక్కని ఇల్లు, చక్కని కుటుంబం. మధుబాబు నన్ను కథల గురించి, గీతను పొయెట్రీ గురించి ఒక్కొక్కళ్లనీ 30 నిమిషాలు మాట్లాడించి రికార్డు చేసాడు రేడియో కోసం. తర్వాత అది అక్కడి రేడియోలో ప్రసారమైంది. 

          ఇంకో రోజు మధ్యాహ్నం గీత అమెరికన్ ఫ్రెండ్ కేండీ ఇంటికి వెళ్లేం. ఆ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వైఫ్, చక్కని డూప్లెక్స్ హౌస్, ఒక బాబు, పాప పిల్లలు, వాళ్ల ఇల్లు చూసేటప్పుడు వంటింట్లో అసలు వంట చేసేటట్టు కన్పించలేదు. తర్వాత గీత చెప్పింది. ‘వాళ్లు మనలాగా వంటింటికి అంకితమైపోరు. బ్రెడ్డు, ఛీజ్ లాంటివి, టిన్డ్ ఫుడ్స్ తింటారు. దానికి ఓవెన్ చాలు వేడి చేసుకోడానికి అని. మరో స్పేనిష్ ఇంటికి వెళ్లేం. వాళ్ల పేర్లు ఏంటోనియో, అలీషియా. అతి సాధారణమైన,  ఇంకా చెప్పాలంటే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. ఇంట్లో ఆడామగా అందరూ హోటల్ సప్లయర్స్, పెయింటర్స్, గార్డెనర్స్ లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ, రెండు చిన్న చిన్న బెడ్ రూములున్న ఒకే ఇంట్లో అందరూ కలిసి నివసిస్తున్నారు. వాళ్లు చాలా ఆప్యాయత చూపించేరు. గీతంటే చాలా ఇష్టం వాళ్లకి. ఒకటే మాట్లాడడం, ఒకటే క్షేమ సమాచారాలు అడగడం. ఆ పరిసరాల్లో ఉండేటప్పుడు చాలా సాయంచేసేవారట. కారు వరకూ వచ్చి బైబై చెప్పి వెళ్లేరు. వీళ్ల గురించి గీత తన ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథల్లో రాసింది.

          తర్వాత చిన్న చిన్న ట్రక్కులంతేసి ఇళ్లున్న ఓ బుల్లి కాలనీలోకి వెళ్లేం. చాలా తక్కువ ఆదాయం వాళ్లు. సైకిల్, మోటార్ మెకానిక్ లాంటి స్థిరమైన ఆదాయం లేని వాళ్లు. ఆ చిన్న చిన్న ఇళ్లు కూడా బైట పూసిన బోలెడన్ని పూలతో, అతి శుభ్రంగా ఉన్నాయి. ఓ ఇంటావిడని పలకరించేం. ఆవిడ సాదరంగా ఆహ్వానించింది. రెండు మెట్లెక్కితే రెండు గజాలున్న బుల్లి హాలు, చిన్నవంటిల్లు, కేవలం మంచం పట్టేటంత బెడ్ రూం. 2200 డాలర్లకి కొనుక్కున్నారట. స్థలానికి నెలనెలా 900 డాలర్ల రెంట్ కట్టాలట. ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటే ఆ ఇళ్లను యాజిటీజ్ గా ట్రక్ మీద పెట్టుకుని వెళ్లిపోవచ్చట. కొందరు బ్లేక్స్, స్పానిష్ కుటుంబాల వాళ్లు ఉన్నారక్కడ. నాపెళ్లైన కొత్తలో మా అత్తగారి పూరిల్లు దీనికన్నా చిన్నది, అశుభ్రమైనది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.