సస్య-6

– రావుల కిరణ్మయి

          డిప్యుటేషన్ ఇవ్వబడిన పాఠశాలకు చేరుకుంది.

          ఆ పాఠశాల పరిసరాలు తనను ఆకట్టుకున్నాయి. తనొక్కతే ఉపాధ్యాయిని, అందరూ ఉపాధ్యాయులే. పరిచయాల తరువాత తరగతి గదిలోకి వెళ్ళింది.

          ఆ గది విజ్ఞానపు కర్మాగారంలా కాక కారాగారంలా తోచింది. అంతా బలవంతంగా బంధించబడిన పక్షుల్లా కనిపించారు.

          ఏ ఒక్కరిలోను ఉత్సాహం లేదు. ఆర్యభట్ట గనుక ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా ఈ తరగతి గది శూన్యతను చూసి సున్నాను కనిపెట్టేసేవాడు అనిపించింది.

          నవ్వుతూ విష్ చేసింది. ఎటువంటి స్పందనా లేదు. ఉదయం పెద్దావిడ పట్ల తను  చూపెట్టిన నిర్లిప్తత ఇప్పుడు వీళ్ళ మొహాల్లోనూ.

          ఆ ఇల్లు, ఈ స్కూలు రెండూ తనకు పెద్ద పరీక్ష పెడ్తున్నట్లుగా ఉన్నాయి.. అనుకుంది.

          స్కూలు అయిపోగానే శ్రావణ్ వాళ్ళ ఇల్లు చేరింది.

          పెద్దావిడ మల్లెల బుట్టతో కూర్చుని ఉంది.

          తనను చూసి శ్రావణ్ గది వైపు చూపించింది.

          ఆ గదిలోకి నడిచింది.

          మంచం పై పడుకొని ఆలోచిస్తున్న శ్రావణ్, అలికిడికి తల తిప్పి చిరునవ్వు నవ్వాడు.

          సస్య నవ్వలేక పోయింది. చేత్తో రమ్మన్నట్టుగా పిలిచి, ఒక పేపర్ చేతికిచ్చి బయటికి వెళ్లి చదువుకోండని  గాయాల వల్ల చిన్నగా, నీరసంగా చెప్పాడు.

          అందులో అక్షరాలు కళ్ళకు పరిచయమవుతూ విషయాన్ని మనసుకు అర్ధం చేయించాయి.

సస్యగారూ! నమస్తే.

నేను గాయాల వల్ల మాట్లాడలేక పోతున్నాను. విదుషి మిమ్మల్ని పంపిస్తానంటే నేను వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వేరే పనిమనిషిని చూడమని చెప్పా. కానీ, ఇక్కడకు రావడం ఎంత కష్టమో ! ఉదయం మీకు అనుభవానికి వచ్చే ఉంటుంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. వంట ఆడర్ చేసి తెప్పించుకోగలము.

          ఇక ఆ పెద్దావిడ మా అమ్మ.నాన్న పోయిన డిప్రెషన్ లో నుండి ఇంకా కోలుకోలేదు. అందువల్ల ఎక్కువగా మాట్లాడదు. పైగా తను శారీరకంగా కూడా అశక్తురాలు.  మీకు తెలియాలని చెప్పాను. సానుభూతి పొందడానికి కాదు. పూర్తిగా చీకటి పడక ముందే వెళ్ళండి. అని రాసివున్న ఉత్తరం చదివింది.

          శ్రావణ్  వైపు చూడలేదు. కానీ, పెద్దావిడ వైపు చూసింది. ఆవిడ సైగ  చేసి చెప్పింది.

          పూలు మాలకట్టమని.తన దేవుడికి వేస్తానని  గోడకు వేళాడుతున్న ఫోటో చూపిం చింది. ఆమె షాకయ్యింది. అతడికి కళ్ళు లేవని ఇట్టే తెలిసిపోతున్నది. ఈమె ఇట్లా , అతనేమో అంధుడు. ఇక్కడి నుండి బయటపడాలని శ్రావణ్ కు మనసులోనే  థాంక్స్ చెప్పి అ పూలమాల అల్లి చకచకా కారులో బయల్దేరింది.

          విదుషిపై చాలా కోపం వచ్చింది. చడామడా తిట్టి తనకూ తన స్నేహానికి గుడ్ బై చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. రేపు ఈ లెటర్ తనకు చూపించి, ఆ పదివేలు ఎలాగోలా ఇచ్చేయాలి అని స్థిమితపడింది.

***

          మరునాడు పాఠశాలకు వెళ్ళిన ఆమెకు ఉపాధ్యాయులందరిలోకి భార్గవ్ సార్ అనగానే కొంచెం ఎక్కువగా గౌరవభావం కలిగింది.

          అందరూ ఏదో ఓటి అడుగుతూ ఎప్పుడూ తనతో మాట్లాడుతూ ఉండాలని చూస్తు న్నారు కాని ఆ సార్ మాత్రం తన పరిధిలో తను ఉంటూ ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా  పుస్తక  పఠనంలో ఉండడం తనకు ఆ భావం కలగడానికి కారణం.

          ఎనిమిదవ తరగతి అటెండెన్స్ తీసుకుంటూ …

          చందనా ! అని  పిలిచింది.

          హాజరు పలకడంతో అంతకు ముందు పది రోజుల నుండి  ఆ అమ్మాయి బడికి రావడం లేదని రిజిష్టర్  చెప్పగా ఆ అమ్మాయిని పిలిచి కారణమడిగింది.

          ఆటో అతను చెప్పిన అనుభవమే  తనూ చెప్పి, ఒక అన్నయ్య  కాపాడాడని చెప్పింది.

          ఆ అమ్మాయి చెప్పిన ఆనవాళ్ళను బట్టి అతను శ్రావణ్ గా అనిపించసాగింది. అది తెలుసుకోవడానికి రేపు ఒకసారి వచ్చి కలవమను అన్నది.

          టీచర్! ఆ అన్నయ్యకు ఆక్సిడెంటయ్యి కాలు, చేయికి కట్టు వేశారు తను లేవలేని స్థితిలో తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు. నేనూ,అమ్మ సహాయానికి వెళ్తే వద్దని పంపించాడు టీచర్. ఏ సహాయం కావాలన్నా రమ్మని  మాత్రం చెప్పాడు. వేరే వారు  వస్తున్నారని చెప్పాడు అని విషయం పూసగుచ్చినట్టుగా చెప్పింది.

          తనలో  చిన్న కదలిక.

          లంచ్ లో భార్గవ్ సర్ “తో చందన గురించి మాట్లాడింది.

          ఆ… ఏముంది? ఇందులో? ఇంట్లో వీలులేక భోజనం దొరకకుంటే బయట నుండి తెప్పించుకోవడమో! మనమే వెళ్ళడమో  చేస్తూన్నాం కదా! ఇంట్లో సుఖం లేని ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆ ఏరియాలో కాస్త రిలాక్స్ అవుతారు. తప్పేముందండీ? నేను చలంని చదివాను. అతను చెప్పిందదే కదా ! ఆ సమయంలో ఈ అమ్మాయి ప్రెష్ గా కనిపించడంతో ఆశపడి ఉంటారు. అని చాలా చాలా నిస్సిగ్గుగా, బాధ్యతా రాహిత్యంగా, నిర్లక్ష్యంగా చెప్పిన అతని ధోరణికి అవాక్కయింది.

          ఇంక దానిని చలం చెప్పాడని సమర్థించుకోవడం, ఆ మహానుభావుడి  భావనలు ఇతగాడికి ఇలా అర్థమయ్యాయా ? ఇతగాడినా ? తను ఉత్తముడనుకుంది. ఆ క్షణం తన చెప్పుతో తనే కొట్టుకోవాలనిపించేంత ఏహ్య భావం తన పై తనకే కలిగింది. స్కూలు అయిపోగానే ఆ సాయంత్రం శ్రావణ్ ఇంటికే వెళ్ళింది. పశ్చాత్తాపభావంతో.

        ఆ భావమే ఆమె జీవితాన్ని గొప్ప మలుపు తిప్పుతుందని  ఎవరూ ఊహించలేనిది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.