అడ్డదారి

-కర్లపాలెం హనుమంతరావు

          సులభ కెనరాబ్యాంకులో ఆఫీసర్.

          ఇయర్ ఎండింగ్ సీజన్.  ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా  ఉంటోంది ఎప్పటిలానే. తొందరగా తెముల్చుకుని బైటపడదామన్నా చీకటి పడనేపడిందా పూట.  పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే  టైమ్  ఏడుకు  ఇంకా ఐదే నిముషాలున్నట్లు గత్తర పెడుతోంది! ఆర్టీసి క్రాస్ రోడ్స్ కు వెళ్లే  లాస్ట్ బస్ టంచనుగా ఏడింటికి వచ్చి పోతుంది.

          ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం పదినిముషాల నడక

          బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత పనిచేసిందామె.

          నిర్మానుష్యంగా ఉంది బస్టాండంతా! డైలీ తనతో పాటు వచ్చే గ్యాస్ ఆఫీస్ పిఆర్ఓ  లేడీ కూడా కనిపించలేదక్కడ.

          సామాను సర్దుకుంటోన్న పల్లీల అవ్వను అడిగింది సులభ  ‘సిటీకీ పోయే ఏడింటి బస్సు పోయిందా అవ్వా?’

          ‘ఇప్పుడే పోయింది బిడ్డా! ఇంకే బస్సులూ  రావే! ఎట్టా చేస్తావూ?’ తట్ట నెత్తికి ఎత్తి పెట్టుకుని జాలిగా అడిగిందా అవ్వ.

          ‘ఏదైనా ఆటో చూస్తాలే! నువ్ పో!’

          ‘పెద్ద మబ్బు తల్లీ! చినుకులు రాల్తావున్నాయి! ఏ ఆటో సచ్చినోడు ఇటేపొచ్చి చస్తాడో! పాపం, ఆడబిడ్డవి! బేగి ఇల్లు చేరుకో తల్లీ!’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయిందా అవ్వ .

          సులభకు అప్పుడు గాని అర్థమయింది కాదు తన పరిస్థితి.

          బస్సు లేక, ఆటో దొరక్క, ఈ గాలివానలో ఇక్కడే ఇరుక్కుపోతే నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఇల్లు చేరేదెట్లా?

          ఉన్న ఒకట్రొండు చిన్న దుకాణాలు కూడా కట్టేసుకుంటున్నారు మెల్లమెల్లగా!

          బస్టాండులో ఆడమనిషొక్కతే బిక్కు బిక్కు మంటూ నిలబడుండటం అప్పుడే దారే పోయే మనుషుల కంట్లో  పడ్డం మొదలుపెట్టింది. ఒకళ్లిద్దరు మగాళ్లయితే మొరటుగా నిలబడి తేరిపారా చూస్తూ పోవడంతో భయం పట్టుకుంది సులభకు.

          ‘ఎంత తొందరగా ఇక్కణ్ణుంచీ కదిలితే అంత సేఫ్!’  

          ఇంగితం హెచ్చరించడంతో సెల్ తీసి రాజశేఖర్ నెంబర్ నొక్కింది. రెండు కాల్సయినా రెస్పాన్స్ లేదు. రాదని తెలుసు. శేఖర్ సెల్ ఈ టైములో ఆఫ్ లో ఉంటుంది! అతగాడు అక్కడెక్కడో మాధాపూర్ చివర్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అనలిస్ట్.  డ్యూటీ స్టార్టయ్యే ముందు డైలీ టీం డిస్కషన్  ఉంటుంది. ఆ టైమ్ లో సెల్ ఆన్-లో  ఉండదు. అది రూలు. రోజూ తను ఇంటికి చేరిం తరువాత మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై రాదందుకే. రూల్స్ స్ట్రిక్టుగా పాటించక తప్పని ఆ కంపెనీలో ఆఫీసు వదిలిందాకా శేఖర్ తో కాంటాక్టంటే స్ట్రిక్ట్లీ వయా మెసేజెస్సే!

          అన్నీ తెలిసీ కాల్ చెయ్యడం.. కంగారు అణుచుకోలేకే! లక్కీగా భర్త నుంచి ఏదైనా సలహా వస్తుందని కూడా ఆశ. కుదరక, మెసేజ్ పెట్టి నడక మొదలుపెట్టింది సులభ!

          నిజంగానే లక్కీ! శేఖర్ నుంచి కాల్! సులభ చెప్పేది సగమే విని ‘గొప్ప చిక్కుల్లో పడ్డావ్ సులభా! ఆ ఏరియా అస్సలు సేఫ్ కాదు. ముందేదైనా దొరికిన వెహికల్ పట్టుకుని యాదగిరి టాకీస్ సెంటర్ దాకా వచ్చేసెయ్! బేరం గీరుతూ కూర్చోక ఆటో దొరికితే. మీ లేడీస్ కు అదో వీక్ నెస్! సెంటర్ కొచ్చేయగానే మెసేజ్ పెట్టు. ఇట్లాగే ఏ టాయ్ లెట్ లోకో దూరైనా మాట్లాడతా! ఇప్పటికే చాలా టైమయింది. బాస్ పిలవకముందే వెళ్లాలి’ అంటూ కాల్ కట్ చేశాడు రాజశేఖర్.

          ఒకటి రెండు ఆటోలు వస్తున్నట్లే వచ్చి దూసుకుపోయాయి. జల్లు జోరు పెరిగింది. ఇంటికి కాల్ చేస్తే చాలా సేపటికి గానీ ఎత్తారు కాదు అత్తగారు. ‘ఎక్కడున్నావు సులభా?’ పెద్దావిడ కంగారు. ‘పిల్లలిద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్ను గూర్చి అరడజను సార్లు అడిగారు. తొందరగా రా!’ ఆమె బెంగ ఆమెది.

          విషయం చెప్పి ‘కాస్త లేటవచ్చేమో అత్తయ్యా! పిల్లలకు సర్ది చెప్పండి! కాస్సేపు చదువుకుని పడుకోమనండి! మీరూ తినేయండి! నా కోసం వెయిట్ చెయ్యద్దు! షుగర్ టాబ్లెట్స్ వేసుకోడం మాత్రం మర్చిపోవద్దు’ అని ఫోన్ పెట్టేసింది.

          ఎవరో ఆటోవాడు ఎదురుగా బండి నిలిపి ‘ఎక్కడికమ్మా పోవాలి?’ అనడిగాడు.

          ‘చిక్కడపల్లి వస్తావా?’ ఆశగా అడిగింది సులభ.

          ‘సిటీలోకి పర్మిషన్ లేదు మేడమ్! కావాలంటే యాదగిరి సెంటర్ దాకా వస్తా! వందవుద్ది’ అన్నాడు కరాఖండిగా. 

          బండిలో ఎక్కి కూర్చున్న తరువాత గొణుక్కుంది సులభ  ‘అందరూ అంతే! అవకాశం వస్తే ఏదీ వదిలిపెట్టరు.. ఐదు కిలో మీటర్లు కూడా ఉండదు సెంటర్. ముప్పై అంటేనే గొప్ప. మీటరు వేస్తే పరిస్థితి అర్థమవుతుంది.’

          భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చి కిమ్మనకుండా  కూర్చుండిపోయింది. ‘ఎట్లాగో అట్లా క్షేమంగా ఇల్లు చేరితే చాలు. అదే పది వేలు’ అనుకుంది  పదోసారి.

          వర్షం దంచి కొడుతుంటే టార్పాలిన్ కవర్ రెండు వేపులా కిందికి దించాడు ఆటో అబ్బాయ్!

          బండి ఎటు పోతుందో అర్థమవడం లేదు. డ్రైవర్ వేసుకున్న పాన్ పరాగ్ వాసనకు కడుపులో దేవుతున్నట్లుంది.  కర్చీఫ్ తీసి ముక్కులకడ్డు పెట్టు క్కూర్చుంది.

          పది నిముషాలు కూడా నడిచింది కాదు.. బండి ఆగిపోయింది. డ్రైవర్ రెండు మూడు సార్లు  పెడల్ గేర్ లాగి లాగి ట్రై చేశాడు. బండి మొరాయింపులు  మానలేదు.

          ‘ఏమయింది?’ భయంగా అడిగింది సులభ.

          వాడు బదులేమీ ఇవ్వకుండా  ఆటో దిగి వెనక ఏదో సరిచేయడానికి తంటాలు పడుతున్నాడు. ఈ సందులోనే రెండు మూడు సార్లు ఫోన్లు. సంభాషణంతా ఏదో అర్థం కాని భాషలోనే. బహుశా గోండు అయుండాలి.

          రిపేరింగు  వాడి వల్ల కాలేదు లాగుంది. ‘ఆటో దిగండమ్మా!’ అన్నాడు టార్పాలిన్  కవరొకటి పక్కకు తొలగతోసి.

          బైటికి తొంగి చూసింది సులభ. కటిక చీకటి. వీధి దీపాలు వెలుగు దూరం నుంచి కనిపిస్తోంది. తనెక్కడుందో అర్థం కాలేదామెకు.

          కిందికి చూస్తే గలగలా శబ్దం. పాదాలు తడిసేటంత లోతులో రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయ్.

          ‘ఇదేంటి? థియేటర్  దాకా కదా తీసుకెళ్లాలి’ అంది సులభ కోపాన్ని దిగమింగు కుంటూ.

          ‘అల్లదిగో ఆ ఎత్తు మీద కనిపిస్తావుందే.. అదే  థియేటర్! బండి ట్రబులిచ్చింది. చూస్తున్నారు కదా! దిగి నడుచుకుంటూ వెళ్లండమ్మా.. పైసలిచ్చి’ అన్నాడు  నిర్లక్ష్యంగా ఆటో మనిషి.

          ‘ఎట్లానయ్యా! ఇంత నీళ్లల్లో! చీకట్లో! నాకిదంతా కొత్త చోటు!’ అంది సులభ మొండిగా.

          ‘బండి ట్రబులిస్తే నాదా తప్పు!   ఏం మాట్లాడతవ్! ముందు గాడీ దిగుండ్రి! పైసల్దియుండ్రి! ముచ్చట్లు ఆనక ! నే పోవాల!’

          డ్రైవర్ మాటల్లో ఎంతో తేడా! ఏం చెయ్యాలో పాలుపోలేదు బ్యాంకాఫీసర్ సులభా కుమారికి.

          పర్సు  తీసి యాభై నోటు అతగాడి చేతిలో పెట్టింది. ‘ఇంకో ఇరవై ఇయ్యమ్మా! ఇంత బారిస్ లో  కూడా గీడ  దాకా తోలుకొచ్చినా. కష్టం చూడరా దొరసానులు!’

          వాడి దబాయింపుకు వళ్ళు మండింది. కానీ, ఒంటరి ఆడది. అక్కడున్న పరిస్థితు ల్లో ఏం చేయగలదు తను?

          బైలుదేరే ముందు ఆటో నెంబరైనా నోట్ చేసుకోలే.. కంగారులో. ఎంత పెద్ద మిస్టేకయిందో  ఇప్పుడర్థమవుతోంది.

          మరీ రచ్చ చేస్తే మొదటికే మోసమవుతుందేమో! వాడు  పర్సు మొత్తం గుంజుకున్నా తానేంచేయగలదు!

          ముందెట్లాగో కొంప చేరాలి. మారు మాట్లాడకుండామరో ఇరవై వాడి చేతిలో పడేసి బండి దిగిపోయింది సులభ.

          వాన జోరు అట్లాగే ఉంది. వళ్లంతా తడిసి ముద్దయిపోయిందప్పటికే. హ్యాండ్ బ్యాగ్ ను జల్లుకు అడ్డుగా పెట్టుకొని దూరంగా కనిపించే థియేటర్ వైపుకు అడుగులు వేసింది  సులభ.

          నడక అలవాటే పూర్తిగా తప్పిపోయిందీ మధ్యన! పదడుగులు పడేసరికి నీరసం ముంచుకొచ్చింది. ఆయాసం కూడా. థియేటర్ సెంటర్ చాలా మెరకలో ఉంది. అంత ఎత్తు తానిప్పుడు  ఎక్కగలదా!..  అదీ వాన నీరు ధారగా ఫోర్సుగా కిందికి జారుతున్న ప్పుడు!

          దారి సరిగ్గా కనపడ్డం లేదు. ఎక్కడ ఏ గుంటలేడ్చాయో  పాడు ..  తెలీదు! మ్యాన్ హోల్సు గానీ ఉండి కాలువాటిలో పడితే! వణుకొచ్చింది సులభకు! 

          కాళ్ల కింద నుంచి ఏదో జర జర పాకి పోయినట్లనిపించింది. ఏడుపొక్కటే తక్కువ పాపం  బ్యాంకాఫీసర్ సులభమ్మకు..ఆ క్షణంలో!

          ‘ఎక్కడికమ్మా! ఈ యేల అట్లా ఒంటిగా పడిపోతావుండావు?’ 

          ఆ గొంతు వినిపించిన వైపుకు చూస్తే ఓ సగం కూలిన పెంకుటింటి  వసారాలో ముసిలామె కనబడింది వానజల్లుకు తడవకుండా ఓ వార కూలబడి!

          ‘ఆ థియేటర్ సెంటర్ దాకా పోవాలవ్వా! అక్కడికి బస్సులొస్తాయిటగా! నాది  సిటీ!’ అంది సులభ.

          ‘ఈ ఎత్తు యేపు ఎందుకు బిడ్డా? అసలే సరిగ్గా ఉండత్తల్లీ అటేపు! ఇంత లావు  వర్షంలో జారకుండా పోగలగవనే! తాగుబోతు సచ్చినోళ్లు అంకాళమ్మ గుడి కాడ అంక ఛండాలప్పనులు చేస్తావుంటారమ్మా అహర్నిశలూ! ఒంటరి ఆడబిడ్డవి. ఈ టైములో..  నిన్ను గాని చూస్తే వదిలేస్తారనేనా త్రాష్టులు?’ అంది అవ్వ.

          అప్పుడు చూసుకుంది సులభ తన వంటి వంక. వర్షానికి తడిసి ముద్దయిన బట్టలు  వంటిని దాచిపెట్టే డ్యూటీకి ఎప్పుడో రిజైన్ చేసేశాయి. లోపలి  దుస్తులు అంత చీకట్లో కూడా మెరుపులొస్తున్నప్పుటు బైటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

          ఆటో మనిషి తన వంక అదోలా చూడడం అప్పుడు గుర్తుకొచ్చి సన్నటి వణుకు వచ్చింది.. కానీ తమాయించుకుందెలాగో!

          ‘అవ్వా! ముందు ఇల్లు చేరడం కావాలి  నాకు.  దేవుడిదే భారం ! మూడు కిలో మీటర్లు నడిచొచ్చా! ఇంకో రెండు కిలో మీటర్లేగా..’

          ‘ఇట్టా చుట్టూ  తిరిగిపో తల్లీ!  అయితే ఇంకో రెండు కిలోమీటర్లవుద్ధి ఎక్కువ అయిన ఆలీసం ఎట్లాగూ అయింది గదా! పెద్ద ముండాదాన్ని! ఎందుకు చెబుతా వున్నానో అర్థం చేసుకో బిడ్డా! రోడ్డు వారా లైట్లుంటాయి కిందైతే. వచ్చే పోయే జనాలు కనపడతా వుంటారు. నీ అదురుష్టం బావుంటే అటేపెళ్లే బళ్ళు తగలచ్చు. చౌరాస్తా కాడ పోలీసు ఠాణా కూడా ఉండింది బిడ్డా!’ అంది అవ్వ తడుముకుంటూ చేతిలోకి ఊత కర్ర తీసుకుని ఇంట్లోకి  పోతూ! 

          సులభ గొప్ప  మీమాంసలో పడిపోయింది. కష్టమైనా సరే, ఎత్తు దారి ఎక్కేసి తొందరగా సెంటర్ కెళ్లి పోవడమా? అవ్వన్నట్లు, పోలీసు స్టేషనూ, జనసంచారం, లైట్లూ ఉండే పల్లం దారెంట పడి సెంటర్ చేరుకోడమా? 

          పెద్దావిడ. ఈ లొకాలిటీ మనిషి. ఏ అనుభవం మీద ఇంతలా చెబుతోందో? కాస్త చుట్టు తిరుగుడైనా రోడ్డు వారగా పోవడమే మేలు అనిపించింది సులభకు. వచ్చిన దారినే మళ్లీ  కాళ్లూ కొట్టుకుంటూ వెనక్కు తిరిగి రోడ్డు బాట వేపుకు నడక మొదలు పెట్టిందా ఖరుకు.

          రోడ్డు మీద ఇందాక తనెక్కి వచ్చిన ఆటో కనిపించలేదు! ముసలవ్వ చెప్పిన పోలీస్ ఠాణా దాటుతుండగా ఉప్పల్ గుండా పోయే బస్సొకటి కనిపించింది.  చెయ్యెత్తం గానే ఠక్కుమని ఆగింది. గభాలున ఎక్కి ఓ  సీటులో కూలబడ్డ  తరువాత గాని ఊపిరి తేలికగా వచ్చింది కాదు.

          ‘బాగా తడిసిపోయారే.. పాపం!’ అంది లేడీ కండక్టర్ సికిందరాబాద్ స్టేషన్  టిక్కెట్ కోస్తూ!

          బస్సు సిటీ జౌట్-స్కర్ట్స్ లోకి ఎంటరవగానే దిగిపోయి దొరికిన ఆటో పట్టుకుని ఇల్లు చేరింది సులభ. అప్పటికి  రాత్రి పది..  పది!  .

          అత్తగారు బోజనం కూడా చేయకుండా జాగారం చేస్తున్నారు.. పాపం.. తన కోసమే   ఎదురు తెన్నులు చూస్తూ. పిల్లలు తమ తమ రూముల్లో పడి నిద్రపోతున్నారు. భర్తకు మెసేజ్ పెడదామని సెల్ బయటకు తీస్తే అప్పటికె ఐదు  మిస్డ్ కాల్స్ .. పది  మెసేజెస్సూ!

          తనే కాల్ చేసింది భర్తకు! వెంటనే ఎత్తేడు రాజశేఖర్! ఎంత సేపు అలాగే ఫోనులో భోరుమని ఏడ్చేసిందో మాటా పలుకూ లేకుండా! అత్తగారు అలా అమ్మలా వెన్ను నిమురుతూనే ఉన్నారు భర్తతో సంభాషణ కొససాగుతున్నంత సేపూ!

***

          మర్నాడు బ్యాంకుకి శెలవు పెట్టేసింది సులభ. అటు మర్నాడు బ్యాంకు కెళ్లి నప్పుడు రాత్రి అనుభవాన్ని తన కొలీగ్సుకు చెబుతుంటే.. అంతా విన్న తరువాత మూర్తి అన్నాడు  చివర్లో ‘సులభగారూ! మీరు ఆ అవ్వ చెప్పినట్లు విని మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ రూట్ లో పైకి  వెళ్లకపోవడమే మంచిదయింది. నిన్న రాత్రి సరిగ్గా అదే స్పాట్లో .. పాపం..  గ్యాస్ కంపెనీలో పన్చేసే పి ఆర్ వో.. ఎవరో పాపం.. ఆవిడ.. దొంగ రాస్కెల్స్ బారినపడి సర్వనాశనం జరిగపోయింది!’ అంటూ ఈనాడు రంగారెడ్డి ఎడిషన్ లోని ఓ పేజీ పరిచి చూపించాడు.

          ‘సామూహిక అత్యాచార ప్రయత్నం’  శీర్షిక కింద ఫలానా మహిళా ప్రయాణీకురాలిపై తుంటరులు తలపెట్టిన గ్యాంగ్ రేపుకు సంబంధించిన వార్తాంశం అది.

          తమ తమ వాహనాలలో ఎక్కే ఒంటరి స్త్రీలను మాయమాటలు చెప్పి దారి మళ్లించడం. ఆనక మిత్రబృందంతో కలసి లొంగతీసుకోవడం.. గురించి వివరంగా రాసిన ఆ కథనం చూడగానే  సులభ గుండెలు ఒక్కసారి గుభేల్మన్నాయి!  

          ఠాణాలో స్టేషన్ ఆఫీసర్ వెనక చేతులు కట్టుకు నిలబడ్డ రేపిస్టుల ఫొటోలో మొన్న రాత్రి తాను ఎక్కిన ఆటో డ్రైవరు కూడా ఉండడం చూసి ఆమె అవాక్కయిపోయింది కొన్ని క్షణాలు!

          అంతకు మించి షాకిచ్చిన వార్తాంశం అక్కడే మరోటి కనిపించింది సులభకు!

          అదే ఫొటోలో పోలీసులకు అసుంటా దూరంగా బెంచీ మీద ముణగదీసుకుని కూర్చోనున్న ఆడమనిషి..  వేరెవరో కాదు.. ‘మెరక బాటలో తనను పైకి వెళ్లకుండా వారించిన  పుణ్యమూర్తి .. ముసిలవ్వ!

          ఆ పాడు   ఘోరానికి సరిగ్గా తన కొంపే వేదికవడంతో, ఆ  అవ్వ చూడలేక పోయిందిట! చేతిలోని ఊత కర్రతో అందినోడి నడ్డి అందినట్లు విరగ్గొట్టేసిందట!   

          ‘ఆనక పోలీసోళ్లకు సమాచారం అందించిందీ ఆ ముసిల్దే మేడమ్! మా పేటలో అందరూ మా గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఆ రేప్ కేసు త్రాష్టుల్లో తన కొడుకుండాడని  తెలిసీ వెనక్కి తగ్గడం లేదీ తల్లి ‘ అంది బైటి  నుంచి టీ.. కాఫీలు తెచ్చిచ్చే మహాలక్ష్మి. 

          ‘నువ్వు అడ్డదారిలో పోతుంటే ఆపగలిగిన ఆ ముసలమ్మ తన కొడుకు అడ్డదారిలో పోతుంటే ఆపలేకపోయింది చూశావా సులభా! సరే అయినా సరే.. చట్టానికి పట్టిచ్చే  అవకాశంరాగానే అంతలా తెగించేసింది! .. రియల్లీ హ్యట్సాఫ్ టు ది గ్రేట్ మదర్!’ అంటూ విషయం విన్న రాజశేఖర్ కామెంట్ పాస్ చేస్తుంటే సులభ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.