![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Telikacharla-Vijaylaxmi-e1739009409183.jpeg)
సక్సస్
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-తెలికిచెర్ల విజయలక్ష్మి
అప్పుడే డ్యూటీనుంచి వచ్చిన రాధిక, కొడుకుని దగ్గరకు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే…విదిలించుకుని దూరంగా వెళ్లి తనలో తనే నవ్వుకుంటున్న కొడుకుని చూస్తూ…
“వీడి ముక్కుకి ఏమైనా తగిలిందా?” అంటూ కొడుకు దగ్గరగా వెళ్ళి చూసింది. ముక్కు కొసంతా ఎర్రగా కమిలిపోయి రక్తం గూడు కట్టుకుపోయి వుంది. అమ్మగారి మాటలకు కేర్ లెస్ గా…“ఏమొనమ్మా! మేరీ క్లాసుకు వెళ్ళేటప్పుడు బాబు బాగానే ఉన్నాడు. బాబు మాట వినకపోతే, గట్టిగా ముక్కు పిండి వుంటుంది!” అంటూ తనపని ఐపోయింది అన్నట్టుగా చూస్తున్న ఆయమ్మ మాటలకు నిట్టూర్చి…
“సరే వెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా సమయానికిరా!” అంటూ ఆయమ్మను పంపించి తలుపు తాళం వేసుకుని, ఈ థెరపిస్ట్ లను నమ్మాలంటే భయం వేస్తోంది. మొన్నటికి మొన్న, దేవునికి దీపం పెడదామని, అగ్గిపెట్టె తియ్యగానే కెవ్వున
బాబు ఏడుస్తుంటే… వాడు ఎందుకు అలా ఏడుస్తున్నాడో చాలాసేపు అర్థంకాలేదు. వెంటనే ఆయమ్మని పిల్చి…
“నేను లేనప్పుడు అగ్గిపెట్టెని ముట్టించాడా?” అని అడిగింది రాధిక. “బాబు ముట్టించలేదమ్మా! మేరీ మేడం అడిగితే ఇచ్చాను” అంటూ చెప్తున్న ఆయమ్మ మాటల కు… కొడుకు ఒళ్ళంతా చెక్ చేస్తూ…అరికాళ్ళవైపు చూసింది. అరికాళ్లకు బొబ్బలు కనిపిస్తుంటే…బాధగా అనిపించింది. వెంటనే, ఫోన్ చేసి మేరీని అడిగింది. ‘ఏమో మీవాడు నా దగ్గర ఒక్కగంట మాత్రమే వుంటాడు. మిగతా సమయాలలో ఏచేస్తాడో మీరు చూసుకోవాలి. పని వాళ్ళమీద ఇలాంటి పిల్లల్ని వదిలేస్తే ఎలా?’ అంటూ ఫోన్ పెట్టేసింది. స్పీచ్ థెరపీలో మేరీ పట్టుకున్న కేసు సక్సెస్ అవుతుందన్న రేటింగ్ చూసి,
ఎంతో బతిమాలితేనే వచ్చింది ఆమె. గట్టిగా ఏమైనా అంటే రావడం మానేస్తుందేమో అనే భయం. ఈ దిక్కుమాలిన ఆటిజం వలన కొడుకుని ప్రతీ వాళ్లకూ అప్పచెప్పెవలసి వస్తోంది.
కెమేరాలో చూస్తాను అంటే…అలా నాకు నచ్చదు అంటుంది. ఏం చెయ్యాలీ? ఈ పసి ప్రాణాన్ని ఇలా థెరపిస్ట్ లకు అప్పచెప్పవలసిందేనా?’ అని ఆలోచిస్తూ కొడుకుని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేసింది రాధిక. తల్లి స్పర్శ తగలగానే, విదిలించు కుని దూరంగా జరిగి ఒంటరిగా ఆడుకుంటున్న కొడుకుని చూసి, ఉసూరుమంది ఆ తల్లి ప్రాణం.
ప్రభుని నమ్మితే, అతగాడు లేట్ గా వచ్చేవాడు. అరగంటకూడా క్లాస్ తీసుకోకుండా బయటకు వచ్చేసేవాడు. ‘ఏంటీ క్లాసు తొందరగా అయిపోయిందా?’ అని అడిగితే…
‘ మీ వాడు కోపరేట్ చెయ్యడం లేదు! నేనేమీ చెయ్యలేను’ అంటూ గంటసేపు కూర్చుని ముచ్చట్లు పెట్టేవాడు. ఇంత సమయం బయట వృథా చేసేబదులు క్లాసు తీసుకోవచ్చు ను కదా! అని ఒకసారి నవ్వుతూ అంటే… ‘ మాకూ, కొంచం మైండ్ ఫ్రెష్ అవ్వాలి కదా!’ అంటూ వెకిలి నవ్వు నవ్వుతున్న ప్రభుని చూస్తుంటే ఒళ్లుమండేది. ‘నా బంగారు తండ్రికోసం అడ్డమైన వెధవల మాటలూ భరించక తప్పదు అనుకుని, బాబుకి పాలు కలిపి దగ్గరకు తీసుకుని కళ్ళుమూసుకుంటే, ఎందుకో ఆ రోజు, తన ఫ్రెండ్ కొడుకుతో కంపేర్ చేసుకోవడం వలనే ఈ ఆటిజంని గుర్తించగలిగాను కదా అనుకుంది
రాధిక.
***
“ఏవండీ, నా ఫ్రెండ్ కొడుకు వీడికన్నా సంవత్సరం చిన్నవాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. వీడికి మూడు నిండి అప్పుడే నాలుగొచ్చింది. ఇంతవరకూ ఒక్క మాట కూడా రాలేదు!” అంది ఉక్రోషంగా రాధిక భర్తతో.
“ఒకరితో ఒకరిని పోల్చటం ఆపు! ఇన్నాళ్లూ మన పింకి కన్నా వాళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదువుతున్నారని గోల చేసేదానివి. ఇప్పుడు కార్తీక్ మీద మొదలుపెట్టేవా?” అంటూ చిరాకు పడ్డాడు రాధిక భర్త వెంకట్.
భర్త, ఎంత చిరాకు పడినా మౌనంగా వుండలేకపోయిందామె. కార్తీక్ కి మాటలు రావటంలేదని బాధ పడేకన్నా, ఒక్కసారి డాక్టర్ కి చూపించటం మేలనిపించి, మంచి డాక్టర్ వద్దకు కొడుకుని తీసుకువెళ్ళింది.
డాక్టర్ అన్నీ పరీక్షలూ చేసి…”ఒట్టి, మాటలు కాదమ్మా సమస్య. చూపు నిలకడ లేదు. ఎంత పిలిచినా వినిపించనట్టే ఉంటాడు. మనుషులకు దూరంగా జరుగుతూ తన ప్రపంచంలో తను వుండాలని అనుకుంటున్నాడు” అని డాక్టర్ చెప్తున్న మాటలు అస్సలు అర్థంకాలేదు రాధికకు. వెంటనే…. ” నాకర్థంకాలేదు. మరొకసారి సరిగా చెప్పండి డాక్టర్” అంది ఆమె.
“మీ అబ్బాయితో రోజూ ఎంత సమయం గడుపుతారు?” అంటున్న డాక్టర్ మాటలకు…
“నేను, బాబు దగ్గర ప్రత్యేకించి వుండే సమయం అంటూ ఏమీలేదు. మా వాడు చాలా బుద్ధిమంతుడు. ఎవ్వరినీ ఏ ఇబ్బందీ పెట్టడు. ఏం పెట్టినా, ఎవరు పెట్టినా తింటాడు. వాడికి నచ్చకపోతే వుమ్మెస్తాడు!”
“బాబుతో మీ కుటుంబం మొత్తం ఎలా వుంటుందో చెప్పండి!” అంటున్న డాక్టర్ మాటలకు ఆలోచిస్తూ…
“మావారికి వర్క ఫ్రం హోమ్ డ్యూటీలు. పాప స్కూల్ కి వెళ్ళిపోతుంది. మా వారి డ్యూటీకి అంతరాయం కలగకుండా బాబుని శుభ్రంగా ఉంచటంలో ఆయమ్మదే ప్రథమ పాత్ర” అంది రాధిక.
“మీరు, డ్యూటీనుంచి వచ్చిన తరువాత ఏంటి చేస్తారు?” అని డాక్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా…
“డ్యూటీ నించీ వచ్చేక పాపకి హోమ్ వర్క్ చేయిస్తాను. తరువాత నేను కాసేపు రిలాక్స్ అవుతూ ఏవైనా సీరియల్స్ చూస్తాను!” అంటూ డాక్టర్ వైపు సందేహంగా చూసింది రాధిక.
“మీరు టీవీ చూసేటప్పుడు బాబు మీ దగ్గరకు వస్తాడా?” అంటున్న డాక్టర్ ని చూస్తూ…
‘ఏవిటో ఈయన అన్నీ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు! నేను అనవసరంగా ఆఫీసుకి సెలవుపెట్టుకుని ఈయన వద్దకు వచ్చాను’ అనుకుంటూ…
“ఆ, వస్తాడండీ! మీద పడి కుమ్ముతూనే వుంటాడు. చివరకు అలసిపోయి ఆయమ్మ దగ్గర అన్నం తింటాడు!” అంది రాధిక.
“మీరు, బాబుని దగ్గరకు తీసుకుని పడుకోబెడతారా?”
“నేను ఎంత జోకొట్టినా పడుక్కోడు. బాబు మంచంమీద కూర్చుని ఆడుకుంటూ వుంటాడు. నేను, పాపని నిద్రపుచ్చి పడుకుంటాను!”
“పిల్లాడి తండ్రి, బాబుని దగ్గరకు తీసుకుని అపురూపంగా చూస్తాడా?” అన్నాడు ఆలోచనగా డాక్టర్.
“అతనికి అస్సలు తీరుబాటు ఉండదు. పదకొండు తరువాత బాబుకి వాళ్ళ నాన్న జోకొడుతూ మొబైల్ లో పాటలు పెడితే పడుకుంటాడు!” అంది టైమ్ చూసుకుంటూ రాధిక.
ఆమె, సమాధానం విన్న డాక్టర్ కాసేపు ఆలోచించి…
“తల్లిచేతి గోరుముద్దలు తినవల్సిన బాబు, మొక్కుబడిగా ఆయమ్మ పెట్టే అన్నం తింటూ… ఆయాకు సహకరిస్తున్నాడు. ప్రేమగా ఒళ్ళోకి తీసుకుని జోలపాటలు పాడే తల్లి, డ్యూటీ చేసి అలసిపోయాను అంటుంది. తండ్రి, ఏదో మొక్కుబడిగా నిద్రపుచ్చేపని మాత్రం చేస్తాడు!” అంటున్న డాక్టర్ మాటలు పౌరుషం తెప్పిస్తుంటే…
“ఏ తల్లితండ్రులైనా పిల్లల అవసరాలను సొంతంగా తీర్చలేకపోతే పనివాళ్ళమీద ఆధారపడటం సహజం. మా వారు బాబుని నిద్రపుచ్చకపోతే నేను డ్యూటీ చెయ్యలేను. ఆడది ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలకు కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు” అంది విసుగ్గా.
“మీ పేరెంట్స్ కానీ, మీ వారి పేరెంట్స్ కానీ బాబుని చూసుకోవడానికి లేరా?” అన్నాడు డాక్టర్.
“నా పేరెంట్స్ చనిపోయారు. మా వారి తల్లి బాగా పెద్దవారు. ఆవిడ కూతురు దగ్గరే వుంటారు!” అంది రాధిక.
“తల్లితండ్రులు పంచే ప్రేమకోసం ఎదురు చూసేడమ్మా! మీరు దగ్గరకు రారనీ, ప్రేమను పంచలేరని, మీరంతా మీ పనులలో బిజీఅని అర్థమైన బాబు…ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా నిశబ్దం అయిపోయాడు. వాడు దగ్గరకు వస్తే… మీ పనులకు ఆటంకం అవు తుందని, మీరు వాడిని దూరం ఉంచుతున్నారు. మీకు, వాడితో పనిలేదని అర్థమయిం దేమో, వాడిలో వాడే నవ్వుకుంటూ మీదకు చూసుకుంటూ అందరికీ దూరంగా ఉంటు న్నాడు!” అంటున్న డాక్టర్ మాటలకు భయంగా…
“అదేంటి డాక్టర్, అలా అంటారు? బాబే కావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో మీకు తెలుసా? ఏడు తరాలనించీ మా వారి ఇంట్లో మగపిల్లాడు లేడు!” అంది రాధిక.
“ఏం లాభం? అపురూపంగా పుట్టిన బంగారంలాంటి పిల్లడిని అందరూకల్సి దూరం పెట్టారు. పోనీలెండి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీ విలువైన కొంత సమయా న్ని బాబుకి కేటాయించండి! వాడితో ఎక్కువ సమయం గడపండి! ఒంటరిగా వదల కండి” అనే డాక్టర్ మాటలతో రాధికకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహిస్తుంటే… బాబు వైపు చూసింది. మీదకు చూస్తూ వెర్రినవ్వు నవ్వుతున్న కొడుకుని పట్టుకుని…
“మీ మాటలు వింటూ వుంటే భయం వేస్తోంది. నా బాబుకి ఏంటయింది? ఎలా నార్మల్ అవుతాడు బాబు. వీడిని ఎలాగైనా బాగుచెయ్యండి. ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు!” అంటున్న రాధికను చూసి…
“డబ్బుతో అన్నిపనులూ అయిపోవమ్మా! కొంచం శ్రద్ధగా వినండి. మీరు బాబుని నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చెయ్యకుండా సరైన సమయానికి ఇక్కడకు తీసుకు వచ్చేరు. ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చేసే ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ మీ బాబుకి ఫోకస్ పెంచడానికి, మాటలు తెప్పించడానికి ఉపయోగ పడతాయి. అవి చేయిస్తూ వాళ్ళు చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇంట్లో చేయిం చండి. ఆటిజమ్ సివియర్ అవకముందే జాగ్రత్తపడండి. ఆటిజం, ఒక జబ్బుకాదు. అలాగని, ఒక్కసారితో బాగైపోదు. కొంతమందికి త్వరగా నయమవుతుంది. కొంతమందికి చాలా సమయం పడుతుంది. ఆశాభావంతో, ఓర్పుతో బాబుని నార్మల్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా పిల్లడిని ఒక్కడినే వదలకండి!” అని డాక్టర్ చెప్తుంటే… రాధికకు భయంవేసింది. ఎటో చూస్తూ… నవ్వుకుంటున్న బాబుని గుండెలకు హత్తు కుంది. తెలియకుండానే ఆ తల్లి కంటివెంట నీరు కాలవలై కారుతోంది.
“బాధపడకు! తల్లిగా నీ ప్రయత్నలోపం లేకుండా కృషి చెయ్యమ్మా!” అంటూ ధైర్యం చెప్పిన డాక్టర్ కి దండంపెట్టి ఇంటికి చేరుకుంది రాధిక.
కొడుకుని ఎత్తుకుని మొహం వేలాడేసుకుని వస్తున్న భార్యని చూసి వెంకట్…
“ఏంటి రాధీ, ఎందుకలా ఉన్నావు?” అనగానే.. గండి పడిన వాగులా కన్నీళ్ళు ధారలై కారుతుంటే ఏడుస్తూ…అల్లుకుపోయిన భార్యను ఎలా ఓదార్చాలో అర్ధంకాలేదు
వెంకట్ కి. రాధిక, మెల్లిగా సర్దుకుని, విషయమంతా భర్తకు చెప్పి…ఆలస్యం చెయ్యకుం డా డాక్టర్ చెప్పిన రోనక్ ఆటిజం థెరపీ సెంటర్ కు వెళ్ళింది.
నలభై ఐదు నిమిషాల క్లాసుకు వేల రూపాయలు, అలా మూడు క్లాసులు పెట్టాలంటే కష్టం అనిపించినా తప్పదనుకుని, జాయిన్ చేశారు. అన్నీ క్లాసులు ఒకే సమయం కాదు. సెంటర్ కి తీసుకువెళ్ళి అక్కడే వెయిట్ చెయ్యడం, తీసుకు రావడం ఇలా ఎన్నాళ్ళు? డ్యూటీలకు వెళ్ళక తప్పదు అనుకుని, హోమ్ థెరపీల కోసం వెతికారు. రోనక్ సెంటర్ లో పనిచేసే ప్రభు, ఇంటికి వచ్చి చేస్తాడని తెలిసి, వెంటనే కాంటాక్ట్ అయితే…సెంటర్ లో డ్యూటీ అయినాక సాయంత్రం ఏడు గంటలకు వచ్చేవాడు. పేషెంట్ ని బాగుచేయ్యా లనే పట్టుదల అతనిలో మెండుగా వుండేది. ఆ పట్టుదలను చూస్తుంటే, త్వరగా మాటలు వస్తాయనే ఆశ పెరిగింది రాధికకు. కెమేరా చూడకూడదని షరతు పెట్టాడు ప్రభు. లోపలి గదిలో నుంచి, మధ్యమధ్యన కార్తీక్ ఏడుపు వినిపిస్తుంటే…బాధగా వుండేది. హై ఫై చెయ్యి అంటూ గట్టిగా హై ఫై చేస్తుంటే…చెయ్యి నెప్పికి బాబు విలవిలలాడటం గమనించిన రాధిక… “మెల్లిగా! చెయ్యి నొప్పి పుడుతుంది!” అంటూ వారించింది.
ఒకరోజు క్లాస్ నించి బయటకు రాగానే వెక్కివెక్కి ఏడుస్తున్న బాబుని దగ్గరకు తీసు కుని ‘ఏంటైందీ? ఎందుకు ఏడుస్తున్నాడు?’ అంటూ చేతులు పట్టుకుని చూస్తుంటే…చేతులమీద ఇంత వలం వాచిన ఎర్రటి గీతాలను చూడగానే కోపంగా… “మీరు మనుషు లేనా? ఏం చేశారు బాబుకు?” అంటూ అరిచింది రాధిక.
“థెరపీ చెయ్యాలంటే మాకు ఆంక్షలు వుండకూడదు. బాబు నోరు విప్పించాలంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదు. గోరుతో అరచేతిమీద ఒకేచోట గట్టిగా పదీసార్లు గీకుతుంటే…నొప్పికైనా ఏదోఒకటి అంటాడని అలా చేశాను. ఇదీ, థెరపీలో ఒక భాగంగా చేస్తాము. ప్రతీ చిన్న విషయానికీ మీకు సంజాయిషీ చెప్పుకోవాలంటే, మేము థెరపీ చెయ్యడం కష్టం!”
అంటూ వెళ్లిపోయాడు ప్రభు.
తరువాత చాలా మంది థెరపిస్ట్ లను పెట్టింది. ఎవ్వరూ కనీసం కూర్చో పెట్టలేక పోతున్నారు. అటువంటి సమయంలో మేరీ గురించి తెలిసింది. వెళ్ళి ఎంతో రిక్వెస్ట్ చేశాక, రావటానికి ఒప్పుకుంది మేరీ. ఈమెకూడా ఏదోరకంగా బాబుని హింసిస్తూ, చెప్పిన మాటలే పదీసార్లూ చెప్తూ మాటలు తెప్పించటానికి ప్రయత్నిస్తోంది. ఆమెను ఏమైనా అంటే ఆమెకూడా రావడం మానేస్తుంది.
‘ఏం చెయ్యాలీ? ఈ పసి ప్రాణాన్ని ఇలా హింసించవలసిందేనా?’ అనుకోగానే దుఃఖం వస్తుంటే…’ నా కొడుక్కి ఇలా చిత్రక్షోభపెట్టను. నేను ఉద్యోగం మానేస్తాను. బాబుని దగ్గరుండి చూసుకోగలుగుతాను. నా వలన జరిగిన పొరపాటును నేనే సరిదిద్దు కుంటాను!’ అనుకుని, అదే మాట భర్తకు చెప్పింది.
“ఇంటి కోసం బోలెడంత అప్పు తీసుకున్నాము. ఇప్పుడు బాబుకోసం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలా?” అంటూ భయపడుతున్న భర్తను చూసి…బాబు పరిస్థితి వివరిస్తూ…లాంగ్ లీవ్ కావాలని కంపెనీకి రిక్వెస్ట్ పెట్టింది. లీవ్ ఇవ్వటానికి కంపనీ సమ్మతించడం శుభపరిణామం అనుకున్న రాధిక, బాబు ప్రతీ కదలిక గమనించడం మొదలు పెట్టింది.
బాబుని, కూతురు రూంలోకి తీసుకు వెళుతుంటే లోపలకు అడుగు పెట్టకుండా బయట నుంచి ఏడుస్తున్నాడు బాబు.
“ఆయమ్మా? వీడు లోపలకు ఎందుకు వెళ్ళటంలేదు?” అంటూ ఆయమ్మను అడిగింది.
“బాబు, లోపలకు వెళ్ళి అన్నీ పీకేసేవాడు. పాప గట్టిగా అరిచేది. ఆ, అరుపుల భయంతో బాబు అటువైపే చూడటం మానేశాడు!” అంది ఆయమ్మ.
“ఈ విషయాలన్నీ ముందే నాకెందుకు చెప్పలేదు?” అంటూ ఆయామీద కేకలేసింది. బొమ్మలు, స్లయిడర్, సైకిల్, ఆట వస్తువులన్నీ పింకి రూములోనే ఉన్నాయి. వాటి వైపుకూడా చూడటం లేదు బాబు. పింకిని పిలిచి…
“ఏమే, వీడికి ఆట వస్తువులు ఇయ్యటంలేదా?” అన్నాది రాధిక కోపంగా.
“లేదు మమ్మీ, వాడు పాడు చేస్తాడు. వాడికేమీ చేతకాదు. వాడొక తింగర వెధవ!” అంటూ విసుక్కుంటున్న ఏడేళ్ల కూతురు మీద కోపం వచ్చినా తమాయించుకుని…
రైడర్, బయటకు తెచ్చి దానిమీద కూర్చోపెట్టేసరికి, కొడుకు మొహంలో ఆనందం కనిపించింది ఆ తల్లికి. స్పీచ్ థెరపీకోసం తెప్పించిన బుక్స్ అస్తమానం బాబుకి చూపిస్తూ… బాబుని, ఒక్కడినే అస్సలు వదలకుండా దగ్గర కూర్చోపెట్టుకుని ఆడిస్తూ…కబుర్లు చెప్తూ పాటలు వినిపించేది. వున్నట్టుండి హైపర్ అవుతూ గోడకేసి తల కొట్టుకో వడం చేస్తున్న కొడుకు చేష్టలకు భయపడుతూ సైక్రియాటిస్ట్ వద్దకు వెళితే… “మందులు కొన్ని రోజులు మాత్రమే వెయ్యండి.
మందులకన్నా మన ప్రయత్నమే ముఖ్యం! బాబు, బ్రెయిన్ ఎదుగుదల రెండు సంవత్సరాల వెనక్కు వెళ్ళిపోయింది. మీరు విసుక్కోకుండా చిన్నపిల్లాడితో ఎలా డీల్ చేస్తారో అలా బాబుతో డీల్ చెయ్యండి!” అంటూ బోధపరచాడు సైక్రియాటిస్ట్.
సైక్రియాటిస్ట్ సూచనలు పాటిస్తుంటే కొద్దిరోజులకు మళ్ళీ మొదటిలా శాంతం అయ్యేడు కార్తీక్. స్పీచ్ థెరపీ కోసం సెంటర్ కి క్లాసుకు తీసుకు వెళుతూ…అక్కడ వాళ్ళు చేయిస్తున్నవి కెమెరాలోనించి చూసి, అవన్నీ ఇంటిదగ్గర మళ్ళీ మళ్ళీ చేయించేది.
రకరకాల ఆటబొమ్మలు తెప్పించి… చాలాసేపు బాబు దగ్గర కూర్చుని రంగులు, షేప్స్ చెప్పేది. ఒంటరిగా ఒక మూల కూర్చునే కొడుకుని తీసుకుని పార్కులకు తీసుకు వెళుతుంటే కార్తీక్ మొహంలో ఆనందం చూసి మురిసిపోయేది ఆ తల్లి. రోడ్డుమీద సైకిల్ తొక్కడం నేర్పించడానికి ప్రయత్నిస్తే, పెడల్ వెయ్యడానికి ఇష్టపడేవాడు కాదు. మాల్స్ కి తీసుకు వెళితే అన్నీ తోసేసి, విచిత్రంగా బిహేవ్ చేస్తున్న కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని, మాల్ స్టాఫ్ కి సారీ చెప్తూ… మాల్ లోపల తిప్పుతూ అక్కడి వస్తువులను పాయింట్ చేసి చూపిస్తూ వాటి పేర్లను పదేపదే చెప్తుంటే మాల్స్ వెళ్ళడం అంటే
ఇష్టం పెరిగింది కార్తీక్ కి. పిల్లలతో కలసి ఆడుకోవడం నేర్పించాలని ప్రయత్నిస్తూ విఫలమౌతున్నా పట్టువదలకుండా ప్రయత్నాన్ని ఆపలేదు.
స్కూల్ లో చేర్పించితే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ చెప్పడం తో… అడ్మిషన్ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ప్రతీ స్కూలులోనూ కార్తీక్ బిహేవియర్ చూసి, సీటు ఇవ్వలేమని చెప్పేవారు. రాధిక బాధను అర్థంచేసుకున్న ఒక టీచర్…’నీ పేరు ఏంటి? అంటే మీ బాబు జవాబు చెప్పగలగాలి. కొంచమైనా కమాండ్స్ ఫాలో అవ్వాలి! ప్రయత్నించండి, బాబు తప్పకుండా రెస్పాండ్ అవుతాడు. ఏదో ఒక స్కూల్ లో సీటు తప్పకుండా దొరుకుతుంది’ అంటూ ధైర్యం చెప్పింది. అప్పటినుంచీ…వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతూ…’ మై నేమ్ ఈస్ కార్తీక్!’ అని చెప్పించటానికి ప్రయత్నించేది. బ్యాగ్ తీసుకురా, గ్లాస్ అక్కడ పెట్టు. నీళ్ళు వంపి శుభ్రం చెయ్యి అంటూ, ఎలా శుభ్రం చెయ్యాలో చూపిస్తూ… ఏదో ఒకటి చెప్తూ బ్రెయిన్ అలెర్ట్ గా ఉంచటానికి ప్రయత్నించేది.
పింకి చదువుతున్న స్కూల్ లో, కార్తీక్ కోసం అడ్మిషన్ కి వెళ్ళింది. ప్రిన్సిపల్ లోపలకు పిలిచేలోపు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకుంటూ కూర్చుంది. ‘కార్తీక్…! ‘ అంటూ లోపలనుంచి పిలుపు వచ్చింది. భయపడుతూ కొడుకుని తీసుకుని ప్రిన్సిపల్ రూంలోకి అడుగుపెట్టిన రాధిక, ఆవిడ ఏమీ అనకముందే…
“మేడం, బాబుకి ఇంకా మాటలు రాలేదు. పాప కూడా ఇదే స్కూల్ లో చదువుతోంది. నేను, మాటలు నేర్పించటానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఒక సంవత్సరం తరువాత కూడా మాటలు రాకపోతే మీరు స్కూలు నించీ తీసేయండి!” అంటూ కన్నీళ్ళు పెట్టు కుంటున్న తల్లి బాధను అర్థంచేసుకుంది, ప్రిన్సిపల్. రాధికకు, కళ్ళతోనే ధైర్యం చెప్తూ, బాబు వైపు తిరిగి…” వాట్ ఈస్ యువర్ నేమ్ మై బాయ్?” అంటూ ప్రశ్నించింది. ఆవిడ మాట ఆర్థమైనట్టుగా…
“కార్తీక్!” అన్నాడు. ఆవిడ మళ్ళీ అదే ప్రశ్నను రిపీట్ చేసింది..
“కార్తీక్!” అని బాబు చెప్తుంటే… ప్రిన్సిపల్ నవ్వుతూ రాధిక వైపు చూసి నవ్వుతూ…
“బాబుకి మాటలు రావని అన్నారు. ఇప్పుడే మీ ముందే పేరు చెప్పాడు కదా!” అంది ఆవిడ.
“నా బాబు మాట్లాడుతున్నాడు మేడం. నిజంగా మాట్లాడేడు!” అంటూ మురిసిపోతూ బాబుని గట్టిగా పట్టుకుందా పిచ్చితల్లి.
***
సాయంత్రం బాబుని హాస్పటల్ కి తీసుకు వెళ్లి…
“డాక్టర్ గారూ, బాబు మాట్లాడేడు!” అని సంతోషంగా చెప్పింది. అతను, అంతావిని…
“తల్లిగా మీరు పడే వేదన మీ బాబు బ్రెయిన్ ని కదిలించింది! అమ్మ, బాధ చూడలేక అమ్మకోసం పలికేడు. ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నాడని, బాబు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఏదోఒకటి మాట్లాడించుతూ వుండండి. బాగా ఊహ వచ్చేదాకా ఒక్కడినే ఒదలకండి!” అంటూ జాగ్రత్తలు చెప్పేడాయన. స్కూల్ కి పంపిస్తూ… “బై కార్తీక్!” అంటే బై కార్తీక్ అనేవాడు. స్కూల్ లో టీచర్స్ “గుడ్ మార్నింగ్ కార్తీక్” అంటే గుడ్ మార్నింగ్ కార్తీక్ అనేవాడు.
వెర్రిచూపులు చూస్తూ, విచిత్రంగా ప్రవర్తించే కొడుకుని చూసి అధైర్యపడకుండా మనో నిబ్బరంతో… కొడుకు, అందరిలో కలిసి చక్కగా మాట్లాడాలనే ఆశతో పట్టు వదలకుండా బాబుకి చిన్నచిన్న మాటలు నేర్పిస్తూ…సమయం దొరికినప్పుడల్లా ఆట వస్తువులతో ఆడిస్తూ, రైమ్స్ పాడుతూ…పాడించాలని ప్రయత్నిస్తూ ఒంటరిగా ఉంచ కుండా పిల్లల మధ్యన వుంచేది. తల్లి పడే వేదన గమనించిన పింకి, తమ్ముడితో పాటూ ఆడుకోవటానికి ఇష్టపడేది. మెల్లిగా అందరితో కలుస్తున్న కొడుకు కదలికలను గమని స్తూ…కొడుకు నోటినుంచి వచ్చే ఒకొక్క ముద్దు మాటకూ మురిసిపోయేది. కార్తీక్ ని మామూలు మనిషిని చేయగలను అనే ధైర్యం రాధికలో కలిగింది. సంవత్సరం తరువాత స్కూల్ వేన్ ఎక్కి, చెయ్యి ఊపుతూ…
“మమ్మీ బబ్బై…” అంటూ బై చెప్తుంటే, నేను సక్సెస్ అయ్యాను. ఈ విజయం నాదే అనుకుంది రాధిక
*****
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Telikacharla-Vijaylaxmi-e1739009409183.jpeg)