సోదెమ్మ…(బామ్మ లాంటి మంచి జ్ఞాపకం)

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-పెమ్మరాజు విజయ రామచంద్ర

          బాంక్ ఉద్యోగంలో చేరి రెండు రోజులైంది. క్యాషంటే ఏమిటో అసలు తెలియని నన్ను క్యాష్ కౌంటర్ లో పని చేయమని బ్రాంచ్ మేనేజర్ ఆర్డర్ వేశారు. నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఐదు వందలు పదిసార్లు లెక్కపెట్టే నేను క్యాష్ లో పని చేయడమేమిటి?
ఒక పక్క ఆనందం మరో పక్క ఆందోళన. చాలా భయంగా, బెరుకుగా ఉంది.

          హెడ్ క్యాషియర్ రామచంద్రరావు గారు, సీనియర్ క్యాషియర్ రమణ మేడం ఇచ్చిన దైర్యంతో కౌంటర్ ఎక్కేసాను. పబ్లిక్ దగ్గర మొదట డబ్బులు జమ చేసే ఫారం తీసుకుని ఎకౌంటు నెంబర్ చెక్ చేస్తున్నాను. కంప్యూటర్ లో నెంబర్ ఫీడ్ చేసి సరిగా
పేరుతో చూసుకుని అప్పుడు కష్టమర్ ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాను. ఫారం మీద వేసిన నోట్లతో వెరిఫై చేస్తున్నాను. తర్వాత కౌంటింగ్ మెషిన్ లో వేస్తున్నాను. మేడం చెప్పినట్లే తు.చ. తప్పకుండా చేస్తున్నాను.

          కౌంటింగ్ మెషిన్ లో చకచక కదలిపోతున్న నోట్లు పరిశీలిస్తున్నాను. లెక్క సరిపోయాక నోట్లను వాటికి సంబంధించిన అరలో పెడుతున్నాను. వర్షకాలంలో డ్రైనేజిలోంచి బైటకొచ్చే మురికినీరులా కష్టమర్లు జమ చేసే క్యాష్ టేబుల్ సొరుగు
నిండిపోయి బైటకు పొర్లిపోతోంది, అంత ఎక్కువ మొత్తంలో కాష్ దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి.

          ఒకరి తర్వాత మరొకరు వస్తూనే ఉన్నారు. కౌంటర్ చాలా రద్దీగా ఉంది.

          “రిపోర్ట్ చేసారా? నిన్న యూనియన్ మీటింగ్ లో కొత్త రిక్రూటి రిపోర్ట్ చేస్తారని చెప్పారు.” వెనుక నుంచి ఎవరో పలకరించారు

          “అవును సార్”.

          “నా పేరు సత్యనారాయణ. ఈ బ్రాంచ్ సెక్రెటరీని. మిమ్మల్ని చూస్తుంటే డైరెక్ట్ గా కాలేజీ నుంచి కౌంటర్ ఎక్కినట్టు కనిపిస్తున్నారు. ఏ ఊరు మీది?”

          “డిగ్రీ అవగానే జాబ్ వచ్చింది. మాది వైజాగ్”. లేచి వెనక్కి తిరిగి ఆయనతో చేయి కలిపాను.

          “గ్రేట్, బాంకుకి మీలాంటి కుర్రాళ్లే కావాలి. పరుగెడుతున్న బాంక్ తో మీరే పరిగెట్ట గలరు. మారుతున్న టెక్నాలజీని మీరే పట్టుకోగలరు.” అభినందిస్తూ చెప్పారు. నేను చిన్నగా నవ్వాను.

          “ఇంతకీ ఎక్కడున్నారు. ఎవరైనా చుట్టాలు ఉన్నారా? రూం ఏదైనా కావాలా? చెప్పండి.”

          “నాకు ఇక్కడ ఎవరు లేరు సార్. ప్రస్తుతం లాడ్జ్ రూంలో ఉన్నాను. రూం కావాలి. అది కూడా బాంక్ దగ్గరగా అయితే మంచిది. రావడానికి కాస్త సౌకర్యంగా వుంటుంది”.

          “బాంక్ పక్కవీధిలో రూం ఖాళీగా ఉంది. మంచి ఏరియా. ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం వెళ్ళి చూడండి. నచ్చితే మాట్లాడదాం” ఏడ్రస్ రాసిచ్చి పనిలోకి వెళ్లి పోయాడు సత్యనారాయణ.

          సాయింత్రం ఆఫీసు పని పూర్తికాగానే సత్యనారాయణ చెప్పిన ఇంటికెళ్లాను. బాంకుకి దగ్గరగానే ఉంది. ఇల్లు బాగుంది. నచ్చింది. ఎవరితోనూ సంబంధం లేదు. ప్రైవసీ ఉంది. అటాచ్ బాత్ రూం. సెపరేట్ మీటర్. చూడగానే ‘ఎస్’ అనేశాను. కిరాయి
కూడా ఎక్కువేం కాదు.

          “రాత్రి పది తర్వాత మెయిన్ గేటు లాక్ చేస్తాం. రాత్రి పూట ఆలస్యంగా రావడం కుదరదు. స్నేహితులని తీసుకురావడం, పార్టీలనీ గోల చేస్తే ఇల్లు ఖాళీ చేయిస్తాం”. ఇంటావిడ ఖరాఖండిగా చెప్పింది. నేను కూడా అన్నింటికీ సరేనని తల ఊపాను. అడ్వాన్స్ చేతిలో పెట్టాను. ఆనందంగా బైటకోచ్చాను. అప్పుడు వినిపించింది వెనుక నుంచి పిలుపులాంటి అరుపు. ఆడగొంతు. చుట్టూ కలయ చూసాను. ఎవరూ కనబడ లేదు.

          “ఒరేయ్!లం….కొడకా.” వెనక్కి తిరిగి చూసాను. ఎవరు కనబడలేదు.

          “ఒరేయ్!లం…కొడకా.” మళ్ళీ అదే పిలుపు. ఈసారి పిలుపు మరింత స్పష్టంగా వినబడింది. తలతిప్పి చూసాను. పెద్దావిడ. వయసు డబ్బై దాకా ఉండచ్చు. నెరసిన జుట్టు. నేను అద్దెకు రాబోతున్న ఎదురింట్లో కిటికిలోంచి పిలుస్తోంది. వయసు మీద పడ్డా గొంతులో గాంభీర్యం తగ్గలేదు. అసలు పరిచయం లేని నన్ను ఎందుకు తిడుతోంది.
పిచ్చిదనుకున్నా. నన్నుకాదనట్టు ముందుకెళ్లాను. .

          “అలా తల దించుకు వెళ్లిపోతున్నావేమిటి. నిన్నేరా కుర్ర లం..కొడకా.” సర్రుమని కోపం వచ్చింది. సంభాళించుకున్నాను. విసురుగా వెళ్లిపోయాను.

          ఇలా తిడితే ఎందుకు పడాలి. మా అమ్మ నాన్న ఎప్పుడు తిట్టలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని ఆవిడ తిడితే ఎందుకు ఎదురుతిరగకూడదు. ఈ గొడవంత ఎందుకు? ఆ రూం వద్దని చెపితే… ఎందుకు చెప్పాలి? ఎవరి కోసమో నేనెందుకు నచ్చిన రూం వదులుకోవాలి? ఆ గది, పరిసరాలు నచ్చాయి. అంత మంచి రూం  వదులుకో దలచుకోలేను, అందుకే పెద్దావిడతో గొడవ పడలేదు. అసలు ఆమెని పట్టించుకోలేదు. గట్టిగా పిలుస్తున్నా విననట్లు వచ్చేసాను.

          “అమ్మా! ఇక్కడ రూం దొరికింది. రూం చాలా కంఫర్ట్ గా ఉంది. ఎదురింటి పెద్దావిడ మాత్రం నచ్చలేదు. అందర్నీ నోటికొచ్చినట్లు తిడుతుంది.” అమ్మకి ఫోన్ చేసి చెప్పాను.

          “అది సిటి కాదురా, పల్లెటూరుకి తక్కువ సిటికి ఎక్కువ. అక్కడ మనుషులు అలాగే ఉంటారు. జాగ్రతగా ఉండు”. అమ్మ సలహా చెప్పింది.

          మర్నాడు ఆఫీసులో ఎదురుపడ్డ సత్యనారాయణతో “థాంక్స్ సార్, రూం చాలా బాగుంది. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ రోజే జాయిన్ అవుతున్నాను.”

          “ఈ ఊరిలో అదొక మంచి ఏరియా. ఏ గొడవలు ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది.”

          “అవునండి అంత బాగానే ఉంది, కానీ ఎదురింట్లో పెద్దావిడ. నోరు పారేసుకుం టోంది. అదే కాస్త ఇబ్బందిగా ఉంది.”

          “ఓ ఆవిడా, సోవిదేవమ్మ గారు. అందరూ సోదెమ్మ బామ్మని పిలుస్తారు. కాస్త నోరు జాస్తి. కాని మనిషి సహాయకారని చెప్పుకుంటారు. ఆవిడ తిడితే మంచి జరుగుతుందని అందరూ అంటుంటారు. కూరల వాళ్లు, పండ్ల వాళ్ళు, పాలవాళ్లు అడిగి మరీ తిట్టించు కుంటారుట. వ్యాపారం బాగా ఉంటుందని నమ్మకం. ఆవిడ తిట్లు ఆశీర్వచనాలు అనుకుంటారు. అయినా ఆవిడకి తిట్టే టైమ్ ఉన్నా మనకి తిట్టించుకునే టైం ఉండదుగా. బాంక్ లోనే సరిపోతుంది. ఎప్పుడో పొద్దుట వస్తే అందరూ నిద్రపోయాక
ఇంటికెళ్తాం.”

          “అవుననుకోండి, కాని తెలియని వాళ్ళు తప్పు లేకుండా తిడుతుంటే వినేవాళ్లకు బాగుండదు. మనకీ బాధనిపిస్తుంది.”

          “అది పట్టించుకోకండి. ఆమెకు సమాధానం చెప్పకుండా పక్క నుంచి వచ్చేయండి. అదే బెస్ట్”

          “సరే సార్. ఏది ఏమైనా మంచి ఏరియాలో రూం చూపించినందుకు థాంక్స్ సార్”

          “ఈ మాత్రం దానికే థాంక్స్ ఎందుకు. మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి”. భరోసా ఇచ్చి మేనేజర్ రూం వైపు వెళ్ళారు.

          నెమ్మదిగా ఉద్యోగానికి, ఊరికి అలవాటు పడుతున్నాను. పెద్దావిడ పిలిచినా పలకటం లేదు. ఎదురుపడినా పొరపాటున కూడా తల ఎత్తి చూడటం లేదు.

          ఒకరోజు ఆఫీస్ కి బయల్దేరిన నాకు ఇంటి గేట్ దగ్గరే ఎదురు పడింది. బాంక్ పాస్ బుక్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది.

          “ఒరేయ్ అబ్బాయి!”

          ఒరేయ్ పిలుపుకి నాకు చిర్రెత్తుకొచ్చింది. కానీ అమ్మ మాట గుర్తుకొచ్చి అయిష్టం గానే తల పైకెత్తాను.

          “నువ్వు స్టేట్ బాంక్లో పని చేస్తావని నిన్ననే తెలిసింది. ఇది నా ఖాతా బుక్. ఇది ఎప్పుడో తెరిచాను. పెద్దగా డబ్బులు వేయలేదులే. డబ్బులు వేసి తియ్యకపోతే ఖాతా చచ్చిపోతుందని మా అబ్బాయి చెప్పాడు. ఇదిగో ఈ వెయ్యిరూపాయలు వేసి దీన్ని
బతికించు.” పాస్ బుక్ చేతిలో పెట్టింది.

          “డబ్బులేస్తే కుదరదు. ఆధార్ కార్డ్, ఒక ఫోటో తీసుకుని బాంక్ అప్లికేషను పూర్తి చేసి ఇవ్వాలి. కనీసం వంద రూపాయలు ఖాతాలోంచి విత్ డ్రా చెయ్యాలి.” మొహం చిట్లించు కుంటూ చెప్పాను.

          “అవన్నీ నాకు తెలువదురా. ఆ కాగితమేదో తెస్తే వేలిముద్ర వేస్తాను. కాస్త ఈ పని చేసి పుణ్యం కట్టుకోరా లం..కొడకా”

          పుస్తకం అక్కడే విసిరేసేంత కోపం వచ్చింది. ఒక క్షణం నిదానించుకుని సమాధానం చెప్పకుండానే విసురుగా అక్కడ నుంచి ఆఫీసుకెళ్లిపోయాను.

          మొత్తానికి ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లు పని పూర్తి చేసాను. తర్వాత కొన్నాళ్ళకి వినాయక చవితి పండుగ వచ్చింది. పండుగనాడు మధ్యాహ్నం సత్యనారాయణ విలాస్ లో బోజనం చేసి రూం కొచ్చి మంచం మీద నడుం వాల్చాను. ఇంతలో గదిలోకి వచ్చింది పెద్దావిడ. కొంగుచాటునున్న పళ్ళెం తీసి కంప్యూటర్ బల్ల మీద పెట్టింది. దాంట్లో కారపూస, జంతికలు, మినపసున్నుండలు, కాజాలు, ఉండ్రాలు ఉన్నాయి.

          “ఆకలేసినప్పుడు తినరా అబ్బీ. కడుపు నిండా తినే వయసులో అమ్మనాన్నలకి దూరంగా ఉంటూ హోటల్ గడ్డి తింటున్నావు.”

          “ ఇవేమీ నాకొద్దు.” కంగారుగా లేచి విసురుగానే చెప్పాను. ఆవిడ నా మాట పట్టించు కోలేదు. పళ్ళెం అక్కడ పెట్టి తనకేమి సంబంధంలేనట్లు వెళ్లిపోయింది. పనిపిల్ల లక్ష్మికి ఇచ్చేసాను.

          “బాబూ గారూ! ఇవి తీసుకుంటాను. కాని ఆవిడ ఎంతో ప్రేమగా మీకు ఇచ్చిన….”

          “ఆవిడ ప్రేమ నాక్కకర్లేదు. ఆవిడ తిట్టే తిట్లు వద్దు. పెట్టే స్వీట్స్ వద్దు. నీకు వద్దంటే చెప్పు. డస్ట్ బిన్ లో పడేస్తా.” విసురుగా చెప్పాను.

          “వద్దులే బాబూ! ఇంటికి తీసుకెళితే పిల్లలు తింటారు.” గబగబా కవర్లో వేసుకుని తీసుకుపోయింది.

          క్రమంగా వీధిలో పరిచయాలు పెరిగాయి. సెలవురోజుల్లో రూంకి కుర్రాళ్ళు రావడం, సాయంత్రం మైనర్ గారి మామిడితోటలో కుర్రాళ్ళతో కలిసి ఆడుకోవడం అలవాటైంది. పక్క వాటాల్లో పిల్లలు ‘అన్న’ అంటూ లెక్కలు, ఇంగ్లీష్ చెప్పమని రావడం పరిపాటైంది. పిల్లలతో పాటు నేను కూడా బాంక్ పరీక్షలకి చదువుకుంటున్నాను. అంతా హయిగా సాఫీగా సాగిపోతోంది. పెద్దావిడంటే మాత్రం అభిప్రాయం మారలేదు.

          ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి బ్యాంకింగ్ చదువుకుంటున్నాను. ఒరవాకిలిగా వేసున్న తలుపు తోసుకుంటూ కంగారుగా వచ్చింది పెద్దావిడ.

          “ఒరేయి అర్జెంట్ గా ఐదువేలు కావాలిరా. తాతగారు స్పృహ తప్పి పడిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. అబ్బాయి రాగానే ఇచ్చేస్తా”. పైకి దైర్యంగా మాట్లాడుతోంది కాని కంట్లోంచి కన్నీరుని అపలేకపోతోంది. ఆవిడ్ని అలా చూడడం నాకెందుకో ఆశ్చర్యంగా అనిపించింది.

          ఆ రోజే విత్ డ్రా చేసిన డబ్బు జేబులో ఉన్నా లేవని అబద్ధం చెప్పాను. నిరాశగా వెనక్కి తిరిగిన ఆవిడ్ని నేను పట్టించుకోలేదు.

          నాలుగు రోజులు తర్వాత పెద్దాయన క్షేమంగా ఇంటికొచ్చారు. ఆయన రిక్షా దిగుతోంటే తప్పుచేసినట్లనిపించింది. మనసుకి ముల్లులా గుచ్చుకుంది.

          బాంకుకి నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. అప్పటికే అమ్మని చూసి చాలా రోజులైంది. వైజాగ్ వెళ్దామని రెండు రోజులు సెలవు పెట్టుకున్నాను. ఉదయమే బట్టలు సర్ధేసుకుని ఆఫీసు కొచ్చాను. సాయంత్రం ఆఫీసు పని పూర్తి చేసుకుని బైటకొచ్చాను. రోడ్ దాటుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కుర్రాడు బైక్ మీద దూసుకుంటూ వచ్చి నన్ను ‘ఢీ’ కొట్టాడు. కళ్ళు తిరిగి పడ్డాను. అంతవరకునే తెలుసు నాకు. ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేశారు. బెడ్ మీద మగతలో ఉన్నాను.  పరిసరాలు కొద్దిగా తెలుస్తున్నాయి. లీలగా మాటలు వినిపిస్తున్నాయి. “సత్యనారాయణ గారూ! రెండు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందిట. డాక్టర్ గారుచెప్పారు. వాళ్ళ తల్లి తండ్రులకి ఫోన్ చేసి ఇంఫాం చేద్దాం.” అప్పుడే వచ్చిన సత్యనారాయణ గారితో బ్రాంచ్ మేనేజర్ చెప్పారు.

          “కరెక్ట్ చెప్పారు నేను కూడా అదే అనుకుంటున్నాను. లేకపోతే ఈ తలనొప్పి ఎవరు పడతారు? సేవలు ఎవరు చేస్తారు?” ఇంటి ఓనర్ చెపుతున్నాడు.

          “అసలు ఈ రోజు రాత్రి బస్ కి వూరు వెళ్లాలనుకున్నాడు. కాని ఇంతలోనే ….” సత్యనారాయణ బాధగా చెప్పాడు.

          “అవును, నాలుగురోజులు సెలవు కదా మరో రెండురోజులు సెలవు పెట్టాడు కూడా.

          “ఇతగాడు వెళ్లకపోతే తల్లితండ్రులు కంగారు పడతారు. వాళ్ళు వెంటనే బయల్దేరి వస్తారు అందుకని చెప్పడమే మంచిది..” సత్యనారాయణ సలహా ఇస్తున్నాడు

          “ఆ విషయం సరేనండి. ఇప్పుడు ఎంతో కొంత ఎడ్వాన్సు కడితే కాని ఆపరేషన్ చేస్తారో, లేదో. ఆ డబ్బులు ఎక్కడనుంచి తేవాలో ఆలోచించండి.” మా ఇంటి ఓనరుదే ఆ గొంతు.

          “డబ్బులు గురించి ఆలోచించకండి. మేం చూసుకుంటాం. మెడికల్ బిల్ బ్యాంకు పే చేస్తుంది.” బాంక్ మేనేజర్, సత్యనారాయణ ఒక్కసారే అన్నారు.

          “నోరు మూసుకోండిరా లం…కొడకలారా” గంభీరంగా గొంతు లేచింది. ఆ గొంతే ఆవిడదే, అనుమానం లేదు పెద్దావిడదే.

          “ఓ పిల్లాడు తల్లితండ్రులకి దూరంగా వచ్చి మన మధ్య ఉద్యోగం చేసుకుంటు న్నాడు. మన ఇంటి బిడ్డలా, కొడుకులా, మనవడిలా కళ్ల ముందు తిరుగుతున్నాడు. అలాంటి కుర్రాడు ఈ రోజు అనుకోకుండా ప్రమాదానికి గురై అలా నిస్తేజంగా
పడుంటే మనమేం చెయ్యగలమో ఆలోచించాలి. అంతే కానీ తల్లితండ్రులకి కబురు పెట్టి భాద్యత తీర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు. మన కుర్రాడు ఇలాంటి కష్టంలో వుంటే ఇలాగే ఆలోచిస్తామా?”

          “అది కాదండీ.” ఏదో చెప్పబోయారు

          “ఆగండిరా! ఈ సమయంలో డబ్బు గురించి ఆలోచించడమేమిటి. మన దగ్గర ఉంటే పెడతాం. లేకపోతే ఎవరినైనా అడుగుతాం. అంతకి అవసరమైతే అప్పు చేస్తాం. ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనదా ముష్టి డబ్బు. లక్ష్మి చంచలం. ఈ రోజు
ఉంటుంది, రేపు పోతుంది. అయినా మనిషిని కాపాడుకోవడానికి ఉపయోగపడని డబ్బు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి?”

          “అది కాదు బామ్మా గారూ. మనం నోట్ పంపిస్తే హెడ్ ఆఫీసు అడ్వాన్సు పే చేస్తుంది. డబ్బు సమస్య కాదు.”

          “బాంక్ అడ్వాన్స్ పే చేసేవరకు నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటామా? ఇదిగో పదివేలు. ఇంకా అవసరమైతే నేను ఇస్తాను. లేకపోతే నా బంగారం పెట్టుకుని అప్పు ఇవ్వండి, మీరు బ్యాంకు వాళ్ళేగా. మీ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ
అప్పు తీర్చి నా నగ తీసుకొచ్చి ఇవ్వండి. సాటి మనిషి కష్టాల్లో ఉంటే డబ్బులు లెక్కలు మాట్లాడే వాడు మనిషి కాదు. బతుకున్న శవంతో సమానం” అంటూ మెడలో గొలుసు తీసి ఇచ్చింది.

          వాళ్ళు చెప్పే సమాధానం వినటం లేదు. వినదు కూడా. ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు.

          “చూడండి మేనేజర్ గారూ. వాడు నాకు మనవడు. వాడి అమ్మ నాన్న వచ్చినా వాడు లేచి తిరిగే వరకు వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటా” పెద్దావిడ మాటల్లో ప్రేమ కనబడింది. నిజాయతీ స్వరం వినబడింది.

          అసలు నేనవర్ని? ఆమెకు నాకు ఏమిటి సంబంధం? నా కోసం ఆమె ఎందుకు రావాలి? వచ్చినా ఆమె ఎందుకు డబ్బులు ఇవ్వాలి? సేవ ఎందుకు చేయాలి? ఈమేనా నేను ఇన్నాళ్ళు శత్రువులా చూసింది. చాలా తప్పు చేశాను. మనిషిని మంచం మీదున్నా
మెదడు చుట్టూ మాత్రం ఈ ఆలోచనలే ముసురుతున్నాయి. తాతగార్ని ఆసుపత్రిలో చేర్చడానికి డబ్బులు కావాలని వచ్చినప్పటి నా ప్రవర్తన గుర్తుకొచ్చింది. సిగ్గుతో మనసు
కుంచించుకుపోయింది. వయసులోనే కాదు. మనసులో కూడా ఆమె పెద్దదే. అదే విషయం తెలిసొచ్చింది. ఇదేనా నా చదువు ఇచ్చిన సంస్కారమా? ఏమి చదువుకుందని ఆమెకు సంస్కారం ఎలా వచ్చింది? ఇన్నాళ్ళు ఆవిడ కటువైన మాట వెనుక, కర్పూరం
లాంటి మనసు కనబడలేదు. అసంకల్పితంగా నాకు కన్నీరు వస్తోంది.

          “ఒరేయి! ఎడ్వకురా, దెబ్బలు తగ్గిపోతాయిలే.” ఓదారుస్తూ పెద్దావిడ ప్రేమగా తల నిమురుతోంటే అమ్మ ఎక్కడో దూరంగా ఉందనిపించలేదు. నాకు ఒరేయ్ అన్నందుకు కోపం రాలేదు. ఆ పిలుపు నన్ను ఆమెను మరింత దగ్గర చేసినట్లనిపించింది. క్షమించ మని అడుగుదామనుకుంటే పూడికపోయిన గొంతులోంచి మాటలు బైటకు రాలేదు.*

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.