
అనుగామిని
अनुगामिनी
హిందీ మూలం – డా. బలరామ్ అగ్రవాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
ఈమధ్య అనుకోకుండా నితిన్ కి ఒంట్లో అలసట అనిపించసాగింది. ఆకలి తగ్గిపోయింది. దాహం ఎక్కువగా వెయ్యసాగింది. ఇవన్నీ చూసి నీలూకి దిగులు పట్టుకుంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. భార్య సిసలైన భారతీయ వనిత అయితే ఆమె తన ఆరోగ్యంకన్నా భర్త ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువగా దిగులు పడుతుంది. వెంటనే ఆమె ఎవరైనా డాక్టరుని సంప్రదించమనిరోజూ అతనికి చెప్పడం మొదలు పెట్టింది. మనదేశంలో సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసుకునేవాళ్ళని శారీరికంగా, మానసికంగా అధికంగా వాడుకోవడం, ఆ విధంగా చేస్తూ ఉండటానికి శాపగ్రస్తులైనవారి కథల గురించి చెప్పేదేముంది. వాళ్ళ పరిస్థితి అందరికీ తెలిసిందే. అసలైన ఇబ్బంది ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగంచేస్తూ కూడా ప్రైవేటు సంస్థ ల్లోని ఉద్యోగుల్లాగా జీవిస్తున్నవారిది. దీన్ని గురించి వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పుకోలేరు కూడా. నితిన్ ఆఫీసులోని పరిస్థితినే చూస్తే ఎలావుందంటే ఒక సూపర్ వైజర్, నలుగురు క్లర్కులు మొత్తం అయిదుగురు ఉద్యోగుల శాంక్షన్ అయిన స్టాఫ్ పనిని గత నాలుగేళ్ళ నుంచి క్లర్కుస్థాయికి చెందిన కేవలం ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అందులో ఒకరు తనే అయితే, రెండోవ్యక్తి సురేష్. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా సెలవు తీసుకోవడం మాట అలావుంచి, పనిలో ఏమాత్రం అలసత్వం చూపించినా అది టెన్షన్ ని ఆహ్వానించ డమే అవుతుంది. కేవలం తప్పించుకోలేని తరుణాలలోనే వాళ్ళు సెలవు తీసుకో గలుగుతారు. అదికూడా వాళ్ళ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే.
తను చెబుతున్నమాట నితిన్ మీద ఎటువంటి ప్రభావం చూపడంలేదని గమనించి నీలూ ఆదివారంనాడు పొద్దున్నే తను స్వయంగానే అతన్ని డాక్టరు దగ్గరికి తీసుకువెళ్ళి హాజరు పరిచింది. ఉన్న ఇబ్బంది అంతా ఆయనకి చెప్పింది.
“మీరు డయాబెటికా?” డాక్టరుగారు నితిన్ ని అడిగారు.
“తెలియదు.” తను అన్నాడు.
“ఇప్పుడేమైనా తిని వచ్చారా?” డాక్టరు మళ్ళీ అడిగారు.
“అవును. బెడ్ టీ తీసుకునే అలవాటుంది నాకు.” తను చెప్పాడు.
“ఏం ఫరవాలేదు” ఆయన తన లెటర్ హెడ్ మీద ఏదో రాసి అతనికి ఇస్తూ అన్నారు- “ఇవి కొన్ని టెస్టులు. మీరు రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా క్లినిక్ కి వచ్చి చేయించుకోవాలి. రిపోర్టు రేపు సాయంత్రానికి నాకు అందుతుంది. ఎల్లుండి పొద్దున్న వచ్చి నన్ను కలుసుకోండి.”
“ఈ టెస్టులు నేను వచ్చేవారం చేయించుకోవచ్చునా?”
“నేను చెప్పేది ఒకటే. రోగాన్ని పెరగనియ్యద్దు.” డాక్టరుగారు అన్నారు, “ఆ తరవాత మీయిష్టం.”
“రేపే ఎందుకు రాకూడదు?” ఈ ప్రశ్న డాక్టరు కాకుండా అక్కడే కూర్చున్న నీలూ అతన్ని అడిగింది.
“పొద్దున్నే ఎనిమిది గంటలకి ఆఫీసుకి బయలుదేరకపోతే…”
“అయితే ఆఫీసు పని ఆగిపోతుందా?” ఆమె వెటకారంగా అతనితో అడిగింది.
“ఆఫీసు గురించి కాదు. నాకు సురేష్ గురించి దిగులుగా ఉంది. పాపం అతను…” నితిన్ అన్నాడు.
“రేపు లేటుగా వెళ్ళండి ఆఫీసుకి. సగం రోజుకి, లేకపోతే పూర్తిగా ఒక్కరోజుకి సెలవు తీసుకోండి. మిగతా విషయాలు నాకు తెలియవు.” డాక్టరు ఎదురుగానే ఆమె తన నిర్ణయం చెప్పడంతోబాటు ఆదేశం జారీ చేసింది- “’టెస్ట్ చేయించుకునేందుకు రేపు పొద్దున్నే ఇక్కడికి రావాలి. అంతే.”నీలూ వైఖరి చూసి నితిన్ కి తన సీనియర్ మహిళా సహోద్యోగి మిసెస్ ఉషా గుప్తా జ్ఞాపకం వచ్చింది. ఆవిడ అంటూవుండేది- “శుక్లా గారూ, ఒక వయస్సు వచ్చాక ఎక్కువమంది మగవాళ్ళు తమ భార్యల ముందు కొడుకుతో సమానమైన జీవితం గడపడం మొదలుపెడతారు. దీన్నే ఇలా కూడా చెప్పవచ్చు. తెలివైన భార్యలు తమ పిల్లలతోబాటు చివరికి మొత్తం కుటుంబాన్ని తమ కొంగునీడలో దాచుకుంటారు. తమ భర్తనే కాదు, తమ అత్త-మామలని కూడా.”
ఇది ఇప్పటి నుంచి ఇంచుమించు ఇరవైయేళ్ళ వెనకటి మాట. అప్పుడు తను ముఫ్పైయేళ్ళవాడైవుండచ్చు, ఆవిడ చెప్పే మాటలు అప్పుడు విచిత్రంగానూ, అర్థంలేనివి గానూ అనిపించేవి. ఆత్మాభిమానం కల ఏ భర్త అయినా తన భార్యముందు చిన్నపిల్లవాడిలాగా ఎలా బ్రతగ్గలడు! కాని ఇప్పుడు అతనికి ఆవిడ చెప్పింది అక్షరాలా అనుభవం మీద ఆధారపడిందని అనిపించింది. ఇప్పుడతను ఆవిడ చెబుతూవుండే వయస్సు పరిమితిలో ప్రవేశించాడు.
నిజానికి అతను ఎక్కడా నీలూ తనకి చివాట్లు పెట్టినా, హెచ్చరించినా ఎప్పుడూ బదులు చెప్పలేడు. అందులోనూ డాక్టరుగారి క్యాబిన్ లో ఎదురుసమాధానం చెప్పడం అసలు బాగుండదనిపించింది. అందుకనే తను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. ఏమి ఇబ్బందిరా నాయనా. క్లినిక్ నుంచి బయటికి రాగానే నీలూకి వినిపించేలాగా కొంచెం సణుక్కున్నాడు. కాని ఆమె ఆ సణుగుడుని వినిపించుకోలేదు. అతన్ని తనకూడా తీసుకుని ఆమె ఇంటికి చేరుకుంది.
సోమవారంనాడు మిగిలిన రోజులకన్నా ఆమె తొందరగా పక్కమీద నుంచి లేచింది. నితిన్ ఎప్పటిలాగానే తన కళ్ళు తెరిచాడు. గడియారం చూసుకుంటే ఏడుంబావు అవుతోంది.
“చాయ్ తెస్తావా…” అతను రోజూలాగానే నీలూకి వినిపించేలాగా అన్నాడు.
“చాయ్ కాని, మంచినీళ్ళుకాని ఏదయినా టెస్టింగ్ కోసం బ్లడ్, యూరిన్ లు ఇచ్చిన తర్వాత క్లినిక్ దగ్గర క్యాంటీన్ లోకూర్చుని తీసుకోవాలి ఇవాళ.” వంటింట్లోంచి భార్య గొంతుక వినిపించాక అతనికి డాక్టరుగారి సలహామేరకు నీలూ నిర్ణయించిన ఆ రోజు కార్యక్రమం జ్ఞాపకం వచ్చింది. ఆఫీసులోని ఫైళ్ళన్నీ ఒక్కసారిగా భడభడా తన నెత్తి మీదకి వచ్చిపడినట్లు, దానితో శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయినట్లు అతనికి అనిపించింది. అతను లోలోపలే భయాందోళనలతో వణికిపోయాడు.
“చూడు…. ఇలా ముందుగా చెప్పకుండా ఆఫీసుకి లేటుగా చేరుకోవడం లేదా సెలవు తీసుకుని ఉండటం రూల్స్ కి విరుద్ధం.” మందమైన స్వరంలోనైనా నీలూ నిర్ణయానికి ఎదురుచెబుతున్నట్లుగా అతనన్నాడు- “ఒకపని చేస్తే బాగుంటుంది. ఇవాళ ఆఫీసుకి వెళ్ళి రేపటికి…”
“ఏం చేస్తారు…” అతను చెప్పినదాని మీద ఆమె ఇంచుమించు ఉగ్రస్వరంలో అక్కడినుంచే అంది- “ఒక్కరోజుకి జీతం కట్ చేసుకుంటారా? చేసుకోనివ్వండి.”
“అరే, నేను చెప్పేది జీతం గురించి కాదు. దానికన్నా సురేష్ ఒక్కడే అయిపోతాడు.” అతను సెంటిమెంటల్ పావు విసిరాడు.
“సురేష్ ఒక్కడే ఎందుకు అయిపోతాడు? మీరు క్లినిక్ కి వెడుతున్నారా లేకపోతే వాఘా బోర్డరుకా?” అతను విసిరిన పావుని తిరిగి అతని ముఖం మీదకే విసురుతూ తను అంది.
“నీతో వాదించడంకన్నా తలకాయని రెండు-మూడు సార్లు గోడకేసి కొట్టుకోవడం మేలు.” అతను కోపంగా అన్నాడు.
“రెండు-మూడు సార్లు కాదు, పదిసార్లు.” అతను చెప్పిందివిని నీలూ వంటింట్లోంచి బయటికి వచ్చి అంది. దానితోబాటుగా రోజూకన్నా కొంచెం పెద్ద టిఫిన్ క్యారియర్ అతని బ్యాగ్ లో పెట్టి ఆమె టేబిలుకి చేర్చిఉంచింది. “ఆఫీసుకి వెళ్ళడానికి మీకు అరగంట కన్నా ఎక్కువ ఆలస్యం కాదు. తెలిసిందా! అయినా, వాళ్ళకి కావలసినవి వాళ్ళకి ఇవ్వడంలో కాస్త ఎక్కువ సమయం పట్టినా, క్లినిక్ దగ్గర క్యాంటీన్ లో టిఫిన్ చెయ్యడానికి టైమ్ దొరక్కపోయినా తిన్నగా ఆఫీసుకి వెళ్ళిపొండి. లంచ్ తో బాటు బ్రేక్ ఫాస్ట్ కి కూడా కొంచెం పెట్టాను. ఆఫీసుకి వెళ్ళి తినండి చాయ్ తో పాటు.”
నితిన్ గడియారం చూసుకున్నాడు. మిగిలిన రోజులకన్నా నలభైఅయిదు నిముషాలు ముందే టిఫిన్ తయారుచేసి అతనిముందు అమర్చింది నీలూ. ఆ తరువాత అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆమెపట్టుదలతో అతను ఆరోజే క్లినిక్ కి వెళ్ళి టెస్టింగుకి బ్లడ్, యూరిన్ నమూనాలు ఇచ్చాడు. కాస్త పది నిమిషాల తేడాతో ఇంచుమించు సమయానికే ఆఫీసుకి కూడా చేరుకున్నాడు.
లంచ్ టైమ్ దరిదాపుల్లో ఫోన్ వచ్చింది. నీలూకి అతను నీ ఒత్తిడివల్ల ఊరికేనే ఒక గంట ఆలస్యంగా ఆఫీసుకి చేరుకున్నానని మృదువుగానే, సౌమ్యంగానే నిష్ఠూరం వేశాడు.
మూడోరోజున మళ్ళీ నీలూ అతన్ని డాక్టరుముందు హాజరుపరిచింది.
“మీకు సెకండ్ స్టేజి డయాబిటీస్ ఉంది మిస్టర్ శుక్లా”, టేబిలు మీద పెట్టిన చాలా కవర్లలోంచి అతని పేరున్న కవరు తీసి రిపోర్టును చూస్తూ డాక్టరు అన్నాడు-“బట్, యూ డోంట్ వర్రీ. లోపల కిడ్నీలు, లంగ్స్ మొదలైనవన్నీ బాగా ఉన్నాయి. ఇంకా ఏమీ పాడైపోలేదు. ఇదిగో.. ఈ టాబ్లెట్, ఒక కాప్సూల్ పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి పది-పదిహేను నిమిషాలు ముందు వేసుకోవడం మొదలుపెట్టండి. అది చాలు.”
“ఈ మందులు కాకుండా ఇంకా ఏమన్నా…?” నీలూ అడిగింది.
“అదేం లేదు.” డాక్టరు అన్నాడు- “తీపి వస్తువులు తినడం మొత్తానికి మానెయ్యాలి. కౌంటర్ లోంచి ఒక డైట్ చార్టు తీసుకోండి. భోజనం షెడ్యూలు దాన్నిబట్టి ఉండటానికి ప్రయత్నించండి. షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే అంతా బాగా నడుస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ. తిరగడానికి వెడుతూవుంటారా?”
“లేదండి.” నీలూ చెప్పింది.
“మొదలుపెట్టండి మిస్టర్ శుక్లా” ఆమె చెప్పిన జవాబు విని డాక్టరు నితిన్ తో అన్నాడు- “వాకింగ్ చేస్తూ ఉండటం అనేది షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడంలో చాలా సహాయపడుతుంది.”
ఈ మాటలన్నీ ఆయన నీలూ సమక్షంలో చెప్పాడు కనుక వీటిలో దేన్నీ కూడా ఆమెకి తెలియకుండా దాచి వుంచడం నితిన్ కి సాధ్యం కాదు. దాని పర్యవసానంగా డాక్టరు సలహా ప్రకారం ఆ సాయంత్రం నుంచే అతనికి ఇచ్చే చాయ్ లో పంచదార మాయమై పోయింది. నిజానికి చాయ్ పేరుతో అతనికి ఒక కప్పు కషాయం ఇవ్వడం మొదలయింది. రెండోది, ఆమె అతన్ని ఉదయం, సాయంత్రం పార్కులో తిరగడానికి పంపించడానికి కూడా ఒత్తిడి చెయ్యడం మొదలుపెట్టింది.
“నిజం చెబుతున్నాను… ఊరికే తిరగడం నా స్వభావంలో ఎప్పుడూ లేదు నీలూ.” నితిన్ ఆమె సమక్షంలో చాలాసార్లు బ్రతిమలాడాడు. కాని ఏమీ ప్రయోజనం లేకపోయిం ది. అతను చెప్పింది ఏదీ ఆమె ఏమాత్రం వినలేదు. ఆరోజు రాత్రి పడుకునేముందు ఉదయం అయిదు గంటలకి అలారం పెట్టి నిద్రపోయింది. పొద్దున్నే అలారం మోగగానే తను లేచికూర్చుని అతన్ని కుదిపేస్తూ అంది- “బట్టలువేసుకుని తయారవండి. వాకింగ్ చెయ్యడానికి వెళ్ళాలి.”
“ఏం ఇబ్బంది వచ్చి పడిందిరా నాయనా, నువ్వు నా వెనకాల పడ్డావు.” దుప్పటిని మరింత బాగా కప్పుకుంటూ ఆమె మీద విసుక్కున్నాడు. కాని ఆ విసుగుదల ప్రభావం నీలూమీద ఏమీ కనిపించలేదు. ఆమె నితిన్ ని మళ్ళీ కుదిపింది. నిద్రకళ్ళతోనే అతను తలగడ ఒళ్లో పెట్టుకుని పక్కమీద కూర్చున్నాడు. కళ్లు తెరిచి చూస్తే తిరగడానికి తయారై తను ఎదురుగా నిలబడటం చూసి అతను అన్నాడు-“నువ్వు నాతోకూడా వస్తే పిల్లలకి టిఫిన్ ఎవరు చేస్తారు?”
“అదంతా రేపు ఆలోచిద్దాం. ఇవాళ ఆదివారం కదా.”
“భగవంతుడా!” అతను మనస్సులోనే గొణుక్కున్నాడు…”ఈమెది చీర కొంగా లేకపోతే ఆటోమెటికల్లీ ఎక్స్ టెండబుల్ టెంటా! ఈమె నీడకి ఎంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే అంతగానే ఎక్కువగా తలపైన సంచరిస్తుంది. కనీసం కాస్త విశ్రాంతి తీసుకునే సమయంలోనైనా నా తలమీద నుంచి తీసి వేరుగా ఉంచాలి ఈమెని.”కాస్త చిరచిరలాడుతూ అతను లేచాడు. బాత్ రూంకి వెళ్ళివచ్చి ముఖం కడుక్కున్నాడు. చొక్కా-పైజామా ధరించి ఇష్టంలేని విధంగా అడుగులువేస్తూ భార్యకి వెనుకగా అనుసరించాడు. ఏదో కుక్కపిల్లనో, మేకపిల్లనో బలవంతంగా లాక్కుంటూ వెళ్ళినట్లుగానే ఉందా దృశ్యం. నితిన్ మెడకి బెల్టు అనేది ఏదీ కట్టిలేదు. అంతే తేడా. కేవలం పార్కుదాకా వెళ్ళిరావడం, అక్కడ తిరగడం… మొత్తం అంతా ఒక్కగంటలో ముగిసింది. ఏడుగంటలకి అంటే రోజూ తను పక్కమీద నుండి లేచే సమయానికి కూడా పది-పదిహేను నిమిషాలకి ముందే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇష్టంలేకుండా తిరగడంవల్ల నితిన్ ఒళ్లంతా పై నుంచి కిందివరకూ నొప్పిపెడుతున్నట్లుగా ఉంది. చెప్పులు విడిచి అతను తిన్నగా బెడ్ రూంలోకి వెళ్ళి పక్కమీద వాలిపోయాడు. బహుశా ఆదివారం కావడంమూలంగానేమో…నీలూ అతన్ని ఆపుజెయ్యలేదు. పడుకున్న తరువాత ఎనిమిదిన్నరకి అతనికి మెలకువ వచ్చింది.
“ఇవాల్టికి ఏదో అయిపోయింది,” కొద్దిసేపట్లోనే టీకషాయం కప్పు డ్రస్సింగ్ టేబిలు మీద పెడుతూ నీలూ అంది- “రేపయితే ఆఫీసుకి కూడా వెళ్ళాలి, కాబట్టి తిరగడం అయివచ్చాక పడుకోవడం బంద్.”
“అంటే మరొక తుగ్లక్ ఆదేశం… నెమ్మదిగా మొత్తం సౌకర్యాలన్నీ ఒక్కొక్కటిగా ముగిసిపోతాయనిపిస్తోంది.” నితిన్ అన్నాడు.
“తుగ్లక్ అనుకున్నా, తైమూర్ లంగ్ అనుకున్నా ఒంట్లో ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకునేందుకు ఏవి బంద్ చెయ్యడం అవసరమనిపిస్తుందో అవి చెయ్యాలిసే వస్తుంది.” ఆమె తన నిర్ణయం తెలియపరుస్తూ అంది.
“సరే…అలాగేలే బాబూ,”కషాయం కప్పు టేబిలుమీద నుంచి తీసుకుంటూ అతను నవ్వుకుంటూ పాట అందుకున్నాడు,“సుఖ్ భరే దిన్ బీతే రే భయ్యా, అబ్ దుఃఖ్ ఆయో రే…”
“రాత్రి అన్నంతిన్నాక కూడా తిరగడానికి వెళ్ళాలి. తెలిసిందా!” పుండుమీద కారం చల్లుతూ ఆమె చెప్పింది.
“వెళ్ళాలి అంటే?”నితిన్ అడిగాడు- “రాత్రి అన్నం తిన్నాక కూడా నాతో వస్తావా?”
“మీరొక్కరూ వెళ్ళద్దు. తిరగడానికి రావలసే వస్తుంది.” నీలూ అంది.
“నేను వెళ్ళి తిరిగొస్తానుగా” తన గొంతుకను చేతివేళ్ళతో పట్టుకుని అన్నాడు- “నిజంగా. ఒట్టు.”
ఆమె ఒప్పుకుంది. నిజానికి ఇంట్లోని పనులు, పిల్లలని చూసుకునే బాధ్యత కారణంగా అతను చెప్పింది నమ్మవలసి వచ్చింది. నీలూతో వాకింగ్ చేస్తూ అతను మొదటిరోజునే నిరాటంకంగా విశ్రాంతి తీసుకునే చోటు నిర్ణయించుకున్నాడు. పార్కులో గేటుకి దూరంగా ఉన్న చివర చెట్టు కింద ఒక సిమెంటు బెంచీ ఉంది. మర్నాడు అతను దానిమీదనే కూర్చోవడం, పడుకోవడం మొదలుపెట్టాడు. తన మొబైల్లో సరిగా ఉదయం ఏడుగంటలకి రిపీట్ అలారం సెట్ చేసి పెట్టుకున్నాడు. అలారం మోగగానే లేచికూర్చుని ఫ్రెష్ గా ఉన్న మూడ్ లో ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు తప్ప మిగిలిన చాలా రోజులు అతను సుఖపడ్డాడు. కాని అనుకోకుండా సుఖంగా ఉండే ఆ క్షణాల మీద పిడుగుపడినట్లయింది.
అసలు జరిగిందేమిటంటే, ఏవో అడ్మినిస్ట్రేటివ్ కారణాలవల్ల పిల్లల స్కూలుకి రెండురోజులు సెలవు ప్రకటించారు. మూడోరోజు ఆదివారం కావడంవల్ల మొత్తం మూడురోజులపాటు స్కూళ్ళకి మూతపడింది. నీలూ ఆ మూడు రోజులూ పిల్లలని పార్కులో తిప్పితీసుకువచ్చే కార్యక్రమం నిర్ణయించింది. ఆమె దృష్టితో చూస్తే ఇవన్నీ నితిన్ తో చెప్పవలసిన అవసరం ఏదీ ఉందని తను అనుకోలేదు. మొదటిరోజున నితిన్ తన రొటీన్ ప్రకారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి పార్కులో బెంచీ మీద పడుకు న్నాడు. అతను వెళ్లిన ఒక ఇరవై నిముషాల తరువాత నీలూ, పిల్లలూకూడా అక్కడికి చేరుకున్నారు. పరుగులెత్తుకుంటూ పార్కులో ముందుగా పిల్లలు ప్రవేశించారు. అన్ని పక్కలా వెతుకుతూ అందరికన్నా ముందుగా వాళ్లే తమ తండ్రిని బెంచీ మీద నిద్రపోతూ ఉండగా చూశారు. వాళ్ళు తిరిగివచ్చి `డాన్’ వంటి వాళ్ళ అమ్మకి చెప్పారు. ఆమె వాళ్ళని ఆబెంచీవైపుకి వెళ్ళవద్దని, ఇదంతా మనకి తెలిసిపోయిందని వాళ్ళ `డాడ్’ అంటే నితిన్ కి దీని గురించి ఏమాత్రం అనుమానంరాకుండా ఉన్నట్లు ఉండమని చెప్పింది. గొప్పవిషయం ఏమిటంటే పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మకి విశ్వాసపాత్రులైన సహచరులుగా తయారయ్యారు. తెలివైన తల్లులు సునాయాసంగానే పిల్లలని తమకి అనుకూలంగా ఎలా మలుచుకుంటారన్నది నితిన్ కి అప్పుడే తెలిసింది. వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే వాళ్ళు ఈ రహస్యం తమకి తెలిసినట్లుగా తమ డాడీకి ఏమాత్రం తెలియనివ్వలేదు. నితిన్ పార్కులో లేచి అక్కడి నుంచి ఇంచుమించు ఏడుంబావుకి ఇంటికి చేరుకుంటు న్నాడు. ఆ ముగ్గురూ అతనికన్నా అరగంట ముందుగా సరిగా పావుతక్కువ ఏడుకి చేరుకుంటున్నారు. అతను ఆఫీసుకి బయలుదేరి వెళ్లేంతవరకు వాళ్ళు స్కూలుకి వెళ్ళినట్లుగానూ, ఇంట్లో అసలు లేనట్లుగానూ వాతావరణం ఏర్పరచారు.
ఈ నాటకానికి మూడోరోజున ముగ్గురూ కలిసి స్వయంగానే తెరతీశారు. ఆరోజున వాళ్ళు పార్కులో ఆడుకునేందుకు ఇటూ-అటూ వెళ్ళకుండా నితిన్ ఉండే బెంచీకి దగ్గరలోనే తిరుగుతూ ఉన్నారు. అసలు ఏమాత్రం ఎటువంటి అల్లరీ చెయ్యకుండా. సరిగా ఏడుగంటలకి అతని మొబైల్ లోని అలారం మోగింది. అతను లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని ఎదురుగా చూసేసరికి నీలూ, పిల్లలూ పచ్చిగడ్డిమీద కూర్చుని ఆసనాలు వేస్తున్నారు.
“అరే, మీరా!” కలవరపడుతూ పిల్లలని అడిగాడు- “స్కూలుకి వెళ్ళలేదా మీరివాళ?”
“లేదు. అమ్మ ఇవాళ సెలవు పెట్టుకోమంది.” చింటూ అమాయకంగా అన్నాడు.
తనని పరీక్షించడానికే నీలూ పిల్లలతో పార్కుకి వచ్చివుంటుందని నితిన్ కి అనిపించింది. కాబట్టి బెంచీ మీద పడుకుని ఉండటానికి కారణం చెప్పుకుంటూ అన్నాడు- “తిరుగుతూ కాస్త అలిసిపోయానని అనిపిస్తేనూ…”
“మనమేమన్నా అడిగాముటర్రా?” అతను అలా అనగానే నీలూ ఇద్దరు పిల్లలనీ అడిగింది.
“మీ పని అయిపోయింది డాడీ…” ఇద్దరు పిల్లలూ ఒక్కసారిగా అన్నారు- “ఆల్ దో మామ్ ఈజ్ గ్రేట్, బట్ షీ ఈజ్ ది డాన్ ఇన్ సచ్ సర్కమస్టెన్సెస్, యూనో!”
“అరే ఊరుకోండిరా…” దగ్గరలో తిరుగుతున్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని అతను గుసగుసలాడుతున్నట్లుగా బతిమాలుతూ అన్నాడు- “నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా?”
“లేదు- ఎప్పుడూ లేదు.” ఇద్దరు పిల్లలూ వ్యంగ్యంగా పెదవులు బిగించి తలకాయ అడ్డంగా తిప్పుతూ ఒకే స్వరంలో తమ కవిత్వం వినిపించారు.
“సరే, వేళాకోళం ఆపుజెయ్యండి. ఇంటికి వెడదాం పదండి. ఏడు దాటిపోయింది. నేను ఆఫీసుకి కూడా వెళ్ళాలి.” నితిన్ అన్నాడు.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఒకరినొకరు క్రీగంటితో చూసుకుంటూ, నవ్వుకుంటూ అందరూ లేచి నిలబడ్డారు. అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. నితిన్ సాధ్యమయినంతవరకూ తను సహజంగా ఉన్నట్లు కనిపించడానికే ప్రయత్నిం చాడు. ఇంటికి చేరుకుని నీలూ సబ్బుతో చేతులు-కాళ్ళు కడుక్కుంది. వంటింట్లోకి వెళ్ళింది. తనకి, పిల్లలకి టిఫిన్, భర్తకోసం టీ డికాషన్ పెట్టి తీసుకువచ్చింది.
“రేపటి నుంచి మీరు పార్కుకి మీ మొబైల్ మీతోబాటు తీసుకువెళ్ళద్దు.” ఆమె చెప్పింది విని అతనికి గొంతుకలో పొరబోయింది. ఎలాగో సర్దుకున్నాడు.
“అరే,” తన కంఠస్వరాన్ని నార్మల్ గా ఉంచుతూ అన్నాడు- “ఇవాళ నిజంగా కాస్త అలిసిపోయాను. నేను చెప్పేదాని మీద నమ్మకం లేదా?”
“దానికి కారణం ఇప్పుడే, పిల్లలు మీకు చెబుతారు.” నీలూ సహజంగానే అంది, “ఒక్క గంట సేపే కదా?”
“ఆ ఒక్క గంటలోనే ఎక్కడినుంచైనా ఏదయినా కాల్ వస్తే,,,,” ప్రయోజనం ఏమీ లేదని తెలిసిపోతుండగా కూడా జవాబు ఇచ్చాడు-“నేను తిరుగుతూ ఉన్నప్పుడే నేను నీతో ఏమైనా చెప్పాలన్నా, లేకపోతే నువ్వు నాతో ఏమైనా చెప్పాలన్నా…”
“మీ కాల్ ఏదీ మిస్ కాదు.” తను ఎప్పటిలాగే ఉన్నట్లు అంది-“ఈ మొబైల్ చేత్తో పట్టుకుని నేను మీ వెనకాలే వస్తాను రోజూ.”
“ఆఁ!!!”
ఆమె చెప్పింది విని నితిన్ గొంతుకలో ఆమాట కొంచెం అడ్డంపడింది. తాగుతున్న టీ డికాషన్ అతికష్టం మీద అతనికి నోట్లో ఆగింది.
***
డా. బలరామ్ అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1952 న బులంద్ షెహర్, ఉత్తరప్రదేశ్ లో జన్మించిన డా. బలరామ్ అగ్రవాల్ గారు ప్రఖ్యాత రచయిత, సమీక్షకులు, అనువాదకులు. వీరు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో తన రచనాకౌశల్యం చూపించారు. వీరి విద్యార్హతలు- పిహెచ్.డి., అనువాదంలో పి.జి. డిప్లొమా, ఆయుర్వేదరత్న మొ. డా. అగ్రవాల్ గారి సాహిత్యసేవ వైవిధ్యభరితమైనది. మినీకథ, కథ, కవిత్వం, సమీక్ష, బాలసాహిత్యం, అనువాదం వీటిలో ఉన్నాయి. వీరి 9 మినీకథా-కథాసంకలనాలు, 6 సమీక్షాగ్రంథాలు, 15 బాలసాహిత్యానికి చెందిన పుస్తకాలు ప్రచురితం. ఇంచుమించు 25 కథాసంకలనాలకి సంపాదకునిగా
ఉన్నారు. వీరి రచనలు సంఘంలోని చైతన్యాన్ని, లోతైన ఆలోచనని ప్రతిబింబిస్తాయి. వీరి శైలి సహజంగానూ, ప్రభావవంతంగానూ ఉంటుంది. కేంద్రప్రభుత్వంవారి సాంస్కృతిక మంత్రిత్వశాఖకి చెందిన సి.సి.ఆర్.టి. నుండి వీరికి సీనియర్ ఫెలోషిప్ (హిందీ-2019-21) లభించింది. సెకండరీ స్థాయి విద్యార్థులకోసం పాఠ్యపుస్తకాల నిర్మాణానికి సంబంధించిన ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి 2 ప్రాజెక్టులలో సంపాదకత్వం నిర్వహించారు. వీరి సాహిత్యసేవకు చాలా సన్మానాలు, బహుమానాలు లభించాయి.
2023లో వీరిని ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్, లక్నో ద్వారా `డా. రామ్ కుమార్ వర్మ బాలనాటక సన్మానం’ ప్రదానం చేసి సత్కరించారు. డా. బలరామ్ అగ్రవాల్ నోయిడా (ఉత్తరప్రదేశ్) వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.