“నేనూ…. నా నల్లకోటు కథలు” – పుస్తక సమీక్ష

 -డా.మారంరాజు వేంకట మానస

          నల్లకోటునుద్దేశించి వ్రాయాలంటే సరియైన అవగాహనతో పాటు కాసింత ధైర్య సాహసాలు ఉండాలి. అదే స్వయంగా నల్లకోటు వేసుకుని నల్ల కోటునుద్దేశించి వ్రాయాలంటే అవగాహనకు మించి అనుభవాలుండాలి. అనుభవాల దృష్ట్యా సరైన విశ్లేషణ అవసరం. ఇటువంటి ఆలోచనా దృక్పథం ఉన్న అరుదైన రచయితలలో మంగారి రాజేందర్ గారు ఒకరని చెప్పవచ్చు.

          కళ్ళ ముందు జరిగే అనేక సంఘటనలతో ఆందోళన చెంది, జరగవలసిన విధంగా న్యాయం జరగడంలేదని గుర్తించి, ఎవరినీ నొప్పించకుండా జరుగుతున్న వాస్తవాలను సమాజానికి తమ కథల ద్వారా తెలియజేసినారు రచయిత. విస్తృత విషయాలపై కథలు వ్రాసి, నల్ల కోటు కోర్టుకు మాత్రమే కాదు అతి సామాన్యునికి కూడా దగ్గరే అని నిరూపించి నారు. నిర్దోషులకు, నిజాయితీపరులకు న్యాయం జరగకపోతే నల్ల కోటు ఎంత విలవిల లాడుతుందో పాఠకులకు చూపించినారు. అటు ఎవరినీ ఏమీ అనక, ఇటు మౌనంగా ఉండలేక, ఏ విధమైన పలుకుబడి లేని సామాన్యులు నిష్కల్మషంగా న్యాయం కోసం పోరాడితే జరిగేది ఏమిటో తెలిపి తమ కథల ద్వారా మనందరికీ పరోక్షంగా లోతైన సందేశాన్ని అందించారు. ‘ రూల్ ఆఫ్ లా ‘ కి నిర్వచనం నిలకడగా లేకపోయి స్థాయికి తగ్గట్టు మారుతూ ఉండటం, ప్రజాస్వామ్యం ఇచ్చిన రాజుకే మొట్టికాయలు పడటం, తమకు కలిగిన సందేహాలను ప్రశ్నించినా చాలా ప్రశ్నలకు నిర్ధిష్టమైన సమాధానాలు దొరకకపోవడం, ఎవరికి తోచినట్టు వారు చట్టాలతో తొండి ఆటలు ఆడటం, ఇంకా చెబుతూ పోతే మరెన్నో ప్రత్యక్షంగా తారసపడ్డ ఘటనలు రచయితను అంతర్మథనానికి గురిచేసినాయి.

          అసలు ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలో న్యాయస్థానాలు ఎవరికోసం పనిచేయాలి? న్యాయం కోసం పోరాడుతూ ధర్నాలు చేస్తే ఏం జరుగుతుంది? పలు విశ్వవిద్యాలయాలు ఏ నిర్ణాయిక సూత్రాలపై గౌరవ డాక్టరేట్ లను ప్రధానం చేస్తున్నాయి? కింది స్థాయి వారితో పై స్థాయి వారు ఎందుకు అహంభావంతో ప్రవర్తిస్తారు? ఎదుటివాని అవసరాన్ని కనిపెట్టి వాని జుట్టు చేతిలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తారు? యజమాని తన బంటు ఆంజనేయుడిలా ఉండాలని కోరుకుంటాడు కానీ తాను రాముడిలా ఉంటున్నాడా అని ఎందుకు ఆలోచించుకోడు? ఇటువంటి సమాధానం లేని ప్రశ్నలు రచయిత మనసును తలచివేసినాయి. రచయిత తన నిజ జీవితంలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టి వివిధ పై హోదాల్లో సేవనందించినారు. ఎక్కడ ఉన్నా ఏ హోదాలో ఉన్నా నీతిగా, నిజాయితీగా పనిచేసినారు. తాము చూసిన అన్యాయ అవినీతి ఘటనల ఆధారంగా కథలు కవితలు నిక్కచ్చిగా వ్రాసినారు. ఇంత ధైర్యంగా కోర్టులో జరిగే కథలు వ్రాయడానికి కారణం వారికి ఎంతో ఇష్టమైన వారి నల్ల కోటు. ఉదయం లేవగానే దేవునితో పాటు నల్ల కోటుకు కూడా దండం పెట్టుకుంటారు రచయిత. నల్ల కోటు ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ప్రతీక అని వారి భావన. రచయిత ఇష్టపడి వేసుకున్న నల్ల కోటు ఇప్పుడు ” నిన్ను వదిలి పెట్టాను ఓ నా నల్ల కోటూ .. ” అంటూ నిస్సహాయశీలిగా కవితలో చెప్పుకొచ్చిన తీరు పాఠకుల మనసులను చివుక్కుమనిపిస్తున్నది. నల్ల కోటు న్యాయ పోరాటానికి చిహ్నం. ” వచ్చే దాక చదువు, చచ్చే దాక వ్రాయి ” అన్న నానుడిలా ‘ బ్రతికినంత వరకూ నల్ల కోటు వేయి, న్యాయ పోరాటం చేయి ‘ అనేది ప్రతీ ఒక్క న్యాయవాదికి వర్తిస్తుంది. రచయిత మంగారి రాజేందర్ గారు తమ న్యాయవాద వృత్తిలో మళ్ళీ కొనసాగి, న్యాయాన్ని గెలిపిస్తూ తాను గెలవాలని ఆశిస్తూ…

డా. మారంరాజు వేంకట మానస

హైద్రాబాద్

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.