మౌన సాక్షి (కవిత)

-వి.విజయకుమార్

ఎన్ని చేదు జ్ఞాపకాల
మౌనసాక్షివి నీవు
ఎన్ని సంతోషాల
నిశ్శబ్ద మౌనివి నీవు

నాలుగు దశాబ్దాల
జీవితపు ఆనవాలు నువ్వు
మాకు బతుకు నిచ్చిన
జన్మవి నువ్వు
నీడ నిచ్చిన జననివి నువ్వు

మా సంతోషాల్నీ
దుఃఖాల్నీ మాతో పాటూ
పంచుకొని
గుండెల్లో దాచుకున్న
బంగారు తల్లివి నువ్వు

రెక్కలొచ్చి
ఎగిరిపోయాక
మిగిలి
ప్రిదిలిన పక్షి గూడులా
బావురు మంటూ
ఎంత హృదయ విదారకంగా
ఉన్నావిప్పుడు

ఒకనాడు నీ లోగిల్లో
వెల్లి విరిసిన
చిరునవ్వుల రవళులెక్కడ
విరబూసిన రోజా పువ్వు లెక్కడ
ఎర్ర గోరింట లెక్కడ
బిళ్ళ గన్నేరు లెక్కడ
బంగాళా బంతులెక్కడ
చిట్టి చేమంతుల
సౌరభాలెక్కడ

వెన్నెల
ముంగిట్లో
ఈతాకు చాప మీద
నానమ్మ చెప్పిన
జడ భరతుడేడీ
ఇంతీ చామంతీ పూబంతీ
ఎటెళ్లి పోయారు

కథలన్నీ
కంచికి పోయాయ్
పూసిన పూలన్నీ
వాడి పోయాయ్
పచ్చ తోరణాల
లోగిలి కాస్తా
పిచ్చి మొక్కలతో
మరు భూమిని
తలపిస్తోందిప్పుడు

అమ్మ చల్లిన
కళ్ళాపి చప్పుళ్ల ధ్వనులిప్పుడు
ఒక పురా జ్ఞాపకం
వాకిట్లో నానమ్మ గీసిన
రథం ముగ్గు
ఒక ధవళ వర్ణ స్మృతి
నాన్న మోసిన నీళ్ళ కావిడిలో
ఒలికిన నీటితడి
నా కన్నీటి జడి

కడివెడు కన్నీళ్లు
నింపుకుని
పుట్టెడు దుఃఖాల్ని
పులుముకున్న
చెమ్మెక్కిన నీ గోడలపై
అప్యాయంగా నిమిరే
హస్తాలు
ఇక మృగ జలాలు

ఇల్లంటే ఇటుకలూ
కాంక్రీటు కాదనీ
నీనుంచి వేరై పోయిన
గుండె ఘోషలు
నింపుకున్న ఆనవాళ్ళనీ
తెలిసీ యేం
చేయలేని వాళ్ళం

క్షమించు తల్లీ
నిన్నిలా ఒంటరిగా
విడిచి వెళ్లిపోయినందుకు
సుఖ దుఃఖాల
వైకుంఠ పాళీలో
తలో చోటికి
విసిరేయ బడ్డాం
పరమ పద సోపాన పటంలో
బతుకుబాట
వెతుక్కుంటూ
నిష్క్ర మించాం
కొందరు శాశ్వితంగా
కొందరం వేచి చూస్తూ
నిలబడేది నువ్వే
అన్నిటికీ
మౌన సాక్షిగా

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.