అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 23

– విజయ గొల్లపూడి

జరిగినకథ:విశాల, విష్ణుసాయి పర్మెనెంట్ రెసిడెంట్ వీసా తో ఆస్ట్రేలియా సిడ్నీలో అడుగు పెట్టారు. అక్కడ జీవన విధానానికి మెల్లిగా అలవాటు పడుతున్నారు. విశాల టేఫ్ కాలేజ్ లో వర్క్ ఎక్స్ పీరియన్స్ పూర్తి చేసింది. విష్ణు నైట్ షిఫ్ట్ పర్మెనెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. విశాల ఖాళీగా ఉండకుండా, వచ్చిన అవకాశాలను  ఉపయోగించు కుంటూ, మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ డ్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసింది.

***

          జీవిత ప్రయాణంలో ఎందరో వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. కానీ ఏ కొద్ది మందితో మాత్రమే బంధం, అనుబంధం ఏర్పడతాయి. కొన్ని కలకాలం నిలిచి ఉంటాయి. మరికొన్ని కారణాంతరాల వల్ల కొద్ది కాలం కొనసాగుతాయి. ఒక బంధం నిలుపుకోవడమనేది ఇరువురిపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మధ్యలో ఒక మనిషి దూరి ఇరువురి మధ్య పొరపొచ్ఛాలు కలిగించి, ఉన్న స్నేహాన్ని చెడగొట్టవచ్చు. ఏమీ ఆశించకుండా, అన్నిటికి అతీతంగా నిలుస్తూ, మనస్సు, మనస్సు పెనవేసుకుని ఉన్నపుడు, ఆ ఇరువురి మధ్య గాలి చొరబడినా వారిని ఏమీ చేయలేదు. అలాంటివారినే సోల్ మేట్స్ అనగా ఆత్మ సఖులు- ఒకరికోసం ఒకరు అనవచ్చా?

          విశాల డోర్ బెల్ మ్రోగటంతో ఎవరా? అని తలుపుకి ఉన్న మేజిక్ ఐ లోంచి చూసింది. నిజంగా తలుపు తీసేముందు అపరిచితులైతే, అసలు వారు ఎవరు? ఏదో మార్కెటింగ్, అడ్వర్ టైజ్మెంట్ పేరుతో తలుపు తట్టేవారైతే అసలు బయటికి వెళ్ళన వసరం లేదు. అలనాడు సీతమ్మ వారికి లక్ష్మణ రేఖ గీసి, జాగ్రత్తలు చెప్పి లక్ష్మణుడు బయటికి వెడలాడు. ఇపుడు కలియుగంలో, ఏ దేశమైనా గానీ, స్త్రీ బయటికి వెళ్ళినపుడు, అప్రమత్తతతో ఉండి తీరాలి కదా! రోజూ పేపర్ తెరిస్తే ఎన్ని దుర్ఘటనలు చూడటం లేదు? ఇలా, ఏ చిన్న విషయం గురించి ఐనా సరే విశాల మనస్సు చాలా లోతుగా ఎక్కడికో పరుగులు తీస్తూ వేగంగా ఎల్లలు దాటి పది యుగాలు వెనక్కి, పది సముద్రాలు దాటి ముందుకు సాగిపోతుంది. బయట కొరియర్ బోయ్ డిహెచ్ ఎల్ అక్షరాలతో షర్ట్ ధరించి ఉండటంతో, ఫర్వాలేదనుకుని తలుపు తెరిచింది. అతను విశాల పేరు
అడిగి, నిర్ధారించుకున్న తరువాత, పేపర్ పై ఆమె సంతకం తీసుకుని, అట్ట పెట్టె గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోయాడు.

          విష్ణు కి ఫోన్ చేసి, కొరియర్ వచ్చిన విషయం చెప్పింది.

          “విశాలా! ఎందుకైనా మంచిది, ఒకసారి బాక్స్ తెరిచి చూడు. అన్ని వచ్చాయో, లేదో. ఒక్కోసారి కస్టమ్స్ లో చెక్ చేసినపుడు, కొన్ని ఐటెమ్స్ క్వారంటైన్ లో రెస్ట్రిక్టెడ్ ఐతే ఐటెమ్స్ పడేస్తారు.” అన్నాడు.

          “అలాగే!” అంటూ విశాల ఫోన్ పెట్టేసింది.

          ఇంతలో వాయిస్ మెసేజ్ నోటిఫికేషన్ రావటంతో పిన్ కొట్టి మెసేజ్ తెరవగానే, అత్తగారు ఇచ్చిన మెసేజ్ “ అమ్మా! విశాలా! మీ బావగారు, నేను కలిసి అవసరమైనవి మీకు కొరియర్ లో పంపాము. వారం రోజులు కావస్తోంది. అందులో నేను పంపిన లిస్ట్ కూడా జత చేసాను. అందగానే, నాకు ఫోన్ చెయ్యి.” అని.

          విశాల ఇక ఉండబట్టలేక, కత్తెర తెచ్చుకుని, కార్డ్ బోర్డ్ బాక్స్ జాగ్రత్తగా ఓపెన్ చేసింది. పైన రసీదు, పంపిన వస్తువుల జాబితా ఉంది. ఒక్కొక్కటి గా అన్ని తీసి, బల్ల
మీద పెట్టింది. లిస్ట్ తో అన్ని సరి చూసుకుంది. ఏదీ మిస్ కాకుండా అన్ని వచ్చినట్లే.
పంపిన వస్తువులలో దొడ్డ గణపతి, శివ పార్వతులు, శ్రీరామ పట్టాభిషేకం ఫోటోలు చక్కగా లేమినేట్ చేసినవి ఉన్నాయి. నిజంగా శివ పార్వతుల ఫోటో అటువంటిది ఎపుడూ చూడలేదు. అపురూపమైన ఫోటో పంపారు. ఎక్కడైనా పెద్దవాళ్ళు భార్యాభర్తలను చూడగానే పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతుల్లాగా ఉన్నారు అంటారు. పెళ్ళిలో కూడా నూతన వధువు చేత పార్వతి దేవి పూజ చేయిస్తారు. మళ్ళీ పెళ్ళి అయిన తరువాత కొనసాగింపుగా శ్రావణమాసంలో మంగళ గౌరి వ్రతం, అది కాగానే కుమారుడి
జననం వినాయక చవితి జరువుకుంటాం. నిజంగా ఎంత రిచ్ ట్రెడిషన్, కల్చర్ మన భారత దేశంలో ఉంది!’ విశాల మనసులో భావనా తరంగాలు మాతృభూమిపైకి మళ్ళాయి.

          ఇంకా తెలుగు పంచాంగం, తెలుగు క్యాలెండర్, డబుల్ కవర్ ప్యాక్ చేసినవాటిలో బూందీ లడ్డు, చింతకాయ పచ్చడి, రెండు కొత్త చీరలు, ఫ్యాంట్, షర్ట్ విష్ణు కోసం పంపారు. అవి కాక, ప్రెషర్ కుకర్, సుమీత్ గ్రైండర్, దోశె పెనం కూడా పంపారు. తెలుగు క్యాలెండర్ తీసుకుని పండగలు ఎప్పుడు ఉన్నాయో చూసుకుంది. శివరాత్రి ఈ నెలలోనే ఉంది కదా, గుడికి వెళ్ళాలి అని మనసులో అనుకుంది.

          అమెరికా మరియు ఇతర దేశాలతో పోలిస్తే, ఆస్ట్రేలియా కి పచ్చళ్ళు, పొడులు, నేతితో చేసిన ఆహార పదార్థాలు పంపడం అంత సులభం కాదు. క్వారెంటైన్ రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి అని తెలుసు విశాలకి. గతంలో స్నేహితులకి  కొంత మందికి, తెచ్చుకున్న ఊరగాయలు కమర్షియల్ ప్యాక్, లేబుల్ సరిగా లేకపోవటంతో రిజెక్ట్ చేసి అక్కడే ఎయిర్ పోర్ట్ లో పడేసిన ఉదంతాలు వింది విశాల.

          ఐతే అత్తయ్యగారు మనసు పెట్టి పంపిన వస్తువులు ఏవీ మిస్ అవ్వకుండా అన్నీ వచ్చినందుకు సంతోషించింది విశాల. అత్తయ్య గారు ఇద్దరి పేరు సంబోధిస్తూ తన స్వంత దస్తూరితో చక్కగా లెటర్ కూడా పెట్టారు క్షేమసమాచారాలు తెలుపుతూ, వచ్చే పండగలు అన్నీ చేసుకోమని, బెంగ పడవద్దని వ్రాసారు.

          అవన్నీ చూడగానే, విశాలకి ఉవ్వెత్తున కన్నీరు ఉబికి వచ్చింది. ‘తను ఎంత
అదృష్టవంతురాలు! నిజంగా ఇలాంటి అత్తగారు తనకి దొరకడం. తనను అడిగి మరీ
నీకు ఈ రంగు చీర లేదు కదా! అని తెలుసుకుని మరీ పంపారు. ఏనాడు విష్ణు మనసులో
చెడు బీజం వేయకుండా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో!’ అని చెప్పడం చూసింది.

          టైమ్ చూసుకుంది. ఇండియాలో పదిన్నర అయింది. ఫోన్ కార్డ్ తీసుకుని అత్తయ్య గారితో మాట్లాడదామని ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతోంది కాని, ఎవరూ ఫోన్ తీయక పోవడంతో అస్థిమితంగా ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది. మనసులో గూడు కట్టుకుని ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్త పరచాలి, అత్తయ్యగారితో తనివి తీరా మాట్లాడాలి అనుకుంది. కానీ అలాంటపుడే మనుష్యులు అందుబాటులో ఉండకపోవటం నిజంగా శాపంలాగ ఉంటుంది. దూరంగా ఉన్నపుడైతే ఆ వేదన చెప్పలేనిది.

          విష్ణు వర్క్ లో బిజీగా ఉంటాడు. ఫోన్ చేసినా ఎత్తడు. అన్య మనస్కంగా
ఇల్లు లాక్ చేసుకుని, అలా వాకింగ్ కి వెళ్ళింది. 

          ఇంటికి దగ్గరలోనే విశాలకు పార్క్ ఉండటంతో, పది నిమిషాలు నడుచుకుని
పార్క్ కి చేరుకుంది. తనకు ఆస్ట్రేలియాలో బాగా నచ్చిన విషయం ప్రతి సబ్ అర్బ్ లో కౌన్సిల్ వారు ఏర్పాటు చేసిన సుందర వనాలు. అందులో సీనియర్ సిటిజన్స్ కోసం బెంచీలు, పిల్లలకు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యాల, ఇంకా ఎక్సర్ సైజ్ చేయడానికి పెడల్స్ తో ఒక పరికరం ఉన్నాయి. విశాల అక్కడ ఊయల దగ్గర ఎవరూ లేకపోవడంతో కాసేపు ఉయ్యాలలో ఊగింది. తాతగారింట్లో చెక్క బల్ల ఉయ్యాల మీద తను చిన్నపుడు ఊగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

          ఇంతలో అక్కడికి పాపతో ట్రాలీ తీసుకుని ఒకావిడ వచ్చింది. చూడటానికి చిన్నగానే ఉంది. చుడీదార్ వేసుకుని తెలుగు అమ్మాయి లాగనే అనిపించింది. అక్కడ పాపని ఆడిస్తూ, విశాల ని చూసి చిరునవ్వు నవ్వింది.

          “హాయ్! ఐ యామ్ మాధురి! ఐ లివ్ హియర్ క్లోజ్ బై.” అని తనని పరిచయం చేసుకుంది.

          “హలో! నా పేరు విశాల. మీరు ఎక్కడనుంచి వచ్చారు?” అని విశాల సరాసరి
తెలుగులో తన పరిచయం చేసుకుంది.

          “అరె! మీరు నేను ఎక్కడినుంచో చెప్పకుండానే, తెలుగులో మాట్లాడుతున్నారు. ఎలా మీరు ఊహించగలిగారు నేను తెలుగమ్మాయినని?”

          “మన తెలుగువారి ఐడెంటిటీ కొట్టొచ్చినట్టు మొహంలోనే తెలిసిపోతుంది. మీలో ఐతే మరీను. తెలుగు కళ ఉట్టిపడుతోంది” అంటూ నవ్వింది విశాల.

          “మొత్తానికి మీరు ఈ రోజు ఒక నానుడిని బ్రేక్ చేసారు. ఎవరైనా ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ముందుగా తెలుగు తప్ప ఇతర భాషలలో మాట్లాడతారు అంటారు.

          చివరికి ఎప్పుడో తెలుగులో మాట్లాడుకుంటారు.” అంది మాధురి.

          “తరువాత, మాధురి “మా పాప స్నేహ! మూడేళ్ళు” అంటూ ట్రాలీ లోంచి బయటకు తీసి విశాలకు చూపింది.

          విశాల, మాధురి దాదాపు ఒకే ఈడు వాళ్ళు అవటంతో చాలా సేపు మాట్లాడుకు న్నారు. ఇక చీకటి పడటంతో, ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చి, పుచ్చుకుని మళ్ళీ కలుద్దాం అంటూ చెరో వైపు వెడలిపోయారు.

          అప్పటికీ విశాల కు మనసు తేలిక పడినట్లైంది. ఇన్ని రోజుల తరువాత, తనకి
తగినట్లుగా కష్టం, సుఖం తెలుగులో మాట్లాడుకోవటానికి, ఇంటికి దగ్గర్లోనే ఒక స్నేహితురాలు దొరికింది అని ఆనందపడింది. ఇంటికి వచ్చి మరొకసారి అత్తగారితో మాట్లాడదామని ప్రయత్నించింది. ఫోన్ ఎవరూ తీయకపోవడంతో, మనసులో సర్ది చెప్పుకుని, నిద్రలోకి జారుకుంది.

          భర్త విష్ణు, నైట్ షిఫ్ట్ ముగించుకుని, ఇంటికి రాగానే, అలారం లేకుండానే మెలకువ వచ్చింది. జరిగిన విషయాలు చెపుతూ..”ఫోన్ ఎవరూ తీయలేదు. నాకు గాభరాగా ఉంది.” అని ఆదుర్దాగా అంది విశాల.

          విష్ణు నైట్ షిఫ్ట్ చేసి అలసటగా ఉన్నా గాని, ఆ సమయంలో కూడా విశాలను కూల్ చేస్తూ, సవా లక్ష కారణాలుండవచ్చు. బయటికి వెళ్ళి ఉండొచ్చు. లేదా ఫోన్ అపుడపుడు డెడ్ అవడం సర్వసాధారణమైన విషయం. మళ్ళీ రిపోర్ట్ చేసి, టెక్నీషియన్ వచ్చేదాకా ఫోన్ బాగవ్వదు. నువ్వు నిశ్చింతగా నిద్రపో విశాలా! అంటూ విష్ణు పడుకున్నాడు.

          విశాల విష్ణు చెప్పిన పద్ధతి చూసి, ‘అరె ఎంత చక్కగా చెప్పారు! నాకు ఈ విషయం తట్టనేలేదు.’ అని మనసులోనే విష్ణుకి ధన్యవాదాలు తెలుపుకుంది.

          ఉదయం నిద్ర లేవగానే, తల స్నానం చేసి, గదిలో ఎత్తుగా ఉన్న గట్టు మీద దేముడి పటాలు పెట్టింది. బయట వాకిట్లో తెల్ల మందార పూల చెట్టు ఉంది. నిజంగా ఆస్ట్రేలియా లో ఇన్ని రంగుల మందార పూల చెట్లు ఇండియాలో కూడా ఎప్పుడు చూడలేదు. ఇంటి బయట కామన్ ప్లేస్ లో ఉంది చెట్టు. పూలు కోయవచ్చో, లేదో. ఇక్కడ ట్రెస్ పాస్ రెస్ట్రిక్షన్. కోయడానికి వీలు లేదేమో, సొంత ఇంట్లో అయితే తప్ప అని ఆ
ప్రయత్నాన్ని విరమించుకుంది.

          ఇంట్లో దీపారాధన చేసుకుని, ఆ రోజు శివరాత్రి పండుగ కావటం వలన శివ
స్త్రోత్రాలన్నీ చదువుకుంది.

          విష్ణు లేచిన తరువాత, టీ కలిపి ఇచ్చింది.

          “ఈ రోజు శివరాత్రి. వెస్ట్ మిడ్ దగ్గిర మురుగన్ గుడికి వెడదామండీ.” అంది విశాల.

          “ఈ రోజు భలే కలిసొచ్చింది. నాకు రోస్టర్ డే ఆఫ్. అలాగే వెడదాం. నువ్వు ఉపవాసము ఉంటున్నావా విశాలా?”

          “కనీసం సాయంత్రం వరకు ఐనా పండ్లు తీసుకుని, గుడిగి వెళ్ళి వచ్చాక ఉప్మాహారం చేద్దామనుకుంటున్నాను, మరి మీరు…” అని అర్థోక్తిగా విష్ణు వైపు చూసింది విశాల.

          “సరే! అలాగే కానీ, ఇద్దరము కలిసే చేద్దాం, నీ వల్ల నాకు పుణ్యం కలిసి వస్తుంది, హరోంహర!” అన్నాడు విష్ణు.

          సాయంత్రం ఇద్దరూ అనుకున్నట్లుగా వెస్ట్ మిడ్ మురుగన్ గుడికి చేరుకున్నారు.

          ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. కారు పార్కింగ్ గుడి ఆవరణలోనే దొరికింది. గుడిలోకి వెళ్ళేముందు ఇద్దరూ కాళ్ళు కడుక్కుని, ఆలయ ప్రదక్షిణం చేసారు.

          ఆలయంలో తమిళ పూజారులు బాగా సంప్రదాయబద్ధంగా మంత్రాలు చదువు తున్నారు. విష్ణు కౌంటర్ దగ్గరకి వెళ్లి, అభిషేకం చేయడానికి కూపన్ తీసుకున్నాడు.
తరువాత విశాల, విష్ణు ఇద్దరూ క్యూలో నించున్నారు. అక్కడ ఒక్కొక్కరికి ఇత్తడి మరచెంబులో పాలు మరియు బిల్వ పత్రాలు ఇస్తున్నారు.

          ఆలయ ప్రాంగణలో శివుని చిత్తరువు ధ్యానంలో ఉన్న కటౌట్ ఎత్తుగా పెట్టారు. అక్కడ అభిషేకానికి గాను, శివలింగాన్ని ఉంచారు. విశాల విష్ణు చేయి పట్టుకోగా ఇద్దరూ కలిసి శివలింగానికి పాలతో అభిషేకం చేసి, మారేడు దళాన్ని శివలింగంపై ఉంచారు.
విశాల ఆనందానికి అవధులు లేవు. “ఎంత అదృష్టం! శివరాత్రి రోజు సాక్షాత్తు పరమ శివుని సన్నిధిలో ఆయనకు పాలతో అభిషేకం, బిల్వపత్రం ఆయన శిరస్సున ఉంచటం భర్తతో కలిసి, మొదటిసారి ఇలా చేసుకోవటం ఎంతో పుణ్యం. భారత దేశంలో ఇటువంటి అనుభూతి ఎన్నడూ కలుగలేదు. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. నాదు జన్మ ధన్యం ఈశ్వరా!” అని మరల చేతులెత్తి నమస్కరించుకుని, “హర హర మహాదేవ, శంభో శంకరా! ఓం నమః శ్శివాయ!” అని ధ్యానించుకుని ఇద్దరూ బయట పడ్డారు.

          పెళ్ళైన తరువాత, విశాల, విష్ణు మొదటిసారి కలిసి చేసుకున్న శివరాత్రి వ్రతం, ఉపవాసాన్ని, అల్పాహారంతో బద్ధలు కొట్టి, ఆ రోజును సార్థకం చేసుకున్నారు.

          ఆ రోజు రాత్రి విష్ణు క్షేమసమాచారాలు మాట్లాడటానికి ఇంటికి ఫోన్ చేసాడు.
ఫోన్ మ్రోగుతోంది. విష్ణు నిన్న, విశాలకైతే సర్ది చెప్పాడు గానీ, ఇపుడు అతనిలోను అసహనం పెరుగుతోంది ఫోన్ ఎవరూ ఎత్తకపోవటంతో.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.