ఆహారం విలువ

-కందేపి రాణి ప్రసాద్

          చిక్కటి ఆడవి. చెట్లన్నీ ఎత్తుగా పెరిగి ఉన్నాయి అడవిలో జంతువులన్నీ పనులు చేసుకునే వేళ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని కోతి పిల్లలు చెట్ల తీగల మీద ఉయ్యాలలు ఊగుతూ ఆడుతున్నాయి. తీగల్ని పట్టుకుని కిందకి జారుతూ మళ్ళీ చెట్ల మానుల నుంచి ఎగబాకుతూ జారుడుబల్ల ఆటలు ఆడుతున్నాయి. మధ్య మధ్యలో ఒకదాని నొకటి వెక్కిరించుకుంటూ ఉన్నాయి. తాడు పట్టుకొని ఊగుతూ ఆగి తలను గోక్కుంటున్నాయి. ఇంతలో పై ను౦చి జారే మరో కోతిని తోక పట్టుకుని లాగుతున్నాయి అది కోపంలో గుర్రు మంటే ‘హిహి’ అంటూ నవ్వుతున్నాయి. చెట్టు మీదకు ఎగబాకి కాయలు కొరికి పారేస్తున్నాయి. పూలు పిందెలను నలిపేస్తున్నాయి. కాయల్ని తింటున్నాయా అంటే అది లేదు. అన్నిటినీ తెంపేస్తూ కింద పారేస్తున్నాయి. కొన్ని కాయల్ని మాత్రం కొరికి ఒక ముక్క తిని మిగతాదంతా కింద పడేస్తున్నాయి. ఈ కోతి పిల్లలు పైకీ కిందకీ తిరగడం వల్ల చెట్లు ఆకులు, చిన్న చిన్న పుల్లలు విరిగిపోతున్నాయి. కానీ అవి వేటినీ పట్టించుకోవడం లేదు. దేన్నీ లెక్క చెయ్యడం లేదు. తమ గోల తప్ప ఎవరినీ చూడడం లేదు, ఏమి ఆలోచించడం లేదు.
 
          తల్లి కోతి ఇంటికి వచ్చింది పిల్లల కోసం చూసింది. ఇంట్లో పిల్లలు లేవు. ఎదురుగా ఉన్న చెట్ల మీద ఆటలాడుతూ కనిపించారు. ఇంట్లోకి వెళ్ళి చూసింది. నిద్ర లేచాక పక్కబట్టలు సర్దుకోవాలని చెప్పింది. తిన్న తర్వాత పళ్ళాలు, గ్లాసులు ఒక పక్కగా పెట్టాలని చెప్పింది. ఇంటి ముందు చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా చిమ్ముకోవాలని చెప్పింది ఏది లేదు తల్లి కోతి తల పట్టుకున్నది.
 
          పిల్ల కోతుల్ని కిందికి రమ్మని పిలిచింది. ఇప్పుడే కాదు కాసేపు తర్వాత వస్తామని బదులు చెప్పాయి. “మీకిష్టమైనవి తినడానికి తెచ్చాను త్వరగా రాకపోతే నేనే తినేస్తాను” అని తల్లి కోతి బెదిరించింది. ఆ మాట వినగానే పిల్ల కోతులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. బాగా పండిన మామిడి పండ్లను చూపింది. పండ్లను చూడగానే పిల్లలన్నీ దగ్గరకు వచ్చాయి.
 
          పిల్లల్లూ! “మీకీ పండ్లు కావాలంటే నేను చెప్పిన మాటలు వినాలి. నేను చెప్పిన విధంగా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవాలి. పుల్లలు, పుడకలు, ఆకులు ఏరి బయట పార బోయాలి. ఇంటి ముందు శుభ్రంగా చిమ్మాలి. ఇల్లు, పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటాము. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పళ్ళాలు, గ్లాసులు వాడుకున్న తర్వాత కడిగి బోర్లించాలని చెప్పాను కదా! మొదట ఈ పనంతా చేసిన వాళ్ళకే మామిడి పండ్లిస్తాను” అన్నది తల్లి కోతి.
 
          పిల్ల కోతులు ‘మేం చేయం’ అంటూ కాసేపు మారాం చేశాయి. మాకు పనులు చేతగావడం లేదు నువ్వే చేసుకో అమ్మా అంటూ కాసేపు గారం చేశాయి. అయినా తల్లి కోతి కరగలేదు బెదరలేదు. ఖచ్చితంగా చెయ్యాల్సిందే అంటూ గట్టిగా ఆజ్ఞ జారి చేసింది.
ఇక చేసేదేమీ లేక పిల్ల కోతులు పనులు చేయడం మొదలు పెట్టాయి. కానీ అటోకటి ఇటోకటి విసిరి కొడుతూ నిర్లక్ష్యంగా పని చేస్తున్నాయి. “పని చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి . శ్రద్ధ వినయం లేని పనులు సరిగా ఉండవు” అని తల్లి కోతి బెదిరించింది. ఇంకా “సమాజంలో మనకసలే చెడ్డ పేరున్నది. మానవులు వాళ్ళ పిల్లల్ని ‘కోతి మూక’ అని తిడుతూ ఉంటారు. అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలు చేసే పనుల్ని ‘కోతి చేష్టలు’ అని చెప్పుకుంటారు. మనకా పేరు మాసి పోవాలి. కోతి పిల్లలు కూడా మంచి పిల్లలు అనే పేరు తీసుకురావాలి. అంటూ పిల్లలకు చెప్తూ పోయింది తల్లి కోతి.
 
          పిల్లలు తల్లి చెప్పినవి వినట్లే నటిస్తూ పనులు చేస్తున్నారు. ఈ పనులు చేయాలా౦టే వాటికిష్టం ఉ౦డట్లేదు. “ఏంటో ఈ అమ్మలు ఎప్పుడూ ఏదో చెప్తూనె ఉ౦టారు.” అని గొణుక్కుంటూ పనులు చేస్తున్నాయి. 
 
          అలా ఉండగా వేసవి కాలం వచ్చింది చెట్టూ పుట్టా ఎండిపోయాయి. చెట్లకు ఎక్కడా ఆకులు, పూలు లేక వెలవెల బోతున్నాయి మోడుల్లాగా వేలాడుతున్నాయి. ఆడవి అంతా ఎండు పుల్లలు ఆకులతో గల గల లాడుతున్నాయి. అడవిలోని జంతువులన్నీ ఆకలికి అల్లల్లాడుతున్నాయి.
 
          ఈ పరిస్థితిలో అడవిలోని జంతువులన్నీ ఒక చోట కూడాయి. ఉగ్గర్లో ఉన్న మరో అడవికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాయి. ఆహారం దొరకని కారణంగా వలస పోవాలని అనుకున్నాయి. అందరితో పాటు కోతి, కోతి పిల్లలు కూడా ప్రయాణమ య్యాయి.
 
          దారిలో కోతి తన పిల్లలకు విషయం వివరిస్తూ ఉన్నది.” పిల్లలూ మీరు ఇంతకు మందు చెట్టు మీదున్న కాయలన్నీ కొరికి పడేసే వాళ్ళు కదా! అలా అవసరం లేకు౦డా ఆహారాన్ని పాడు చేయకూడదు. ఆకలి వేసినపుడు మాత్రమే అదీ కావలసినంత మాత్రమే తినాలి. ఆహారాన్ని వృథా చేయకూడదు. ఆహారాన్ని పాడు చేసి విసిరేస్తే ప్రకృతి పగపడుతుంది. ప్రకృతి ప్రకోపిస్తే సృష్టిలొ ఎవరికీ ఆహారం దొరకదు. తిండి లేక జీవులన్ని మలమల మాడి చస్తాయి. జీవులకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం. మీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. మీరు వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు చెప్తున్నా”.
ఎండి పోయిన అడవిలో తినడానికి ఏమీ దొరక్క కడుపులో నకనకలాడుతూ నడుస్తు న్నారు. కోతి పిల్లలకు కష్టం తెలిసి వచ్చింది. తాము చేసిన పని ఎంత తప్పో అర్థ మయింది. చెట్టు నిండా కాయలున్నపుడు ఇష్టం వచ్చినట్లుగా కాయలు తెంపి పారేశారు. పిదెలన్ని పండ్లుగా మారి ఎందరి ఆకలో తీర్చేవి. “ఇవన్నీ అర్ధం కాక ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాయో” అని పిల్ల కోతులకు పశ్చాత్తాపం కరిగింది. కోతి పిల్లలు చాలా సిగ్గు పడ్డాయి. తమ తెలివి తక్కువ తనానికి బాధ పడ్డాయి.
 
          “అమ్మా! మాకివన్నీ తెలియదు. నువ్వు వివరించి చెప్పటం వలన మాకు తెలిసి వచ్చిందమ్మా. ఇంకెప్పుడూ ఇలా చేయం” అని కోతి పిల్లలు సిగ్గుగా చెప్పాయి.
 
          తల్లి కోతి పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టింది. “మీరే కాదమ్మా! మనుషులు కూడా ఆహారం ఇలాగే వృధా చేస్తున్నారు పెళ్ళిళ్ళలో ఎంతో అన్నాన్ని పారబోస్తున్నారు. మనిషి తినలేనన్ని రకాలు పెట్టి ఆహారాన్ని వృధా చేయటానికి కారణమౌతున్నాడు. వాళ్ళకీ ప్రకృతి ఎప్పుడో బుద్ధి చెబుతుంది”. తల్లికోతి మాటలు వింటూ పిల్లలు ఆలోచిస్తున్నాయి. “ఎంతో తెలివైన మానవులు కూడా ఆహారాన్ని వృదా చేస్తున్నారా” అని “మేమే తప్పు తెలుసుకున్నాం” అని కోతి పిల్లలు సంతోష పడ్డాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.