విజేత

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్

          డాక్టర్ నర్మద చండీగఢ్ వచ్చి అయిదు సంవత్సరాలు అయింది. అక్కడ ఒక సంవత్సరం నుంచి పీ.జీ. ఐ .లో కార్డియాలిజిస్టుగా పనిచేస్తోంది. అంతకు ముందు దిల్లీలో, ఎయిమ్స్ లో జనరల్ మెడిసిన్ చదివి, చండీగడ్ పీ.జీ. ఐ .లో, కార్డియాలిజీలో డీ.ఎం . చేసింది. ఎం.బీ.బీ.ఎస్. దగ్గర నుంచి, అన్ని కోర్సులలో, అన్ని సబ్జెక్ట్లలలో, గోల్డ్ మెడల్స్ సాధించింది . అంతటి అద్భుతమైన తెలివితేటలు కల నర్మద, అన్ని చోట్ల, అందరి చేతా, ప్రశంసలు అందుకుంది . చండీగడ్ లోనే , ఒక సంవత్సరం , వివిధ
హాస్పిటల్స్ లో పనిచేసింది. ఆ ఎక్స్ పీరియన్సు , ఆమెకి ఒక కార్డియాలిజిస్టుగా బాగా ఉపయోగించింది. పీ.జీ. ఐ .లో కార్డియాలిజిస్టుగా ఎంపిక అయ్యింది. నిజానికి నర్మదకి
కోర్స్ అయిన వెంటనే ఉద్యోగం రావాల్సింది . కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది . నర్మద ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె తల్లిదండ్రులు నరేష్, రజని నర్మద ఇన్నాళ్లు చదువుకుంటోందని , నర్మద పెళ్ళి ప్రయత్నాలు చెయ్యలేదు . ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు . కానీ వాళ్లేమో హైదరాబాద్ లోనూ , కూతురు ఎక్కడో దూరంగా, చండీగఢ్ లో ఉండడం వలన ,సంబంధాలు వెతకడానికి ఇబ్బంది అయ్యింది. అయితే ఈ మధ్యే బాగా విస్తరించిన షాదీ వెబ్ సైట్లు ,ఆ ఇబ్బందిని కొంత వరకు, అధిగమించడానికి, ఉపయోగపడుతున్నాయి . నరేష్, షాదీ వెబ్ సైట్లులో సంబంధాలు చూస్తున్నా , రజనికి ఆ పద్ధతి పెద్దగా నచ్చలేదు. స్వయంగా వాకబు చేసుకుని, చూసుకుని చేసుకున్న సంబంధాలే మంచివని ఆవిడ ఉద్దేశ్యం. ఏ తల్లికన్నా కూతురు జీవితం గురించి ఆ మాత్రం భయం ,బాధ్యత ఉండడం సహజం .

          తల్లిదండ్రులు,ఒక పక్క అలా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే , నర్మదకి మాత్రం ఇప్పట్లో పెళ్ళి చేసుకోవడం , ఇష్టం లేదు .ఆ విషయమే తల్లి రజనికి ఫోన్ చేసి చెప్పింది.  “అదేమిటే? ఎంతవరకు కావాలంటే అంతవరకూ చదువుకున్నావు .పెద్ద
డాక్టర్ అయ్యావు .చదువు అయ్యింది.ఉద్యోగం వచ్చింది.ఇంక పెళ్ళి చేసుకోవాలి కదే!? ” అంది రజని .

          “నా పెళ్ళికేమీ తొందరలేదమ్మా. అనవసరంగా నువ్వూ ,నాన్నగారూ కంగారు పడకండి” అంది నర్మద. పక్కనే ఉన్న నరేష్ కూడా స్పీకర్లో ఆ మాటలను వింటున్నాడు.
“అలా అంటావేమిటి తల్లీ .నువ్వు ఉద్యోగంలో, అంటే నీ ప్రొఫెషన్ లో, స్థిర పడ్డావు .ఇంక జీవితంలో కూడా స్థిర పడాలి కదమ్మా” అన్నాడు నరేష్.

          “ఏమీ కంగారు లేదు నాన్నగారు .ఇప్పుడిప్పుడే నా వృత్తిని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. ప్రాణాలమీద ఆశ వదులుకుని వచ్చే పేషెంట్స్ , ఎంతో ఆదుర్ధాగా, హడావిడి పడే వాళ్ళ బంధువులు . వాళ్ళని శాంతపరిచి , పేషెంట్స్ కి ఏమీ కాదని భరోసా ఇచ్చి , నేను చేయగలిగింది, చేయాల్సింది అంతా చేసి , ఒక పేషెంట్ ప్రాణాలు  కాపాడినప్పుడు కలిగే తృప్తి ….. అది నేను మాటలలో చెప్పలేను నాన్నగారు ” అంది నర్మద.

          “బావుంది.ఇట్ ఈజ్ గుడ్ యు ఆర్ ఎంజొయింగ్ యువర్ జాబ్ .నేను ఒక సీనియర్ బ్యాంకర్ గా అదే చేస్తుంటాను. మా నాన్నగారు ,అదే మీ తాతగారు , కూడా “డ్యూటీ ఈజ్ ఫస్ట్” అంటుండేవారు . కానీ పెళ్ళి చేసుకుని కూడా నువ్వు నీ జాబ్ ని ఎంజాయ్ చెయ్యొచ్చు” అన్నాడు నరేష్ .

          “పెళ్ళంటూ అయిన తరువాత అది అంత తేలిక కాదు నాన్నగారు . మీకు తెలియనిది ఏముంది . నేను ఒక్కొక్కసారి పేషెంట్ పరిస్థితి బట్టి, ఇరవయి నాలుగు గంటలు, హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది .” అంది నర్మద .

          “అప్పుడు నీకు నచ్చిన ,నిన్ను మెచ్చిన, డాక్టర్ కొలీగ్ నే పెళ్లి చేసుకో. ఇబ్బంది ఉండదు.ఇద్దరూ కలిసి హాయిగా డాక్టర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు”

          “డాక్టర్ ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్నగారు ….. అయినా చెప్పానుగా. కొంత కాలం తరువాత చూద్దాం .ఇంతకీ మీరు, అమ్మ ఎలా ఉన్నారు” అని అడిగింది నర్మద .

          “మేము బాగానే ఉన్నామే .పోనీ నీకు డాక్టర్ ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోతే , ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకో. నేను,నాన్నగారూ అయితే నీ పెళ్ళికి తొందర పడుతున్నాం . నువ్వు పెళ్ళి చేసుకుని,కాపరం చేసి , ఒక నలుసుని కని, మాకు ఇచ్చేసావనుకో . బాబునో , పాపనో మేమే చూసుకుంటాం. నువ్వు , నీ భర్త, మీ ఉద్యోగాలు, మీరు చేసుకోవచ్చు. మాకు మనమడినో , మనమరాలినో చూసుకోవాలని , వాళ్ళ ఆటపాటలు చూసి ఆనందించాలని ఉంటుంది కదే నర్మదా ………. నువ్వు మాకు ఒక్కర్తివే కదే .నీ తరువాత తరం వాళ్ళని మా చేతిలో పెడితే , వాళ్ళని మేమే పెంచుతాం . బతికి బాగుంటే , వాళ్ల పెళ్ళిళ్ళు కూడా చూడాలని నాది,మీ నాన్నగారిదీ ఆశ . ఆలోచించు. జాగర్తగా ఉండు” అంటూ ఫోన్ పెట్టేసింది రజని .

          “దీని వ్యవహారం చూస్తే ఎవరినో ప్రేమిచడం లాంటివి చేసి ఉంటుంది.ఇప్పుడే బయట పడడం ఇష్టం లేక కుంటిసాకులు చెబుతోంది.” అంది రజని,భర్తతో .

          “పోనీ అలా అనుకున్నా అసలు డాక్టర్ వద్దు అంటోంది కదా !?” అంటూ తన
సందేహం వెలిబుచ్చాడు నరేష్ . 

          “అది అలాగే అంటుంది .నాకు చిన్నప్పడి నుంచి దాని సంగతి తెలుసు కదా .
అంతా మనస్సులో దాచిపెట్టుకుంటుంది .ఏ విషయం అంత తొందరగా బయట పెట్టదు. అయినా ఎక్కడో దూరంలో ఉంది.ప్రస్తుతం మనం చేయగలిగింది ఏమీ లేదు . రేపు, మీ సీ. ఈ. ఓ తో, ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఉందన్నారుగా .తయారు  అవ్వండి. లేకపోతే అక్షింతలు వేస్తాడు కదా” అంది రజని వంటింట్లొకి నడుస్తూ. నరేష్ తల ఊపి , తన లాప్టాప్ అందుకున్నాడు .

***

          చండీగడ్ అంటే చండికాదేవి ఇల్లు అని అర్థం. ఆ ఊరికి సిటీ అఫ్ బ్యూటీ అనే పేరు ఉంది . అక్కడ సుఖానా సరస్సు అని ఒక కృత్రిమ సరస్సు ఉంది . అక్కడ నుంచి చూస్తే హిమాలయాల అంచులు కనపడతాయి . చండీగఢ్ లో ఉన్న జాకిర్ హుస్సేన్ పార్క్ లో 825 రకాల గులాబీ రకాలు ఉంటాయి . దసరా పండగకి అనేక ప్రదేశాలలో రాంలీలా జరుపుకుంటారు . నర్మదకి తీరిక దొరికినప్పుడు ఆయా ప్రదేశాలను చూస్తూ ఉంటుంది . నర్మద పని చేసే హాస్పిటల్, సెక్టార్ 12 లో ఉంది. నర్మద ,సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన, తన స్నేహితురాలు కౌర్ తో కలిసి, సెక్టర్ 11 లో, ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లాలన్నా, ఎయిర్ పోర్ట్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.విచిత్రం ఏమిటంటే ఎయిర్ పోర్ట్ రన్ వే చండీగఢ్ లో ఉంటే , ఎయిర్ టెర్మినల్ పంచకులాలో ఉంటుంది. కౌర్ కి ప్రతి శని , ఆదివారాలు శలవలు . ఆసారి అనుకోకుండా నర్మదకి రెండు రోజులు రెస్ట్ వచ్చింది . స్నేహతురాళ్ళు ఇద్దరూ సిమ్లా ప్రోగ్రాం పెట్టుకున్నారు . కౌర్ కి సొంత కారు ఉంది . దాంట్లో బయలుదేరారు . నర్మద వారిస్తున్నా వినకుండా ,కౌర్ కారు మంచి వేగంగా నడుపుతోంది . ఉడుకు రక్తం . నర్మద కూడా వయస్సులో చిన్నది అయినా ,డాక్టర్ కావడం వల్లనేమో కాస్త జాగర్త , దానితో ఏర్పడిన భయం ఎక్కువ. కారు త్రాచు పాములా ఉన్న రోడ్డు మీద రివ్వున
దూసుకు పోతోంది . సరిగ్గా పంచకుల ప్రవేశిస్తుంటే , ముందు వెడుతున్న కారు ఎటువంటి ముందు సంకేతం లేకుండా , హఠాత్తుగా ఆగిపోయింది . నర్మద, కౌర్, ప్రయాణిస్తున్న కారుని, కౌర్  నియంత్రించలేకపోయింది . సెకనులో పదో వంతులో ఘోర ప్రమాదం జరిగిపోయింది . వాళ్ళ కారు ముందు కారుని గుద్దుకుంది . ప్రమాద
ధాటికి నర్మద , కౌర్, ఇద్దరూ సృహ కోల్పోయారు .అక్కడ వాహనాలలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు, పోలీసులు కార్ల వైపు పరిగెత్తారు . వాళ్ళు ,ముందు కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, బాగా తాగి ఉన్నాడని ,సెల్ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడని
గ్రహించారు. అతను కూడా గాయపడ్డాడు.కేసు సంగతి తరువాత చూసుకోవచ్చని, పోలీసులు గాయపడ్డవారందిరినీ, ఆంబులెన్సులో హాస్పిటల్ కి తరలించారు .

* * *

          నర్మద ,కళ్ళు తెరిచేసరికి, ఆసుపత్రిలో ఉంది . తను పనిచేసే పీ.జీ. ఐ .లో , ఎమర్జెన్సీ అండ్ ఇంటెన్సివ్ కేర్ వార్డ్ లో ఉంది . తల విపరీతంగా భారంగా ఉంది . ఒళ్ళంతా సలుపు,పోటు . అక్కడే ఉన్న సిస్టర్ ,నర్మద ,కళ్ళు తెరవడం చూసి , డాక్టర్ కి , నర్మద కి సృహ వచ్చిన విషయం తెలిపింది. డాక్టర్ నర్మద తండ్రి వయస్సు వాడు .
డాక్టర్ సిన్హా . బిహారీ . హాస్పిటల్లో చాలా మంచి పేరు ఉంది . నర్మదకి పెద్దగా పరిచయం లేకపోయినా , హాస్పిటల్లో పనిచేసే ,సాటి డాక్టర్ గా తెలుసు. డాక్టర్ హడావిడిగా వచ్చి , నర్మద, నుదిటి మీద చెయ్యి వేసి “హౌ అర్ యు మై చైల్డ్” అన్నాడు ఆప్యాయంగా .

          “ఐ యాం ఫైన్ డాక్టర్” అంది నర్మద బలహీనమైన స్వరంతో .

          “నైస్. యు విల్ బీ ఆల్రైట్ ఇన్ నో టైం” అంటూ ప్రేమగా తల నిమిరాడు . సంభాషణ ఇంగ్లీష్ లో సాగింది .

          “తలనెప్పి ఏమైనా ఉందా ?”అని అడిగాడు సిన్హా.

          కొంచెం ఉంది డాక్టర్ .బాగా భారంగా ఉంది .” అంది నర్మద .

          “ఒక డాక్టర్ గా నీకు తెలుసు కదా .సింటమ్స్ హఠాత్తుగా వచ్చి మీద పడిపోతాయి. మెల్లిగా తగ్గుతాయి .” అన్నాడు సిన్హా .

          “కాళ్ళు బాగా నెప్పులుగా ఉన్నాయి డాక్టర్. అందులో కుడి కాలు తిమ్మిరిగా కూడా ఉంది” అంది నర్మద .

          సిన్హా,సిస్టర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు .తరువాత నర్మద వైపు చూసారు. వాళ్ళ జాలి చూపులను ,భావాలను గ్రహించిన , నర్మదకి ఏమీ అర్థం కాలేదు. అంతలో, మరీ తిమ్మిరి ఎక్కువగా ఉన్నట్లనిపించి, కుడి కాలు కదపబోయింది . అక్కడ కాలు లేదు !!?? ఎడమ కాలు పైకి ఎత్తబోయింది .ఉహుఁ .లాభం లేకపోయింది .మరుక్షణం నర్మద , తనకు కప్పిన దుప్పటి తొలగించి ,కిందకు చూసుకుంది . రెండు కాళ్ళు ,తొడల భాగం వరకు ,తొలగింపబడి ఉన్నాయి . నర్మదకి కాళ్ళు ఉన్నట్లు,అవి నెప్పి  పెడుతున్నట్లు, తిమ్మిరిగా ఉన్నట్లు అనిపించడానికి కారణం “ఫాంతోమ్ లింబ్ ” అనే విచిత్రమైన పరిస్థితి .

          శరీరంలో లేని భాగాలు ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది . “నో” అని బిగ్గరగా అరిచింది నర్మద . బోరున ఏడవసాగింది . సిన్హా ,నర్మద ,భుజాలపై చేతులు వేసి ఓదార్చసాగాడు .
అంతలో తల్లిదండ్రులు ,నర్మద దగ్గరికి వచ్చారు .మామూలుగా ఆ ప్రదేశానికి అటెండెట్స్ ని రానివ్వరు .నర్మద కూడా డాక్టర్ కనుక, ప్రత్యేక పరిస్థితులలో, నరేష్ ని , రజనిని అనుమతించారు .

          తల్లిదండ్రులను చూడగానే నర్మద దుఃఖం దిగ్వుణీకృతం అయ్యింది . వెక్కి, వెక్కి ఏడవసాగింది . కూతురిని, ఆ పరిస్థితిలో చూసిన రజని, తట్టుకోలేకపోయింది . ఆవిడ బాధ కట్టలు తెంచుకుని ప్రవహించింది .ఆవిడ బిగ్గరగా రోదించసాగింది . అయితే నర్మదను ,మిగతా పేషెంట్స్ కి బాగా దూరంగా ఉంచడం వలన , ఆ పేషెంట్స్ కి , అదంతా , పెద్దగా ఇబ్బంది కలిగించలేదు .

          “బాధ పడకు తల్లీ ….భగవంతుడు ఏది,ఎప్పుడు,ఎందుకు చేస్తాడో మనం చెప్పలేం. ఆయన చెప్పినట్టు నడుచుకోవడమే మన కర్తవ్యం” అన్నాడు నరేష్ ,ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుందుకు,వ్యర్ధ ప్రయత్నం చేస్తూ. సిన్హా రమేష్ కి , సిస్టర్ రజనికి ధైర్యం చెప్పారు .

          దాదాపు పదినిమిషాలకి అందరూ సర్దుకున్నారు . నర్మద , తన స్నేహితురాలి గురించి అడిగింది . ఆమెకి చిన్న దెబ్బలే తగిలాయని , బాగానే ఉందని చెప్పింది సిస్టర్. నిజానికి కౌర్ ఆక్సిడెంట్ స్పాట్ లోనే చనిపోయింది ! నర్మద ఆక్సిడెంట్లో సృహ కోల్పోయింది . శరీరమంతా గాయాలు అయ్యాయి .వెంటనే హాస్పిటల్ కి తీసుకు వచ్చారు. నుజ్జు,నుజ్జు అయిపోయిన, రెండు కాళ్ళు తొలిగించారు డాక్టర్లు .అది జరిగి దాదాపు నాలుగు రోజులు అయ్యింది . తరువాత పది రోజులలో నర్మదని డిశ్చార్జ్ చేశారు .

          “అయ్యో! ఇక అనుక్షణం అప్రమత్తంగా ఉండి ,ఉరకలు,పరుగులు పెట్టవలిసిన , కార్డియాలిజిస్టు గా పనికిరానే” అన్న బాధతో  ,నర్మద , మనస్సు మూలిగింది .నరేష్,రజని , నర్మదని , వీల్ చైర్ ఏర్పాటు చేసుకుని, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్
కి, అక్కడ నుంచి హైదరాబాద్ , తీసుకు వెళ్ళారు . ఆ లోపల నరేష్ ,నర్మద రూమ్ కి వెళ్ళి సామాన్లు తీసుకు వచ్చేసాడు .

* * *

          హైదరాబాద్ వచ్చిన తరువాత ,నర్మద శారీరకంగా కోలుకోడానికి దాదాపు రెండు నెలలు పట్టింది . అప్పడివరకు ఒక డాక్టర్ల సమూహం, నర్మదకి అన్ని విధాలా సాయపడింది . నర్మద, మానసికంగా కోలుకోడానికి, ఇంకా సమయం పట్టింది . ఆమె వీల్ చైర్ కే పరిమితం అయ్యింది.మెల్లి, మెల్లిగా నర్మద, కొత్త జీవితం అలవాటు చేసుకుంది . మొదట్లో, ఇంకొకరి సహాయంతో, అటు,ఇటు తిరిగేది .క్రమంగా నర్మద, ఎవరి సహాయం లేకుండా, వీల్ చైర్లో ఇల్లంతా తిరిగేది . అలాగే మెల్లి,మెల్లిగా పార్క్ వరకు కారులోను , పార్క్ లోపల స్వయంగాను కదలడం నేర్చుకుంది . అలాగే బుర్ర చెద పట్టిపోకుండా , మెడికల్ స్టూడెంట్స్ కి ,పీ.జీ స్టూడెంట్స్ కి , ఉచితంగా , కార్డియోలోజి ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టింది . అలా శారీరకంగా , మానసికంగా ,చాలా చురుకుగా ఉండేది . సౌకర్యంగా ఉంటుందనీ ఇంట్లోనూ , బయటకు వెళ్ళినప్పుడు కూడా నైటీ వేసుకునేది .

          అది వేసవి కాలం. ఆ రోజు సాయంత్రం పార్క్ కి వెళ్ళింది నర్మద . క్రమేపి వెలుగు తగ్గి ,చీకట్లు కమ్ముకోసాగాయి . ఎండ వేడి తగ్గింది .పార్క్ లో లైట్లు వేశారు . అక్కడ పెద్దలు అటు ,ఇటు తిరుగుతూ ,కబుర్లు చెప్పుకోసాగారు .అంతలో ఒక అనూహ్య సంఘటన జరిగింది . ఒక రెండు ,మూడు సంవత్సరాల పిల్లాడు , బంతితో ఆడుకుంటూ, హఠాత్తుగా , పార్క్ లో ఒక ఎలక్ట్రిక్ పోల్ పట్టుకున్నాడు. షాక్ తగలడంతో పెద్దగా  అరవడం మొదలు పెట్టాడు . కొంతమంది ఏమి చేయాలో తోచక కంగారు పడసాగారు . ఇంకొంతమంది దుర్మార్గులు అయితే ,జరుగుతున్న దాన్ని , వాళ్ళ సెల్ ఫోన్లో
చిత్రీకరిస్తున్నారు . ఆ పిల్లాడుకి దగ్గరలో ఉన్న నర్మద , వేగంగా తన వీల్ చైర్ నడిపించు కుంటూ వెళ్ళి ,తన నైటీతో , పిల్లాడిని ఒక్కసారిగా లాగింది. ఆ కుదుపుకి ఆ పిల్లాడు , తన వీల్ చైర్ తో సహా నర్మద, కింద పడ్డారు. నిజానికి నర్మద శరీరానికి ,పిల్లాడి శరీర భాగం
ఏ మాత్రం తగిలినా, ఇద్దరూ పెద్ద ప్రమాదంలో పడిపోయేవారు . కానీ నర్మద ఏ మాత్రం సంకోచించకుండా, సాహసం చేసింది . అతనిని కాపాడింది . అప్పుడు చుట్టూ పక్కల జనం పోగయ్యారు. వాళ్ళు నర్మద ని లేపి, వీల్ చైర్ లో కూర్చోబెట్టారు . పిల్లాడిని ఒకరు
ఎత్తుకున్నారు . పిల్లాడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది .

          “అమ్మా …అన్నీ బాగున్న అందరూ విడ్డురం చూస్తుంటే, మీరు ప్రాణానికి తెగించి , మా బాబుని కాపాడారు” అని ఏడుస్తూ, నర్మదని కౌగలించుకుని , కాళ్ళమీద పడింది.

          “లేమ్మా.నేను చేసింది ఏమీ లేదు .ఒక డాక్టర్ గా, ఎంత ప్రయత్నం ,ఏ ప్రయత్నం చేసన్నా, ఒక ప్రాణం కాపాడడం ,నా బాధ్యత . నేను నా బాధ్యత నిర్వహించాను అంతే” అని వినయంగా అంది నర్మద. విధి తన జీవితంతో క్రూరంగా ఆడుకున్నా , ధైర్య , సాహసాలతో , విధిని ఎదురించి, విజేతగా నిలుస్తోంది డాక్టర్ నర్మద. ఆ విషయం
మరొక్కసారి రుజువు అయ్యింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.