పౌరాణిక గాథలు -26

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ధర్మ ప్రవర్తన – విక్రమార్కుడు కథ

          ఉజ్జయినికి రాజు భర్తృహరి. అతడి తండ్రిపేరు చంద్రగుప్తుడు. అతడి సోదరులు విక్రమార్కుడు, భట్టి, వరరుచి. వీళ్లది బ్రాహ్మణ వంశం.

          భర్తృహరి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. కొంతకాలం రాజ్యపరిపాలన చేశాక భర్తృహరికి రాజ్య పాలన మీద విరక్తి కలిగింది. తన రాజ్యానికి విక్రమార్కుణ్ని రాజుని చేశాడు.

          రాజ్యం వదిలి అడవులకి వెళ్లిపోయాడు. అడవులకి వెడుతూ వెడుతూ తన దగ్గర ఉన్న పండుని విక్రమార్కుడికి ఇచ్చాడు.

          భర్తృహరి ఇచ్చిన పండుని తీసుకున్నాడు విక్రమార్కుడు. దాన్ని అంత జాగ్రత్తగా దాచి తనకి ఇస్తున్నాడు అంటే దాన్లో ఏదో విశేషం ఉండి ఉంటుంది.

          పైగా ఎంత కాలమైనా అది ముగ్గి, కుళ్లిపోకుండా ఉందీ అంటే దానికి చాలా మహత్తు ఉండి ఉంటుంది అనుకున్నాడు. పండుకి ఉన్న విశేషం ఏమిటో చెప్పమని భర్తృహరిని అడిగాడు.

          ఆ పండు ఎవరి దగ్గర ఉంటే వాళ్లకి మరణం గాని, ముసలితనం గాని రావని చెప్పాడు భర్తృహరి. అసలు ఆ పండు భర్తృహరి దగ్గరికి ఎలా వచ్చిందో వివరంగా చెప్పమని అడిగాడు విక్రమార్కుడు.

          భర్తృహరి ఆ పండు తన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పాడు.” “దైవ భక్తి కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. 

          ప్రతి రోజు క్రమం తప్పకుండా దేవిని ఆరాధించేవాడు. అతడి భక్తికి మెచ్చుకుని దేవి అతడికి ఈ పండు ఇచ్చింది.

          ఆ పండు తనకి ఎలా ఉపయోగ పడుతుందో చెప్పమని దేవిని అడిగాడు బ్రాహ్మణుడు. అది అతడి దగ్గర ఉండడం వల్ల అతడికి ముసలితనం, మరణం రావని చెప్పింది.

          పండు తీసుకున్న బ్రాహ్మణుడు అనేక విధాలుగా ఆలోచించాడు. ఆ పండు ఏ విధంగా ఉపయోగపడుతుందో మొదట అర్థం కాలేదు. ఇది తన దగ్గర ఉంటే తనకి ముసలితనం, మరణం రావని చెప్పింది దేవి.

          తనకా సంపదలు లేవు. భిక్షాటన చేసి జీవిస్తున్నాడు. కుటుంబం లేదు కనుక పోషించాలన్న బాధ్యత లేదు.

          ముసలితనం, మరణం లేకపోతే ఇదే విధంగా అడుక్కుంటూనే జీవించాలి. తనకు కావలసింది మోక్షం.

          ఈ పండు మహారాజు దగ్గర ఉంటే అతడు ప్రజల పోషణకి ఉపయోగిస్తాడు అనుకు న్నాడు. అందుకే ఆ బ్రాహ్మణుడు నన్ను కలుసుకుని ఈ పండు గురించి వివరంగా చెప్పి నాకు ఇచ్చాడు”” అని చెప్పాడు.

          బ్రాహ్మణుడు తనకిచ్చిన పండుని ఎవరికిచ్చాడో, ఆ పండు తిరిగి తన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తున్నాడు భర్తృహరి. మహారాజు భర్తృహరికి తన భార్య అంటే చాలా ఇష్టం. తను బ్రతికి ఉండగా భార్య మరణిస్తే  బాధని అతడు భరించలేడు. అందుకని ఆ పండుని తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు.

          భర్తృహరి భార్యకి తమ దగ్గర గుర్రాలు తోలేవాడుగా పనిచేస్తున్న వాడంటే చాలా ఇష్టం. ఆ పండుని తీసుకుని వెళ్లి ఆమె గుర్రాలు తోలేవాడికి ఇచ్చింది.

          గుర్రాలు తోలేవాడికి దాసి అంటే ఇష్టం. అతడు దాన్ని తీసుకుని వెళ్లి తన ప్రియురాలు దాసికి ఇచ్చాడు.

          దాసికి పాలు అమ్ముకునేవాడంటే చాలా ఇష్టం. దాసి ఆ పండుని తీసుకుని వెళ్లి పాలు అమ్ముకునేవాడికి ఇచ్చింది.

          పాలు అమ్ముకునే వాడికి పేడ ఏరుకునే అమ్మాయి అంటే చాలా ఇష్టం. పాలమ్ముకునేవాడు ఆ పండుని తీసుకుని వెళ్లి తనకు ఇష్టమయిన పేడ ఏరుకునే అమ్మాయికి ఇచ్చాడు.

          పేడ ఏరుకునే అమ్మాయి దాన్ని తన తట్టలో వేసుకుని వెడుతుండగా భర్తృహరి చూశాడు.

          ఆ అమ్మాయిని పిలిపించాడు. ఆ పండు గురించి వివరాలు అడిగి తెలుసు కున్నా డు.

          అంతా విని ‘తను భార్య మీద ప్రేమతో ఆమెకు ఇచ్చాడు. చివరికి అది పేడ తట్టలోకి చేరింది’ అని తెలుసుకుని చాలా బాధ పడ్డాడు.

          ఆ పండుని తన సోదరుడు విక్రమార్కుడికి ఇచ్చాడు. బ్రాహ్మణుడు అనుకున్న ట్టుగా అది చేరవలసిన చోటుకే చేరింది.

          భర్తృహరి కోరినట్టే ఉజ్జయినీ రాజ్య భారాన్ని విక్రమార్కుడు అందుకుని ప్రజారంజ కంగా పాలించాడు.  

          ఒకరోజు ఒక వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి..

          ““అయ్యా! నేను ఒక యాగం చెయ్యబోతున్నాను. మీరు నాతో వచ్చి సహాయం చెయ్యాలి”” అన్నాడు.

          విక్రమార్కుడు అతడితో వెళ్లాడు. అతడు విక్రమార్కుణ్ని అడవిలోకి తీసుకుని వెళ్లాడు.

          ఆ వ్యక్తి తనను చంపడానికే తీసుకుని వెళ్లాడని గ్రహించిన విక్రమార్కుడు తనే అతణ్ని చంపేశాడు.

          అదే సమయంలో విక్రమార్కుడికి బేతాళుడితో పరిచయమయింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

          ఒకసారి దేవలోకంలో అప్సరసల నాట్యం చూస్తున్న దేవతలకి ఒక సందేహం కలిగింది. ఊర్వశి చేసే నాట్యం బాగుంటుందా…రంభ చేసే నాట్యం బాగుంటుందా…? అని.

          అందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. విక్రమార్కుడయితే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అనుకున్నారు. ఇంద్రుడు తన రథాన్ని పంపించి విక్రమార్కుణ్ని రప్పించాడు.

          ఊర్వశి రంభల నాట్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి నాట్యం బాగుంటుందో తీర్పు చెప్పమన్నారు.

          విక్రమార్కుడు వాళ్లిద్దరి నాట్యం చూసి, ఊర్వశి నాట్యం బాగుందని చెప్పాడు.

          ఇంద్రుడు మణులతో తయారయిన ముప్పై రెండు సాలభంజికలు కలిగి ఉన్న సింహాసనాన్ని విక్రమార్కుడికి కానుకగా ఇచ్చాడు. ఆ సాలభంజికలే విక్రమార్కుడి గొప్పతనాన్ని గురించి చెప్తుండేవి.

          సాహసంలోగాని, ఉదార స్వభావంలోగాని విక్రమార్కుణ్ని మించినవాళ్లు లేరు. పరులకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడేవాడు.

          శివుడి గురించి తపస్సు చేసి శివుణ్ని మెప్పించాడు. “ శివుడు “విక్రమార్కా! నీకేం కావాలో అడుగు ఇస్తాను.

          మోక్షం కావాలని మాత్రం కోరుకోకు. అది నీకెలాగూ వచ్చేదే కాబట్టి ఇంకేదయినా కోరుకో!”” అన్నాడు.

          విక్రమార్కుడు “ “పరమేశ్వరా! ఏ ప్రదేశంలో అయినా సరే రెండున్నర ఏళ్ళు వయస్సు గల పాపకు ఎప్పుడయితే కొడుకు పుడతాడో అప్పుడు నా అంతట నేను మరణించగలిగే విధంగా వరం ఇయ్యి!” అని అడిగాడు.

          నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి పరమేశ్వరుడు అంతర్థానమయ్యాడు.

          కొంత కాలం గడిచింది. ఒక ఊళ్లో కుంభాకారుడు అనే పేరు గల వ్యక్తికి రెండున్నర సంవత్సరాల పాప ఉండేది.

          ఆ పాపకు ఒక కొడుకు పుట్టాడు. ఆ సమయంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ విధంగా పుట్టినవాడే శాలివాహనుడుగా ప్రసిద్ధికెక్కాడు.

          ఆ విషయం తెలిసిన విక్రమార్కుడు భేతాళుణ్ని పిలిచి కుంభాకారుడు ఏ ఊళ్లో ఉన్నాడో తెలుసుకుని రమ్మని పంపించాడు.

          భేతాళుడు బయలుదేరి వెళ్లగానే ఖడ్గంతో పొడుచుకుని తన ఇష్ట ప్రకారమే మరణించాడు.

          తరువాత ఆ రాజ్యాన్ని ఏలడానికి విక్రమార్కుడితో సమానమైన రాజు దొరకలేదు.

          సరయిన రాజు దొరికేదాకా విక్రమార్కుడి మరణం గురించి ఎవరికీ తెలియకుండా ఉంచాలని మంత్రులు నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు సింహాసనం ఖాళీగా ఉంచారు.

          తరువాత విక్రమార్కుడి సింహాసనం భోజరాజు అధీనంలోకి వెళ్లింది. విక్రమార్కుడి తో సమానమైన గుణవంతుడు, పరాక్రమశాలి, దైవభక్తుడు, ధర్మప్రవర్తన కలవాడు అయిన మరొక రాజు లేడు అనిపించుకునేంత గొప్పవాడుగా జీవించాడు విక్రమార్కుడు.

          అతడి పరాక్రమం గురించి మనుషులే కాదు బొమ్మలు కూడా పొగిడాయి.

ధర్మప్రవర్తన ఉంటే దేవతలకి కూడా ఆత్మీయులవుతారు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.