ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 8

(ఒరియా నవలిక )

మూలం – హృసికేశ్ పాండా

తెనుగు సేత – స్వాతీ శ్రీపాద

          2000, డిసెంబర్ 1 న  దాదాపు మధ్యాన్నం మూడుగంటలకు ప్రేమశిల చివరి శ్వాస తీసుకుంది. అప్పుడు హృదానంద చిన్న గమడాలో టీ షాప్ లో ఉన్నాడు. వార్త చేరాక మూడున్నరకల్లా వచ్చాడు. హృదానంద అయిదయేసరికి చితికి నిప్పుపెట్టాడు. ప్రేమశిల పార్ధివ దేహానికి అంత్యక్రియలు ముగిసాయి.

          ఆమె చావుకు రెండు గంటల ముందు, సరిగ్గా చెప్పాలంటే  మధ్యాన్నం 12.45 , 1.15 మధ్యన,  ప్రేమశిల మరణ వార్త, అదీ తిండిలేక ఆకలివల్ల అనే వార్త రాజీవ్ భువనెశ్వర్ నుండి పబ్లిష్ అయే ఒరియా, ఇంగ్లీష్ దినపత్రికలకు ఫాక్స్ చేసాడు. డిసెంబర్ 2 న ఉదయం ఒక  ఒరియా దినపత్రికలో, ఢిల్లీ నుండి వచ్చే ఇంగ్లీష్ పేపర్లో  ఈ వార్త వచ్చింది.

          ఈ మధ్యన ఆకలి చావులు నిరోధించటం అనేది  ముఖ్యంగా స్థానిక సర్పంచులకు ఇచ్చిన బాధ్యత. ఒక గ్రామంలో ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలియగానే గ్రామ సర్పంచ్ వారికి పది రోజుల గ్రాసం అందించాలి. గమడా సర్పంచ్ చెప్పిన దాని ప్రకారం గమడా గ్రామ ప్రజలు అతన్ని గ్రామంలోకి రానివ్వలేదు. పంచాయత్ ఆఫీస్ చిన్న గమడాలో ఉంది. సర్పంచ్ తన గ్రామం నుండి అక్కడకు రావాలంటే గమడా మీదు గానే రావాలి. సర్పంచ్ మునుపు జలంధర్ పార్టీకి చెందిన వాడు. ఇప్పుడు జహంగీర్ పార్టీకి మారి పోయాడు. గమడా వార్డ్ మెంబర్ మరో సారి జలంధర్ పార్టీ మీద, ఇదివరలోలానే ఎంపికయ్యాడు. వార్డ్ మెంబర్ కు గమడా , చిన్న గమడాలలో చాలా పలుకుబడి ఉంది.

          సర్పంచ్ పార్టీ మారాడు గనక అతనికి గమడాలో ప్రవేశం నిషేధించారు. చిన్న గమడాలో పంచాయత్ ఆఫీస్ కి అతను వచ్చినప్పుడు గమడా గ్రామం తప్పించి పొలాల మధ్య నుండి చుట్టు తిరిగి వెళ్ళాడు. ఒక్క  ప్రేమశిల మరణం గురించి తప్ప గమడాలో మరో ఆకలి చావు గురించి అతనికి ఎలాటి సమాచారమూ లేదు.

          ఆ రోజున కూడా నేను గమడా గ్రామానికి విచారణకు వెళ్ళాను. అతని సాక్ష్యం  రుజువు చూపడానికి సర్పంచ్ రాలేదు. పొలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్  ఫైల్ చేసాడు- నా ముందుకు సాక్షి రాబోతుంటే దారిలో జలంధర్ మనుషులు తనను అడ్డుకున్నారనీ ,   బలవంతంగా వెనక్కు పంపించారనీ. ఆ సాయంత్రం పొలాలగుండా ముందు పొలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ సమర్పించడానికి వెళ్ళాడు. అప్పుడు నేను పంచాయతీ ఆఫీస్ లో ఉన్నాను.   పోలీస్ అతన్ని వారి వాహనంలో తెచ్చారు, నేను అతని  స్టేట్మెంట్ రికార్డ్ చేసాను.

          డిసెంబర్ 2 న లీగల్ కౌన్సిల్ లో ఈ విషయమై తీవ్రమైన చర్చ జరిగింది. వివరంగా రిపోర్ట్ పంపమని కలెక్టర్ కు ఫాక్స్ సందేశం వచ్చింది. పవర్ లేకపోడం, టెలిఫోన్ లైన్ల సమస్య వల్ల కలెక్టర్ కు ఫాక్స్ అర్ధరాత్రి తరువాత చేరింది. మర్నాడు, అంటే డిసెంబర్ 3 న పొద్దుటికల్లా బీడీవోనూ, తాసిల్దారునూ చీవాట్లు పెట్టి, ఇరవైనాలుగు గంటల్లో ఈ కేస్ వివరాలు నిజాలు తెలియబరచమని ఆదేశించాడు. డిసెంబర్ రెండున భువనేశ్వర్ నుండి వచ్చిన న్యూస్ పేపర్లు గమడా రోడ్ లోనూ, బ్లాక్ ఆఫీస్ లోనూ డిసెంబర్ మూడున అందుబాటులో ఉన్నాయి. ఆరోజునే బీడీవో, తాసిల్దార్, పోలీశ్ స్టేషన్ ఆఫీసర్ ఇంచార్జ్ గమడాకు వెళ్ళారు.

          ఒరిస్సాలోని ఈ ప్రాంతంలో కాంధా జాతి జనాలు వారి దగ్గరి వారిలో మరణం తరువాత రెండంచెలుగా శోక సంస్కార విధులు, పవిత్రీకరణ నిర్వహిస్తారు. మొదటి దశలో నూనెల సంస్కారం, మూడూ రోజులపాటు సాగుతుంది. ఆ సమయంలో బయటి వారితో మాట్లాడరు. కొత్త కుండతో కొత్త ఒత్తులు, మట్టి దీపాలు, పెరుగు , పెసరపప్పు, బియ్యం, నీటితో మూడో రోజున చిన్న సమర్పణ. పవిత్రీకరణ జరుపుతారు.

          మరణించిన పదో రోజున చివరి పవిత్రీకరణ విధులు జరుగుతాయి. పదో రోజున దూరపు చుట్టాలు, మిత్రులు గ్రామస్తులు ఒక్క చోట చేరతారు. మరణించిన వారి మిత్రులు, చుట్టాలు ఊళ్ళోకి ప్రవేశించే రోడ్ క్రాసింగ్ దగ్గరకు వెళ్తారు. ఎక్కడైతే ప్రేమశిల నవంబర్ లో రెండు కట్టెల మోపులు తీసుకువస్తూ కుప్పకూలిందో అక్కడి నుండి గ్రామస్తులు ప్రేమశిల ఆత్మను వేడుకుంటారు. వాళ్ళు కుండలో ఏడు నూలు కండెలు, పెరుగు, పెసరపప్పు, బియ్యం, పేలాలు ఉంచుతారు. అంతే కాని విందు , తాగడాలు ఏవీ ఉండవు.

          డిసెంబర్ 3 న బీడీవో, తాసిల్దార్, పోలీసు అధికారి గమడా వెళ్ళినప్పుడు వారితో  జనం ఎవరూ మాట్లాడలేదు. అవి శోక దినాలు కావడం వల్ల,  పూర్తిగా మౌన శోకమే , నిర్జన శౌచ్యం. మళ్ళీ డిసెంబర్ 4 న అధికారులు అక్కడికి వెళ్ళారు. డిసెంబర్ 5న విచారణ నివేదిక కలెక్టర్ కు, ప్రభుత్వానికీ పంపించారు.

          ఇక్కడ వారి నివేదిక గురించి ఒక నిజం నేను చెప్పాలి. డిసెంబర్ 2 న జలంధర్ , జహంగీర్ తరఫున చెరో పది బస్తాల బియ్యం గమడా గ్రామానికి పంపించారు. ఆ బియ్యం పదో రోజు సంతర్పణ భోజనాలకు వాడటానికి. కాని ఆ బియ్యం వాడకుండానే ఉంచే సారు, రాబోయే ఆకలి చావు విచారణ కారణంగా. మొదట ఆ బియ్యం బస్తాలు గ్రామ క్రాసింగ్ వద్ద ఉంచారు. తరువాత అంగన్ వాడీ సెంటర్ కు తరలించారు. చివరికి మరణించిన ప్రేమశిల ఇంటికి , ఆపైన ఆమె మరిది ఇంటికి వెళ్ళాయి. నా విచారణ సమయంలో ఆ బియ్యం చెక్కు చెదరకుండానే ఉన్నాయి. బస్తాలు అసలు తెరవలేదు.

          జలంధర్, జహంగీర్ తరఫున పంపిన బియ్యం వారి వారి ప్రతినిధి స్టోరేజి ఏజంట్లు  ఇచ్చినవి. అవి రెండు రూపాయలు కిలో చొప్పున డీలర్స్ సేకరించి ప్రభుత్వ సరఫర విధానం కింద జనాలకు  పంపిణీ చేసేందుకు ఉద్దేశ్యించినవే. ( ఆమేరకు కాగితాలు సిద్ధం చేసారు).

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.