
ఆరాధన-8 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
కళాత్మకం
మళ్ళీ ఆదివారం నేను హూస్టన్ స్టూడియోకి వెళ్ళేప్పటికే మాధవ్ తో పాటు అతని తల్లి వరలక్ష్మి, మరదలు కాత్యాయని ఆఫీసులో నా కోసం వేచి ఉన్నారు.
మాధవ్ వారిని పరిచయం చేశాడు. అతని తల్లి ఆప్యాయంగా పలకరించి, నాకు ధన్యవాదాలు తెలిపింది. కాత్యాయని చాలా అందమైన అమ్మాయి. సొగసైన కన్నులతో, చిరు మందహాసంతో ఓ కిన్నెరలా నాజూకుగా అనిపించింది. నా వద్దకి వచ్చి, పాదాభి వందనం చేసి.. వెళ్ళి వరలక్ష్మి గారి పక్కనే కూర్చుంది.
స్వయంగా అందరికీ ఛాయ్ చేసి అందించాడు మాధవ్. “మేడమ్ మన ప్రాక్టీసులకి కూడా సాయపడగలదు కాత్యాయని. మీరంటే తనకి ఎనలేని అభిమానం.” అన్నాడు.
“ఐదో ఏడు నుండీ మా మాధవతో పాటు పసుమర్తి శ్రీనాథ్ గారి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించింది. నా మేనకోడలు చాలా అందంగా నాట్యం చేయగలదు.” అని ధృవీకరించింది వరలక్ష్మి గారు.
“మీ ఇరువురుని కలవడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే అయితే మీకు మాధవ్, రాగిణీల పెళ్లి పనులు మొదలవుతాయి .. కదూ లక్ష్మీ గారు. కొడుకు ఓ ఇంటివాడవుతున్నాడుగా. మీకు సంతోషమేగా.” అన్నాను మాధవ్ తల్లితో.
“అంతా మీ చలవ భారతి గారు. మేము వచ్చి కూడా రెండు రోజులయింది. రాగిణి వాళ్ళు వచ్చి కలిశారు. మాకు కాస్త బడలిక తీరాక.. ఇదిగో ముందు మిమ్మల్ని కలిసేందుకు వచ్చాము. పెళ్లి విషయాలు, పనులు మొదలు పెడతాము.” అని ఆమె అంటుండగానే.. బిలబిలమంటూ శిష్యులు వచ్చేశారు.
***
బే-పోర్ట్ లో గురువారం క్లాస్ ముగిసే సమయానికి రాగిణి, మియా, వాసుదేవి గారితో పాటు మాధవ్ కూడా నన్ను కలిసేందుకు వచ్చాడు. ఇరువైపుల కుటుంబాలు కలిసి వివాహ వేడుకలకి సంబంధించి సంప్రదింపులు జరిపారని తెలిపాడు.
“అయితే మేడమ్, రిసెప్షన్ లో ప్రత్యేకంగా కాత్యాయని నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నది మా ప్లాన్. మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా మనవి.” అన్నాడు మాధవన్.
వారందరి వంక చూశాను. అందరూ కళాప్రియులు, కళాకారులు. అసలు మమ్మల్ని ఒక దగ్గర చేర్చినదే ఆ కళామతల్లి.’ అనుకుని వారు అడిగిన దానికి ఒప్పుకున్నాను.
పెళ్లి ఏర్పాట్లకి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి కదిలాను.
***
రెండు స్టూడియోల్లో ఆర్కెస్ట్రాతో జరుగుతున్న క్లాసులు, ప్రాక్టీసులు గమనించిన కాత్యాయని.. శిక్షణ బాధ్యతలని మాధవ్ తో సమానంగా పంచుకోసాగింది. ఆ అమ్మాయి చొరవకి, నైపుణ్యానికి ముగ్ధురాలనయ్యాను.
***
హైదరాబాద్ నుండి ఈ లోగా… నాన్న టెలీ-ఫిల్మ్ కి సంబంధించన స్క్రిప్ట్ పంపడంతో.. నా ఆలోచనలు నూతన ఉత్సాహంతో పరుగులు తీసాయి.
అకాడెమీ వార్షికోత్సవ బాధ్యతలు మాధవ్, కాత్యాయనీలకి వప్పజెప్పి నెలరోజుల పాటు టెలీఫిల్మ్ నిర్మాణ నిర్ణయాల్లో మునిగితేలాను.
వోలేటి పార్వతీశం గారు మూల కథ సమకూర్చిన ‘ఆలయనాదాలు’ కి .. అమెరికాలో చిత్రీకరించవలసిన భాగాలకి .. స్క్రీన్-ప్లే, డైలాగ్ నేనే సమకూర్చి రేయింబవళ్ళూ వాటిపై అధ్యయనం చేశాను. అందులో చేర్చవలసిన సంప్రదాయ సంగీత నృత్యాలని, చిత్రీకరణకు అనువైన లొకేషన్స్ ని గుర్తించాను.
ఐదుగురు శిష్యురాళ్ళు ముఖ్య పాత్రధారులుగా నిర్ధారించుకుని.. తతిమ్మా శిష్యురాళ్ళు కూడా టెలీఫిల్మ్ లో పాల్గొనేలా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను.
మా అమ్మాయి శిల్ప చిన్నప్పటి కథానాయకిగా నటించాలని, నేనే కళ్యాణి పాత్ర పోషించాలని ప్రతిపాదించారు మా డైరెక్టర్, కుటుంబం కూడా.
ఆ ఏర్పాట్లు, ప్రయత్నాలలో మునిగితేలాను.
***
కళ్యాణం కమనీయం..
ఇక రాగిణి, మాధవ్ ల వివాహానికి మూడురోజుల ముందు నుండే సంబరాలు మొదలయ్యాయి. మియా, అభినవ్ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకి ఆహ్వానితులు అసంఖ్యాకంగా హజరయ్యారు. షడ్రుచుల విందులు, వినోదాలతో బే-పోర్ట్ యూనివర్సిటీ టౌన్ ఉత్సవ రంగు పులుముకుంది. భారతీయ వరుడు – ఇండొనేషియన్ వధువుల వివాహ మహోత్సవం అంటూ మీడియా కవరేజ్ కూడా.
ఎటు చూసిన గులాబీ పుష్పాలతో అలంకరణ, అతిధులకు మధుర పానీయాలు, అల్పాహారాలు. విస్తరించి ఉన్న అధునాతమైన హాల్లో ఎక్కడినుండైనా వివాహాన్ని వీక్షించేలా ఏర్పాట్లు.
.. వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు జీలకర్ర బెల్లం ఉంచడం దగ్గర నుండి.. చక్రపాదాలు, కన్యాదానం, సువర్ణజలాభి మంత్రం, యోక్త్ర బంధనం, మంగళ సూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, అంగుళీయకాలు తీయడం, సప్తపది పాణి గ్రహణం, హెూమం, సన్నికల్లు తొక్కడం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ నక్షత్ర దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడచుకు అప్పజెప్పడం, అంపకాలు వంటి ప్రతి ఘట్టాన్ని .. ఆంగ్లంలో వివరిస్తూ సాగింది .. వైభవోపేతంగా మాధవ్రాగిణీల వివాహం.
***
సాయంత్రం జరిగిన రిసెప్షన్ కూడా అంతే వైభవంగా జరిగింది. కాత్యాయని కూచిపూడి నృత్యం.. ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేసింది. ఓ గొప్ప నర్తకిగా రాణించగల సామర్ధ్యం తప్పకుండా ఉందనిపించింది.
ప్రదర్శన ముగిశాక, కాలిఫోర్నియా నుండి వచ్చిన మియా బంధువులు.. మంగళ, రంగస్వామి దంపతులు వచ్చి నన్ను కలిశారు. కాత్యాయని గురించి వివరాలు అడిగారు. ఆమె తమకి చాలా నచ్చిందని, తమ కుమారుడికి సరైన సంబంధంగా భావించి.. నాతో సంప్రదించేందుకు వచ్చామని అన్నారు. వారి కొడుకు మనోహర్… శాన్-హొజే లో పేరున్న న్యూరో-సర్జన్ అని, తమకి కాత్యాయిని వాళ్ళ కుటుంబాన్ని కలిసే అవకాశం కల్పించమని కోరారు.
***
కాత్యాయని పెళ్లి సంబంధం గురించి ఆలోచించి అందరినీ సంప్రదించాను. డాక్టర్ మనోహర్ గురించి, అతని కుటుంబం గురించి వాకబు చేశాను. నాయర్ కుటుంబం… పేరు, పరపతి ఉన్న వారని, మనోహర్ శాన్–హొజె లోని ప్రముఖ న్యూరో సర్జన్ అని.. తెలిసింది.
నిజానికి అటువంటి గొప్ప సంబంధం కాత్యాయని ని వెతుక్కుంటూ రావడం మామూలు విషయం కాదని మాధవ్ వాళ్ళకి, మాకు కూడా అనిపించింది.
***
మరునాడు మియా, అభినవ్ లు మనోహర్ ఫోటో, బయో-డాటా అందిస్తూ.. మరో విషయం తెలిపారు. మనోహర్ కి ఆరునెల్ల క్రితం పెళ్లయిందని, కానీ ఆ జంట నడుమ సరిదిద్దుకోలేని వ్యత్యాసాలు తలెత్తడం వల్ల మూడునెల్లకే వివాహాన్ని రద్దు చేసుకున్నా రన్న విషయం ప్రస్తావించి ….
“అతని వివాహం రద్దయిన డాక్యుమెంట్స్ ని పరిశీలించమని సంబంధిత వివరాలు ఇచ్చారు నాయర్ కుటుంబం. ఆలోచించి సమ్మతమైతే వారి కుటుంబాన్ని మనం కలవచ్చు.” అంది మియా.
నిర్ణయాన్ని కాత్యాయని, మాధవ్ లకి వదిలేశాను.
***
తరువాత రెండురోజులకి పొద్దుటే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు కాత్యాయని, మనోహర్. తమని ఆశీర్వదించమని కోరారు. “కాత్యాయని మీ వద్ద శిష్యరికం చేయాలని, మీలాగా ప్రఖ్యాత నర్తకి అవ్వాలన్నదే తన ఆశయం అని అంటుంది. నేను ఆమెని తప్పక ప్రోత్సాహిస్తానని మాటిచ్చాను కూడా ఉమా మేమ్.” అన్నాడు మనోహర్ నాతో.
“కానివ్వండి. అన్నీ సాధ్యమే. భర్త ప్రోత్సాహం ఉంటే.” అని నవ్వుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.
***
మరో రెండు వారాలకి కాత్యాయనీ, మనోహర్ ల వివాహం హూస్టన్ లోని శ్రీ మీనాక్షీ ఆలయంలో వైభవంగా జరగడం, తరువాత మూడు రోజులకి కాత్యాయని అత్తారింటికి వెళ్ళిపోవడం కూడా అయ్యాయి.
***
వార్షికోత్సవానికి డాన్స్ ప్రాక్టీసులు కొనసాగిస్తున్నాము. ఈ మారు దాదాపు అరవై మంది శిష్యురాళ్ళు పాల్గొంటారని అంచనా వేశాను. ఎప్పటిలా శ్రీ మీనాక్షీ టెంపుల్ .. సహాయ నిధికి .. కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా.. వారితో ఒప్పందం చేసుకున్నాను.
కాలిఫోర్నియా నుండి కాత్యాయని ఫోన్ చేసి వార్షికోత్సవ ప్రోగ్రాములో నృత్యం చేసే అవకాశం కోరింది. ఆ అమ్మాయిలోని పట్టుదలకి ఆశ్చర్యమనిపించింది.
మాధవ్, రాగిణి లు హనీమూన్ ముగించుకుని మాధవ్ తల్లితో సహా హూస్టన్ స్టూడియోకి దగ్గరలో ఉన్న టౌన్-హోమ్ కి మారారు.
***
దరి చేరిన ఆత్మీయతలు….
హూస్టన్ స్టూడియోలో.. మాధవ్ ఆధ్వర్యంలో స్తుదెంట్స్ వాద్యబ్రుందంతో ప్రాక్టీసులు సాగిస్తున్నారు.
మరో పక్క నేను ఫోన్ పై ఆలయ సిబ్బందితో సమావేశంలో ఉండగా, మియా ఆఫీసు రూములోకి వచ్చింది. ఆమె వెనుకే ఒక పెద్దావిడ, ఆమె చేయి పట్టుకుని ఐదేళ్ల పాప ఉన్నారు.
నా ఫోన్ కాల్ అయ్యేంత వరకు ఎదురుగా సోఫాలలో కూర్చున్నారు.
ఫోన్ పెట్టాక, “చెప్పండి మియా. అతిధులని తీసుకుని వచ్చారు.” అన్నాను వచ్చిన వారి వంక చూస్తూ. మియా వెంట ఉన్న ఆమెని..మునుపు ఎక్కడో చూసినట్టే ఉంది.
ఆమె నమస్కారం చేస్తే .. నేనూ తిరిగి అభివాదం చేశాను.
ఆమెని శైలజ మేనన్ గా పరిచయం చేసింది మియా. ఆమె వెంట ఉన్నది ఆమె మనమరాలు ‘ఏంజెల్’. నీలి రంగు కళ్ళు, పసిమి ఛాయ, నడుము దాటిన నల్లని వొత్తయిన కురులు.. కనులు తిప్పుకోలేని చక్కని ముఖవర్చస్సుతో చాలా ముద్దుగా ఉంది.
ఏంజెల్ ని దగ్గరికి పిలిచాను. “నీకు డాన్స్ ఇష్టమేనా? నేర్చుకుంటావా?” అని అడిగాను. ఆ అమ్మాయి వెంటనే నాకు పాదనమస్కారం చేసి “నేను అందుకోసమే వచ్చాను.” అందిముద్దుగా.
ఆశ్చర్యపోయి నవ్వేశాను. “నీవెప్పుడంటే అప్పుడే మొదలు పెడదాము.” ఆన్నాను ఆ చిన్నారితో. ఏంజెల్ గ్రాండ్-మా వంక చూస్తూ.. “వీలుంటే, మా అకాడెమీ కార్యక్రమానికి ఏంజెల్ ని కూడా తీసుకుని తప్పక రండి.” అన్నాను.
“నువ్వు నాకు బాగా తెలుసు ఉమాభారతి. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో నేను మీకు సీనియర్ ని. నన్ను గుర్తు పట్టలేదు అనుకుంటా.” అంది ఆమె.
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. ఆమె ముఖాన్ని నిశితంగా చూశాక గుర్తుపట్టాను. మా సీనియర్ శైలజ అంటే ఒక జాబిలమ్మ. ఒక బ్యూటీ. మంచి సింగర్ కూడా. సంతోషంగా అనిపించింది. లేచి తన వద్దకి వెళ్ళి, సంతోషంగా ఆలింగనం చేసుకున్నాను.
మమ్మల్ని గమనిస్తున్న మియా .. “నాక్కూడా సంతోషమే మేడమ్. ఇలా మీఇద్దరూ కలవడానికి నేను కారణమయినందుకు.” అంది. మియా భర్త అభినవ్ శైలజ అక్కగారి అబ్బాయేనని, అతన్ని పెంచి, ప్రయోజకుడని చేసిందే శైలజ, ఆమె భర్త కృష్ణ మేనెన్ అని తెలిపింది.
“ప్రపంచం ఎంత చిన్నదో కదా! ఇలా మనం తిరిగి కలుస్తామని ఊహించలేదు శైలజా.” అన్నాను. మరో నాలుగు వారాల్లో ప్రోగ్రామ్ అయ్యాక, తీరిగ్గా కలవాలని అనుకున్నాము.
***
ఆ రోజు భోజనాల వద్ద శైలజ గురించి, ఏంజెల్ గురించి .. మా వారికి చెప్పాను. “మన ఇంటికి ఆహ్వానించు.” అన్నారాయన.
రాత్రి చాలా సేపటి వరకు శైలజ, ఏంజెల్ గురించి ఆలోచిస్తూ నిద్రబోయాను.
***
కనులపండువగా జరిగిన అకాడెమీ వార్షికోత్సవానికి ఎప్పటిలా ఆలయ ఆడిటోరియం కిక్కిరిసిపోగా.. వందకి పైగా శిష్యులతో ‘కన్య’ అనే నృత్య నాటికను అద్భుతంగా ప్రదర్శించాము. ప్రతి అంశానికి కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు ప్రోత్సహించారు. లాభాపేక్ష లేకుండా మా అకాడమీ కృషికి పియర్-లాండ్ మేయర్ చేతుల మీదగా నాకు సన్మాన సత్కారాలు జరిపించారు ఆలయ కార్యకర్తలు.
అకాడెమీ తరఫున మాధవ్, రాగిణి లని, నర్తకి కాత్యాయని ని ప్రత్యేకంగా గుర్తించి సత్కరించుకున్నాము.
*****
(సశేషం)

నా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ మహా నగరంలో ‘అర్చన ఫైన్_ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. రచయిత్రిగా మూడు నవలలు, రెండు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువడ్డాయి. మా తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మూగాజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటాను. యోగాభ్యాసన నా అభిరుచి. నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ నా జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నాను. నేను B.A Economics M.A Political Science చేసాను. USA కి 1980 లో వచ్చాను… నాకు ఓ కొడుకు, ఓ కూతురు. నా భర్త తో సహా వారు కూడా Health care workers..