“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష

   -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి


“అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రాసి, పాఠకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో,  విమానాలలో ప్రయాణిస్తూ, కుటుంబాలతో కలిసి ఉన్నా,   ప్రేమ ఉత్తరాలను చదివి, పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ ఆనందిస్తూ రచయిత ఇష్టంగా రాసిన ప్రేమలేఖ ఈ ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’.

          అచ్చతెలుగు నవల ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’, లక్ష కాపీలు అమ్ముడై సంచలనం రేపడానికి కారణం విశ్వజనీనమైన ప్రేమను, అమ్మ ప్రేమకథతో సామరస్యం జోడించి వ్యక్తీకరించడమే. చిన్న, పెద్ద తేడా లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఈ నవలకి ఆకర్షితులై, అక్షర సేద్యం చేసిన యువ రచయిత రవి మంత్రితో ఏకీభవించి తమ తమ అంతరంగాలలో గూడు కట్టుకున్న ప్రేమ భావాల ప్రవాహాలతో నీరాజనాలు పలుకుతున్నారు.

          అమ్మ కాక ముందు అమ్మ అమ్మాయే, అప్పుడు ఆమె జీవితంలో ఏం జరిగిందో అనే అంశాన్ని తీసుకొని అల్లిన కథే “అమ్మ డైరీలో కొన్ని పేజీలు”. ఈ కథ మీకు నచ్చితే మీకు నచ్చిన వారికి ఉత్తరం రాయాలి అని  పిలుపునిచ్చిన యువ రచయిత ‘రవి మంత్రి’. ట్విట్టర్, వాట్సాప్, ఈమెయిల్, మెసేజెస్, ఫేస్బుక్ వాడే ఈ రోజుల్లో ఉత్తరాలు కష్టంగా కాకుండా, ఇష్టంగా రాసే విధంగా మంత్రం వేశాడు రచయిత.

          “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” రవి మంత్రి రచించిన తొలి నవల అయినప్పటికీ పాఠకులు నవలలోని పాత్రలలో తమను తాను ఊహించుకునే విధంగా ప్రతి పాత్రలోని సంభాషణలు సహజంగా, సరళంగా ఉంటాయి. చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథలు, బాల్యంలో చదివిన చందమామ, బాలమిత్రులతో స్నేహం, యవ్వనంలో చలం, వంశీ, తిలక్, యండమూరి రచనల, ప్రభావంతో అక్షరాల గారడీ చేయకుండా లేఖ రాయడంలో ఉత్తీర్ణత సాధించాడు రచయిత.

          అమ్మ ప్రేమ కథలోని ప్రధాన పాత్రలు నాలుగు, వాటిని నడిపించే పాత్రలు మరొక మూడు – మొత్తం ఏడు పాత్రలు.

* వర్ధనమ్మ- వర్ధనమ్మ పాత్ర మీద చాలామందికి కోపం వస్తుంది కానీ ప్రతి ఆడపిల్ల తల్లికి ప్రతినిధిగా అనిపించి ఆ కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది.
* గీత, జిత్తు- ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక దానిలో మనల్ని మనం చూసుకుంటాం.
* అభిరామ్- అభిరామ్ లా ప్రేమించడం అందరికీ సాధ్యం కాదు.
* నందగోపాల్- నందగోపాల్ లాగా మనుషుల్ని స్వీకరించడం మనుషుల్ని ప్రేమించడం కన్నా కష్టం.
* సుచిత్ర- మన మనసులకు చాలా దగ్గర అయిపోయే పాత్ర ఇది. గతాన్ని భవిష్యత్తుని లెక్కచేయకుండా వర్తమానాన్ని మాత్రమే ఆస్వాదించే సుచిత్ర లాంటి వాళ్లను అందరం ఇష్టపడతాం.
* సారిక- కథానాయిక పాత్ర సారికది. టీనేజ్ నుండి అమ్మ వరకు ఆమె ప్రయాణంలో వయసుతో వచ్చే మార్పులకు తగ్గట్లు ప్రవర్తిస్తూ ఒక దశ తర్వాత భావాల్ని నియంత్రించుకోవడం నేర్చుకుని పరిస్థితుల్ని తన అదుపులోకి తెచ్చుకోగలిగే పాత్ర. ఆమె పాత్రలో మనల్ని మనం చూసుకుంటాం. ఆమె నవ్వితే నవ్వి, ఆమె ఏడిస్తే ఏడ్చే విధంగా ఈ పాత్రను నడిపిస్తాడు రచయిత.

          సంసారం అనే బండికి ఒక చక్రం అమ్మయితే మరోచక్రం నాన్న, ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అని కథ రాసి, సంసార భారాన్ని మోస్తూ, బంధాల్ని, బాధ్యతల్ని నవ్వుతూ స్వీకరించే నాన్నకు అంకితం ఇచ్చి అమ్మానాన్నల మధ్య సామరస్యాన్ని నెలకొల్పిన యువ రచయిత ‘రవి మంత్రి’.

          రవి మంత్రి స్వయంగా చెప్పుకున్న మాటలు, ఏ భయాలు, ఏ సంకోచాలు లేకుండా రాసుకున్న కథ. ఎవరైనా చదువుతారో, చదవరో అనే సంశయాలు లేకుండా ‘డబ్బింగ్లో, తన గదిలో రాత్రుళ్ళు కూర్చుని రాసుకున్న ‘అమ్మ కథ’ పుస్తకంగా తీసుకురావాలన్న ఆశ, కల నిజమవడానికి మూడేళ్లు పట్టి నప్పటికీ, నవల రూపంలో వచ్చి లక్ష కాపీలు అమ్ముడై, మంత్రించిన భావాలకు లక్ష నీరాజనాలు అందడంలో ఆనందం తెలిసిందని పాఠకులతో సంతోషం పంచుకున్నాడు.

          విదేశీ గడ్డపై కొలువు చేస్తూ, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా గోదావరి యాసతో రీల్స్ చేస్తూ, తెలుగు సామెతలు వెటకారం మమకారంతో కలగలిపి వినిపిస్తూ, ఇన్ స్టాలో  రెండున్నర లక్షల ఫాలోయర్లతో ప్రయాణిస్తూ, “అమ్మ డైరీలో కొన్ని పేజీలు”తో లక్షల మంది పాఠకులను సంపాదించుకొని విజయ యాత్ర సాగిస్తూ, ఘన విజయాన్ని సాధించిన రవి మంత్రికి అభినందనలు. ఈ పుస్తకాన్ని పిల్లలు తల్లిదండ్రులకు, భార్య భర్తకు, భర్త భార్యకు, పుట్టినరోజులు, పెళ్లిరోజుల బహుమతిగా ఇచ్చి పుచ్చుకోవచ్చు.  

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.