![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2019/07/VenutiraganiVennelaCoverPage-e1583726575828.jpg)
వెనుతిరగని వెన్నెల(భాగం-67)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది.
***
“మీరు నాకు బాగనె గుర్తుకున్నారు మేడం. రెండేల్ల కిందట స్పాట్ వాల్యుయేషన్ ల మీ పక్క పొంటి బెంచిల ఉంటి. కాకుంటె ఇంగ్లీషు డిపార్టుమెంటు” అన్నాడు ఆయన.
“ఆ.. గుర్తొచ్చింది సార్. మీరు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు?” అంది తన్మయి.
“ఇప్పుడు ఏడ చేస్తలేదు మేడం. అయిదేండ్ల పర్మిషను మీద పీ.ఎచ్.డీ చెయ్యనీకి అమెరికకు పొయ్యుంటి. రెండు వారాల సెలవు పెట్టి హైద్రబాదు ఒచ్చి ఉంటి.” అన్నాడు.
తన్మయికి ఆశ్చర్యంగా “ఇతర దేశాల్లో చదువుకుందుకు మనకు గవెర్న్మెంట్ అయిదేళ్లు పర్మిషన్ ఇస్తుందాండీ” అంది.
“ఇస్తది మేడం. ఉద్యోగానికి పోతె కూడా ఇస్తది. ఐదేండ్ల లాంగ్ లీవుకి అప్లై చేసుకోవాలె. కానీ జరంత ఆలస్యమైతది. ముందుగాల కాలేజీల అడ్మిషను గానీ, జాబు గానీ కరారు చేసుకోవాలె. వెంబడె లీవు అప్లికేషను గవర్నమెంటుకు పంపాలె. అమెరికల జాయిను అయెటందుకు ఎట్లయిన మీకు ఆరు నెల్ల పైమీకి సమయముంచుకోవాలె. అందుట్ల మీరు పర్మిషన్ తెచ్చుకుంటిరంటె అయిపాయె” అన్నాడు.
తన్మయి శ్రద్ధగా వింటూండడం చూసి “మీరు ఇంగ్లీషుల మంచిగ మాట్లాడుడు నే జూసిన. మీరు గిట్ల కాలేజీల అడ్మిషను ట్రై చేయురి.” అన్నాడు మళ్లీ.
తన్మయి చిరునవ్వు నవ్వి “లేదు సార్, మాకంత స్థోమత లేదు” అంది.
“ఆడికి పొయ్యెటందుకు, ఒక సంవత్సరం ఉండేటందుకు పైసల్ జమ చేసుకురి. కాంపస్ లల జాబు పార్ట్ టైము గిట్ల వచ్చిందంటె కతం పైసల్ ఫికర్ ఉండనె ఉండదు” అన్నాడు.
“అయినా కష్టమే సార్, ఇవన్నీ అయ్యేవి కావు నాకు. ఇక్కడ పీ.ఎచ్.డీ చేస్తున్నా” అంది.
“అయితె కెనడా, న్యూజిలాండ్ గిట్ల ఫామిలీ ఇమ్మిగ్రేషను ట్రై చేయురి. బాగ చదుకున్నవోళ్లకోసం ఆ దేశాలు చూస్త ఉంటయి. ఎట్లను మీరిక్కడనె పీ హెచ్ డీ చేస్తుంటిరి కదా, అది కాగనె అప్లికేషను పెడితిరంటె ఈజీ అయితది ప్రాసెస్. కాకుంటె మస్తు పైసల్ ఖర్చయితయ్యని ఇన్నా. హిమాయత్ నగర్ల ఏజన్సీ ఉన్నది ఒకపారి పొయ్యి కలువురి. మీకు ఎంతో భవిష్యత్తు ఉన్నది మేడం. అసుంటి చోట్ల మీరు, మీ ఫామిలి మంచిగ సెటిల్ గావచ్చు” అన్నాడాయన కిటికీ లోంచి బయటికి చూస్తూ.
దాదాపు నలభయ్యేళ్లుంటాయేమో ఆయనకు.
గొప్ప ఆశావహంగా మాట్లాడుతున్న ఆయనతో బస్సు దిగే వరకూ మాట్లాడుతూనే ఉంది. దిగే ముందు ఆయన రాసిచ్చిన ఫోను నంబరు, అడ్రసు కాగితాన్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకుంది. ఏ నెలకానెలే ఖర్చులతో సతమతమవుతూ పదివేలు కూడా సేవింగ్సు లేని తమకు అవన్నీ సాధ్యమయ్యే పనులు కావని తెలిసినా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటికైనా డబ్బులు కూడబెట్టి ఒక్క దేశమైనా చూసి రావాలన్నదే గొప్ప ఆకాంక్ష. అసలు మరో దేశం చూడడమే గొప్ప విషయం ఇక అక్కడే ఉండే అవకాశం వస్తే బహుశా: తన జీవితంలో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటా.
సమస్యల్లేని జీవితాన్ని ఊహించుకున్నందుకే మనస్సంతా తెలియని హాయిగా అనిపించింది తన్మయికి.
ఉదయపు బాధలన్నీ తీరిపోయినట్లు అనిపించింది ఇంటికి రాగానే. తలారా స్నానం చేసి గదిలో ఉన్న “Knowledge is strength – Weakness is death” పోస్టర్ దగ్గిర రెండు అగరొత్తులు వెలిగించి కళ్లు మూసుకుని నిలబడింది కాస్సేపు. పొద్దుటి నించీ ఉన్న అలసటంతా తీరి కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. పెందరాళే పిల్లల్ని నిద్రపుచ్చింది.
ప్రభు రావడం ఆలస్యం అవుతుండడంతో కంప్యూటరు ముందు కూచుంది. బయట సన్నగా చినుకులు పడ్తున్న శబ్దం వినబడసాగింది.
ఈ మధ్యనే సెకండ్ హ్యాండ్ డెస్కు టాపు కంప్యూటరు ఒకటి ప్రభు తన స్నేహితుడి దగ్గిర నించి కొని తెచ్చేడు.
బీ ఎస్ ఎన్ ఎల్ ఫోను ద్వారా ఇంటర్నెట్టు కావల్సి వచ్చినపుడు మాత్రమే కనెక్టు చేసుకోవాలని, లేకపోతే బిల్లు బాగా ఎక్కువ అవుతుందని ప్రభు ముందే హెచ్చరిం చేడు.
సాధారణంగా ప్రభు ఇంటికి వస్తూనే కంప్యూటరు ముందు కూర్చుని అర్థరాత్రి వరకూ ఏదో పని చేస్తూనే ఉంటాడు.
తన్మయి కోసం ఒక గెస్టు లాగిన్ పెట్టి ఇచ్చేడు.
తనంతట తను కంప్యూటరుని మొదటిసారి ఆన్ చేసింది తన్మయి.
ఏది నొక్కితే ఏమవుతుందో అని బెరుకుగా అంతకు ముందు కొద్ది కొద్దిగా నేర్చుకున్న పరిజ్ఞానంతో ఇంటర్ నెట్టు ఎక్ష్ ప్లోరర్ లో, యాహూ సెర్చిలో బస్సులో లెక్చరర్ చెప్పిన కాలేజీ సైటు ఓపెన్ తీసింది ముందుగా.
ఎంత వెతికినా తెలుగు భాషలో ఉన్నత విద్యా కోర్సులు ఎక్కడా కనబడలేదు.
ఇక కెనడా, న్యూజిలాండ్ దేశాల చిత్రాలు చూసింది. అక్కడి సంస్కృతుల గురించి వివరాలు చదివింది.
సరిగ్గా ఒకేఒక్క గంటలో వెళితే బావుణ్ణన్న ఉత్సాహమంతా పోయి, మనస్సులో ఏదో తెలియని దిగులు మొదలయ్యింది. ఇప్పటి వరకూ ఉన్న జీవితాన్ని అమాంతం ఒదిలి కొత్త ప్రాంతంలోకి వెళ్లి స్థిరపడడమా?
కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వదిలి మళ్లీ ఎక్కడో పునః ప్రారంభించడమా?
ఆలోచిస్తూంటేనే నీరసం రాసాగింది.
అంతలోనే “ఆలూ లేదూ చూలూ లేదన్న” సామెత గుర్తుకు వచ్చి తన అర్థం పర్థం లేని ఆలోచనలకి తననే తిట్టు కుంటూ అలసటతో పాపాయి పక్కన జేరబడింది. అనుకోకుండానే నిద్రలోకి జారుకుంది. ప్రభు ఎప్పుడు వచ్చేడో తెలియదు. కరెంటు ఎప్పుడు పోయిందో కూడా తెలియదు
“తనూ! భోజనం చేద్దాం దా” అంటూ తట్టి లేపుతున్న ప్రభుని చూడగానే మెడని కౌగిలించుకుంది.
“ఏంట్రా, అంతా ఓకేనా” అన్నాడు నవ్వుతూ పక్కన కూచుంటూ.
మాట్లాడకుండా అలాగే అతని భుజమ్మీద తలాన్చి ఎంతో సేపు ఉండిపోయింది.
తన్మయి మౌనాన్ని మరోలా అర్థం చేసుకుంటూ– “మీటుంగులో ఆలస్యమైపోయిం దిరా. ఇలా బాధపడితే ఎలా చెప్పు. అయినా నీకొక సంతోషకరమైన వార్త చెప్పాలని త్వరత్వరగా డ్రైవ్ చేసుకొచ్చేను” అన్నాడు మెల్లిగా లేచి తల తుడుచుకుంటూ.
“ఏవిటన్నట్టు” చూసింది.
“నన్ను మా ఆఫీసు వాళ్లు నెల రోజుల కోసం బిజినెస్ ట్రిప్పు మీద అమెరికా పంపిస్తున్నారు. సోమవారం వీసా కోసం మద్రాసు వెళ్లి రావాలి నేను……..” అంటూ చెప్పుకెళ్లిపోతున్న ప్రభు మాటలు నమ్మలేనట్లు సంభ్రమంగా చూసింది.
అంతలోనే దిగులు కమ్ముకొచ్చి కళ్లు తుడుచుకుంది. నిజానికి సాయంత్రమంతా తనేదైతే ఆలోచించిందో అదే ప్రభు చెప్తున్నా దుఃఖం ఆగడం లేదు.
బట్టలు మార్చుకుంటూ వెనక్కి తిరిగి చెప్పుకెళ్లిపోతున్నాడు ప్రభు “……..ఆఫీసు వాళ్లు నన్ను పంపుతానంటే వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఒకనెల జీతమంత డబ్బులు ఎక్స్ ట్రా వస్తాయి వెళ్తే. వింటున్నావా?” అంటున్న ప్రభుతో
“ఒకవేళ పిల్లలు, నేనూ వచ్చే వీలుంటే? ఒకవేళ నీకు అక్కడే ఉద్యోగం వస్తే” తనలో తను గొణుక్కుంటున్నట్టు మెల్లగా అంది ప్రభుతో.
“ఆగాగు, నేను వెళ్తున్నది చిన్న బిజినెస్ ట్రిప్పు మీద. వెళ్లి అక్కడే స్థిరపడాలన్న పెద్ద ఆశలు పెట్టేసుకోకు. ఇక నా ఒక్కడి కంటే కంపెనీయే అన్ని ఖర్చులూ భరిస్తుంది. కానీ అందరం వెళ్లడానికి ఇప్పుడు మన దగ్గిర డబ్బులెక్కడున్నాయి చెప్పు? ఇక నిజంగా అక్కడ నాకు జాబ్ ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కనీసం మన ఆర్థిక కష్టాలు తీరే వరకైనా ఉండి వెనక్కి వచ్చేయ్యొచ్చేమో” అన్నాడు నవ్వుతూ.
ప్రభు మాటలు సగం అర్థమయీ కాకపోయినా ఒకటి మాత్రం అర్థమయ్యింది. “విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే వదులుకోకూడదని.” భోజనాలు కాగానే ఎప్పటిలానే ప్రభు కిందే ఆగిపోయేడు.
అర్థరాత్రవుతున్నా రాని ప్రభుతో అతని తల్లితండ్రుల సంభాషణ ఎలా ఉంటుందో ఊహించగలదు తను.
“నెల రోజులకే…” అని ప్రభు పదే పదే చెప్పడం వినిపిస్తూనే ఉంది.
ముందు వైపు తలుపు దగ్గిరికి వేసేసి గదిలో వెనక వైపు వెన్నెల పడ్తున్న బాల్కనీ లో కుర్చీలో నిట్టూరుస్తూ జేరబడింది.
“నా గది స్వప్నాలతో నిండిపోయింది
నా మది స్వగతాలతో కుంగిపోతోంది
ఇంక రావెందుకు ప్రభూ
శంకాకులమై ఈ రాత్రి సడలిపోతోంది“ –తిలక్ గుర్తొచ్చాడు.
ప్రభు ఒక్కడే వెళ్ళబోతూ ఉన్నా ఏదో ఒక కొత్త తొలిమెట్టు ఎక్కబోతున్న ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరో పక్క ప్రభు లేకుండా ఈ ఇంట్లో ఎలా గడపాలో అన్న బెంగ చుట్టుముట్టసాగింది.
***
ప్రభు వెళ్లి వచ్చేంత వరకూ తల్లితండ్రుల బ్యాంకు అకౌంట్లలో తగిన ఏర్పాట్లు చేసే వెళ్లేడు.
అయినా తన్మయి కాలేజీ నుంచి వచ్చేటపుడు రోజూ కాయగూరలు, మొక్కజొన్నలు, ద్రాక్షపళ్లు, కమలాఫలాల వంటివేవైనా కొనుక్కొచ్చి అందరికీ ఇవ్వసాగింది.
బాబుతో పాటూ, రాణి కూతురు బుజ్జికీ యథావిధిగా చదువు చెప్పసాగింది.
తన చిరకాల లక్ష్యమైన పీ హెచ్ డీ మీదే పూర్తిగా దృష్టంతా కేంద్రీకరించి థీసిస్ రఫ్ కాపీ తయారు చెయ్యసాగింది.
ప్రభు రాగానే యూనివర్సిటీకి వెళ్లి రావాలి.
ప్రభు గురించిన బెంగ చుట్టుముట్టకుండా అహర్నిశలూ థీసిస్ పనిలో మునిగి తేలసాగింది తన్మయి.
కానీ ఎంతకాదనుకున్నా నిద్రపోయే ముందు మహా దిగులు కమ్ముకొచ్చేది.
ప్రభు ఈ–మెయిల్ చెయ్యడం ఎలాగో నేర్పించినా తెలుగుని ఇంగ్లీషులో టైపు చెయ్యడం నచ్చదు తన్మయికి.
ఇక ఇంగ్లీషులో రాయడం అంతకంటే కృతకంగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
రోజూ నిద్రొచ్చే వరకూ ప్రభుకి ఒక ఉత్తరం రాసి కంప్యూటరు బల్లసొరుగులో భద్రంగా దాచిపెట్టసాగింది.
కాస్త ఖాళీ దొరికితే చాలు పెళ్ళికి ముందు సంవత్సర కాలం పాటు తామిద్దరూ రాసుకున్న ఉత్తరాలు తీసి చదువుకోవడం, అతని లాలన గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రభు మీద బెంగ మరింత పెరగసాగింది.
అక్కడినించి ఫోను కాల్ బాగా ఖరీదవుతుందని వెళ్ళగానే మాత్రమే చేసేడు.
కాలేజీకి వెళ్లి రావడం, పిల్లల్ని చూసుకోవడం, పీ హెచ్ డీ పనులతో నెలరోజులు క్షణం తీరిక లేకుండా గడిచిపోయేయి. తను లేనప్పుడంతా ఇంట్లో తన్మయికీ, తల్లి దండ్రులకూ ఎటువంటి గొడవలూ లేకపోవడం బాగా సంతోషాన్నిచ్చినట్లుంది ప్రభుకి.
అక్కడి నించి బయలుదేరే ముందు ల్యాండ్ ఫోను చేసి సంతోషంగా మాట్లాడేడు.
***
కిందన ప్రభు వచ్చిన అలికిడి వినబడగానే తన్మయి కిందికి పరుగెత్తుకు వచ్చింది.
ప్రభుని చూడగానే అమాంతం కౌగిలించుకోవాలన్న ఆకాంక్షని బలవంతంగా ఆపుకుంది.
తన్మయి వైపు చూస్తూ పలకరింపుగా చిన్న నవ్వు నవ్వి చూపు తిప్పుకున్నాడు ప్రభు.
కానీ అతని కళ్ళల్లో గొప్ప ప్రేమ తొణికిసలాడింది తన్మయికి.
రాగానే కనీసం రిఫ్రెష్ అవకుండా సూట్ కేసులు తెరిచి తెచ్చిన బొమ్మలు, చాక్లెట్లు, గిఫ్ట్ లు తలా ఒకటీ ఇవ్వసాగేడు ప్రభు. ఒక పక్కగా నిల్చుని చూస్తున్న బాబుని దగ్గిరికి పిలిచి టోపీ ఒకటి నెత్తిమీద పెడుతూ, చేతిలో చాక్లెట్టు పెడుతూ “ఇవి నీకు” అన్నాడు.
అంత దానికే బాబు మురిసిపోతూ గెంతులు వేయసాగేడు. అందరికీ అన్నీ ఇచ్చినా వాళ్ల ముఖాల్లో ఆ ఒక్క విషయానికి చికాకు స్పష్టంగా కనిపించింది.
చివరిగా పెద్ద టెడ్డీ బేర్ బొమ్మతోబాటూ, బట్టలు, బూట్లు వంటివెన్నో వున్న చిన్న చిన్న వస్తువుల మధ్య పాపని తెరిచిన సూట్కేసులోనే కూర్చోబెట్టి “ఇవన్నీ నీకేరా బంగారం” అని ముద్దు చెయ్యసాగేడు ప్రభు.
బాబుని కూడా పట్టించుకున్నందుకు తన్మయికి ఎంతో సంతోషం వేసింది. ఎక్కడో చదివింది “మనిషి తను ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి వెళ్లి వస్తే దృక్పథం విశాలమవుతుందని“. పక్కనే ఇంకా తెరవని మరో సూట్కేసుని పైకి తీసుకెళ్లింది తన్మయి.
తెరవగానే “ప్రియమైన తనూ…..” అంటూ చేతిరాతతో ప్రభు తన కోసం రాసిన ఉత్తరాల కట్టని చూసి పొంగిపోయింది. సరిగ్గా తనలాగే ప్రభు కూడా రోజూ తనకి ఉత్తరాలు రాసేవాడన్నమాట. ఒక్కో పేజీ తిప్పి చూస్తూంటే అంతటి అవ్యాజమైన ప్రేమకు పాత్రమైనందుకు ఆనందబాష్పాలతో చెంపలు తడవసాగేయి తన్మయికి.
***
మరో నెల్లాళ్లల్లో థీసిస్ రఫ్ కాపీని మాస్టారికి సబ్మిట్ చెయ్యడం కోసం పాపని, బాబుని తీసుకుని ప్రభుతో బాటూ విశాఖపట్నానికి ప్రయాణమయ్యింది తన్మయి.
మేరీ సాయంతో యూనివర్సిటీకి దగ్గర్లోని YMCA లో రెండు రోజులకు బస ఏర్పాటు చేసుకున్నారు.
పొద్దుట లేస్తూనే గది బాల్కనీలో నుంచి ఎదురుగా కనిపిస్తున్న సుందర సాగర దృశ్యాన్ని కళ్లనింపుకుంటూ తన్మయత్వంలో మునిగితేలింది తన్మయి.
“ప్రభూ! సాయంత్రం బీచికి వెళ్ళొద్దాం” అంది.
“అలాగే. నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా” అన్నాడు ప్రభు నవ్వుతూ.
పిల్లల్ని లేపి గబగబా తయారుచేసి తొమ్మిది గంటలకల్లా డిపార్టుమెంటుకి చేరుకున్నారు.
డిపార్టుమెంటు ఆఫీసులో క్లర్క్ తన్మయిని చూస్తూనే “నమస్తే మేడం, రండి కూర్చోండి” అన్నాడు మర్యాద పూర్వకంగా. తనకి జే ఆర్ ఎఫ్ వచ్చినప్పటి నుంచి ఆఫీసు స్టాఫ్ అంతా ఇలా నమస్కారాలు చెప్పడం మొదట్లో కొత్తగా ఉన్నా తర్వాత్తర్వాత అలవాటు అయిపోయింది తన్మయికి.
తన్మయి ప్రతిగా నమస్కరిస్తూ “మాస్టారిని కలవాలండి” అంది.
పక్కనే ఉన్న ప్రభుని, పిల్లల్ని చూస్తూ “నమస్తే సార్, పిల్లలా మేడం?” అని,
“మేస్టారిని కలవడానికి ఇక అప్పాయింటుమెంటు అవసరం లేదండి. ఇప్పుడు హెడ్డు కాదు కదా!” అన్నాడు.
అప్పటికే అక్కడ తచ్చాడుతున్న అటెండరు “నాతో రండి. మేస్టారి ఆఫీసు రూము తెరుస్తాను” అని వెంటబెట్టుకుని తీసుకెళ్లబోయేడు.
వెళ్లబోతున్న తన్మయితో క్లర్కు లోగొంతుకతో “మేడం, మనలో మన మాట. డిపార్టుమెంటులో సీనియర్ ప్రొఫెసర్లు ముగ్గురు రాబోయే సంవత్సరం రిటైర్ అవబోతున్నారు. ఈలోగా మీరు తొందరగా పీ ఎచ్ డీ పూర్తిచేసేరంటే, నోటిఫికేషన్ పడగానే మీకు తెలియజేస్తాను” అన్నాడు.
తన్మయి చిన్నగా నవ్వుతూ “అలాగేనండీ. ఈ లోగా పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను, చాలా థాంక్స్” అని లేచి అటెండరును అనుసరించింది.
తన్మయికి ఎమ్మే సీటు వచ్చిన మొదటి రోజు నుంచి అనుక్షణం జరిగిన ప్రతీ ఒక్కటీ జ్ఞాపకం వచ్చేయి.
గంటల తరబడి డిపార్టుమెంటు బయట బెంచీ మీద చంటిపిల్లాణ్ణి ఎత్తుకుని కూచుని నోట్సులు రాసుకున్న రోజులు, తినీ తినకా చెట్టు కింద కూచుని జే ఆర్ ఎఫ్ కోసం చదివిన పుస్తకాలు జ్ఞాపకం వచ్చేయి.
తనకి జే ఆర్ ఎఫ్ రాకపోతే తనని ఇలాగే గౌరవించేవారా?
తన జీవితంలో జే ఆర్ ఎఫ్ ఫెలోషిప్ రావడం ఎంత పెద్ద మార్పు తెచ్చిందో తలచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.
మొట్టమొదట అప్పటివరకూ ఉన్న ఆర్థిక కష్టాలు తొలగి, తనకు గొప్ప ఆత్మసైయి ర్యం వచ్చింది.
పీ ఎచ్ డీ హాస్టల్ లో సీటు వచ్చి నిలువనీడ, కేంటీన్ నుంచి మూడు పూటలా భోజనం కొనుక్కోగలిగిన ఆర్థిక స్థోమతా వచ్చేయి.
డిపార్టుమెంటులో తను ఎమ్మే చదివేటప్పుడు ఆఫీసు రూములోకి అడుగుపెడ్తే కసురుకునే క్లర్కులు, అటెండర్లు లేచి నిలబడి మరీ నమస్కారాలు చెప్పసాగేరు.
జీవితంలో నిలదొక్కుకోవడం, ఉన్నత స్థితికి చేరడం ఎంత విలువైనవో అర్థం కాసాగేయి.
పాపాయి ప్రభు ఒళ్ళో నుంచి కిందికి దూకుతూ నడవడానికి ప్రయత్నిస్తూండడంతో ఈ లోకంలోకి వచ్చిపడింది తన్మయి.
“మాస్టారు వచ్చేలోగా అలా కేంటీన్ వరకు వెళ్లొస్తాం” అంది లేస్తూ బయట ఉన్న అటెండరుతో. వరండా చివర ఎదురుగా వస్తున్న మరో అటెండరు నమస్కరిం చేడు.
బాబు ఆశ్చర్యంగా చూస్తూ “అమ్మా! నువ్వు ఇక్కడ స్టూడెంటా? టీచరా?” అన్నాడు.
తన్మయి నవ్వుతూ ప్రభు వైపు చూస్తూ “అమ్మ కూడా ఒకప్పటికి ఇక్కడ టీచరయి పోతుందని వీళ్ల నమ్మకమేమో” అంది.
ప్రభు ప్రశంసా పూర్వకంగా చూస్తూ ” నువ్వు తల్చుకోవాలే గానీ తప్పకుండా అవుతావు” అన్నాడు.
తన్మయికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయ్యింది ప్రభు మాటలకి. ప్రభు దగ్గిర తనకి బాగా నచ్చేదదే. తను నమ్మిన ప్రతిదీ సాధించగలదన్న గొప్ప ధైర్యాన్నిస్తాడు.
“ఇదిగో ఇది మా భాషాశాస్త్రం క్లాసురూము. ఇది ఆధునిక సాహిత్యం” అంటూ క్లాసురూములన్నీ తిప్పి చూపించింది.
డిపార్టుమెంటు బయట ప్రభు తన్మయిని మొదటిసారి చూసినప్పటి బెంచీ మీద కూచుని ఫోటోలు తీసుకుంది.
“మా కేంటీన్ లో పొగలు కక్కే ఇడ్లీ తినాలి” అంటూ కేంటీన్ వైపు హుషారుగా అడుగులు వేసింది.
*****
(ఇంకా ఉంది)
![డా||కె.గీత](http://www.neccheli.com/wordpress/wp-content/uploads/2019/07/20190709_223131.png)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.