యాత్రాగీతం
హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (భాగం-5)
-డా||కె.గీత
మర్నాడు మావీ నించి బయలుదేరి ఒవాహూ ద్వీపానికి మా ప్రయాణం. మధ్యాహ్నం రెండుగంటలకు మా ఫ్లైట్ అయినా నేను చక్రాల కుర్చీలో ఉండడంతో ఎయిర్ పోర్టుకి ముందుగా వెళ్లాల్సి వచ్చింది. పదిన్నరకల్లా రిసార్ట్ నించి బయలుదేరి మావీ ద్వీపానికి సెలవు తీసుకుని పదకొండున్నర కల్లా ఎయిర్ పోర్టుకి చేరాం. ఎయిర్ పోర్టు దగ్గిర దిగి, చక్రాల కుర్చీ కోసం రిక్వెస్టు చేసినా కుర్చీలు ఖాళీ లేవని ఎయిర్పోర్టు బయటే అరగంటసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది.
మొత్తానికి కుర్చీ దొరికినా తోసేవాళ్ళు దొరకక చెకిన్ అయ్యేవరకు పిల్లలే సాయం చెయ్యాల్సి వచ్చింది.
అయితే అదృష్టం కొద్దీ ఫ్లైట్ ఎక్కే ముందు అసిస్టెన్స్ దొరికింది. ఫ్లైట్ గుమ్మం వరకూ ఒక కుర్చిలోనూ, అక్కణ్ణించి మరొక చిన్న కుర్చీలోనూ తీసుకెళ్లి, సీటులో కూర్చోబెట్టారు. జీవితంలో మొదటిసారి ఫ్లైట్ సీట్ వరకు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. మావీలో మా ఇన్సూరెన్సు ఉన్న ఆసుపత్రి లేనందున అప్పటివరకు పెయిన్ కిల్లర్స్ తో సొంత వైద్యం చేస్తూ వచ్చాను. విమానం గాల్లోకి ఎగరగానే అంతులేని బాధ కలిగింది. అది నడవలేక కలిగిన బాధ కాదు. మావీ ద్వీపాన్ని చుట్టి చూడలేక పోయిన బాధ. “నిన్ను చూడడానికి మళ్ళీ ఓ రోజు వస్తాను మావీ ద్వీపమా” అని నాలో నేనే చెప్పుకున్నాను.
గంటలో హనోలూలూ చేరాం. ఈ సారి పెద్ద కారు దొరక్క, రెండు చిన్న కార్లు తీసుకున్నాం. హోటలుకు చేరగానే పిల్లల్ని హోటల్లో వదిలి సత్య, నేను తిన్నగా ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ రాత్రి వరకు అర్జెంట్ కేర్ లో ఉండి వైద్య సహాయం తీసుకున్నాను. ప్రాథమిక టెస్టులు పూర్తయ్యాక, సయాటికా నర్వ్ ప్రాబ్లమ్ లాగా ఉంది అంటూ హెవీ పెయిన్ కిల్లర్స్ రాసిచ్చారు. మిగతా టెస్టులు చేయించుకునేందుకు వరసగా అపాయింట్మెంటులు తీసుకోవాలి. ఇక రెండు రోజుల్లో మేం మా ఊరు తిరిగి వెళ్లిపోతాం కాబట్టి హవాయీలో ఇక అపాయింట్మెంటులు వద్దని, మా ఊరు చేరాక అవన్నీ చేద్దామని నిర్ణయించుకున్నాను. అదీగాక ఉన్న రెండురోజులు నేను ఆసుపత్రి చుట్టూ తిరిగితే ముందుగా బుక్ చేసుకున్న ప్రోగ్రాములన్నీ మార్చాల్సి వస్తుంది. ఇక పిల్లలు బాగా డీలా పడిపోతారని మళ్ళీ ఏదో రకంగా ఓపిక తెచ్చుకుని తిరగడానికే సిద్ధమయ్యాను నేను. అయితే అదృష్టం కొద్దీ కొత్త మందులు కాస్త వెంటనే పనిచెయ్యడం మొదలు పెట్టాయి.
హవాయీ ప్రధానకేంద్రమైన హనాలూలూ నగరం ఒవాహూ ద్వీపంలో ఉంటుంది. ఈ ద్వీపం గురించి ఇంతకు ముందు బిగ్ ఐలాండ్ ట్రిప్పులో చెప్పుకున్నాం కదా!
మేం ఒకసారి చూసేసిన విశేషాలు మళ్ళీ చూడకుండా ఈ సారి కొత్తవి బుక్ చేసు కున్నాం. అయితే పెరల్ హార్బర్, హనౌమా బీచ్ వంటివి తప్పనిసరిగా చూడాల్సినవి కాబట్టి సమయం ఉంటే మరోసారి చూద్దామనుకున్నాం.
హనాలూలూలో సముద్ర తీరంలోని ప్రసిద్ధ వైకికీ ప్రాంతంలో హయత్ రీజెన్సీ హోటల్ తీసుకున్నాం. హోటల్ నలభై అంతస్తులతో మంచి సౌకర్యవంతంగా ఉన్న హై ఎండ్ హోటలైనా పార్కింగు మాత్రం రోడ్డుకావల పదంతస్తులతో అతి తక్కువ వెడల్పులో అసౌకర్యంగా ఉంది. అందువల్ల మాకు నష్టం కూడా వాటిల్లింది.
ఇక వెళ్లిన రోజు రాత్రి భోజనాల సమయానికి అలిసిపోయినట్లయినా, అన్నీ రెండడుగుల్లోనే ఉండడం వల్ల పక్కనే ఉన్న రెస్టారెంటులోకెళ్ళి సాండ్ విచ్ లు తినొచ్చాము. భోజనాలయ్యాకా ఇక మర్నాడు పొద్దున్నే లేవాల్సి ఉండడంతో త్వరగా నిద్రకుపక్రమించాం.
మర్నాడు వైకికీ నించి ఓ గంట దూరంలో ద్వీపానికి అవతలి తీరంలో ఉన్న కువాలువా రాంచ్ (Kualoa Ranch) లో జురాసిక్ టూరు కి పొద్దుటే తొమ్మిదికల్లా బయలు దేరి వెళ్లాం. రెండున్నర గంటల టూరుకి మనిషికి $150 డాలర్లు టిక్కెట్టు. నాలుగువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కువాలువా రాంచ్ లోనే జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్, జూమాంజీ, కింగ్ కాంగ్ , జర్నీ, లాస్ట్, పెరల్ హార్బర్ వంటి వెన్నో ప్రసిద్ధ సినిమాలు తీశారు.
కారు పార్కింగు నించి గేటు లోపలికి కొంతదూరం నడిచి వెళ్ళాలి. అక్కడ ఉన్న వెయిటింగ్ ఏరియా నించి టూరుని బట్టి బస్సుల్లో, వ్యానుల్లో, జీపుల్లో, గుర్రాల మీద ఎక్కించుకుని వెళ్తారు. మొత్తానికి పదిన్నర ప్రాంతంలో మా టూరు బస్సు కదిలింది. ఈ రాంచ్ కువాలువా పర్వత సానువుల్లో ఉంది. ఇందులో ప్రధానంగా కావా, కువాలువా, హాకీపు అనే మూడు లోయలు ఉన్నాయి.
ఎత్తైన వృక్షాలు లేని పచ్చని గడ్డి లోయల్లో ఎటు చూసినా సుదూర తీరాలు కనిపిస్తూ అందంగా ఉంది ఈ ప్రదేశం. దారంతా అక్కడక్కడా ఉన్న బోర్డుల మీద అక్కడ ఏ సినిమా తీశారో రాసి ఉంది. నిజానికి ఆ సినిమా చూసినా, గ్రాఫిక్స్ వల్ల అక్కడే తీసారని కూడా తెలియదు మనకి. పర్వతాన్ని అధిరోహించాకా వచ్చిన టన్నెల్ లోపలికి నడవడానికి అంతా దిగేరు. ఎత్తైన బస్సు ఎక్కడమే కష్టమైన నేను, సిరితో బాటూ బస్సులోనే ఉండిపోయాను టూరు మొత్తం.
ఇంతకీ ఆ టన్నెల్ లోపల అక్కడ తీసిన సినిమాల సెట్టింగులలో చిన్న చిన్న భాగాల్ని ప్రదర్శనకి ఉంచారు.
ఇక దార్లో రొయ్యల చెరువులు చూపించారు. వెచ్చని వాతావరణం, అరటి తోటలు, దేవగన్నేరు పూలు, ఆకు పచ్చని సతత హరిత వనాలతో నిండిన హవాయిని చూసినప్పు డల్లా ఇండియా గుర్తుకు వస్తుంది. కాదు కాదు, ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకో ఏమో, ఏమీ చెయ్యకపోయినా హవాయి వెళ్లిరావడం అంటే తెలియని సంతోషం కలుగుతుంది నాకు.
చివరగా జురాసిక్ లోయకి చేరాం. అక్కడా అదే పరిస్థితి. ఎకరానికో సినిమా బోర్డు ఉంది.
అక్కడక్కడా ప్రసిద్ధి గాంచిన సినిమా విశేషాల ప్రదర్శన్లున్నాయి. ఒక చోట ఈస్టర్ ఐలాండ్ కు డాక్యుమెంటరీ తీసిన చోట అటువంటి నమూనా విగ్రహం ఉండగా, మరోచోట కాంగ్ స్కల్ ఐలాండ్ అనే సినిమాకు చెందిన అవశేషాల నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ బస్సుని ఆపి చుట్టూ ఉన్న పెద్ద అస్తిపంజరపు అవశేషాలతో ఫోటోలు తీసుకోనిస్తున్నారు. ఈ సారి సిరి కూడా అందరితో బాటూ దిగి వెళ్ళింది. పైగా భయపడ కుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక నేను బస్సులో కూర్చుని కనిపించినంతమేరకు చుట్టుపక్కలా, వీళ్లందరినీ ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆనందించాను. పిల్లలు సంతోషంగా ఆనందిస్తూ ఉంటే నేను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నానన్న లోటు తీరింది నాకు. వాళ్ళ నవ్వు ముఖాలు చూస్తూ ఉంటే, నేను కూడా వాళ్ళతో బాటూ అన్నీ కలయ దిరుగుతూ చూస్తున్న సంతృప్తి కలిగింది.
పర్వతాన్ని చుట్టి తిరిగి వెనక్కి వస్తున్నపుడు విశాల సముద్రంలో చేతికందే దూరంలో కనిపిస్తున్న చిన్న ఒంటరి ద్వీపం మకోలీ కూడా ఈ రాంచ్ కే చెందినదని చెప్పేడు గైడు.
మొత్తానికి ఈ టూరుకి పెట్టిన డబ్బులకి అంత గొప్పగా ఏం లేదనిపించింది. గిఫ్ట్ షాపు కూడా పెద్ద పెద్ద మెట్ల పైన ఉండడంతో పిల్లలు మాత్రమే వెళ్లి ఏవో కొనుక్కొ చ్చారు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అక్కణ్ణించి బయటికొచ్చాము. రోజంతా సన్నగా వర్షం పడుతూ ఉన్న ఆహ్లాదంగా ఉంది. దార్లోనే కనిపించినవేవో కొనుక్కుని తిన్నాం. ముఖ్యంగా ఎక్కడికక్కడ అమ్మే తియ్యని పైనాపిల్ పళ్ళు తప్పనిసరిగా తిని తీరాల్సిందే.
ఈ దీవుల్లో లేత కొబ్బరి, అనాస పళ్ళు కలిపి తింటూ ఉండడం విశేషం.
హోటలుకి వస్తూనే గంటలో తయారయ్యి సాయంత్రం బుక్ చేసుకున్నచెఫ్స్ లావూ (Chief’s Luau) అనే ట్రెడిషనల్ డిన్నర్ కి బయలుదేరాం. హవాయి సంప్రదాయ నృత్య ప్రదర్శన, భోజనం కలిపిన ఆ ఈవెంటుకి టిక్కెట్టు మనిషికి $175 డాలర్లు.
నాకు బాగాలేకపోయేసరికి, బాగా ఖరీదైనవెన్నో ఇలా ఒకదానిమీదొకటి ముందే బుక్ చేసుకుని వెళ్లాల్సి వస్తున్నందుకు సత్య బాగా బాధ పడ్డాడు.
అది ఎకరాల మేర విస్తరించి ఉన్న పెద్ద ప్రదేశం కావడంతో కారు పార్కింగు నించి నాకోసం వీల్ ఛెయిర్ తీసుకున్నాం. వాటర్ పార్క్ వంటి ఇతర ఎట్రాక్షన్లు కూడా ఉన్న థీమ్ పార్క్ అది.
చుట్టూ కొబ్బరి చెట్లు నాటిన పెద్ద ఆవరణలో ఓ మూలగా ఉన్న జలపాతాన్ని పోలిన స్టేజీ చుట్టూ కూర్చునేందుకు వందలాది టేబుళ్లు, కుర్చీలు వరుసల్లో వేశారు. ఎంతో ఖరీదైనదైనా ఎక్కడా ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేనంత మంది జనం ఉన్నారు. ఎదురొచ్చి పెద్ద పెద్ద పూసల దండలు వేసి, తలలకు కొబ్బరాకుల కిరీటాల వంటివి తగిలించారు. మాకు నిర్దేశించిన ప్రదేశంలో కూర్చుని బఫే డిన్నరు తెచ్చుకుని, విందారగిస్తూ వినోద కార్యక్రమాల్ని తిలకించాం. భోజనంలో నూడుల్స్, రైస్, మాంస విశేషాలు, సలాడ్, బ్రెడ్, కేకువంటివి, తాగేందుకు జ్యూస్, నీళ్ల వంటివి తప్ప మిగతావేవైనా మళ్ళీ కొనుక్కోవ ల్సిందే.
స్టేజీ మీద అందరినీ నవ్విస్తూ కొబ్బరాకులతో బుట్టలు అల్లడం దగ్గరనించి, సంప్రదాయ వేట వరకు ఎన్నో విశేషాల్ని ప్రదర్శించారు. రంగురంగుల దుస్తుల్లో నృత్యాలు చేసి, స్థానిక సంస్కృతిని ప్రతిబింబింపజేసారు. చీకటి పడిన తరువాత ఫైర్ డాన్స్ తో కార్యక్రమాన్ని ముగించగానే, వచ్చిన అందరితో నృత్యం చేయించారు.
వినోద కార్యక్రమం బానే ఉన్నా భోజనం అస్సలు నచ్చలేదు ఎవరికీ. ఆ మాత్రం భోజనానికి అంత ఖరీదు చెల్లించాల్సిన అవసరం లేదనిపించింది. పిల్లలు ఏవీ తినలేక బ్రెడ్లు, కేకు ముక్కలు తిన్నారు.
అక్కణ్ణించి తిరిగి వస్తూనే హోటలు కారు పార్కింగులో మేం తీసుకున్న రెండు కార్లలో ఒకటి సత్య రివర్స్ చెయ్యబోతూ గోడకి గుద్దడం వల్ల వెనక అద్దం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇన్సూరెన్సు పోగా మొత్తానికి దానికి వెయ్యిడాలర్ల వరకు చెల్లించవలసి వచ్చింది. ఆ ప్రయాణంలో రెండవ అపశృతి అది.
*****
(సశేషం)