![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2022/05/Durga-e1652332299232.jpg)
వ్యాధితో పోరాటం-29
–కనకదుర్గ
అపుడే జాండిస్ జ్వరం వచ్చింది. ఇంక ఆ స్కూల్ కెళ్ళడం మాన్పించేసారు. ముందు వెళ్ళిన స్కూల్ లోనే 7వ తరగతి పరిక్ష రాయడానికి కొంత డబ్బులు తీసుకుని ఒప్పుకున్నారు. చాలా వరకు ట్యూషన్లో చదువుకుని పరీక్షలు రాసాను. పాస్ మార్కులతో మొత్తానికి పాసయ్యాను. 1978 నవంబర్లో మా అన్నయ్య భాను పెళ్ళయ్యింది. ఆ పెళ్ళికి జరిగిన హడావుడి, వాదనలు, నాన్నకు, అన్నకు మధ్య గొడవలు చూసి చాలా భయ మేసేది. అన్నకి అపుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదే, ఉద్యోగం వచ్చాక చేసుకుంటా నని అన్నఅనేవాడు, నాన్నేమో చిన్నోడు పోయిన భాదలో వున్నాము, ఇంట్లో ఒక మనిషి ఉంటే అమ్మ కూడా కోలుకుంటుంది అని. అన్నేమో నేను సాంప్రదాయమైన పెళ్ళి చేసుకోను, స్టేజ్ పెళ్ళి చేసుకుంటానని, అపుడు కొంచెం ఫ్రెండ్స్ తో కమ్యూనిజం ప్రభావంలో వుండేవాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధేసేది. ఒకోసారి నాన్న కరెక్ట్ అనిపించేవాడు, మరోసారి అన్న కరెక్ట్ అనిపించేవాడు. ఒకోసారి నాన్న, అన్న వాదించు కున్న తర్వాత, ఒకోసారి అన్న రాత్రి ఇంటికి వచ్చేవాడు కాదు. మాకు చాలా భయ మేసేది. మొత్తానికి పెళ్ళికి ఒప్పుకున్నాడు అన్న. పెళ్ళయిన ఏడాది లోపల మైత్రి పుట్టింది, అమ్మా, నాన్నకు మొట్టమొదటి మనవరాలు, నాకు, అమ్ములు అక్కకు మేన కోడలు. మైత్రిని ఒక్క నిముషం వదిలిపెట్టేవాళ్ళం కాదు. అన్నకి బాధ్యత అంటే ఏంటో తెలియడం మొదలుపెట్టింది. ట్రావెల్ అండ్ టూరిజంలో ఏడాది డిప్లొమా కోర్స్ చేసాడు, గైడ్ గా పని చేస్తుండగానే ఎ.పి. ట్రవెల్ అండ్ టూరిజంలో ఉద్యోగం వచ్చింది.
నా 8 వ తరగతి అట్లా అట్లా సాగింది, 9వ తరగతి అప్పుడు నాకు భయం వేసింది ఎందుకంటే తమ్ముడు పోయిన భాదలో అమ్మ, నాన్న అక్క పదవ తరగతిలో వుండగానే మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి చేయడానికి నిర్ణయించారు, నేను 7వ తరగతిలో ఉండగా. అతను ఇపుడు నిశ్చితార్ధం చేసుకుని పి.హెచ్.డి అయిపోగానే చేసుకుంటా నన్నాడు, కానీ మా అమ్మ నిశ్చితార్ధం అయినా తర్వాత క్యాన్సిల్ అయ్యే పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి. చేసుకుంటే ఇపుడే చేసుకోవాలి అని పట్టు పట్టింది. అతనికి మా అక్క రాధ (అమ్ములు) బాగా నచ్చింది, అతని పేరు గోపాల్. అక్క చిన్న పిల్ల, మేజర్ కూడా కాలేదు. ఈ సంబంధం వదులుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. బాగా చదువుకున్నాడు కాబట్టి అక్కని కూడా బాగా చదివిస్తాడనుకుని ’80 మే నెలలో పెళ్ళిచేసారు. పెళ్ళయిన ఏడాదిన్నరలోగా బాబు పుట్టాడు. మా ఇంట్లోనే వుండేవారు. చిన్నపిల్ల తనకి అన్నీ చేసుకోవడానికి రాదు, ఇక్కడ వుంటే మేమంతా సాయం చేయొచ్చని, ఆ తర్వాత కూడా పిల్లలతో ఒక్కతి అవస్థ పడుతుందని అమ్మా, నాన్న నా పెళ్ళి తర్వాత అక్కడే ఎక్కువ వుండేవారు. నేను సరిగ్గా చదువుకోకపోతే పెళ్ళి త్వరగా చేసేస్తాడేమోనని భయం వేసి చదువు మీద శ్రద్ద పెట్టి చదవడం మొదలుపెట్టాను. అక్క, బావ కొన్నిరోజులు మా ఇంటికి దగ్గరే రెండు రూములు అద్దెకి తీసుకొని వున్నారు. నాన్నకి చాలా గర్వంగా వుండేది, తన అల్లుడు పి.హెచ్.డి చేస్తున్నాడు, అన్నీ తెలిసిన వాడు, కూతురు బాగా సుఖపడ్తుందనే నమ్మకముండేది. పెళ్ళయిన కొత్తలో ఆయన కూర్చొని ఏ విషయాలు చెప్పినా అందరూ కూర్చొని ఎంతో శ్రద్దగా వినేవారు, ముఖ్యంగా మా అమ్మా, నాన్నలు.
ఆ తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు మొదలయ్యి అన్నా, వదిన మేమున్న కాలనీలోనే ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని వుండసాగారు. మా వదిన కూడా స్కూల్లో పని చేయసాగింది. మా బావ గోపాల్ సోషియాలజీలో పి.హెచ్.డి చేస్తున్నా ఆయన ఆలోచనలన్నీ సాంప్రదాయపు, పురుషాధిక్య ఆలోచనలు. నేను పదమూడేళ్ళ వయసులో అంటే పెళ్ళయిన కొన్ని నెలల తర్వాతేమో ఒకరోజు మా బావ వాళ్ళ బావ వచ్చారు మా ఇంటికి. వాళ్ళు కల్సినపుడల్లా ఏదైనా స్పెషల్ పార్టీ వుండాలి. అమ్మ, అక్క వంటింట్లో వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు, తిండితో పాటు డ్రింక్ కావాలని వాళ్ళిద్దరూ వెళ్ళి తీసుకొచ్చారు. నాకు ఇదంతా చిరాకుగా అనిపించింది. నాన్న వేరేగా అయిపోతున్నాడని పించేది, మా ఇంట్లో ఇవన్నీ చేయరు. నాన్న నాకు కోపం వచ్చిందని చూసి నా దగ్గరకు వచ్చి, “ఎందుకమ్మా, అంత కోపం. నువ్వు చిన్నపిల్లవు. ఇంటి విషయాలన్నీ పట్టించుకో వద్దమ్మా! అయినా ఆయనెవరు, మన బావే కదా! తన సంతోషం కోసం చిన్న పార్టీ అంతే,” అన్నాడు.
నేను వెంటనే, “బావంట బావ, ఏం బావ? బోడి బావ,” అన్నాను. ఈ మాట బావ వాళ్ళ బావ విని,” ఓరేయ్ గోపాల్, బొడ్డూడని పిల్ల నిన్నుబోడి బావ అంటుందిరా! నీకసలు ఈ ఇంట్లో మర్యాదనేది వుందా, లేదా?” అని గట్టిగా అరిచాడు. ఈయన అరవకపోతే మా బావ పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో!
ఆయన మా నాన్నతో, ” ఏంటండీ ఇది. అయినా మనం ఏం చేసుకుంటే చిన్నపిల్ల తనకెందుకండీ! నన్ను ఇంత అవమానపరుస్తుందా? అసలేమనుకుంటుంది తనని తాను?” అని కోపంతో వూగిపోయాడు.
నాన్న,”అదేదో కోపంలో అన్నది పట్టించుకోకండి…. అని అంటూనే వున్నాడు
“చిన్నపిల్ల తనకే అంత కోపం వుంటే ఈ ఇంటికి పెద్దల్లుడిని నాకెంత కోపం వుండాలో ఆలోచించండి….అసలు అది చిన్నపిల్లా? ఎపుడు చూడు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూరుస్తుంది….”
నాన్ననాకు సపోర్ట్ చేయడని తెలుసు. నేను అమ్మ వైపు చూసాను.
“ఏదో చిన్న పిల్ల అంత కోపం ఎందుకండీ? అది తెలియక ఏదో అన్నది మీరే పెద్ద మనసు చేసుకుని వదిలేయాలి. ఒక్కమాట కోసం ఇంత గొడవెందుకండి,” అన్నది అమ్మ.
మా బావ వాళ్ళ బావ, మా నాన్నతో, ” ఇదేంటండీ మీ ఇంట్లో ఆడవాళ్ళే అన్ని నిర్ణయించేలా వున్నారు. మీ పాత్ర వుట్టిదేనా?”
మా నాన్నకు కోపం వచ్చింది అమ్మ మీద, “నువ్వూరుకో, నేను మాట్లాడుతున్నా కదా! నాయనా గోపాల్ నా కోసం దాన్ని క్షమించేయండి…” అన్నాడు.
నేను వెంటనే,”నువ్వెందుకు క్షమించమని అడుగుతున్నావు. అయినా ఇపుడు అంత పెద్ద తప్పేం జరిగిందని,” అన్నాను.
“ఇది మేమొప్పుకోమండి, ఆ పిల్ల వచ్చి మా వాడి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి అప్పటిదాక మీరేం చెప్పినా మేం వినం.” అని బావ వాళ్ళ బావ అని రెండు కుర్చీలు జరుపుకుని తను కూర్చొని, మా బావని కూర్చోబెట్టాడు.
మా నాన్న గుండె డక్కుమంది ఎందుకంటే నేనెంత మొండిదాన్నో తనకి తెల్సు.
నాన్న నన్ను పక్కకి తీసుకెళ్ళి,” అమ్మా చిన్ని, చూడు నువ్వు కోపంలో అన్న ఒక్క మాటకి ఎంత పెద్ద గొడవయ్యిందో? వాళ్ళ కోపం తగ్గాలంటే నువ్వు బావ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి సారీ చెప్పు చాలు…”అన్నాడు.
“నాన్న నిజంగా ఆయన నువ్వన్నట్టు మన బావే అయితే ఇంత పెద్ద గొడవచేస్తాడా? నేను అంత తప్పు మాట ఏమన్నాను? నేనెందుకు సారీ చెప్పాలి?”
మేము పుట్టినప్పట్నుండి నాన్న మమ్మల్ని ఎపుడు కొట్టలేదు.
నాన్నకు కోపం వస్తుంది, “నిన్ను ఇంత గారాబంగా పెంచడం వల్లనే ఇట్లా తయారయ్యావు. నేను చెబ్తున్నాను అక్కడికి వెళ్ళి మన అక్క కోసం సారీ చెప్పాలి,’ అని తీసుకెళ్ళాడు అక్కడికి.
అయిదు నిమిషాలు, పది నిమిషాలు, పదిహేను నిమిషాలు గడిచాయి… నాన్న, “తొందరగా చెప్పు తల్లీ, రాత్రవుతుంది,” అంటున్నాడు కొన్ని నిమిషాలకొకసారి. నేను క్రిందికి చూస్తూ కాలి బొటన వేలితో నేలపై రాస్తున్నాను. 20 నిమిషాల తర్వాత మా బావ నన్ను చూసి, నువ్వేం చెప్పొద్దు వెళ్ళు,” అన్నాడు.
బావ వాళ్ళ బావ,”అదేంటిరా నిన్ను అన్ని మాటలంటే…” “పోనీలే బావ, తనకిష్టం లేనపుడు మనం ఎందుకు ఫోర్స్ చేయాలి? వెళ్ళు లోపలికి వెళ్ళు.” అని లేచి వెళ్ళి పోయాడు.
అప్పట్నుంచి మా ఇద్దరి మధ్య మన:స్ఫర్ధలొచ్చాయి. పెద్దయ్యాక ముఖ్యంగా నా పెళ్ళయ్యాక కొంచెం మాములుగా మాట్లాడటం అలవాటయ్యింది. ఆయన అంత త్వరగా అన్నీ మరిచిపోయే వ్యక్తి కాదు. నాకు వొంట్లో బాగాలేదనే నేపంతో నేను రాలేనని అనుకునో కానీ పిల్లల పెళ్ళిళ్ళకు పిలవలేదు. నేనెళ్తే ఎక్కడ వుంటుంది, నాకన్నీ క్లీన్ గా వుండాలి అన్నీ స్పెషల్ గా వుండాలి అనే ఆలోచనో కానీ నేనొక్క పెళ్ళికి కూడా వెళ్ళ లేదు. నన్ను కుటుంబం వాళ్ళు మర్చిపోయారని చాలా బాధేసింది.
అక్కకి బాబు జనవరి 13న అంటే భోగి రోజున పుట్టాడు, సిజేరియన్ చేసారు. మా నాన్నకు తన కొడుకే మనవడి రూపంలో పుట్టాడని చాలా సంతోషమేసింది. సిజేరియన్ కావడంతో అక్క మా ఇంట్లోనే వున్నారు. చిన్న వయసులో పిల్లల్ని పెంచడం రాని సమయంలో పిల్లలు పుడితే ఎలా వుంటుందో స్వయంగా చూసాను. అమ్మే బాబుని ఎక్కువగా చూసుకునేది. 9వ తరగతి నుండి నా చదువు మెరుగయ్యింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత కాసేపు చదువుకుని, పొద్దున స్కూల్ కి అన్నీ రెడీ చేసుకుని పడుకునే దాన్ని. ఈ లోపల బాబు లేస్తే వాడికి పాలు కలిపి ఇస్తే, అమ్మ తాగించి తన దగ్గరే పడుకోబెట్టుకునేది. వాడు చూడడానికి ముద్దుగా బొద్దుగా వుండేవాడు, శశాంక్ అని పేరు పెట్టారు. వాడ్ని, మైత్రిని నేను ఆడిస్తూ వుండేదాన్ని. బాబు పుట్టకముందు ఇంటర్మీడియట్ రెడ్డీ కలేజ్లో చేరింది మా అక్క. ఆయన స్కూటర్ పైన మా అక్క చక్కగా తయారయితే, ఇద్దరు జంటగా కల్సి వెళుతుంటే మా అమ్మా, నాన్నకు ఆనందంగా ఉండేది. పెళ్ళి ’80లో అయ్యింది, ’82 జనవరిలో బాబు పుట్టాడు. కాలేజ్ చదువు అట్లా వెనక పడింది కదా అని సంగీతం కాలేజ్ లో చేర్పించారు. తను వెళ్ళినపుడు శశాంక్ ని, మైత్రిని నేను ఆడిస్తూ వుండేదాన్ని.
పదవ తరగతి బాగా కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ రాసాను. సెలవుల్లో బాగా పుస్తకాలు చదివేదాన్ని. రిజల్ట్స్ వచ్చినపుడు మేము థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ చూసి నేను ఫెయిలయ్యానని నిర్ణయించేసారు. నేను పెరట్లోకెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. అపుడు మా ఐదో అత్త భర్త, ఆయన పిల్లలు మా ఇంట్లోనే వున్నారు. వాళ్ళిద్దరూ కూడా టెన్త్ పరిక్షలు రాసారు. రిజల్ట్స్ చూసే సమయానికి బయటకు వెళ్ళిపోయారు. తన కొడుకులు తప్పకుండా పాసవుతారనే నమ్మకంతో ఉన్నాడు మా మామయ్య. మా అన్నయ్య వచ్చి హాల్ టికెట్ తీసుకుని రమ్మని ఫస్ట్ థర్డ్ క్లాస్, సెకెండ్ క్లాస్ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ చూస్తుంటే నేనెళ్ళిపోతుంటే ఆపి చూసాడు అందులో నా నెంబర్ వుంది. అదే నాకర్ధం అవ్వలేదు, నేను అన్నీ కరెక్ట్ గా రాసాను, అన్నీ సబ్జెక్ట్స్ లో నేనెట్లా ఫేయిల్ అయ్యానా అని ఒక పక్క నిరాశ, ఒక పక్క నేను కనీసం సెకెండ్ క్లాస్ లోనయినా పాసవ్వాల్సింది కదా అనుకున్నాను. అన్నయ్య చూడగానే అందరూ సీరియస్ గా అయిపోయిన మొహాలన్నీ ఒక్కసారిగా ఆనందంగా మారిపోయాయి ముఖ్యంగా మా అమ్మా, నాన్న. నాన్న ఆశ్చర్యపోయాడు. ” నా తల్లి, రాత్రిళ్ళు కూర్చొని చదువుకునేది, చాలా కష్టపడింది. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా!” అన్నారు నాన్న.
మా మామయ్య పిల్లలు రాత్రికి వచ్చారు. ఆయన పిల్లల్ని రిజల్ట్ ఏమయ్యిందని అడిగితే పరిక్ష రోజు బస్ మిస్ అయ్యిందని అందుకే ఒకటి, రెండు పరీక్షలకు వెళ్ళలేదని చెప్పారు. అది విన్న ఆయనకు చాలా కోపం వచ్చింది. బీ.పి పెరిగిపోయింది. మా నాన్న అడ్డుకున్నారు పిల్లల్నికొట్టకుండా. అన్నకి డబ్బులిచ్చి స్వీట్ తెమ్మని చెప్పాడు, అమ్మ ఆలుబాత్ చేస్తానని అన్నది. నిజంగా చాలా ఆనందమేసింది. మళ్ళీ అంత ఆనందం జర్నలిజం కోర్స్ చాలా క్లాసెస్ మిస్ అయినా 9వ నెల వెళ్ళి పరీక్షలు రాసినా అందులో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేనసలు అది నాకు చాలా ఇష్టమైన కోర్స్ కాబట్టి ఏ మెరిట్లోనో పాసవ్వాలని ఉండేది. అంత కష్టపడి పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయినా మా నాన్న నన్ను పిలిచి మా ఐదో అత్త, కమలత్త పెద్దకొడుకుని పెళ్ళి చేసుకోమని అడిగాడు. నేను ఏడ్చేసాను, నాకు చదువుకోవాలని వుందని, నేను ఆరోగ్యంగా ఉండాలంటే నాకు స్పోర్ట్స్ ఆడాలని వుందని చెప్పాను. పెళ్ళి చేసుకొని కూడా అన్నీ చేసుకోవచ్చు. మా అక్కతో ప్రయత్నించారు కదా, ఎంతవరకు చదివింది? ఎంతవరకు సంగీతం నేర్చుకోగలిగింది. చాలా వరకు ఇంటి పని, వంట పని, పిల్లల పనితోనే సతమతమవుతూ వుంటుంది. పెళ్ళికి ముందు ఎంత అందంగా, ఆరోగ్యంగా వుండేదో అంత సన్నగా అయిపోయింది. మొత్తానికి నాకు, నా ఆలోచనలకు, మా బావ ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరలేదు. మా అక్క ఎవరు ఏది చెప్పినా వినేది, కానీ నేను ఆలోచించేదాన్ని, నా మనసులో ఏముందో భయపడకుండా చెప్పేదాన్ని. దాంతో మా ఇద్దరికి మన:స్ఫర్ధలొచ్చాయి.
నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా చాలా వత్తిడి తెచ్చారు నాన్న పెళ్ళి చేసుకోమని, తను రిటైర్ అవుతున్నాడు కాబట్టి చదివించలేను, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తన బాధ్యత తీరిపోతుందని అనేవాడు. అన్నా, వదిన వేరే వున్నారు, కొన్నాళ్ళయ్యాక శశాంక్ ని మంచి స్కూల్ లో చేర్పించాలని వాళ్ళు విధ్యానగర్ కి వెళ్ళిపోయారు, వాళ్ళకి పాప సుకృత కూడా పుట్టింది. అప్పుడు కూడా అమ్మా, నాన్నే బాధ్యత తీసుకుని అన్నీ చేసారు. పాపకి పెదవి సరిగ్గా లేకుండా పుట్టింది. అది చిన్నపుడే సర్జరీ చేసి సరి చేసారు. పిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నేనొక్కదాన్నే చదువు కుంటూ వుండడం వల్ల అమ్మా, నాన్నతో కల్సి సమయం గడపగలిగాను. నాన్న అనుకున్న ఆ సంబంధం నా ఆలోచనలు, నేను రాయడం, పుస్తకాలు చదవడం ఇవన్నీ నచ్చక వేరే సంబంధం చూసుకుని మంచి కట్నం తీసుకుని పెళ్ళి చేసుకున్నారు. నాన్నకు కొంచెం షాక్ అయ్యింది, అది అమ్మ, నా తప్పే అనుకున్నాడు. మొత్తానికి నా డిగ్రీ అయిపోయింది. ఒక సంవత్సరం మా అన్న ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ చెయ్యి అంటే చేరాను. చివరి వరకు కోర్స్ అయిపోవచ్చిందనగా నా అటెండెన్స్ లేదని పరీక్షలు రాయనీయలేదు. నేను టైప్ పరిక్షలు ఈ కోర్స్ లో చేరక ముందే తీసుకున్నను, పాసయి పోయాను. లాస్ట్ పీరియడ్లో టైపింగ్ ఉండేది. ఆ సార్ కి చెపితే అటెండెన్స్ వేసుకున్నాక వెళ్ళొచ్చు అన్నారు, నేను ఇంటికి వచ్చి అమ్మకి టీ చేసి యిచ్చి, ట్యూషన్స్ చెప్పే దాన్ని. పెళ్ళయినపుడే వాళ్ళు గోవా ట్రిప్ కి వెళ్ళారు. నెనపుడు అది మిస్ అయ్యాను. ముందు అటెండెన్స్ వేస్తాను అన్నతను నాకు అటెండెన్స్ ఇవ్వలేదు, ప్రిన్సిపాల్ కి కంప్లయింట్ చేసాడు. ఆవిడ పట్టు పట్టి నన్ను పరీక్షలు రాయనీయలేదు. నాకు చాలా బాధేసింది.
ఆ ఏడాదే పెళ్ళి కుదరడం, పెళ్ళయిపోవడం అన్నీ త్వరత్వరగా జరిగి పోయాయి. ఇంట్లో పిల్లలు ఎవ్వరూ లేకపోయేసరికి నాన్న, ఇంత పెద్ద ఇల్లెందుకు అమ్మేసి ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నారు. అన్నను తమతో వచ్చి వుంటే అందరం కల్సి వుందామని అడిగాడు నాన్న. అన్నకు ఇల్లు అమ్మడం ఇష్టం లేదు, కానీ గట్టిగా నిలబడి చెప్పలేదు కూడా. ఇల్లమ్మేసి వాటా ఇచ్చేస్తే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటామన్నారు కానీ కల్సి వుండమన్నారు. వాళ్ళు కూడా సిటీలోకి వెళ్ళిపోయారు. అన్నకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మొగపిల్లవాడు. అక్కకు ఒక కొడుకు, ఒక కూతురు. నాన్న ఇల్లు అమ్మేసి మారేడ్ పల్లి, చిన్నమామయ్య ఇంటి దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకుని ఉండ సాగారు. మేముండే ఇంటికి దగ్గర కాబట్టి వచ్చి, పోతూ వుండేవాళ్ళు. నాన్నకు మా అక్క పైన ప్రేమ ఎక్కువ వుండేది. ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే వుండేవారు, ఇంటికి వెళ్ళాలనిపిం చినపుడు వెళ్ళి కొన్ని రోజులో, నెలలో వుండి, వెళ్ళేవారు, మనవల పుట్టినరోజులకు, పండగలకు వెళ్తుండేవారు. అన్న కూడా వచ్చి చూసి వెళ్తున్నాడు, అమ్మ ఒకోసారి అందరిని ఏదైనా పండగకు పిల్చి అందరికీ బట్టలు పెట్టి, పిల్లలకు డబ్బులిచ్చి పంపిస్తుంటుంది. కానీ నాన్నకు ఇపుడు ఈ అపార్ట్మెంట్ కూడా అమ్మేసి అన్న దగ్గరకు వెళ్ళి వుండాలని వుంది అంటుంటాడు మధ్య మధ్యలో.
అమ్మా, నాన్న, మా కుటుంబపు ఆలోచనలతో తెల్లారిపోయింది. నర్సులు వచ్చి ఈ రోజు 3 గంటల వరకు తాము వుంటామని పరిచయం చేసుకోవడం, టెక్స్ వచ్చి వైటల్ సైన్స్ తీసుకోవడం, క్లీనర్స్ వచ్చి రూములు క్లీన్ చేయడం మొదలుపెట్టారు. నేను సరిగ్గా నిద్ర లేక అలాగే బెడ్ మీద పడుకుని వున్నాను. ఇంతలో పక్క బెడ్ పేషంట్ భర్త వచ్చాడు ఆమెకిష్టమైన కాఫీ తీసుకుని. నేను “గుడ్ మార్నింగ్,” చెప్పాను. ఆయన రాగానే ప్రాణం లేచి వచ్చినట్టు ఆవిడ, “వచ్చావా? ఇపుడే ఫోన్ చేద్దామనుకున్నాను. సరిగ్గా పడుకున్నావా? నువ్వు కాఫీ తాగావా? హౌ ఈజ్ కిట్టీ బేబి అండ్ జాక్? వాక్ కి తీసుకెళ్ళావా? తిండి పెట్టావా?” అని ప్రశ్నపై ప్రశ్న వేసింది.
“టేకిట్ ఈజీ డియర్. ఎవ్వరీథింగ్ ఈజ్ ఫైన్! డోంట్ యూ వర్రీ అబౌట్ ఎనీథింగ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే?”
” నొప్పి అలాగే వుంది. నాకు చాలా భయంగా వుంది, డాక్టర్స్ ఏమంటారోనని. జాక్…”
“వాక్ కి తీసుకెళ్ళాను. తిండి కూడా బాగానే తింటూనే వున్నాయి. అవి బాగానే వున్నాయి. నువ్వేం వర్రీ అవ్వకు వాటి గురించి.”
“ఎపుడైనా నిన్ను విడిచి వున్నానా? కిట్టీ బేబీ, జాక్ మనింటికి వచ్చినప్పటి నుండి వాటిని వదిలిపెట్టి వున్నామా?” ఆమె గొంతు గద్గదమైంది.
టెక్ వచ్చి నా హాస్పిటల్ ఫ్రెష్ గౌన్, సోప్ క్లాత్స్ వేడివి, టవల్స్ తెచ్చి, ” డూ యూ నీడ్ హెల్ప్ ఫర్ క్లీనింగ్?” అని అడిగింది.
“నో ఐ కెన్ డూ మైసెల్ఫ్, థ్యాంక్ యూ!” అనగానే వెళ్ళిపోయింది.
లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషెన్ అప్ అయ్యి వచ్చాను. నా పక్కనావిడకి నడవ డానికి రావటంలేదు కాబట్టి నర్సులే బెడ్పాన్ అవి పెడ్తున్నారు. అందుకే బాత్రూం క్లీన్ గా ఉంది. కొంతమంది క్లీన్ గా ఉంచుతారు, కొంతమంది భయంకరంగా చేస్తారు.
డాక్టర్స్ వస్తున్నారు. నొప్పికి ఇంజెక్షన్ తీసుకుంటే ఈ మధ్యన భయంకరమైన పీడ కలలొస్తున్నాయి. అందుకే ఒకోసారి నొప్పి ఎక్కువగా వున్నాకూడా ఆ పీడ కలలకి భయపడి తీసుకోవడం లేదు. నొప్పి ఎక్కువగా వుంది. ఈ రోజు డాక్టర్ వచ్చి చూసి ఏం చెబ్తారో చూడాలి. అప్పటికపుడు టెస్ట్స్ రాస్తారు, వెళ్ళడం, రావడం కానీ ఏమీ తెలియడం లేదు. పాన్క్రియాస్ ఎలా వుంది? స్టోన్స్ వున్నాయా? ఏదైనా మాస్ వుందా? ఇన్ని అటాక్స్ వచ్చాయి, అదీ కాక డెలివరీ అయ్యింది, హార్మోన్స్ ప్రభావం కూడా వుంటుంది. లిక్విడ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకు వచ్చారు. నాకేమి తినాలని లేదు. కానీ ఏదైనా కొంచెం తినమంటారు. వేడి వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేసుకుని, తేనె కలుపుకుని త్రాగుతున్నాను డాక్టర్ రిచర్డ్ వచ్చారు.
ఎగ్జామ్ చేసింతర్వాత, “ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గెట్ సి.టి స్కాన్ టు సీ వెదర్ దేర్ ఈజ్ ఎనీ డామేజ్.” అన్నారు.
“ఓకే,” అన్నాను.
“సారీ దుర్గా! ఐ నో ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ నాట్ నోయింగ్ వాట్స్ గోయింగ్ ఆన్. వియ్ ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. లెట్స్ సీ ద రిపోర్ట్స్ అండ్ దెన్ వియ్ విల్ డిసైడ్ వాట్ టు డూ.” అన్నారు.
” డూ ఐ హావ్ టు డ్రింక్ దట్ లిక్విడ్..?”
“యూ మీన్ బేరియం..ఐ యామ్ సారీ యు హావ్ టు డ్రింక్ ఇట్, దెన్ ఓన్లీ వియ్ కెన్ సీ ద పాన్క్రియాస్ క్లియర్లీ, హోప్ ఫుల్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం! ఐ విల్ సీ యూ ఇన్ ది ఆఫ్టర్నూన్ వెన్ ది రిపోర్ట్స్ కమ్,” అని వెళ్ళిపోయారు.
ఇంటికి ఫోన్ చేసి శ్రీనికి చెప్పాను టెస్ట్ గురించి. “ఏ టైంకి చేస్తారో చెప్పారా? నాకు వీలైతే వస్తాను.”
“ఇంకా చెప్పలేదు..” అని చెబ్తుండగానే నర్స్ బేరియం బాటిల్స్ పట్టుకుని వచ్చి, “నేను నీకోసం నీకిష్టమైన జ్యూస్ తీసుకొచ్చాను…” అని బాటిల్స్ ని షేక్ చేయసాగింది.
“నర్స్ ఇపుడే బేరియం బాటిల్స్ తీసుకొచ్చింది.రెండు బాటిల్స్ తాగాలట!”
“టైం అడుగు…”
’ఏ టైంకి టెస్ట్ సి.టి.స్కాన్ చేస్తారు..”
“యాజ్ సూన్ యు ఫినిష్ దీజ్ బాటిల్స్ దెన్ వియ్ విల్ టేక్ యూ!”
“నీకు వీలు కాదులే, సాయంత్రం వీలైతే రండి!”
“నువ్వు ఢల్ గా వున్నావు ఈ రోజు,”
” ఏం లేదులే, నీ పనులు చూసుకో, సారీ ఫర్ గివింగ్ యూ సో మచ్ ట్రబుల్…” అని ఏడ్పొస్తుంటే ఫోన్ పెట్టేసాను.
*****
(సశేషం)
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2022/05/Durga-e1652332299232.jpg)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.