ఈ తరం నడక – 12

కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్

-రూపరుక్మిణి 

ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు 

          ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున

వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి
ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…,
ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…,
ఆమెల్లోని ఆమెకు ఓ ఎరుక చూపించగలిగే ఓ తొలిపొద్దు కోసం కొత్తగా ఉదయించే సూర్యుడిలా తమలోని ఆలోచనలను పదును పెట్టుకునే, “ఏ అవకాశాన్నీ” తాము వదులుకోమని చెప్పగలిగే వనితావనులు ఉన్నారని, ఉండాలని కోరుకునే ఆశావాద దృక్పథాన్ని పంచే ఎర్ర రంగు పులుము కున్న గొంతులలో నుండి ఉద్భవించే ‘అగ్నిపూల కొలనులో,’ తాను ఓ గీతమై నిలవాలని కోరుకునే కవుల్లో గట్టు రాధికమోహన్ కూడా వుంటారు.

          భావ కవిత్వాన్ని రాసే కవుల మధ్య నలుగురు గురించి ఆలోచిస్తూ.., నలుగురి మధ్య నలిగే సంఘర్షణలను, ఓ స్త్రీలోని ఆవేదనని, ఆక్రోశాన్ని, సమయస్ఫూర్తిని, ఆలోచనను నింపే కవిత్వం రాస్తున్న కవుల్లో గట్టు రాధికమోహన్ ఒకరు.

          తన తొలి పుస్తకం “ఆమె తప్పిపోయింది”. రెండవ సంపుటి “కొత్త పొద్దు కోసం”. మొదటి కవిత్వంలో స్త్రీవాదాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తూ, స్త్రీల మనోభావాల్ని కవిత్వంగా మలిస్తే, ఈ కవిత్వంలో స్త్రీ మనోబలాన్ని, బలహీనతలని, మాతృత్వపు నీడల్ని, బంధాల అనుబంధాల – పొదరింటి అల్లికను, సంఘంలోని సంఘర్షణాత్మక విషయాల పట్ల అవగాహనని, పంచుకుంటూనే, వెన్నెముక లేని రాజకీయ చపలత్వాన్ని ప్రశ్నిస్తుంది.

          నేటి యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగంపై గొంతెత్తుతుంది. నగర జీవితంలో ఓ నిరుద్యోగి పాత్రని ప్రశ్నిస్తూ, పల్లె నుండి పట్నం పోయి అక్కడి నగరం పునాదుల కింద ఎలా పూడ్చబడతాడో, నిరుద్యోగం శాశ్వత చిరునామాగా ఎలా మిగులుతుందో చెప్తుంది.

          ‘నో ఎంట్రీ బోర్డు పెట్టు’ అని, ఆమెకి ఆమె పై ఉన్న పేటెంట్లు ఎవరి సొంతం కావని ఈ సమాజం ఓ సర్కిల్ జారీ చెయ్యాలి  అంటూ, భర్త చనిపోయినప్పుడు ఈ వ్యవస్థ వేసే ముద్రలకి ఎదురు నిలబడాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.

          ఆమెలో ఆమెగా, అమ్మగా, ఓ మనిషిగా, స్త్రీ తన కుటుంబానికి తనని తాను ఎంత నిస్వార్ధంగా అంకితం చేసుకుంటుందో చెప్పే సందర్భాన్ని చెబుతూ, “ఈ పిడికెడంత గుండెకు ఎంత ముందు చూపు లేకుంటే నాలుగు అర్రలుగా పార్టీషన్ చేసుకుంటుంది ” అన్నప్పుడు నాలుగు అర్రలు(గదులు) నావే అంటూ అందులో గది గదికి కేటాయింపులను పంచిపెట్టుకుంటూ తన కోసం తాను మిగిల్చు కున్న సమయాలు లేకున్నా, అందరూ వయసు బాధ్యతలలో దూరమయ్యాక మిగిలే ఒంటరితనాన్ని, పేగుముడి వేసుకున్న ప్రేమ బంధాల్ని, కవితాత్మకం చేసి మన బతుకు బంధాల్ని కదిలిస్తుంది.

          గ్లోబరీనా, ఉక్కుపాదం, అంతర్లీనం కవితల్లో సామూహిక గొంతు అవసరాన్ని చెప్తూ “ఈ మట్టిలో పుట్టిన వాళ్లంతా ఎర్ర సముద్రపు బంధువులేనని గుర్తు లేదేమో “, ” ఈ గర్భం ఎప్పుడో గాయాల చరిత్రలో కొత్త అంకాన్ని పుట్టిస్తూ ఉంటుందని తెలియనిదేముంది ” అంటూ, ఈ నేల ఉద్యమాలగడ్డ అని, ఎర్రరంగులద్దుకోవటం కొత్త కాదని, ఆంక్షల కాలానికి చెల్లు చీటీ పాడేస్తారు, అలా మేథో అంతఃర్నేత్రం తెరుచుకుంటే చాలు అంటూ తన కవితల్లో సామాజిక ఆటుపోట్లను ప్రశ్నిస్తారు.

          ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుండి పెరిగిన ఇంటిలో వాతావరణం గురించి చెప్తూ, అక్క చేతి పచ్చడి రుచిని గురించి గతకాలపు జ్ఞాపకాల మూటని విప్పుతూ, దీపపు బుడ్డిని గుర్తు చేస్తూ, నేటి ట్యూబ్ లైట్ వెలుగుల్లో ఆనాటి ప్రేమ వెలుగులు కరువైపోతున్న విషయాన్ని చెప్పారు.

          ఓ ఆడపిల్ల గడపదాటే ముందు ఈ ఇంటి పిల్ల ఆ ఇంటికి వెళ్లే సందర్భాన్ని, బతుకమ్మ పండుగలో పుట్టింట జరిగే వైభవాన్ని, కొనుక్కోలేకపోయిన పట్టులంగాలో మిగిలిపోయిన చిన్ననాటి ఆశని, చేజారి పోకుండా ముడి వేసుకున్న ఎంగిలిపువ్వు బంధం తోడబుట్టిన వాడి ఆత్మీయతను, అమ్మానాన్నల తొలిముద్దు స్పర్శను, నాయన మాటలు, సాంప్రదాయాల చక్రంలో మిగిలిపోయిన, విరిగిపోయిన కోర్కెల చిట్టాలు, బంధాల బాధ్యతల్లో ఒంటరి క్షణాల్ని బలంగా చెప్పారు.

          అయితే ఈ కవిత్వంలో అక్కడక్కడ కొన్ని సర్దుబాట్లు, సాంప్రదాయపు కట్టుబాట్లను విడిపించుకోలేని నిస్సహాయత, ఆ సాంప్రదాయాల్లోని అసౌకర్యాన్ని ప్రశ్నిస్తూనే సర్దుకు పొమ్మనే గాయాల ముళ్లపొదల్ని మోసే క్షణాలు మనకు కనిపిస్తాయి.

          రైతుల ఈతి బాధల గురించి మాట్లాడుతుంది, ఆమెని చెరువుతో పోలుస్తుంది. అందులో కూడా కబ్జాదారుడు ఆమెని ఆమెగా ఎదగనీయకుండా చేసే సాంప్రదాయ సంకెలను గురించి చెప్తూనే ఆ చట్రంలోనే మిగిలి పోవాల్సి వస్తున్నందుకు దుఃఖిత అవుతుంది.

          రాధికకు ఏ వస్తువునైనా కవిత్వంగా మలచడం వచ్చు. అది కూడా తన ఆవరణం నుండి చెప్పుకోగలిగే నేర్పు రాధిక సొంతం.

          ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ప్రాంతీయతకు ప్రాణం పోయడం అచ్చమైన ఓరుగల్లు తెలుగు పదాల సోయగం ఈ సంపుటంలో కొన్ని చోట్ల చూడవచ్చు. ‘శ’ అక్షరం ఎత్తి పలికే పదాల అబ్బురాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. సామల సదాశివ గారి మాండలిక ప్రేమ ఈ కవిత్వంలో కనిపిస్తుంది.

         ఈ కొత్త పొద్దుతో అనేక కొత్త పొద్దులని చూపే మేల్కొలుపుల ఆకాంక్షల వైపు తన కలం వెళ్లాలని కోరుకుంటూ, రాధిక గారికి అభినందనలు.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.