అన్నం కంటే ఆదరువెక్కువ అన్నట్టు ఈ పుస్తకంలో రాంభట్ల జీవితం కంటే సందర్భానుసారంగా ఆయన చేసిన విశ్లేషణలు ఎక్కువ. అడవి బాపిరాజుగారింటికేల్లి నపుడు ఆయనతల్లి ‘ అన్నం సెట్టాను బాబూ’ అన్నారట. ‘సెట్టాను’ అనేది పశ్చిమ గోదావరిజిల్లా నియోగి బ్రాహ్మల భాషట. ( పే. 53 )
నా పెళ్ళిలో కొన్ని మంత్రాలయిన తరువాత నేను లేచి నిలబడ్డాను. ‘ఏమిరా లేచావేం అని మామయ్య అడిగాడు. ఆ మంత్రాల్లోని పాపాలు నేను చేశానా అని ప్రశ్నించాను. మామయ్య ఆ మంత్రాలను మళ్ళీ చదవమన్నారు. అవి వినేసరికి ఆయనకే జుగుప్స కలిగింది.” ( పే.75)
ఎదుటివారికి తెలియకుండా పనులు చేసుకుపోయే విద్యను కమ్యూనిస్టుపార్టీ పరిభాషలో ‘ టెక్ ‘ అంటారు. టెక్నిక్ సంక్షిప్త పదం టెక్ . కందుకూరి వీరేశలింగం గారి జీవితచరిత్ర చదివితే ఇలాంటివి అర్ధమవుతాయి. బ్రిటిష్ ఇండియా ప్రాంతానికీ నిజాం సంస్తానానికీ గల సరిహద్దు ప్రాంతాన ఒక బాల వితంతువు ఉందని తెలిస్తే ఆమెను రప్పించడానికి ఆయన అనుసరించిన టెక్ చాలా గొప్పగా ఉంటుంది. .. “చాలామంది వీరేశలింగం గారిమీద భక్తిని ప్రదర్శిస్తారే కానీ ఆయన పుస్తకాలు చదవరు. ఏమయినా గూఢచర్యంలో కూడా శిక్షణ కావాలి. అలాంటి శిక్షణ కమ్యూనిస్టు పార్టీకున్నట్టు నాకు తెలియదు.” (పే.79)
“మన ప్రభవాది సంవత్సరాలు అరవయ్యే. అవే తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. వాటి ప్రకారం పుట్టినరోజు మళ్ళీ అరవై ఏళ్లకు అదే సంవత్సరం, నెల, తిరిగి తిరిగి వస్తాయి. దాన్ని షష్టి పూర్తి అంటారు. ఒకప్పుడు సగటు ఇరవై ఏడేళ్ళు. ఆ కాలాన మనిషికి అదే ఏడు, నెల, తిరిగి తిరిగి రావడం అరుదు కదా? నాడు పుట్టిన పండుగ షష్టిపూర్తి.” (పే.179)
నాటి బెజవాడ రాజకీయాలు చిత్రంగా ఉండేవి. కాంగ్రెస్ భూస్వాములు కమ్యునిస్టు యువకులకు తమ పిల్లల్నిచ్చేవారు… కమ్యునిస్టులు స్త్రీని గౌరవిస్తారు. తిట్టరు. కొట్టరు. అట్టహాసం పెల్లినొల్లరు. ఆధునిక దండపెళ్లిళ్ళే కావాలంటారు” (పే.73) ఇలా అడుగడు గునా ఎన్నో ముచ్చట్లు ఎదురవుతాయి.
‘ నాకు చదువు లేదు’ ని స్వయంగా చెప్పుకున్న రాంభట్ల ఒక విజ్ఞాన సర్వస్వం. కదిలే గ్రంథాలయం. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వరకూ ఔపోసన పట్టారు. తెలుగులో తొలి రాజకీయ కార్టూనిస్టు ఆయనే. మీజాన్, విశాలాంధ్ర, ఈనాడు పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జనకథ, పారుటాకులు, వేల్పుల కథ, వేదభూమి ఆయన రచనల్లో కొన్ని. పిడకల వేట, గరిక పరకలు, మథనం శీర్షికలతో పలు పత్రికల్లో వందల వ్యాసాలు రాశారు. ఎన్నో కష్టాలు పడ్డారు. వారాలు చేసుకు బతికారు. ‘ భవతి భిక్షాందేహి’ అన్నారు. విదేశాలకు వెళ్ళారు. కమ్యూనిస్టుగా బతికారు. సాహితీ ఉద్యమాల్లో పాల్గొ న్నారు. ఎనభై వసంతాల అనుభవాలకు అక్షర రూపం ఈ సొంత కథ.
1920 మార్చి 24న అమలాపురం దగ్గర్లోని అనాతవరం అగ్రహారంలో జన్మించారు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ప్రముఖ జ్యోతిష్కుడు. మూడో ఏట తండ్రిని కోల్పోయి మేనమామ పంచన చేరాడు. ‘గుంట ఓనమాలు’ నేర్పడానికి పంతుల్ని రప్పించారు. చూపుడు వేలుతో నడింవేలును నొక్కిపెట్టి అక్షరం గుంటలో దిద్దాలి. దిద్దేటప్పుడు పంతులు వేలు నొక్కడం వల్ల ఈయన కెవ్వుమన్నాడు. ఆ కేక విన్నఆయన తాత పెయ్యకట్టు తాటితో పంతుల్ని చితకబాదాడు. పంతులు పారిపోయాడు.తాతనడిగి తాటాకు గంటం తీసుకున్నాడు. తాటాకు ఎలా పట్టుకోవాలో గంటంతో ఎలా రాయాలో తాతే నేర్పాడు. గజపతినగరంలో ఎలిమెంటరీ స్కూల్లో వేస్తే బడి మానేశాడు. హెడ్ మాస్టరు అడిగితే ‘ఆ క్లాసులో నేర్చుకోడానికేమీ లేదు. ఆవుకు నాలుగు కాళ్ళుండును. గడ్డిమేయును. నెమరువేయును. ఇవి పాఠాలు. నేను బోలెడు ఆవుల్ని చూశాను. అవన్నీ ఆపనే చేస్తుంటాయి’ అన్నారు. అపుడాయన మూడో క్లాసులో కూర్చో బెట్టాడు. ఎలా అయితేనో మూడు గట్టేక్కాడు. సింగరేణిలో కూడా ఉర్దూ మీడియంలో మూడో తరతగతే చదవాల్సొచ్చింది. తర్వాత నాలుగుపూర్తిచేసి ఐదో తరగతి అర్ధాంతరంగా మానేసారు.
హిందీ పరీక్షలు ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. ఎన్ని అవతారాలెత్తారో! భజన సంఘానికి కోశాధికారిగా ఉన్నారు. కర్రసాము నేర్చుకున్నారు. నాటకాలాడారు. ‘దివాంధం’ అనే నాటకం రాసి కొందరి ఆగ్రహానికి గురయ్యారు. వాళ్ళు కొడతారని అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయినా బడితపూజ తప్పలేదు.
ఐదోతరగతితో చదువు ఆగిపోయాక హైదరాబాద్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో రెండు నెలలు పని, తర్వాత టీ ప్రచార ఫలితాలు తెలుసుకునే ఉద్యోగం, అదీ మానేసి చిక్కడపల్లి లైబ్రరీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత పుస్తకపఠనం, నేర్చినదంతా మిత్రులకు చెప్పడం వ్యాపకం అయింది.
నలుగురితో నారాయణా అనుకునే రకం కాదు రాంభట్ల. సంధ్యావందనంలో అఘమర్షణ మంత్రాలున్నాయి. అంటే ఒక్కొక్క అంగం చేసిన పాపాలను ఏకరువు పెడుతూ ఏ రోజు చేసినపాపాలు ఆ రోజే కడిగేసుకునే మంత్రాలు. మళ్ళీ ఫ్రెష్ గా పాపాలు చేయొచ్చని ఆ మంత్రాల అర్ధం.. ‘ఆ మంత్రాలకు అర్ధం నాకెవరూ చెప్పలేదు. అర్ధం తెలియని ఆ మంత్రాలు చదివి బండరాయినీ బడుద్ధాయినీ కాదలచుకోలేదు’అని సంధ్యావందనం మానేశారు. సంధ్యావందనం లేనపుడు జందెం మాత్రం ఎందుకని తీసేశారు. వేద మంత్రాలు గుక్క తిప్పుకోకుండా వల్లెవేయడమే కానీ అర్ధాలకోసం అడిగి ఇబ్బంది పెడితే ఎలా? ఋగ్వేదం పాఠం చెప్పమని తాతగార్ని అడిగితే ఆయన “ మేం బండ మనుషులం. మాకు శబ్దం మీద తప్ప అర్ధంతో పని ఉండదు. నీకు అర్ధం కావాలి” అన్నారట.
చిట్టిపొట్టి అడుగులు వేసేటపుడే చిత్రకళ మీద ఆసక్తి కలిగింది. మూడో తరగతిలోనే మాస్టారు బోర్డుమీద గీసే బొమ్మల్ని అచ్చుగుద్దినట్టు అనుకరించేవాడు. నాలుగో తరగతి లో డ్రాయింగ్ మాస్టారి అభిమాన విద్యార్ధి అయ్యాడు. డాక్టరుని ఆట పట్టించాలని ఆసుపత్రి గోడల మీద ఆయన బొమ్మ గీసి పొట్టి పిచిక అని నిక్ నేమ్ పెట్టేవాడు. భారతి, గృహలక్ష్మి పత్రికల్లో తలిసెట్టి రామారావుగారి వ్యంగ్య చిత్రాలను ఇష్టపడేవాడు. చిత్రకళ మీద అభిమానంతో చిక్కడపల్లి లైబ్రేరీ సంయుక్త కార్యదర్శిగా ఉన్నపుడు చిత్రశాస్త్రా లను తెప్పించాడు.
ఆనందరామాయణం ద్వారా చదవడం నేర్చుకున్నాడు. గజేంద్ర మోక్షం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరిత్ర కంఠస్ధం చేశాడు. నాలుగో క్లాసులో ప్రేమ్ చంద్ కథలు, ఐదో తరగతిలో ఓడ్ హోస్ పుస్తకాలు, పన్నెండో ఏట ‘కన్యాశుల్కం’ చదివారు. ‘ కన్యాశుల్కం’ నాకు ఎంత్రోపాలజీ మీద ఆసక్తి కలిగించింది’ అన్నారు. కందుకూరి, చిలకమర్తి సాహిత్యం అధ్యయనం చేశారు.‘ శంకర తత్త్వం ద్వారా నిరీశ్వర వాదినయ్యాను. అదే శంకరతత్వంతో నేను భౌతిక వాడినయ్యాను… నా నిరీశ్వర వాదం, భౌతిక వాదం నన్ను మార్క్సిజం వైపు మళ్ళించాయి” అన్నారు. గ్రందాలయంలో పనిచేసేటపుడే ఆళ్వారు స్వామి, సంగం లక్ష్మీబాయి, విద్వాన్ విశ్వం, అడవి బాపిరాజు వంటి ప్రముఖులతో పరిచయాలేర్పడ్డాయి. రిటైరయ్యాక ఏంగెల్స్ ‘ ఆరిజన్ ఆఫ్ ఫేమిలీ’ మోర్గన్ రాసిన ఏన్సెం ట్ సొసైటీ చదివి ఆ రెండూ కలిపి రాస్తే బావుంటుందని ‘జన కథ’ రాశారు. ఇలా తన రచనల నేపథ్యం చెప్పి చివరగా “అనంతానికెక్కడో అంతం కల్పించాలి” అంటూ సొంతకథ ముగించారు.
*****