![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Sammeta-Umadevi-e1739013335410.jpg)
సోది
-ఉమాదేవి సమ్మెట
“సోది చెబుతానమ్మ సోది! సోది చెబుతానమ్మ సోది!”
చుక్కల చీర కట్టుకుని, ముఖాన ముత్యమంత పసుపు రాసుకుని, నుదుటన పావలా కాసంత బొట్టు పెట్టుకుని, చేతినిండా రంగురంగుల గాజులు వేసుకుని, సిగలో బంతిపూల మాల తురుముకుని చూడ ముచ్చటగా వున్న చుక్కమ్మ అరుపులే గానీ.. సోది చెప్పించు కోవడానికి ఏ ఒక్కరు కూడా పిలవడం లేదు.
చేతిలో చిన్నకర్ర, నడుమున ఒక గంప పెట్టుకుని ప్రతి గేటు ముందూ నిలిచి ఆశగా “సోది చెబుతానమ్మ సోది..” అంటూ అరుస్తూనే వున్నదామె. అసలు ఇళ్ళల్లో మనుష్యు లు వున్నారా అన్నట్టుగా కొన్ని ఇళ్ళు వుంటే.. ఉరుకులు పరుగులు పెట్టడం తప్ప ఈ మనుష్యులకు వేరే ఏమైనా తెలుసా అన్నట్టున్నారు మనుష్యులు. ఎవరూ చుక్కమ్మను గానీ, ఆమె అరుపులనుగానీ పట్టించుకోవడమే లేదు. ఉదయం మధ్యాహ్నంగా మారింది. చుక్కమ్మ ఇల్లిల్లు తిరుగుతున్నది. ఊహూ ఒక్కరంటే ఒక్కరూ కూడా సోది చెప్పించు కోవడానికి పిలవడమే లేదు.
నిజానికి సోది అంటే వట్టి సోది అనుకుంటున్నారుగానీ.. అదో అందమయిన ఘట్టం.
“సోది చెబుతానమ్మ సోది..!” అని సోదెమ్మ రాగానే.. పిలిచిన ఇంటి వాళ్ళు ఆమెను వాకిట్లో కూర్చోబెట్టి ఆమె చుట్టూ చేర్తారు. ఇంటి ఇల్లాలు చేతలో ఇన్ని బియ్యం తెచ్చి పొయ్యగానే సోది చెప్పడం మొదలవుతుంది. చేటలో చేయివేసి తిప్పి నుదుటి మీద కర్ర పెట్టుకుని.. సోది చెప్పించుకునే వాళ్ళ చేయి పట్టుకుని.. కంచి కామాక్షిని, మధుర మీనాక్షిని, బెజవాడ కనకదుర్గమ్మని, ఏడుకొండల వెంకన్నను, శ్రీశైలం మల్లికార్జున్ని, వేములవాడ రాజరాజేశ్వరున్నీఆహ్వానిస్తుందామె. ఈ దేవతలందరి సాక్షిగా సోది ఎవరు చెప్పించుకుంటున్నారో వాళ్ళ పితృదేవతలో, మాతృదేవతలో, గతించిన మరో పెద్దలో, పిన్నలో చటుక్కున సోదిలోకి వచ్చేస్తారు. వీళ్ళ బాగోగులు చెప్పి.. చేయవలసినవీ, చేయ కూడనివి చెప్పి.. అట్లా ఆవహించిన వారు తొలగిపోతారు.
ఈ సందడికి చుట్టుపక్కల వారంతా గుమిగూడి ఆమె చెప్పే సోదిని ఆసక్తిగా వింటారు. ఆ సోదిలోకి వచ్చిన పెద్దలతో వీళ్ళ అనుబంధమ తలుచుకుని ఇంటి వాళ్ళతో పాటు వాళ్ళుకూడా కంటతడి పెడ్తారు. ఆ తరువాత వాళ్ళులో కూడా కొందరు సోది చెప్పించుకుంటారు. సోది చెప్పించుకున్నవాళ్ళూవీళ్ళూ కూడా సొమ్ములతో పాటు.. ఆమెకు కడుపునిండా అన్నం పెట్టి, పాత చీరలు, దుప్పట్లు ఇస్తారు. లేదా డబ్బులు ఇస్తారు. ఇది ఒకప్పటి మాట ఇప్పుడో.. కొండ దేవర ఆన పొంది.. కొండలూ గట్లు దాటి.. ఊర్లోకొచ్చి గడప గడప దగ్గరా నిలిచిన కోయపడుచు సోది చెప్తానంటే ఇవ్వాళ ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు. గోడలూ, గేట్లే తప్ప ఆ అపార్ట్ మెంట్ల ముందూ, ఆ పెద్ద భవనాల ముందూ అసలు మనుష్యులే కనపడడం లేదు. కనపడిన వారెవ్వరూ సోదెమ్మ ను పిలవడంలేదు. గేట్ల దగ్గర వున్న వాచ్మెన్లూ, సెక్యూరిటీ గార్డ్ లూ “ఇల్లల్లో వాళ్ళు కూడా ‘వెళ్ళూ వెళ్ళనే’ అంటున్నారు. రెండోరోజూ మూడోరోజూ కూడా ఇలాగే జరిగింది.
చుక్కమ్మ పిలిస్తే వద్దామని ఆకాశానికి ఇటు వైపు విహరిస్తున్న కంచి కామాక్షి, మధుర మీనాక్షీ, బెజవాడ కనకదుర్గమ్మలకు, వెంకన్నా, మల్లికార్జునులకు పట్టలేని ఆగ్రహమొచ్చింది. ఆకాశానికి ఇటు వైపున విహరిస్తూ.. ఈ దేవతలు అనుమతిస్తే తమ వారిని ఓసారి కలుసుకుందామని చూస్తున్న మాతృ, పితృ, భాతృ దేవతలకూ విపరీత మైన కోపం వచ్చింది. నారాయణ గానం చేస్తూ నారదులవారు ఆకాశానికి అటువైపూ.. ఇటువైపూ తిరగసాగాడు. “చూశారా చూశారా! వీళ్ళ నాగరికం నక్కలు తోల! ఈ జన మంతా సోది చెప్పించుకోని సోమరులయ్యారా! సోంబేరులయ్యారా దేవ దేవతల్లారా!” అంటూ ఎగదోశాడు.
సరిగ్గా అప్పుడే ఆ కోయపడుచు కూడా నుదుటి మీద కర్ర ఆన్చుకుని దేవతలను తలుచుకున్నది. తమ భక్తురాలి దగ్గర సోది చెప్పించుకోని భూలోక వాసులపై ఆగ్రహించి.. తమ భక్తురాలిని ఏ విధముగానైనా అనుగ్రహించ వలేనని ఆలోచించి, ఒక్కసారైనా నీతో సోది చెప్పించికోని ఈ జనమంతా పెక్కు రీతుల నిన్నే వాక్రుచ్చుదురు గాక! అని అందరూ ఒక్కసారిగా అంతర్ధానమైపోయారు.
***
“సో.. మీ నానమ్మ చనిపోయిందన్న మాట. సో.. అందుకే సెలవు పెట్టారన్నమాట.
“అవును సర్. సో నాకు ఫోన్ల మీద ఫోన్లు సర్. వారం రోజుల నుండీ హర్ కండిషన్ ఈజ్ సో సీరియస్ సర్..
“సో.. ఆఫీస్ పై అంతులేని బాద్యతతో సెలవు పెట్టలేదన్నమాట..” “నిజం సర్”
“సో సాడ్ టూ నో దిస్ న్యూస్.. మై డియర్ ప్రకాష్. మై డీపేస్ట్ కండోలెన్స్ చెప్పుదా మనే వున్నది. బట్, సో సారీ టు ఆస్క్. ఈమె మీకు ఎన్నో నానమ్మా తెలుసుకోవాలని వున్నది”
“సార్.. సో సారీ సార్! నాగార్జున సాగర్ ట్రిప్పుకి వెళ్దామని మావాళ్లు ప్లాన్ చేశారు సార్. సో ఇలా చెప్పక తప్పలేదు సార్.. సొగసుగా సో సోల పర్వం సాగిపోతుంటే నారదుల వారు మబ్బుల పరదాల మాటునదాగి పకపకా నవ్వుకున్నారు.
***
కురచదుస్తులు వేసుకుని, కాలుమీద కాలు మడత వేసుకుని కూర్చుని.. సినీతార సోనీ.. యాంకరయ్య అడుగుతున్న ప్రశ్నలకు హొయలు పోతూ జవాబులు చెబు తున్నది.
“తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సో.. అసలు నేను యాక్టర్ అవ్వడమే అన్ బీలవబుల్. సో.. నేను తెలుగు సినిమాలలో యాక్ట్ చేస్తానని గెస్ చేయలేదు. సో.. అప్పుడప్పుడు నేను మా ఆంటీతో షూటింగ్ కి వెళ్ళేదాన్ని. సో.. అక్కడ నన్ను డైరెకర్ శ్రీహరి సర్ చూశారు. సో.. యాక్ట్ చేస్తావా? అని అడిగారు. సో నేను చదువుకోవాలి ఆక్ట్ చేయను అని చెప్పాను. సో.. ఈ ఒక్క సినిమాలో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో.. మా ఆంటీ కూడా ఈ ఒక్క సినిమాలో చెయ్యొచ్చు కదా! అని కోపడ్డారు. సో.. ఏమి జరిగిందో మీకు తెలుసు” తెరలు తెరలుగా ఆమె నవ్వింది.
“సో.. మీరు ఆ రోజు ఒప్పుకోవడం మా అదృష్టం. లేకుంటే తెలుగుసినీ ఫీల్డ్ కి ఇంత సొగసరి దొరికి వుండేది కాదు. కిలకిలా నవ్వులు. “సో.. మీ నెక్స్ట్ సినిమా కూడా తెలుగు సినిమానే కదా!”
“సో ఆబియాస్లీ తెలుగునే. సో.. ఐ లవ్ తెలుగు ఫీల్డ్? “సో.. మై ఫస్ట్ ప్రీఫేరెన్స్ ఆల్వేస్ తెలుగూ ఓన్లీ. సో.. ఐ నెవ్వర్ గోబాక్. నేను ఇంకా మూడు సినిమాలకు సైన్ చేశాను..” సొగసుగా చెప్పింది హీరోయిన్ సోనీ అరవైసార్లు జుట్టు ముందుకు పడి కళ్ళను కప్పేస్తున్నది. ముప్పైసార్లు ఆ జుట్టును వెనక్కు తోసుకుంటూ అనవసర నవ్వులు గుప్పిస్తూ..
“ఓకే ఓకే! సో మీ అభిమాన దర్శకుడెవరు?” కిలకిల నవ్వుల నడుమ.. “నో డౌట్ ఇట్స్ చేపూరీ సర్”
“సో.. మీకు ఏ హీరోతో నటించాలని ఉన్నది?”
“హ్హ హ్హ.. అయామ్ సో కంఫర్టబుల్ విత్ సోమేష్. సో.. ఆబియాస్ లీ ఇట్స్ సోమేశ్ బాబూ..”
“సో నైస్ ఆఫ్ యూ. మా షో కి వచ్చి మాతో ఇంతసేపు స్పెండ్ చేశారు”
“సో హాప్పీ. తెలుగు పీపుల్ తో మాట్లాడడం” యాంకరయ్య ఇంటర్వూ ముగించాడు
కెమెరామేన్ “ఏంటి సార్ ఆ సో.. సోలూ.. విసుగు తెప్పిస్తున్నాయి.” అన్నాడు గుసగుసగా. “నువ్వే ఇలా అంటే ఇదంతా ఎడిట్ చేసేటప్పుడు నా చెవులు సో.. సోలతో చెవుల్లో ‘సోసం’ పోసుకుంటున్నట్లు.. సారీ సీసం పోసుకుంటున్నట్లు అవుతుంది తెలుసా!” అన్నాడు. పై నుంచీ చూస్తున్న నారదుడు నవ్వాపుకోలేక కిసుక్కున నవ్వుకున్నాడు.
***
బడి పిల్లలంతా ఆన్ లైన్ క్లాసుల్లో పాఠాలు వింటున్నారు స్క్రీన్ మీద సైన్స్ టీచర్ పాఠం చెప్తున్నారు. “సో పిల్లలూ! ఇప్పుడు మనం శ్వాసక్రియ పాఠం చెప్పుకుందాం. సో.. మీరంతా గాలి పీలుస్తున్నారనీ వదులుతున్నారనీ మీకు తెలుసు కదా! సో.. అది మనకు తెలియకుండానే జరిగిపోతున్నది. సో.. మనం గాలి పీల్చడాన్ని ఉచ్ఛ్వాస అనీ, గాలి వదలడాన్ని నిచ్ఛ్వాస అనీ అంటాము. సో.. మనం ఏ గాలిని పీల్చుతాము ఏ గాలిని వదులుతామో తెలుసుకుందాం..” మేఘాలలో తేలుతున్న నారదులవారు గలగలా నవ్వుకున్నారు.
***
“వసుమతీ! సో అక్కడ పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసింది. సో.. అక్కడి పరిస్థితి ఎలా ఉన్నది వసుమతి?”
“రవీ! ఇక్కడ ఆటోని ఒక ట్రక్కు ఢీ కొట్టింది రవీ. సో.. చాలా పెద్ద ప్రమాదమే జరగింది రవీ. సో.. కనీసం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు రవీ. సో.. ఇప్పటికే ఇద్దరు మరణించారు. సో.. చుట్టుపక్కల వారు తమ సహకారం అందిస్తున్నారు రవీ. సో.. 108 కి కాల్ చేశారు కానీ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు రవీ.
“సో.. వసుమతీ! మరీ అక్కడికి పోలీసులు చేరుకున్నారా లేదా?” లేదు రవీ! సో.. ఎక్కడికైనా ముందు మనమే కదా?”
“సో.. ఇప్పుడు మనం చనిపోయిన వారితో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి.. గాయపడ్డవారితో మాట్లాడి చూద్దాం. సో.. చెప్పండీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? సో.. ఇతను ఏమీ మాట్లాడలేకపోతున్నారు రవీ.. మనం ఇంకోకరితో మాట్లాడుదాం సో.. మీరు ఇప్పుడు ఒక ప్రమాదంలో గాయపడ్డారు కదా? సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?”
“చేయి సహకరించడం లేదమ్మా.. లేకుంటే నాకే ఒక ప్రమాదం చెయ్యాలని వున్నది” ప్రమాదాన్ని పసికట్టి వసుమతి జారుకున్నది. జారిపోతున్న మహాతిని సర్దుకుంటూ నారదులవారు అమిత బాధగా నవ్వుకున్నారు
***
“ఏంటి ధరణీ! ఇంతాలస్యంగానా ఇంటికి వచ్చేది?”
“ఇవ్వాళ సడన్గా ఎక్స్ట్ర ట్రా క్లాస్ పెట్టారాంటీ. సో.. అందుకే లేట్ అయ్యిందాంటీ. క్లాస్లో ఫోన్ వాడనివ్వరు కదాంటీ. సో.. మీకు ఇన్ ఫామ్ చేయలేకపోయామాంటీ. సో ధరణీని ఏమీ అనకండాంటీ”
“అననమ్మా! సో.. అందుకేగా మాట్నీషో అవ్వగానే నిన్ను వెంటబెట్టుకొచ్చింది. సో.. షో మధ్యలో మీరు మాత్రం ఫోన్ చేసి ఎట్లా చెప్తారు చెప్పు..” దొరికిపోయిన దొంగలను చూసి దోస్త్ లిద్దరూ తలవంచుకున్నారు. ఆకాశంలో దోబూచులాడుతున్న మబ్బుల్లో చేరి గుంభనంగా నవ్వుకున్నారు నారదులవారు.
***
“హెలో నా పేరు సోహెల్ అండీ”
“సో వాట్ ?”
“నేను శ్రీ గోవిందా వెంచర్స్ నుండీ కాల్ చేస్తున్నానండీ.
“సో..”
“సో.. ఏమీలేదండీ. ప్రశాంత వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలన్న సొంతింటి కల ఎవరికి ఉండదు చెప్పండి. సో.. హైదరాబాద్ హైవేకు కేవలం నలభై అడుగుల దూరం లో సకల సౌకర్యాలతో మా వెంచర్ ని ప్రారంభిమించామండీ. సో.. వెంటనే బుక్ చేసుకోండి. చుట్టూ చక్కటి ప్లాంటేషన్, మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. సో.. మీకు అనువైన ధరల్లో వున్నది. ఇంకా ఇరవై మందికే అవకాశం. సో.. త్వరపడి బుక్ చేసుకోకపోతే మంచి ఛాన్స్ మిస్ అవుతారండీ.
“సో.. చాలా శ్రమ పడ్డారండీ. సో.. మాకు ఆ గోవిందా వెంచర్ గురించి బాగా తెలుసండీ. సో.. మేమేమి కొనదలుచుకోలేదండి. సో మీరిక ఫోన్ పెట్టేయండి” సోనీ ఫోన్ పెట్టేయగానే.. తెలి మబ్బులలో తేలుతున్న నారదులవారు సొగసుగా నవ్వుకున్నారు
***
కైలాస పర్వతంపై శివుడు చిద్విలాసంగా కూర్చున్నాడు. కానీ పార్వతీ దేవి ముఖం పరమ విసుగ్గా పెట్టి..
“ఈ భూలోక వాసులకు ఏమైనది నాధా! మధురమైన భాషలోకి ఈ సో సో లు ఎట్లు చొరబడెను? ఎక్కడ, ఎప్పుడు, ఎవరు మాట్లాడుకున్నా సో.. సోలే. తెలుగులో మాట్లాడు కున్నా సో.. ఇంగ్షీషులో మాట్లాడుకున్నా సో.. ఇంటా సో.. బయటా సో.. వాళ్ళ మాటల ముందొక సొ. మాటల మద్యలో ఒక సో. మాట ల చివరా ఒక సో.. ఇంతకీ ఈ రీతిని చెవులు తూట్లు పొడుస్తూ ఊతమై కూర్చున్న ఈ సో.. ఉదంతమెట్టిది నాధ?” అని అడిగింది..
“దేవీ పార్వతీ! ఎవరైనా సోది చెప్పించుకుంటున్న సమయంలో సోది చెప్పే స్త్రీ.. ఆమె అంబ పలుకు జగదంబ పలుకు, ఏడుకొండల ఎంకన్న పలుకు, వేములవాడ రాజన్న పలుకు.. అంటూ అని మొదలు పెట్టి మన దేవుళ్ళందరినీ పిలుస్తుంటుంది. సరే మానవులతో ఇచ్చకములంటే నచ్చనిది ఎవరికి.. మేము కూడా అట్లా ఒకసారి భూలోక విహారం చేసినట్టు వుంటుంది కదా అని వెళ్ళివస్తూ వుంటాము. అలా ఒక రోజు.. మేమంతా అలా గగన విహారం చేస్తుండగా సోది చెప్పే కోయపడుచు చుక్కమ్మను చూసాము.. ఆమె సోదిలోకి పిలవగానే వెళ్దాములే అని సరదాగా ఎదురు చూస్తున్నాము. అదేంటో ఈ మానవులు చాలా మారిపోయారు దేవీ! ఆ రోజు భువిపై ఎండలో చుక్కమ్మా.. ఆకాశంలో మేఘాల నడుమ మేము విహరిస్తూనే వున్నామా.. ఆ రోజు ఒక్కరంటే ఒక్కరూ కూడా చుక్కమ్మను పిలిచి సోది చెప్పించుకోలేదు. ఆ ఒక్కరోజే కాదు పాపం. మూడు రోజులు వీధి వీధి తిరిగినా.. ఎవ్వరూ ఆమెను పిలిచి సోది చెప్పించుకోలేదు. తీవ్ర ఆశాభంగం పొందినదై.. ఆగ్రహించినదై.. ఆ రోజు దేవ దేవుళ్ళను ఇట్లా ప్రార్థించింది.
“ఓ దేవతలారా ఎలాగూ మీరందరూ నా పిలుపుకు అందుబాటులో వుంటారు కాబట్టి నా మొరాలకించండి.. వెనుకటి రోజుల్లో ఇట్లా సోది చెప్పే మాకు, సోది చెప్పించుకునే ప్రజలకూ గొప్ప అనుబంధం ఉండేది. మంచీ చెడూ చెప్పుకుంటూ.. మా మధ్య మాటా ముచ్చటా ఉండేవి. బియ్యం, బట్టలూ, కూరలూ, పచ్చళ్ళూ ఇచ్చి మమ్ములను ఎంత గానో ఆదరించేవాళ్ళు. ఇప్పుడు సొంపుగా సోది చెబుతానంటే ఒక్కరూ పిలువడం లేదు. ఇట్లా మా కళ మరుగున పడిపోవాల్సిందేనా? ఆకలితో సోలిపోతున్న మమ్ములను పట్టించుకోకుంటే పోనీ.. మా నోట సోది పలుకనివ్వకుండా అంతరించి పోతున్న సోది కళను మాత్రం ఎలాగైనా నిలబెట్టండి..” అని వేడుకున్నది.
బాగా వేడి మీద వున్న దేవతలంతా.. “అంతరించిపోదు చుక్కమ్మా.. అర్ధాకలితో మరలిపోతున్న నిన్ను చూసి మా హృదయం భారమైనది. ఇదంతా మేము చూస్తూ ఊరుకోలేము.. నిత్యం నీవు పలికే ఈ సోది అన్న మాటలోని తొలి అక్షరమే వారి ప్రతీ వాక్యాన తొలి పలుకు అయ్యి తీరుతుంది. అర్థం పర్ధంతో నిమిత్తం లేకుండానే ఈ సో ఊత పదమై ఇక ప్రతివారి మాటల మధ్య నాట్యమాడుతుంది. ఇక పై సర్వ జనులులెల్ల సో.. సో అన్న పదమును సొగసుగా పలుకుతూ.. ఈ ఉర్విని ఉర్రూతలూపుదురు గాక!” అని ఆగ్రహంతో పలికారు. అదే ఇప్పుడు జనుల నాలుకలపై సో గా మారింది దేవీ..!”
“మరి చుక్కమ్మ విద్యను సరే.. చుక్కమ్మను అనుగ్రహించ లేదా? ఆమె ఎట్లా బ్రతకవలె..? దయామయి పార్వతి అడిగింది. దేవీ ఒక్కసారి అటువైపు తొంగి చూడు.. చుక్కమ్మ ఇప్పుడు కట్టూ, బొట్టూ మార్చి ఒక మహిళా కళాశాల ముందు టాటూస్ పార్లర్ పెట్టుకున్నది. నుదుటిపై, చెంపలపై, చేతులపై, భుజాలపై ఎక్కడ కావలిస్తే అక్కడ పచ్చబొట్లు పొడుస్తూ.. దేవతల దీవెనెలతో ‘పచ్చ’గా బతుకుతున్నది..” పరమేశుని పలుకులకు సంతృప్తి పడిన పార్వతీ దేవి ప్రశాంతగా నవ్వింది.
సో ది ఎండ్..
*****
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2025/02/Sammeta-Umadevi-e1739013335410.jpg)
రచయిత్రి సమ్మెట ఉమాదేవి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దాదాపు 150 కథలను రాశారు ఇప్పటిదాకా కథా సాహిత్యంలో అమ్మ కథలు, రేలపూలు – తండావాసుల కథలు , జమ్మిపూలు, సమ్మెట ఉమాదేవి కథానికలు, అనే పుస్తకాలను,.. మా పిల్లల ముచ్చట్లు – ఒక టీచర్ అనుభవాలు, నిక్ అంటే ప్రేరణ, చిలుక పలుకులు, రామకృష్ణ పరమ హంస జీవిత చరిత్ర వంటి బాలసాహిత్య పుస్తకాలను వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటీ ప్రతిభా పురస్కారం మొదలు పలు పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు