![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Sandeep-Tomar-e1739038179886.jpg)
రాంగ్ నంబర్
रांग नंबर
హిందీ మూలం – డా. సందీప్ తోమర్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
రుచి స్నేహితురాలు దివ్య బ్రిటన్ నుంచి తిరిగివచ్చినప్పటి నుంచి రుచిని కలుసుకునేందుకు ఆరాటపడుతోంది. రుచి ఫోన్ లో తనకి పెళ్ళి కుదిరిందన్న విషయం ఆమెతో షేర్ చెయ్యడమే ఆ ఆరాటానికి కారణం. రుచికి తన మనస్సులోని ప్రతి విషయాన్ని పంచుకోవడానికి తనకి ఉన్న ఒకే ఒక బాల్యమిత్రురాలు దివ్య. రుచి కూడా అందుకనే దివ్యని కలుసుకునేందుకు తొందరపడుతోంది. దివ్యకి పెళ్ళి అయినప్పుడు తనుమాత్రం ఆ పెళ్ళికి ఎక్కడ వెళ్ళగలిగింది. అప్పుడు తన పిహెచ్-డి కి వైవా జరుగుతున్న కారణంగా వెళ్ళలేకపోయింది. ఒకపక్క జీవితంలో తన చదువుకి ఆఖరి మజిలీ అయితే మరోపక్క తన నెచ్చెలికి పెళ్ళి. ఆ సమయంలో రుచికి చాలా బాధ కలిగింది. కానుక తప్పకుండా తను పంపించింది. కాని తన మనస్సు మాత్రం తన ప్రియసఖి పెళ్ళిగురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. పెళ్ళికాగానే దివ్య భర్త ఆమెని బ్రిటన్ కి తీసుకువెళ్ళిపోయాడు. నిజానికి అతను బ్రిటన్ లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యలో వీసా గురించిన పనిమీద దివ్య ఒకసారి తిరిగివచ్చిందికూడా. కాని సమయం తక్కువగా ఉండటంవల్లనూ, అత్తవారింట్లో పనులవత్తిడి కారణంగానూ రుచిని కలుసుకోవడం వీలు పడలేదు.
ఈ మధ్యకాలంలో రుచికి పిహెచ్-డి రిజల్టు కూడా వెలువడింది. తను కొన్నిచోట్లకి అప్లై చెయ్యడం కూడా మొదలుపెట్టింది. ఇంకా జాబ్ దొరికే అవకాశం లభించలేదు. కొంచెం ఇబ్బంది అనిపించినా, రుచి అధైర్య పడలేదు. అదీకాక, రుచి రచనావ్యాసంగం కూడా బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఒక మంచి రచయిత్రిగా ఆమె గుర్తింపు పొందసాగింది. సాహిత్యంలోని ఏ ప్రక్రియనూ తను విడిచిపెట్టలేదు. కవిత్వమైనా, కథాసాహిత్యమైనా ఇంచుమించు ప్రతి ప్రక్రియనూ, ప్రతి పోకడనూ తను క్షుణ్ణంగా అర్థం చేసుకుంది. పిహెచ్-డి కి తను తీసుకున్న సబ్జక్టు కూడా చాలా ప్రత్యేకమైనది- “నవలాసాహిత్యంలో విద్యావిషయకమైన చింతనపై విస్తృత పరిశీలన”. వ్యాసాలు కూడా తను సమకాలిక విషయాల మీద రాస్తూ ఉంటుంది. వాటి గురించి సమీక్షకులు, విమర్శకులు బాగా చర్చిస్తూ ఉంటారు. ప్రముఖ పత్రికల్లో తన రచనలు ప్రచురించబడినప్పుడు తనకు చెప్పరాని ఆనందం కలుగుతుంది.
నాన్నగారికి తన పెళ్ళి గురించిన చింత ఉంటే, రుచికి తనకో ఉద్యోగం గురించిన ఆలోచన. ఒకపక్క రుచి తన రచనావ్యాసంగంలో పురోగమిస్తోంది. వేరు-వేరు సంస్థల నుండి ఆమెకి ఆహ్వానాలు వస్తున్నాయి. అభ్యుదయ భావాలు ఉన్న నాన్నగారు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిరావడానికి తనకి ఏ విధంగానూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు రుచి సాహితీప్రపంచంలో తనకి ఒక ప్రసిద్ధిగాంచిన పేరు సంపాదించుకుంది.
పొద్దున్నే దివ్య నుంచి ఫోన్ వచ్చింది- “హలో! రుచీ, ఎక్కడున్నావు నువ్వు?”
“ఇంట్లోనే ఉన్నాను. బ్రిటన్ నుంచి వచ్చేశావా, కలుసుకునేందుకు వస్తున్నావా లేకపోతే ఇప్పుడు కూడా…”
“అవును. వస్తున్నానే బాబూ కలుసుకునేందుకు. మనం కలుసుకుని చాలా రోజులయింది. నీతో షేర్ చేసుకునేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయి. నువ్వు కూడా షేర్ చెయ్యవలసింది ఎంతో ఉంది కదా.”
“అవునే. ఇంక నువ్వు తొందరగా గాలిలో తేలిపోతూ వచ్చేసెయ్.”
“వచ్చేస్తాను. బండి డ్రైవ్ చెయ్యడానికి, నీ దగ్గరికి చేరుకునేందుకు పట్టే సమయమే నువ్వు ఎదురు చూడాల్సి ఉంటుంది.” ఈ మాట చెప్పి దివ్య ఫోన్ పెట్టేసింది.
రుచి దివ్యకోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఆమె డ్రాయింగ్ రూంలో నుంచి తన గదిలోకి వచ్చింది. అక్కడికి రాగానే ఆమెని వ్యాకులత చుట్టుముట్టింది. తను వెనకటి జ్ఞాపకాలలో మునిగిపోయింది.
నాన్నగారు ఇంటికి రాగానే రూపేష్ కుటుంబం ఇండోర్ నుంచి పాట్నా వస్తోందని చెప్పారు. ఆ రోజు సాయంత్రం వాళ్లు రుచిని చూడటానికి తమ ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి రుచి గనుక నచ్చితే ఆ సంవత్సరమే పెళ్ళి చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రుచిని కలుసుకుని చూస్తే చాలు.
రూపేష్, అతని కుటుంబం సాయంత్రం ఇంచుమించు అయిదుగంటలకి రుచిని చూడటానికి పటేల్ నగర్ లో ఉన్న ఫ్లాట్ కి చేరుకున్నారు. వాళ్ళ ఫ్లాట్ మొదటి అంతస్తు లోనే ఉంది. లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్. దానితోపాటే డైనింగ్ హాలు. దాన్ని ఆనుకునే ఉంది ఒక గదిలాంటి కిచెన్. కిచెన్ కి రెండు పక్కలా రెండు బెడ్ రూంలు. ఒక బెడ్ రూం రుచి కోసం. రెండోది అమ్మ, నాన్నగారికోసం. ఈ ఆధునిక యుగంలో కూడా రుచి తన తల్లిదండ్రులని మమ్మా-పాపా అనో లేకపోతే డాడీ-మామ్ అనో అనలేదు.
రుచి ఆ కుటుంబంలో ఒకే ఒక సంతానం. స్నేహపూర్వకంగా మాట్లాడుకునేందుకు, మనస్సులోని మాట చెప్పుకునేందుకు తనకి అక్క-చెల్లెళ్లుగాని, అన్నదమ్ములు గాని ఎవరూ లేరు. రుచి ఎన్నోసార్లు తను ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక క్లాస్ మేట్ తనని దారిలో ఆపుజేసి తనని విసిగించడం మొదలుపెట్టాడు. అప్పుడుకూడా తనకి ఎవరైనా అన్నయ్యకాని అక్కయ్య కాని ఉంటే ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో తప్పకుండా సాయం దొరికేదని తనకి చాలా అనిపించింది. ఎన్నిరోజులో ఆ బాధని సహించుకుంటూ ఉందే కాని ఆ సమయంలో అమ్మకి, నాన్నగారికి చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఇంక నీళ్ళు తలకంటా పైకి వచ్చి తను వరుసగా కాలేజీకి సెలవు పెట్టుకున్నప్పుడు నాన్నగారు అడిగారు- “ఏమ్మా, కాలేజీకి ఇప్పుడు సెలవులా లేకపోతే నీకు ఒంట్లో బాగుండలేదా?”
రుచికి ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. వెక్కుతూనే ఉన్న విషయం అంతా చెప్పేసింది. అప్పుడు నాన్నగారు స్వయంగా కూతురితోపాటు కాలేజీకి వెళ్ళారు. ఆ అబ్పాయికి బాగా బుద్ధిచెప్పి, హితోపదేశం చేసి ఆ తరువాత రుచితో అన్నారు- “రుచి తల్లీ, ఇక్కడ పరిస్థితులతో యుద్ధం స్వయంగానే చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు డిగ్రీ చేస్తున్నావు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ధైర్యం తెచ్చుకుంటావు? ఎప్పుడు బోల్డ్ అవుతావు?”
ఆ రోజునే రుచి జీవితంలో తను నిస్సహాయంగా ఉన్నట్లుగా భావించే అటువంటి రోజు మళ్ళీ ఎప్పుడూ రానివ్వకూడదని, ఈ విధంగా నాన్నగారి సహాయం ఆశించే అవసరం ఎప్పుడూ ఉండకూడదని నిర్ణయించుకుంది.
రూపేష్, అతని కుటుంబం రాగానే వాళ్ళని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టారు. నాన్నగారు ఆధునిక భావాలు ఉన్న వ్యక్తి కనుక ఆయన రుచిని పిలిచారు. రుచి లోపలినుంచి రాగానే ఆయన పరిచయం చేస్తూ అన్నారు- “కూర్చోమ్మా రుచీ, చూడు ఇతను రూపేష్. వీరు ఇతని మమ్మీ-పాపా. ఈమె రూపేష్ కి చెల్లెలు విజయ.”
రూపేష్ తండ్రిగారు అన్నారు- “మీరు కూడా ఏమిటి హరిమోహన్ గారూ, ఇంతగా ఫార్మాలిటీ చూపిస్తున్నారు. రుచి ఇంత చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి మన రెండు కుటుంబాలూ అరమరికలు లేకుండా కలుసుకుంటూ ఉన్నాం. కాని రూపేష్, రుచి మాత్రమే ఎప్పుడూ కలుసుకోలేదు.”
రుచి గమనించింది. రూపేష్ ముఖం ఆకర్షణీయంగా ఉంది. చామనచాయ. చురుకైన కన్ను-ముక్కు తీరు. పొడవైన, ఉంగరాల జుట్టుతో ఉన్న హెయిర్ స్టైలు. తనకి కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇటువంటి రూపాన్నే తను ఊహించుకొని ఉంది. తెల్లని శరీరవర్ణం ఉన్న అబ్బాయిలు ఎందుకనో తనకి ఎప్పుడూ నచ్చలేదు. అబ్బాయి లకి గోధుమవర్ణం లేదా చామనచాయ ఎంతో చూడముచ్చటగా ఉంటుందని తనకి అనిపిస్తుంది. ఒక చూపులోనే తనకి రూపేష్ నచ్చాడు. అతని కళ్ళని చూసి రుచి ఒక విధంగా పరవశమైపోయింది. అతని కళ్ళలో రుచికి ఒక ఆత్మవిశ్వాసం, ఒక విధమైన నిష్కాపట్యం కనిపించింది. సరళత గోచరించింది. అదేకాక, రుచికి రూపేష్ లో ఒక ప్రశాంత గంభీరమైన వ్యక్తిత్వం తారసిల్లింది.
అతనే తన జీవితభాగస్వామిగా లభించాలని తను మనస్సులోనే నిర్ణయించు కుంది.
“అమ్మా రుచీ, పనివాడు ఇక్కడ చాయ్ పెట్టి వెళ్ళాడు. కప్పుల్లో పోసి సర్వ్ చెయ్యి.” రుచి పరధ్యానాన్ని భంగం చేస్తూ నాన్నగారు అన్నారు.
రుచి ఒక్క క్షణం సిగ్గుకి లోనయింది. “అఁ…అలాగే నాన్నగారూ…” అంతే అనగలిగింది.
అందరూ ఒక్కసారి పగలబడి నవ్వేసరికి తనకి కాస్త పరిస్థితి అర్ధం అయింది. రూపేష్ కూడా తన పరధ్యానం వెల్లడి అవడం చూసి నవ్వుతున్నాడా అన్నది తెలుసుకో వాలని రుచికి అనిపించింది. రూపేష్ ముఖం చూసి అతను శాంతంగా ఉండటం గమనించి తనకి కాస్త సంతృప్తి కలిగింది.
చాయ్ సేవించడం పూర్తి అయాక నాన్నగారు అన్నారు- “అవును రుచీ, వెళ్ళి రూపేష్ కి నీ గది చూపించు.”
రుచి కేవలం “అలాగే నాన్నగారూ” అని మాత్రం అంది. రూపేష్ ని లేవమన్నట్లుగా సంజ్ఞ చేసి తను సోఫాలోంచి లేచి నిలబడింది.
రూపేష్ రుచి వెనుకగా నడిచాడు. లోపలికి ప్రవేశించాక అతని దృష్టి పుస్తకాల ర్యాక్ మీద నిలిచింది. అప్రయత్నంగానే అతని నోట్లోంచి వెలువడింది- “చదివేశావా ఈ పుస్తకాలన్నీ?”
“మొత్తం చదివేశాను. అందుకే ఇక్కడ పెట్టాను.”
రూపేష్ ఒక్కక్షణం నిరుత్తరుడయ్యాడు. తరువాత ఏం మాట్లాడాలన్నది అతనికి స్ఫురించలేదు. రుచి గది అంతా చాలా జాగ్రత్తగా సర్ది ఉంది. ఒక గోడకి గిటార్ తగిలించి ఉంది. మరో గోడమీద చేత్తో వేసిన పెయింటింగ్ కనిపిస్తోంది. ఈ పెయింటింగ్ తప్పకుండా రుచి స్వయంగానే వేసిఉంటుందని రూపేష్ అనుకున్నాడు. ఈ సంగతి అడగాలని అనిపించినా, ఇప్పుడింక అడగటానికి ధైర్యం చాలలేదు.
“కూర్చోండి రూపేష్ బాబూ”– రుచి అంది.
“సరే!” అని రూపేష్ గదిలో నాలుగువైపులా పరికించాడు. బెడ్ తో పాటు ఒక ఈజీ చెయిర్, అదికాక ఒక చిన్న రీడింగ్ టేబిల్ తో పాటు చెక్కతో చేసిన ఆకర్షణీయమైన కుర్చీ ఉంది. అతను కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
ఇద్దరూ పరస్పరం పుట్టినరోజులతో మొదలుపెట్టి, హాబీలు మొదలైన చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. సాహిత్యం, రాజకీయాలు, సినిమా పరిశ్రమ, వగైరా అన్ని విషయాల మీద మాట్లాడుకున్నారు. కొన్ని క్షణాలకే, అప్పుడే మొదటిసారి కలుసుకుంటున్నామనీ, పెళ్ళి విషయంలో ఒకరికొకరు ఇష్టాయిష్టాలు తెలుసుకునేం దుకు ఎదురుగా కూర్చున్నామనీ వాళ్ళకి అనిపించలేదు. రూపేష్ తన అభిరుచులను తెలియపరిచాడు. రుచి కూడా తన ఆలోచనలను వెల్లడించింది.
రుచి మాట్లాడే పద్ధతి, సాహిత్యం గురించిన అవగాహన చూసి రూపేష్ ఆశ్చర్యానికి హద్దు లేకపోయింది. కేవలం భారతీయ సాహిత్యవేత్తల గురించి మాత్రమే కాక, విదేశీ రచయితల గురించి కూడా రుచికి ప్రగాఢమైన అవగాహన ఉంది. కేవలం ఇంటివరకు మాత్రమే పరిమితం కాకుండా, కేవలం అత్తలూ-కోడళ్ళ సీరియళ్ళ వరకు మాత్రమే పరిమితమైన జ్ఞానంతో ఉండకుండా ఉన్న అమ్మాయితో తన వివాహం జరగబోతోందని రూపేష్ కి ఆనందం కలిగింది. దేశ-విదేశాల రాజకీయాల నుంచి సంఘంలో జరుగుతు న్న సంఘటనలు మొదలైన ఎన్నో విషయాల మీద రుచితో చర్చించుకోవచ్చునని అతనికి అనిపించింది. ఒక పరిపూర్ణత ఉన్న భార్య కోసం అన్వేషణ ఆ రోజుతో ముగిసిందని అతనికి అనిపించింది.
వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే నాన్నగారి నుంచి పిలుపు వచ్చింది. డిన్నర్ సమయం అయింది. వంటవాడు భోజనం మొత్తం తయారుచేసి అమర్చాడు. డిన్నర్ టేబిల్ మీదనే పెళ్ళి అంగీకారం విషయంలో మాటలు కొనసాగాయి. రూపేష్ కుటుంబం వివాహవాగ్దానం రీత్యా యాభైఒక్క వందలు సాంకేతికంగా ఇచ్చి ప్రధానం చేసుకునే సంప్రదాయం పూర్తిచేశారు. డిన్నర్ తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు.
డోర్ బెల్ మోగడంతో రుచి తన ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చింది. తలుపు తెరవడానికి మెయిన్ గేటుదగ్గరికి వచ్చి తలుపు తెరిచింది. దివ్యని చూసి రుచి ఒక్క ఉదుటునవెళ్ళి కౌగలించుకుంది. స్నేహితురాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. దివ్యతో తనకి ఉన్న స్నేహబంధం ప్రగాఢమయింది. ఆమెతో డ్రాయింగ్ రూంలోనే కూర్చునే ఫార్మాలిటీ అసలు లేనిది. రుచి, దివ్య తిన్నగా బెడ్ రూంలోకి నడిచారు.
అల్పాహారం, తేనీరు ముగించిన తరువాత రుచి డ్రైఫ్రూట్స్ డబ్బా తెరిచి దివ్య ముందు ఉంచింది. దివ్య చాలాసేపు తనగురించి, తనభర్త హిమాంశు గురించి చాలా విషయాలు చెప్పింది. బ్రిటన్ గురించి, టేమ్స్ నది ఒడ్డున తిరగడం గురించి, హిమాంశు కి సన్నిహితురాలవడం గురించి ఎన్నో విషయాలు చెప్పింది. వాటితోపాటు రాబోయే గుడ్ న్యూస్ ని అనుభూతి చెందుతున్న విషయం కూడా. దివ్య తన ఆలోచనాస్రవంతి లో కొట్టుకుపోతూ రుచి కూడా తన గురించి ఎన్నో విషయాలు మనస్సులో పదిలంగా దాచి పెట్టుకుందని, అవన్నీ చెప్పాలనుకుంటోందన్న సంగతి మరిచిపోయింది. ఉన్నట్టుండి ఈ విషయం జ్ఞాపకం రాగానే అంది- “రుచీ, ఇదంతా నా గురించి నా కథ చెప్పాను. ఇంక నువ్వు నీ గురించి చెప్పు మై డియర్.”
రుచి దివ్యతో అంది- “దివ్యా! నాకు సాహిత్యం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఇప్పుడు సాహితీప్రపంచంలో రుచి భట్టాచార్య అనేది ఒక గుర్తింపు పొందిన పేరు. దేశం లో నలువైపుల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. చాలాసార్లు ఏ కార్యక్రమానికి వెళ్ళాలో, దేనికి రాలేకపోతున్నానని అసమర్థత వెలిబుచ్చాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.”
“ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. నా స్నేహితురాలు ఈనాడు సాహిత్య రంగంలో ఒక పేరుప్రఖ్యాతులు వహించిన వ్యక్తి అని నాకు చాలా సంతోషంగా ఉంది.”
“అది నిజమే దివ్యా. కాని ఇంకో నిజంకూడా ఉంది. అది ఈ సంఘంలోని నిజం, పురుషప్రాధాన్యతలో చిక్కుకుపోయిన సమాజంలోని నిజం. ఆధునికంగా మారుతున్న ప్రపంచంలో ఇంకా పాతపద్ధతులని పట్టుకుని వేలాడే నగ్నసత్యం.” ఇది చెబుతూ రుచి ముఖం గంభీరంగా మారింది. ఆమె చెబుతున్న మాటలని దివ్య శ్రద్ధగా వింటోంది.
రుచి చెప్పసాగింది- “నాకున్న పేరుప్రఖ్యాతుల ప్రభావం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ప్రసిద్ధ సాహిత్యవేత్తకి రుచి భట్టాచార్య ఎవరో తెలుసు. ఇక్కడ ప్రతి చిన్న-పెద్ద సంస్థకు చెందిన కార్యక్రమాల ఆహ్వానం నాకు అందుతూనే ఉంటుంది. లేకపోతే ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసే బాధ్యత నాకు అప్పజెబుతారు. కొత్తగా పైకి వస్తున్న రచయితల్లో, రచయిత్రుల్లో నీ ఫ్రెండ్ అంటే తెలియనివారూ, నీ ఫ్రెండ్ నుంచి సలహా తీసుకోనివారూ ఎవరూ లేరు.”
“ఇదంతా వింటూ వుంటే నాకెంతో గర్వంగా ఉంది. కాని ఈ విషయాలతో నీకు ఉన్న ఇబ్బందికి ఏం సంబంధం ఉంది?”
“సంబంధం ఉంది డియర్. ఈ నా ప్రసిద్ధి కారణంగానే పోయినవారం దేశంలోని అన్నిప్రాంతాలలో ఉనికి ఉన్న అధికారపక్షం నుంచి నాకు ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసే అవకాశం లభించింది. ఆ మొత్తం ఈవెంట్ ని డిజైన్ చేయడానికి, ఆహ్వానితుల ఎంపిక నుంచి సాహితీవేత్తల పేర్ల వరకు ఎంపిక చేసే అధికారం నాకిచ్చారు. దివ్యా, ఈ ఈవెంట్ నా జీవితంలో అన్నిటికన్నా గొప్పదైన అవకాశం. ఈ ఒక్క ఈవెంట్ తో నేను రాష్ట్ర స్థాయి నుంచి దేశస్థాయి వరకు పేరు తెచ్చుకుంటాను.”
“అయితే ఇది సంతోషించవలసిన విషయం. కాని నువ్వు చెబుతున్నది నాకింకా ఏదో పజిల్ లాగా ఉంది.”
పనివాడు చాయ్ తెచ్చిపెట్టి వెళ్లాడు. టీకప్పు దివ్యకి అందిస్తూ రుచి అంది- “ముందు నువ్వు చాయ్ తీసుకో. తర్వాత నేను ఎదుర్కొంటున్న సంఘర్షణ గురించి చెబుతాను.”
ఇద్దరు స్నేహితురాళ్ళు చాయ్ కప్పులు తీసుకుని సిప్ చెయ్యడం మొదలుపెట్టారు. చలిగా ఉన్న సాయంత్రం తేనీటి ఉష్ణం కూడా రుచి మనస్సులో నిష్క్రియంగా ఉన్న స్నాయువులకి వేడిని ఇవ్వలేకపోతోంది. రుచి మళ్ళీ ఆలోచనల దుమారంలో చిక్కుకు పోయింది.
పిహెచ్.డి. చేసే సమయంలో తను డేటా కలెక్ట్ చేసుకునే పనిలో ఒక సంస్థకి సంబంధించిన వ్యక్తులను ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆ సంస్థకి చెందిన ఒక యూనిట్ సర్వజన్ రాజకీయ పార్టీ పేరుతో రిజిస్టరు కాబడి వుందని, వాళ్ళ ఆశయం సామాజికంగానూ, రాజకీయంగానూ జనంలో చైతన్యం తీసుకురావడమని తెలిసింది. ఆ సంస్థ పనిచేసే తీరుతోనూ వాళ్ళ ఆశయాలతోనూ తను ప్రభావితురాలై స్వయంగా అందులో క్రియాశీల సభ్యురాలయింది.
పంచాయితీ ఎన్నికల సమయంలో వాళ్ళు ఒక ఈవెంట్ మీద పనిచెయ్యడం మొదలుపెట్టారు. ఇంటింటికీ వెళ్ళి ఎవరికి ఓటు వెయ్యాలో, ఎవరికి ఓటు వెయ్యవద్దో ప్రచారం చేయసాగారు. నోటా గురించి ప్రచారం చెయ్యాలన్నది రుచి ఆలోచన. ఆ సంస్థలో పనిచేస్తూ ఆమె మహిళల ఆలోచనలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపిం చింది. తను మహిళలను ఏ వ్యక్తికైనా, లేక పార్టీకైనా ఓటు వెయ్యడం గురించిన ఆలోచన లను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ మంది స్త్రీలు కుటుంబంలో ఉన్న మగవారు ఎవరికి వెయ్యమంటే వాళ్ళకే వేస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిం చింది. తన విస్మయాన్ని తెలియపరుస్తూ ఆమె అంది- “అరే, ఓటు అనేది మీ వ్యక్తిగత మైన హక్కు. దాన్ని రహస్యంగా ఉంచడం అనేది దాని మొదటి షరతు. మరి మీరు ఎవరో చెప్పినట్లుగా ఓటు ఎలా వేస్తారు? ఇది సరైన పద్ధతి కాదు.”
కాని ఆ మహిళలు చెప్పే కారణం అయితే మా కుటుంబాల్లో ఇదే జరుగుతూ వస్తోం దని, ఇక్కడ ప్రతి నిర్ణయం మగవాళ్లే తీసుకుంటారని. తనకి ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం అయితే చదువుకున్న కూతుళ్ళు, కోడళ్ళు కూడా ఇదే సరయినదని భావించి దీనినే సమర్థించడం. అప్పుడు రుచి తన ప్రయత్నంతో, ఎన్నుకున్న ప్రభుత్వ విధానా లతో మన జీవితం ఎలా ప్రభావితమవుతుందో చదువుకున్న అమ్మాయిలకి నచ్చజెప్పడం మొదలుపెట్టింది.ఆమె ప్రయత్నం మెల్లమెల్లగా తన ప్రభావం చూపించ సాగింది. ఒక ఎన్నికలో నోటా రికార్డు సృష్టించింది. దీనితో అందరూ దిగ్బ్రాంతికి గురి అయ్యారు. ఈ ప్రయత్నంతో రుచి స్టేటస్ బాగా పెరిగింది. ఆమెకి పార్టీ నిర్వహణలో పెద్ద పదవి ఇవ్వాలనే ఆలోచన మొదలయింది. ఆ పార్టీ వ్యవస్థలో రుచి అందరికన్నా సక్రియంగా ఉన్న కార్యకర్త. ఆమెని ఏదయినా పెద్ద ఎన్నికలో అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన కూడా ప్రారంభమయింది. ప్రతి మీటింగులోనూ, ప్రతి మార్చ్ లోనూ ఆమె గురించిన చర్చ జరుగసాగింది. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా ఆమె తనను తాను ఆ ఆర్గనైజేషన్ నుంచి వేరుచేసుకుంది. ఒక జూనియర్ కార్యకర్తతో తన పేరు జోడించటం ఆమెకి బాధ కలిగించింది. చివరకు తనంతట తానే వీటన్నిటి నుంచి తప్పుకుంది.
చాయ్ కప్పు ఖాళీ చేశాక, రుచి ఆలోచనల్లో మునిగిపోయి పరధ్యానంగా ఉందని దివ్య గమనించింది. అందుకే అడిగింది- “రుచీ! నీ చాయ్ చల్లారిపోయినట్లుంది. ఏమాలోచిస్తున్నావు?”
రుచి తన నిద్రాణ స్థితి లోంచి బయటికి వచ్చి అంది- “దివ్యా! నా చాయ్ తో పాటు నావి ఎన్ని కలలు ఇలాగే చల్లబడిపోయాయో.”
రుచి రూపేష్ తో వచ్చిన సంబంధం, తను సాధించిన విజయాలు… ఇవన్నీ చెబుతూ తన రాజకీయరంగంలోని కెరియర్ గురించిన సంగతులన్నీ చెబుతూ అంది- “అధికారపక్షం వారిచ్చిన అవకాశం గురించి నేను రూపేష్ కి చెప్పాను. ఇదంతా విని రూపేష్ సంతోషిస్తాడని నేననుకున్నాను. నా సంతోషాన్ని నాకు కాబోయే లైఫ్ పార్టనర్ రూపేష్ తో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాను.”
“రూపేష్ కూడా ఇది విని సంతోషించే ఉంటాడు.” దివ్య అంది.
“అలాగే జరిగివుంటే ఎంతో బాగుండేది. కాని అతను చెప్పింది విని నా మనస్సు బాగా దెబ్బ తింది. రుచీ, నీకు ఈవెంట్ ఆర్గనైజ్ చేసే బాధ్యత అప్పగించిన పార్టీ వ్యక్తిగతంగా నాకు ఇష్టమైనది కాదు. కాబట్టి నువ్వు ఈ ఈవెంట్ ను చెయ్యవద్దని అతన న్నాడు.”
“కాని అతను అలా ఎలా అనగలిగాడు?”- దివ్య అంది.
“అదే దివ్యా, ఈ విషయంలోనే నేను షాక్ తిన్నాను. ఇలా నేను అసలు ఊహించ లేదు. నాకు జీవితభాగస్వామి కాబోతున్న వ్యక్తి నన్ను నా జీవితంలో ఒక పెద్ద ఈవెంట్ కేవలం తనకి ఫలానా పార్టీ అంటే ఇష్టం లేదనే కారణంతో చెయ్యవద్దంటున్నాడు.”
“మరయితే నువ్వు ఏం ఆలోచించావు? నువ్వు ఈ ఈవెంట్ ను చేస్తావా?” దివ్య అడిగింది.
“ఈవెంట్ నేను తప్పకుండా చెయ్యాల్సిందే. కాని దానికన్నా ముందు నేనొక పెద్ద నిర్ణయం తీసుకున్నాను…”
“ఏమిటది?”
“నిన్ననే నేను రూపేష్ కి ఫోన్ చేసి చెప్పాను- రూపేష్! నేను నిన్ను పెళ్ళి చేసుకోలే నని. నేనతనికి స్పష్టంగా కారణం కూడా చెప్పాను. చదువులో మోడరన్ గా ఉన్నా, ధరించిన బట్టల్లో ఇంత ఆధునికంగా ఉన్నా, ఆలోచనల్లో ఇంత వెనుకబడి ఉన్న వ్యక్తిని, తన ఆలోచనలను తన పార్టనర్ కి బలవంతంగా ఆంటగట్టాలనుకునే వ్యక్తిని నేను నా జీవితభాగస్వామిగా ఎంపిక చేసుకోలేను. పెళ్ళికి ముందే నీ ఆలోచనలేమిటో నాకు తెలియడం మంచిదయిందని, లేకపోతే నా లోకమే నాశనమైపోయి వుండేదని. నేను సరయినదే చేశానంటావా, చెప్పు దివ్యా?”
“ఒక నిర్ణయం తీసేసుకున్నాక ఇంక ఇప్పుడు ఆ నిర్ణయం సరయినదా కాదా అన్న మీమాంస ఎందుకు? ఇంట్లో అందరి అభిప్రాయం ఏమిటి?”
“నాన్నగారు, అమ్మ ఎప్పుడూ తమ నిర్ణయాలని ఎదుటివాళ్ళ మీద ఆపాదించరు. వాళ్ళకి నా ఈ నిర్ణయం కూడా సహజంగానే అభ్యంతరం లేనిది.”
ఇద్దరు స్నేహితురాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే రుచి మొబైల్ మోగింది. తను కాల్ ని పిక్ చేసింది. అవతలివైపు నుంచి కంఠస్వరం వినిపించింది- “రూపేష్ హియర్.”
రాంగ్ నంబర్ అని చెప్పి రుచి ఆ కాల్ ని డిస్కనెక్ట్ చేసింది. ఆమె పెదవుల నుండి అస్ఫుటంగా మరోసారి వెలువడింది- `రాంగ్ నంబర్!’.
***
డా. సందీప్ తోమర్ – పరిచయం
7 జూన్ 1975 న గంగధారీ ఖతౌలీ, ముజఫ్ఫర్ నగర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన డా. సందీప్ తోమర్ ఎం.ఎస్-సి (గణితశాస్త్రం), ఎం.ఏ. (సాంఘికశాస్త్రం, భూగోళశాస్త్రం), ఎం.ఫిల్. (విద్య), పి-హెచ్.డి. చేశారు. వీరి కవితలు, వ్యాసాలు, కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. సాహిత్యసేవలో వీరి ప్రసిద్ధ రచనలు – మూడు కవితాసంకలనాలు, మూడు కథాసంకలనాలు,రెండు మినీకథా సంకలనాలు, ఒక వ్యాససంకలనం, మూడు నవలలు, ఒక స్వీయచరిత్ర, ఒక యాత్రావర్ణన. వీటిలో `ఏక్ అపాహిజ్ కీ డైరీ’ (ఒక వికలాంగుని డైరీ) (ఆత్మకథ) ఆవిష్కరణ 2018లో నేపాల్ లో జరిగింది. 2011-12 లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో బాటు,తన ఉత్తమరచనల ఆధారంగా వీరు ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా సన్మానం పొందారు. 2018లో ఢిల్లీలో జరిగిన కథా గౌరవ సన్మానం, హిందీరత్న సన్మానం, ఉత్తమ నవలా రచనకు 2019లో జరిగిన ప్రేమచంద్ సన్మానం విశిష్టమైనవి. ఆగస్టు 2016 లో “స్త్రీ స్వాతంత్ర్యం – ఎంత లభించింది, ఎంత మిగిలింది” విషయంపై నిర్వహించబడిన సదస్సులో వీరిని ప్రత్యేకంగా సన్మానించారు. విద్యారంగంలో సక్రియంగా ఉన్న డా. సందీప్ తోమర్ న్యూఢిల్లీ వాస్తవ్యులు.
*****
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2023/08/Dr.-K.-V.-Narasimha-Rao.jpg)
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.