
‘ఉదయగీతిక’ నవలా పరిచయం
మూలం : యాంగ్ మో రాసిన ‘ ది సాంగ్ ఆఫ్ ది యూత్’
తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్
-పి. యస్. ప్రకాశరావు
కౌళ్ళు ఇవ్వని కౌలు దార్లను దూలానికి వేలాడ దీసి చంపేసే కిరాతకుడైన ఆ కామందు కామాంధుడు కూడా.అతనికి ఉంపుడు గత్తెలకు లోటు లేదు, కానీ పిల్లలు లేని లోటు ఉంది. అది చైనాలో జెహోల్రాష్ట్రంలోని మారుమూల గ్రామం. ఆ గ్రామంలోని సియుని అనే యువతికి 11 వ ఏటనే పెళ్లి కుదరడం, 15 వ ఏట పెళ్లి కావడం, భర్త చనిపోవడం కూడా జరిగిపోయింది. ఆమె ఆ కామందు దగ్గర కౌలుకి చేసుకుంటూ తన తాతతో కలిసి జీవిస్తోంది. ఎంతోమంది యువకులు ముందుకొచ్చినా పెళ్లికి ససేమిరా అంది. సియుని అందంపై భూస్వామి కన్నేసి లొంగదీసుకున్నాడు. గర్భవతి అయ్యాక తనింటికి తీసుకెళ్ళిపోయాడు. సియుని తాత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భూస్వామి భార్యసియునికి ఆడపిల్ల పుట్టాక, ఆ బిడ్డను లాక్కుని తల్లిని గెంటేసింది. భూస్వామి సియునిని తన స్నేహితుడికి కానుకగా పంపాడు. కూతుర్ని, తాతనూ కోల్పోయిన సియుని మనోవేదనతో నదిలో దూకేస్తుంది. సియుని కూతురే ఈ నవలలో ప్రధాన పాత్ర లిన్ టావ్ చింగ్.
ఆమె పద్దెనిమిదో ఏట, రెండు నెలల్లో హైస్కూలు చదువు పూర్తవుతుందనగా భూస్వామి అప్పులపాలై భార్యాపిల్లల్ని వదిలేసి పరారయ్యాడు. అతని భార్య డబ్బుకి ఆశపడిటావ్ చింగ్ నుఓ 30 ఏళ్ల తాగుబోతు, సంపన్నుడికి కట్టబెట్టాలను కుంటుంది. దోపిడీ వర్గాలపై ద్వేషానికి అప్పుడే టావ్ చింగ్ లో బీజం పడింది. ఆ పెళ్లిని అసహ్యించు కుని మేనత్త సాయంతో ఇంటి నుంచి పారిపోయి టీచర్ గా పనిచేస్తున్న తన అన్నను కలవడానికి వెళుతుంది.
కానీ అతను ఆ ఊళ్ళో ఉండడు. వెనక్కి వెళ్ళడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రాధమిక పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పించమని స్కూల్ హెడ్ మాస్టర్ ని బ్రతిమాలు తుంది. అతను సరే అని ఆశ్రయం కల్పించాడు. కానీ అతనో మేకవన్నె పులి. ఆమెను ఓ మేజిస్ట్రేట్ కి ఉంపుడు గత్తెగా అమ్మేయాలనుకుంటాడు. అది తెలిసి టావ్ చింగ్ పెనం మీద నుంచి పొయిలో పడ్డానని గ్రహిస్తుంది. ఇంతలో తనకు యూనివర్శిటీలో సీటు వచ్చినట్టు తెలిసింది. కానీ అక్కడికి వెళితే, పట్టుకుని పెళ్లి చేసి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలని సవతితల్లి మాటేసి ఉంది. దిక్కు తోచనిటావ్ చింగ్ఆత్మహత్య చేసుకోవాలని సముద్రం దగ్గరకు వెళుతుంది. యుంగ్ సె అనే పెకింగ్ యూనివర్సిటీ విద్యార్ధి కాపాడి, ఉద్యోగం ఇప్పిస్తాడు.
ఒకరోజు చైనాలోని ఈశాన్య రాష్ట్రాలను జపాన్ ఆక్రమించుకుందని తెలిసింది. ఆ ప్రాంతాల ప్రజలు రైలు పెట్టెల నిండా ఏడుస్తూ వచ్చారు. గ్రామమంతా ఉద్రిక్తతకు లోనైంది. బడి మూసేసారు. టావ్ చింగ్ ఒంటరైంది.పెకింగ్ యూనివర్సిటీ విద్యార్ధి(లూ చియా చువాన్) టావ్ చింగ్ కి కొమింటాంగ్ ప్రభుత్వ అసమర్ధత గురించి చెప్పి ఆమెకు విప్లవభావాలను బోధిస్తాడు. అతనంటే ఆమెకు అంతులేని అభిమానం ఏర్పడుతుంది. నాటినుంచీ టావ్ చింగ్ పిల్లలకు దేశభక్తినీ, జపాన్ దురాక్రమణనూ బోధించడం మొదలు పెడుతుంది.
హెడ్ మాస్టర్ వేధింపులు భరించలేక ఆ ఊరు వదిలిపెడుతుంది. తను మొదట బయలుదేరిన చోటికి వెళ్లి తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. టీచర్ కావాలనే ప్రకటన చూసి ఆ చిరునామాకు వెళుతుంది. ఆ ధనవంతుడు తన భార్యా కొడుకూ జపాన్ లో ఉన్నారని, కావలసినంత జీతం ఇస్తానని పాఠాలు తనకు చెప్పమని వెకిలిగా మాట్లాడతాడు. కీడు శంకించి ఆమె అక్కడి నుంచి పారిపోతుంది.
తనను ఆత్మహత్య నుంచి కాపాడిన యుంగ్ సె ని కలిసింది. ఇద్దరిమధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆమె ముందు తన కాళ్ళ మీద తను నిలబడాలని ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టింది. ఇంతలోప్రేమికుడి ఒత్తిడితో అతనితో సహజీవనం సాగిస్తుంది. కానీ ఆ తరువాత అతనుకాలం చెల్లిన భావాలకు దాసుడని అభ్యుదయభావాలకు ఆమడ దూరంలో ఉంటాడని గ్రహిస్తుంది. టావ్ సింగ్ ఉద్యోగం చేయడం అతనికి నచ్చదు. విభిన్న రాజకీయ దృక్పథాలు గల స్త్రీపురుషులు కలిసి జీవించలేరని ఆమె తెలుసు కుంటుంది.
అలాంటి పరిస్థితిలో పెకింగ్ యూనివర్సిటీ హాస్టల్లో జరుగుతున్న దేశభక్త విద్యార్ధుల సమావేశానికి హాజరవుతుంది. అక్కడ జపాన్ దురాక్రమణ గురించీ చియాంగ్ కై షేక్ (కొమింటాంగ్) ప్రభుత్వం జపాన్ కి మోకరిల్లడం గురించీ విద్యార్ధులు జరిపిన ఆవేశ పూరిత చర్చలు ఆమెలో నూతన ఆలోచనలను రేకెత్తిస్తాయి. నాన్ కింగ్ లో విద్యార్దుల ప్రదర్శనలో అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై విద్యార్ధి నాయకులు తిరగబడతారు. ఆ ప్రదర్శనకు నాయకత్వం వహించిన లూ చియా చువాన్పోరాట పటిమ ఆమెలో విప్లవభావాలకు బీజం వేస్తుంది. లూ చియా చువాన్ ద్వారా ఎర్ర సైన్యం గురించీ కమ్యూనిస్టు పార్టీ గురించీ తెలుసుకుంటుంది. అతను గోర్కీ అమ్మ, లెనిన్ రాజ్యమూ, విప్లవమూ లాంటి కొన్ని పుస్తకాలు ఇస్తాడు.అతన్ని మనసులో ఆరాధిస్తుంది.
ఒకరోజు టావ్ చింగ్ ని మారువేషంలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు పోతారు. స్కూల్లోచదువుకునే టపుడు తనను పెళ్ళాడతానని వచ్చిన (హూమెంగ్) జామీనిచ్చి విడిపిస్తాడు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెస్తాడు. ఆమె ఛీ కొడుతుంది.
కొమింటాంగ్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చైనా జాతి విముక్తి వారి లక్ష్యంగా పెకింగ్ యూనివర్సిటీ విద్యార్ధులు చేసిన ప్రదర్శనలో టావ్ చింగ్ పాల్గొంటుంది. వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని చూసిటావ్ చింగ్ఉత్తేజాన్ని పొందుతుంది. తానెంత వెనకబడి ఉన్నానో అర్ధం చేసుకుంటుంది. ‘యుంగ్ సే పరిచయమైన కొత్తలో ‘ఇతనే నా సర్వస్వం’ అనుకుంది. ఇప్పుడు ‘ఇతన్నా నేను ప్రేమించింది! ’ అనుకుంటోంది. అతను ఆమె ఎవరినో ప్రేమిస్తోందని అనుమానిస్తాడు. ఆమెతో ‘ జపాన్ దురాక్రమణ విషయం ప్రభుత్వ బాధ్యత. ఓ సారి నీకు కమ్యూనిస్టుగా ముద్ర పడిందా, వాళ్ళు నీ తల తీసేస్తారు’ అని బెదిరిస్తాడు. టావ్ చింగ్ అతనితో తెగతెంపులు చేసుకుని విప్లవకార్యక్రమాల్లో నిమగ్నమవుతుంది.
రోజుకి పదిహేను గంటలు మార్క్సిజాన్ని అధ్యయనం చేయడంలో గడుపుతుంది. భోజనాన్ని కూడా అశ్రద్ధ చేస్తుంది. ఏదో ఒక లక్ష్యం కోసం బతకాలనే కాంక్ష ఆమెలో ఎక్కువవుతుంది. తనను ఎర్ర సైన్యంలో చేర్చుకోమని కమ్యూనిస్టు పార్టీవాళ్ళను కోరుతుంది.
టావ్ చింగ్ జపాన్ దురాక్రమణలను నిరసిస్తూ, సోవియట్ యూనియన్ ని బల పరచడానికి జరిగే కవాతులో పాల్గొనడానికి నిశ్చయించుకుంటుంది. అది ఆమె భర్త యుంగ్ సె కి కిట్టదు. అయినా తను బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ సంఘటనతో ఇద్దరూ విడిపోతారు. కవాతులో పోలీసులు కాల్పులకు ఇద్దరు విద్యార్ధులు చనిపోతారు. టావ్ చింగ్ తోటి విద్యార్ధులతో కలిసి పోలీసులపై రాళ్ళు విసురుతుంది. ఒక పోలీసు రక్తం కక్కుకునే స్తితి వస్తుంది. రక్షించమని విద్యార్ధులను వేడుకుంటాడు.
1933లో చైనా జాతి గౌరవాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం జపాన్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కమ్యూనిస్టు పార్టీ పిలుపునందుకుని విద్యార్ధులూ మేధావులూ రోడ్డెక్కుతారు. ప్రభుత్వ దళాలు వారిపై రాక్షసంగా విరుచుకు పడతాయి. ఒక విప్లవద్రోహి వల్ల లూచియా చువాన్ ని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి రెండు కాళ్ళూ విరిచేస్తారు. వికృతచేష్టలకు పాల్పడతారు. చేతివేళ్ళ గోళ్ళమధ్య సూదులు గుచ్చుతారు. అయినా అతను పార్టీ రహస్యాలు బయట పెట్టలేదని చివరికి కాల్చి చంపేస్తారు.
గతంలో ఒకసారి లూ చియా చువాన్ దాచమనిఇచ్చిన కొన్ని కరపత్రాలను టావ్ చింగ్ కి గోర్కీ ‘అమ్మ’ లాగ వాటిని పంచుతుంది. ఇళ్ళ తలుపులకు అంటిస్తుంది. ఆ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఆ తరువాత ఆమె పూర్తి సమయాన్ని పార్టీ కోసం ఉపయోగిస్తుంది.
తను రహస్యంగా ప్రేమిస్తున్న లూచియా చువాన్ మరణ వార్త తెలియని టావ్ చింగ్ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. టావ్ చింగ్, తోటి ఉపాధ్యాయుల్లో,విద్యార్ధుల్లో, వారి తల్లిదండ్రుల్లో విప్లవ భావాల ప్రచారం చేస్తూ ఉంటుంది. చివరకు తను పనిచేసే స్కూల్లో జరిగే అక్రమాలపై కూడా ఉద్యమం చేస్తుంది.
ఒకరోజు పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని టావ్ చింగ్ కి సమాచారం వస్తుంది. వెంటనే తన విద్యార్ధి ఇంటికి వెళ్లి తలదాచుకుంటుంది. కానీ అక్కడ క్షేమం కాదని తెలుస్తుంది. అజ్ఞాతం కోసం ఓ భూస్వామి ఇంటి నుంచి రహస్యాలు తెలుసుకునే పని మీద మారుపేరుతో ఆ కుటుంబంలో టీచర్ గా చేరుతుంది. తరువాత తన అభిమాన విప్లవకారుడి జాడ కనుక్కోడానికియూనివర్సిటీ హాస్టల్లో చేరుతుంది. పోలీసులు అరెస్ట్ చేసి ఓ చీకటి కొట్లో పడేస్తారు. ఆ అరెస్ట్ వెనుక ఆమెను మొట్టమొదట పెళ్ళాడాలని ప్రయత్నించిన ధనవంతుడి(హుమేంగ్) హస్తం ఉంటుంది. తనకు లొంగిపోతే కాపాడతానని చెబుతాడు. టావ్ చింగ్ అతని చెంప చెళ్ళు మనిపించి ‘ కావలిస్తే నన్ను కాల్చెయ్! కానీ నేను లొంగను’ అంటుంది.అతని సలహాతో పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తారు. గిన్నెలకొద్దీ కారపు నీళ్ళు ముక్కులో పోస్తారు. ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీతో తొడమీద వాత పెడతారు. కానీ ఆమె నోరు తెరవదు.
మూడు రోజుల తరువాత స్పృహ వస్తుంది. ఒక ఉద్యమకారిణి సపర్యలతో కోలు కుంటుంది. తాను ఓ రహస్య జైలుగదిలో ఉన్నట్టు తెలుసుకుంటుంది. అక్కడ తన లాంటి బాధితులు చాలామందిని చూస్తుంది. వారి ఉద్యమ అనుభవాలు వింటుంది. అప్పుడు ఆమెకు చావు భయం పోతుంది. ‘ చైనా నేలమీద కమ్యూనిజం నిజమయ్యే రోజుదాకా బతికి ఉండాలి’ అనుకుంటుంది. పోలీసులు ఆ రాత్రి పదిమంది విప్లవ కారులను సజీవంగా పాతి పెడతారు. ఏడాది పాటు జైలు జీవితం తరువాత సాక్ష్యాధా రాలు లేవని టావ్ చింగ్ ని వదిలేస్తారు. జైలు శిక్షకు తట్టుకున్నందుకు ఆమెను పార్టీలో చేర్చుకుంటారు. ఆమె సియులాన్ అనే మారుపేరుతో ఒక పార్టీ సభ్యురాలిని కలుస్తుంది. ఇద్దరూ కలిసి బట్టలుతికి పొట్టపోసుకునే తల్లీ కూతుళ్ళలా నటిస్తూ కార్బన్ కాపీలు రాయడం, వార్తలు అందజేయడం వంటి పార్టీ పనులు చేస్తారు.
తరువాత లూఫాంగ్ అనే మారుపేరుతోపెకింగ్ యూనివర్సిటీలో పార్టీనిని బలోపేతం చేయడానికి వెళుతుంది. విప్లవ ద్రోహులు ఆమె రహస్యం బయట పెట్టడంతో మారువేషంలో వచ్చిన పోలీసుల తొత్తులు ఆమెను ఎడాపెడా కొడతారు. ఆమెకు ఉద్యోగం లేదు. డబ్బులేదు. మెత్తని నూలు చొక్కాలన్నీ తాకట్టుకు వెళ్లి పోయాయి. ఉడికించిన బంగాళా దుంపలతో కాలక్షేపం చేస్తూ పార్టీ పనులు చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో చియాంగ్ హువా వచ్చి లూచియా చువాన్ మరణ వార్త చెబుతాడు.నెత్తిన పిడుగు పడ్డట్టు భావిస్తుంది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఆయుధాలు పట్టాలని కూడా అనుకుంటుంది. దుఃఖాన్ని దిగమింగి నాటి నుంచీ చియాంగ్ హువాతో కలిసి విప్లవ కార్యక్రమాలలో పనిచేస్తుంది. ఆ సందర్భంలోనే చియాంగ్ హువాతో సాన్నిహిత్యం పెరిగి సహజీవనం మొదలుపెడుతుంది.
జపాన్ దురాక్రమణ ఉత్తరప్రాంతం వరకూ విస్తరిస్తుంది. దాన్ని నిరోధించడానికి విద్యార్ధులూ పార్టీ కార్యకర్తలూఆ ప్రాంతానికి బయలుదేరుతారు. అది 1935 మహత్తర డిసెంబర్ 9 ఉద్యమం. టావ్ చింగ్ విపరీతమైన జ్వరంతో ఉండటం వల్ల కవాతులో పాల్గొనాలని ఉన్నా స్నేహితుల బలవంతం మీద ఆగిపోతుంది. ప్రదర్శన కారులను పోలీసులు బాయ్ నెట్లతో, కత్తులతో కొరడాలతో అడ్డుకుంటారు. గొట్టాలతో నీళ్ళు చిమ్ముతారు. వాటిని లక్ష్య పెట్టకుండా కార్మికులూ ప్రభుత్వోద్యోగులూ చిన్న చిన్న వ్యాపారులూ రిక్షా కార్మికులూ చివరికి గృహిణులు కూడా ప్రదర్శనలో పాల్గొంటారు. పోలీసులు చాలామంది యూనివర్సిటీ విద్యార్దులనుగాయపరుస్తారు. కత్తితో ఒకవిద్యార్ది ముక్కూ పెదవులూ చెక్కేస్తారు. పదిమందికి పైగా అరెస్టు చేస్తారు.
డిసెంబర్ 9 ఉద్యమం విద్యార్ధులలో విప్లవజ్వాలలు రగిలించింది. ఉత్తర చైనాను జపాన్ కి అప్పగించే ప్రభుత్వ ప్రయత్నాన్ని నిరసిస్తూ డిసెంబర్ 16 న భారీఎత్తున ప్రదర్శన చేయాలని విద్యార్ధులు ప్రణాళిక వేసుకున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడే విద్యార్ధుల సమూహం ముందు నిలవలేక పోలీసులు కాళ్ళకు బుద్ధి చెబుతారు.“ చివరికి విద్యార్దులదే పై చేయి అవుతుంది. “నేను కమ్యూనిజమనే మహత్తర ఆశయం కోసం పోరాడే సైనికురాలినయ్యాను” అంటుంది టావ్ చింగ్.
(పాఠకుల సౌలభ్యం కోసం చైనాభాషలో ఉన్న చాలా పాత్రల పేర్లు నేను చెప్పలేదు)
ఈ నవలలోని ఇతివృత్తం కల్పితం కాదు. టావ్ చింగ్ జీవితం రచయిత్రి యాంగ్ మో జీవితమే (ఆమె పుట్టిన పాప విషయం మినహాస్తే). ఆమె ఉద్యమ జీవితంలోని అనుభవాలూ, ఆమెతోపాటు ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తుల జీవితాలు సందర్భాను సారంగా మనకు ఎదురవుతాయి.
జపాన్ చైనాలోని రాష్ట్రాలను ఆక్రమించుకోవడం, చియాంగ్ కై షేక్ (కొమింటాంగ్) ప్రభుత్వం జపాన్ కి మోకరిల్లడం. దాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిం చడం. విద్యార్థిలోకం కొమింటాంగ్ పార్టీ ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేయడం. ప్రభుత్వం ఎర్రసైన్యం మీద విరుచుకుపడటం, కమ్యూనిస్టులను ఊచకోత కోయించడం, కొమింటాంగ్ పాలనలో కనీసం మూడు లక్షలమంది యువకులు హత్యకు గురావడం, 1935 నవంబర్లో పెకింగ్ విద్యార్థిసంఘం అవిర్భావం, డిసెంబర్ 9న ఆరువేల మంది విద్యార్థులతో జపాన్ ను ప్రతిఘటించడం, చైనాను రక్షించాలనే డిమాండుతో ప్రదర్శన, అనేకమంది విద్యార్థియువజనులు గెరిల్లా యోధులుగామారడం. వంటివన్నీ చారిత్రిక సంఘటనలే.
మహాభారతంలోని ఉపాఖ్యానాల్లా ఈ నవలలో సందర్భానుసారంగా ఎంతోమంది ఉద్యమ కారుల నేపథ్యం కనిపిస్తుంది. కనీసం కొన్నైనా సంక్షిప్తంగా చెప్పుకోవాలి.
లూ చియా చువాన్పెకింగ్ యూనివర్సిటీ విద్యార్ధి. బాల్యం నుంచే విప్లవభావాలు గల చురుకైనకార్యకర్త. తండ్రి ఉపాధ్యాయుడు. టావ్ చింగ్ పై ప్రగాఢ ముద్ర వేసిన మేధావి. ఒక విప్లవద్రోహి ఇచ్చిన సమాచారంవల్ల పోలీసులకు పట్టుబడతాడు. ఆ కిరాతకులు ఇతని రెండు కాళ్ళూ విరిచేసి చిత్రహింసలు చేసి కాల్చిచంపుతారు.
చియాంగ్ హువా అసలు పేరు లీమెంగ్. ప్రాధమిక విద్య పూర్తయ్యాక పదమూడేళ్ళ వయసులో అతని తండ్రి ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనికి కుదిర్చాడు. కొన్నాళ్ళ తర్వాత పారిపోయి పెకింగ్ యూనివర్సిటీలో విద్యార్ధిగా చేరాడు. జపాన్ వ్యతిరేక సైన్యానికి కమాండర్ అయ్యాడు. ఒకసారి పోలీసులకు దొరికిపోయి వారికి మస్కా కొట్టి తప్పించుకున్నాడు. ఇతని ద్వారానే లూచియా చువాన్ మరణ వార్త టావ్ చింగ్ కి తెలుస్తుంది. ఉద్యమ కార్యక్రమాల ద్వారా సాన్నిహిత్యం పెరిగి చియాంగ్ హువా, టావ్ చింగ్ దంపతులవుతారు.
సునింగ్పెకింగ్ యూనివర్సిటీ విద్యార్ధి.ఆవేశపరుడు. మూడేళ్ళ వయసులో తండ్రిని కోలోపోయాడు. తల్లి కళ్ళలో పెట్టుకుని పెంచింది. మార్క్సిజం చదివి విప్లవకారుడయ్యాడు. జపాన్ వ్యతిరేక యుద్ధరంగంలోకి వెళతానంటే తల్లి వారిస్తుంది. చదువు మధ్యలో ఆపి వెళితే తన చావుని చూడాల్సి వస్తుందని తల్లి బెదిరిస్తుంది. ‘దేశం ఇంత ప్రమాద కరమైన స్థితిలో ఉంటే ఎవడూ చేతులు ముడుచుకుని కూర్చోలేడు’ అంటాడు సునింగ్. కానీ పోలీసులు ఓ అర్ధరాత్రి అతని ఇంట్లో రహస్యంగా కమ్యూనిస్టు సాహిత్యం పెట్టి ఆ ఆధారంతో తీసుకుపోయి రెండేళ్ళ పాటు జైల్లో పెడతారు.
లోతాఫాంగ్ విప్లవగ్రూపులోని విద్యార్ధి. ఒకసారి జైలుకెళితే తండ్రివెయ్యి వెండి డాలర్లు ఖర్చు పెట్టి విడిపిస్తాడు. ‘కమ్యూనిస్టులను వదిలేయ్! అమెరికా పంపించి చదివిస్తానంటాడు.‘ అంతకంటే నాకు జైలు కెళ్ళడమే ఇష్టం’ అని లోతాఫాంగ్కుటుంబం తో తెగతెంపులు చేసుకుంటాడు.పోలీసులు మళ్ళీ 3 నెలలు జైల్లో పెడతారు.
లీవెయి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. పార్టీ ఆయన్ని సోవియట్ యూనియన్ కి పంపించి చదివించింది. అక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చైనాకి తిరిగొచ్చి ఇద్దరూ పార్టీ రహస్య కర్యలాపాలు నడిపేవారు. పోలీసుల అతన్ని అరెస్ట్ చేసి రహస్యాలు చెప్పమని ఎన్నో రకాలుగా వేధించారు. అతను పెదవి విప్పలేదు. చివరికి కాల్చి చంపేస్తారు. ఇతని భార్య ఉద్యమంలో కొనసాగుతుంది.
ఈ విప్లవ యోధులతోబాటు బిడ్డలను పోగొట్టుకున్న తల్లులూ, తోడు కోల్పోయిన స్త్రీలూ, సైనికుల పశువాంఛకు బలైన లిహువాయింగ్ వంటి యువతులూ, విప్లవ కారులుగా కనిపిస్తూ ఉంటూ డబ్బుకి కక్కుర్తి పడి కొమింగ్ టాంగ్ ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేసిన వాంగ్ చుంగ్ వంటి విద్యార్ధులూ, 59 ఏళ్ల వయసులో యువజన ప్రదర్శనలో పాల్గొనడానికి వెళ్ళిన వాంగ్ హంగ్ పింగ్ వంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లూ, ‘ నువ్వెళ్ళి నపుడు నేనెందుకు రాకూడదు’ అని భర్తలతో వాదించిన భార్యలూ, ఉద్యమం ద్వారా పెరిగిన సాన్నిహిత్యం ఆధారంగా ప్రేమ వ్యవహారం నడిపి ఆ తరువాత ముఖం చాటేసిన ‘ చెంగ్ చున్ సాయ్ వంటి అవకాశవాదులూ పార్టీలో పనిచేసి ఉద్యమకారు లను పట్టించిన తాయియూ వంటి విప్లవద్రోహులూ తారసపడతారు. విప్లవబాట పట్టిన చాలామంది తమ తల్లులకూ భార్యలకూ ఒకే మాట చెబుతారు. ‘ ఒకవేళ జరగా కూడనిదే మైనా జరిగి నేను తిరిగి రాకపోతే ఇవన్నీ నువ్వే చూసుకోవాలి’
అలాగే ప్రగతిశీల వాదులను ఆలోచింపజేసే వాక్యాలు కూడా ఈ నవలలో కనిపిస్తాయి. వాటిలో కొన్ని.“వీలయినంత ఎక్కువవిజయాన్ని తక్కువ త్యాగంతో సాధించడమే తెలివిగలవాళ్ళు చేసేపని”“ నీ అంతట నువ్వే ఒంటరిగా పోరాడితే దెబ్బలూ ఎదురు దెబ్బలూ తగులుతాయి. కానీ నువ్వొక సామూహిక పోరాటంలో భాగమై నీ భవిష్యత్తును ప్రజలందరి భవిషత్తుతో ముడి వేసుకోవాలి” “ఒకరి ప్రవర్తనను, అంచనా వేయాలంటే మనం వాళ్ళ ఉద్దేశ్యాలను పైపైన మాత్రమేగాక వాళ్ళ పనుల ఫలితాలవైపు గూడ చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం ముందుకు నడవడానికి తోడ్పడు తున్నారా? లేక దాని కుళ్ళును కీర్తించి, దాన్ని కాపాడడానికి తోడ్పడుతున్నారా?”
“ చైనా విప్లవం ఎందుకు విజయవంత మైందో చైనా ప్రజలు, ముఖ్యంగా యువజనులు ఎంత నిర్భయంగా పోరాడారో సరిగా అర్ధం చేసుకోడానికి విదేశీ మిత్రులకు ఈ పుస్తకం తోడ్పడితే నా కృషి సార్ధకమైనట్టే “ అని రచయిత్రి యాంగ్ మో చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
యాంగ్ మో 1978 లో రాసిన ఈ నవలను ఎన్. వేణుగోపాల్ సంక్షిప్త స్వేచ్చాను వాదం చేశారు. 1985 జూలైలో మొదటి సారి అచ్చయింది. ప్రగతిశీల సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులంతా చదవాల్సిన నవల ‘ ఉదయగీతిక’
*****

పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.