రాగసౌరభాలు-12

(ఆనంద భైరవి)

-వాణి నల్లాన్ చక్రవర్తి

 

          స్నేహితులు, హితులకు అనేక వందనములు. అమ్మవారు ఆనంద నాట్యం చేసిన అనుభూతిని, ఆనందాన్ని పంచే రాగం ఆనంద భైరవి. మరి ఈ రాగ విశేషాలు ఏమిటో ఈ నెల వ్యాసంలో తెలుసుకుందామా?

          ఆనంద భైరవి రాగం అత్యంత పురాతనమైనది. ఈ రాగం దక్షిణ దేశంలోని జానపదాలలో నుండి గ్రహింపబడినది అని అభిప్రాయము. ఈ రాగాన్ని కొందరు ఆంధ్ర భైరవిగా పిలిచినా అది ఎక్కువ ప్రచారంలోనికి రాక మునుపే భూస్థాపితమయింది. 18 వ శతాబ్దంలో అనేక మార్పులకులోనై, అన్య స్వరాలు జోడించుకొని నేటి ఆనంద భైరవి స్వరూపం దిద్దుకుంది. ఈ రాగ వైభవాన్ని పెంపొందించటంలో శ్యామా శాస్త్రి గారి కృషి ఎనలేనిది.

          ఈ రాగ లక్షణాలను పరికిస్తే, ఇది 20 వ మేళకర్త నఠభైరవి రాగ జన్యము. సాంప్రదాయ ప్రదర్శిని, గోవిందాచార్యులవారి సంగ్రహ చూడామణి గ్రంధాలలో ఈ విషయం ధ్రువీకరించబడింది. కానీ కొందరు శాస్త్రకారులు, విద్వాంసులు ఈ రాగాన్ని 22 వ మేళకర్త ఖరహరప్రియ జన్యంగా భావిస్తారు. ఈ రాగంలో ఉన్న అన్య స్వర ప్రయోగాలు దీనికి కారణము. ఈ రాగం ఆరోహణ అవరోహణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

సగరిగమ పదపస

సనిదప మగరిస

          ఆరోహణలో నిషాదం వర్జము అవరోహణ సంపూర్ణం. ఆరోహణ వక్రం కూడా. అందు వలన షాడవ వక్ర సంపూర్ణ రాగం. ఇందులోని స్వరాలు షడ్జమ్, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ   దైవతం, కైసికి నిషాదం. చతుశృతి దైవతం , కాకలి నిషాదం అన్య స్వరములుగా చేరటం వలన భాషాంగ రాగం అయింది. రక్తి రాగము. విలంబ కాలంలోనే ఎక్కువ రాణించే రాగము. మంద్ర నిషాదము కింద సంచారము లేదు. రాగలాపనకు అనువైన రాగము. ఏ సమయములోనైనా పాడదగిన రాగము.

          భక్తి, కరుణ, శృంగార రసములే కాక, వినయము, ఆనందము అనే లక్షణాలను ప్రదర్శించగల రాగము. రక్త పోటు, కుంగుబాటులను, మానసిక సమస్యలను తగ్గించటం లో ఉపయుక్తము. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే రాగము.

          ఈ రాగం పురాణ పఠనం, నాటికలు, నాట్యం, నృత్య నాటికలు, పెండ్లి పాటలలో విస్తృతంగా కనిపించే రాగం.

          త్యాగరాజ స్వామి ఈ రాగంలో ‘నీకు తెలియకపోతే’,  ‘క్షీర సాగర విహారా’ రచించిన తరువాత మరి ఈ రాగంలో రచనలు చేయలేదు. దీని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. కుంభకోణం వద్ద త్రిభువన గ్రామ దేవాలయంలో స్వామినాధ గురుక్కళ్ అనే సంగీత పండితుడు ఉండేవాడట. ఆయన సంగీతంలోను, నటనలోనూ ఉద్ధండుడు. తోడి సీతారామయ్య వలే ఈయన ఆనంద భైరవి పాడటంలో దిట్ట. వీరు పాడినట్టు మరెవరు పాడలేరని ప్రసిద్ధి. వీరు తిరువయ్యురులో ప్రదర్శనలో పాడిన ఆనంద భైరవి రాగం వినిన త్యాగయ్య గారి శిష్యులు, గురువు గారి వద్ద అనేక విధముల పొగడిరి. అది విన్న త్యాగయ్య అయన గానం వినవలెనను కోరికతో రహస్యముగా గుంపులో నిలబడి విని ఆనంద పరవశం చెందిరి. ఆనంద భాష్పములతో ఆయనను కౌగిలించుకొని ఏదేని వరము కోరుకొనుమనిరి. అందులకు ఆయన యోచించి ఆనంద భైరవి రాగంలో ఇక ముందు రచనలు చేయనని మాట తీసుకొనిరి. అందులకు త్యాగయ్య అంగీకరించి ఆపై కీర్తనలు రచింపలేదు. ఆ కోరికకు కారణం త్యాగయ్య ఆనంద భైరవిలో కీర్తనలు చేయకపోవటానికి కారణంగా తమ పేరు కూడా ప్రచారంలోనికి వస్తుందనే ఊహ.

          శ్యామ శాస్త్రి ఈ రాగంలో 8 కీర్తనలు రచించారు. ఓ జగదాంబ అనే కీర్తన ఈ రాగానికి ప్రాణం పోసింది. అలానే దీక్షితుల వారు రచించిన త్యాగరాజా యోగ వైభవం  అనే కీర్తనలో రెండు రకాల యతుల ప్రయోగం అద్భుతంగా చేశారు.

త్యాగరాజ యోగ వైభవం

ఆగరాజ యోగ వైభవం

రాజ యోగ వైభవం

గ వైభవం

వైభవం

భవం

వం

          దీనిని గోపుచ్చ యతి అంటారు. అనగా ఆవు తోక వలె మొదలు లావుగా ఉండి క్రమంగా సన్నబడటం.

అలాగే చరణంలో

శం

ప్రకాశం

స్వరూప ప్రకాశం

సకల తత్వరూప ప్రకాశం

శివ శక్తిఆది తత్వ రూప ప్రకాశం

          అంటూ శ్రోతోవహ యతి ప్రయోగం చేశారు. అంటే నదీ ముఖం వలె సన్నగా మొదలై క్రమంగా వెడల్పు కావటం. ఈ విధంగా ఈ కీర్తన ఎంతో ప్రాముఖ్యం పొందింది. అలానే మరి వేరే గతి, ఓ జగదాంబ కీర్తనలు చక్కని చిట్ట స్వరంతో కూడి ఉంటాయి.

          తిరువారూర్ లోని పంచలింగ క్షేత్రాలపై దీక్షితుల వారు 5 కీర్తనలు రచించారు ఆనందేశ్వర పంచలింగ విభుడు ఆనందేశ్వరునిపై ఆనంద భైరవి రాగంలో రచించారు. ప్రసిద్ధ సంగీతకారిణి డి.కే. పట్టమ్మాళ్ గారు ఒకసారి కాంచిపురం వెళ్ళినపుడు కంచి పరమాచార్యులను దర్శించి వారి సమక్షంలో ఆ కీర్తన గానం చేశారట. విన్న పరమాచార్యులు ఆ కీర్తనని కచే్రీలలో పాడరాదనీ, దేవాలయాలలో, పూజలలో, సన్యాసుల సమక్షంలో మాత్రమే పాడాలని చెప్పారట. అంతటి మహత్తు గల కీర్తన అది.

ఇక ఈ రాగంలో కొన్ని రచనలు చూద్దామా?

శాస్త్రీయ సంగీతం

  1. కీర్తన త్యాగరాజ యోగ వైభవం           రూపక             దీక్షితులు
  2. కీర్తన మానసగురుగుహ                       రూపక             దీక్షితులు
  3. కీర్తన నీకే తెలియక                             ఆది                 త్యాగయ్య
  4. కీర్తన ఓ జగదాంబ                              ఆది                 శ్యామశాస్త్రి
  5. కీర్తన హిమాచల తనయ                   ఆది                 శ్యామశాస్త్రి
  6. కీర్తన మరి వేరే గతి                            చాపు                శ్యామశాస్త్రి
  7. కీర్తన పలుకే బంగారమాయెరా         ఆది                 రామదాసు

త్యాగరాజ యోగ వైభవం: https://youtu.be/Skb3iqMbdGs?si=Pfc8NBekyTsmJv3I

అన్నమాచార్య కీర్తనలు

  1. ఇట్టి ముద్దులాడి బాలుడు
  2. ఉయ్యాల బాలు నూచెదరు
  3. కంటి శుక్రవారము
  4. భోగ్రీంధ్రులు మీరు పోయి రండు

భోగ్రీంధ్రులు మీరు పోయి రండు:

https://youtu.be/Xaz9nPWbUh0?si=q-QtahgR7EMZYNBm

లలిత సంగీతము

  1. వచ్చింది శ్రావణి                గంగరాజు సుశీలదేవి                 పాలగుమ్మి
  2. పసిడి మెరుంగుల             రజని                                            రజని, భానుమతి
  3. శివుడాడినాడమ్మా              మంచాల జగన్నాధరావు
  4. అనుమానించెదవేల         తిరుప్పావై తెలుగు                    టి. కే. సీతమ్మగారు

అనుమానించెదవేల : https://youtu.be/nDvLyCo-9yQ?si=45s5UEWJAx1hXw0H

సినిమా సంగీతం

  1. పిలిచినమురళికి             ఆనంద భైరవి                           ఎస్. పి. బాలు, జానకి
  2. మధురానగరిలో               అభిమానం                                కోమల, సుశీల
  3. సువ్వి కస్తూరి రంగా         చిల్లరకొట్టుచిట్టెమ్మ                 సుశీల
  4. శ్రీజానకి దేవి                     మిస్సమ్మ                                   సుశీల, లీల బృందం
  5. అంచలంచలు లేని        శ్రీ కృష్ణార్జున యుద్ధం              గోపాలం, స్వర్ణలత

పిలిచినమురళికి  

https://youtu.be/ux9ETmHCo1E?si=LUaCofrnBDUjGhpY

          సంతోషాన్ని, ఆనందాన్ని పెంపొందించే ఆనంద భైరవి రాగ విశేషాలు చూసారుగా? మరియొక మంచి రాగ విశేషాలతో వచ్చే నెల కలుద్దాము. అంతవరకు సెలవా మరి?

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.