కనక నారాయణీయం -66

పుట్టపర్తి నాగపద్మిని

          పర్తల్ ముందు సిగ్గు పడింది. తరువాత చిత్రపటం చూసింది. నిజమే, ఇతడినే కదా తానూ ఆనాడు చూసింది? తన అందం ఒక రాజును ఆకర్షించేంత గొప్పదా? కానీ..? ఇతణ్ణి పెళ్ళి చేసుకుని తాను వెళ్ళిపోతే ఇంక పుట్టింటితో తన సంబంధం పూర్తిగా తెగిపోయి నట్టే! విజయనగరం పొరుగు దేశమైనా తమ రాజుకు శత్రుదేశం. ప్రజల మధ్య ఎటువంటి వైషమ్యాలూ ఉండవు కానీ రాజుల వల్ల, వాళ్ళ అధికార దాహం వల్లా ముందు సామాన్య ప్రజలకు ఇబ్బంది. వాళ్ళు తమ చోట క్షేమంగానే ఉంటారు, ముందుగా సామాన్య ప్రజానీకం ప్రాణాలను కోల్పోతుంది. ఇప్పుడీ పెళ్ళిని తాను ఒప్పుకుంటే, గొప్ప యుద్ధానికి తానే కారణమైపోతుంది.

          ఇవన్నీ అవసరమా? ఏదో పెళ్ళి చేసుకుని, ఆ కుటుంబంతోనూ, ఇక్కడి  తల్లి దండ్రులతో హాయిగా ఉండక, యీ ఇబ్బందులు కొని తెచ్చుకోవడమెందుకు? ఐనా ఆ నాటి ఘటన ఏదో అనుకోకుండా జరిగింది. అతగాడు రాజని తనకు తెలిసే అవకాశమే లేదు. తెలిసినా, తాను చేయగలిగేదేముంది? ఇప్పుడే యీ ఆలోచన చేయటం మంచిది. తన సుఖం కోసం తన వాళ్ళనూ, కుటుంబాన్నీ కష్టాలపాలు చేయటం ద్వారా తనకేమి దక్కుతుంది, ఇష్టాల మధ్య కాక కష్టాల మధ్య  భయం భయంగా బ్రదకడమా?’ పర్తల్ మరో ఆలోచన లేకుండా తిరస్కరించేసింది. ఆ అమ్మాయి తన భావాలు కూడా ధైర్యంగా తండ్రికి చెప్పింది. సామాన్య జీవితంలోని సరదాలు భవనాల్లో ఉంటాయా? అదీ రాజ భవనాల్లో! రాజుకు ఎంత మందో భార్యలు! వాళ్ళలో ఒకతెగా మాత్రమే తన స్థానం. ఎంత సుఖమైనా అంత మందిలో తానూ ఒకతెగా ఉండటం కన్నా, అమ్మా నాన్నలకు దగ్గరగా హయిగా పొలమూ చెట్ల మధ్య హాయిగా జీవించాలని ఉందని చెప్పింది గట్టిగానే!!

          ఇన్నీ జరిగిన తరువాత ఆ అమ్మయి తనను తృణీకరించినదన్న కోపంతో, విజయనగర రాజు తీసుకున్న నిర్ణయం, ఆ తరువాత పరిణామాలు రెండు రాజ్యాల మధ్య ఎంతటి సంక్షోభాన్ని సృష్టించాయో, ఒక రకంగా విజయనగర ముస్లిం రాజుల మధ్య శాశ్వత శతృత్వానికి దారి తీశాయో, చరిత్ర చదివితే గుండె తరుక్కు పోతుంది.

          తాను నవలగా యే చారిత్రకాంశాన్ని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవటం కష్టంగానే ఉంది పుట్టపర్తికి.

          బుర్ర వేడ్దెక్కి పోయింది.మేడ మీదున్న గదిలోనే వారి పఠన, రచనా వ్యాపకం అంతా!! ఇక్కడ ఎవరూ వారి ఏకాగ్రతను భంగపరచేవారుండరు. అందుకు, కనకమ్మ ఎన్నో  జాగ్రత్తలు తీసుకుంటుంది కూడా! ఆమె గుర్తుకు వస్తే పుట్టపర్తి హృదయం, ఆమె పట్ల అనురాగంతో నిండిపోతుంది. ఇన్నివిధాలుగా తన భర్త పుట్టపర్తి సాహిత్య జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్న సహధర్మచారిణి లభించటం తన అదృష్టమే!! ఆమె కూడా సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితురాలు. వాళ్ళ పితామహులు శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారి వద్ద బాల్యంలోనే చక్కటి సాహిత్య ప్రవేశం లభించిం దామెకు! అందుకే తన కృషి గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఇల్లాలామె! కాబట్టే  అన్ని జాగ్రత్తలూ వహిస్తూ ఉంటుంది. పైగా, మరో సుగుణం, శాంతిగా గుట్టుగా భర్త సంపాదనతో, కుటుంబాన్ని నెట్టుకురావటం తప్ప, లేనిపోని కోరికలేవీ లేని సాదాసీదా ఇల్లాలు కూడా! తన ఆవేశ పూరితమైన మనస్తత్వానికి నిండు కుండ వంటి ఆమె మనస్తత్వం, ఒక విధంగా చెలియలి కట్టగా పనిచేస్తుందని, తననెరిగిన బంధువులూ, సాహిత్య మిత్రులూ కూడ అనే మాటే!కాబట్టే ఆమె అంటే ఒక రకంగా భార్యగా కన్నా మాతృభావనతో తనను ఓర్చుకునే అమ్మతనం తనను ముగ్ధుణ్ణి చేస్తుంది. పుట్టపర్తి మనసు ఒక్కసారి ఆర్ద్రమైపోయింది.

          ఇప్పుడిక వేడి వేడి కాఫీ తాగి, బీడీ ముట్టిస్తే గానీ బండి ముందుకు నడవటం కుదరదు.మేడ గదినుండీ కిందకు బయలుదేరారాయన!

***

          సగం మిద్దె దిగగానే కింద పడసాలలో గట్టిగా నాగ ఏడుపు వినిపిస్తూ ఉంది. అందరి కంటే చిన్న బిడ్డ. ఆటలూ, పాటలూ, ఏవో తనకు తోచినట్టు పాటలకు అనుగుణంగా డాన్స్ కూడా చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. తాను చిన్నప్పుడు పెనుగొండలో నేర్చుకున్న నాట్య విద్యను నేర్పించాలనుకుంటూ ఉంటారు పుట్టపర్తి నాగను చూసినప్పుడల్లా!!

          తీరా కిందకు దిగి వచ్చేసరికి, తనను చూసి, చిన్న బిడ్డ ఏడుపు నియంత్రించు కోవటం చూసి జాలేసింది పుట్టపర్తికి! 

          ఏడుస్తున్న నాగ దగ్గర భార్య కనకమ్మ కూడా నిల్చుని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుంది.

          ‘ఎందుకు అంతగా ఏడుస్తున్నావ్ తల్లీ?’

          ‘స్కూల్ లో..స్కూల్ లో…’ ఆగిపోయింది నాగ.

          అప్పటికే నాలుగు దెబ్బలు వేసినట్టుంది తల్లి. నాగ వెక్కిళ్ళింకా ఆగలేదు.

          ‘చెప్పు..స్కూల్ లో ఏమయింది?’

          భార్య వైపు చూస్తూ, కాఫీ అని సంజ్ఞ  చేసి, మళ్ళీ నాగను దగ్గరికి పిలిచి అడిగా రాయన.

          కనకవల్లి భారంగా అడుగులు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమె కిప్పుడు మళ్ళీ ఐదు నెలలు  గర్భం. ఇదివరకు అమె తల్లి హెచ్చరించినట్టే అయింది, యీ సారి, ఇల్లుగలావిడ గుడిపాటవ్వ భరోసాతో భగవంతుని మీద భారం వేసి రోజులు గడుపుతున్న దామె!  కాలం కదులుతూనే ఉంది. కరుణ, తరులతల నుంచీ వాళ్ళిద్దరి ఆరోగ్య విషయాలు తెలుస్తూ ఉన్నాయి. వేవిళ్ళు, బలహీనత, చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు, తల్లి సలహాలు – ఇలా రోజులు వేగంగా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ సన్నివేశంలో ఆమెకు చిన్నారి నాగకు ఏడవకుండా నచ్చజెప్పే ఓపిక ఆమెకు లేదు మరి.

          పుట్టపర్తి అడిగారు.

          ‘చెప్పమ్మా! ఏమైంది స్కూల్ లో?’ 

          ‘ స్కూల్ లో ..స్కూల్ లో..టీకాలు వేస్తున్నారయ్యా!!’

          ‘టీకాలా? దేనికి?

          ‘అదే..దేనికో తెలీదు. అందరికీ వేస్తారంట!’

          ‘…’

          ‘భుజాల మీద వేస్తారంట! బాగా నొప్పిగా ఉంటుందంట రెండ్రోజులు !! రామసుబ్బ లక్ష్మి కూడ ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది. వాళ్ళమ్మ  బరబరా యీడ్చుకుని వచ్చి వేయించింది. ఆ పిల్ల భలే ఏడ్చిందయ్యా!

          నాకూ భయం! మా సారేమో తప్పకుండా వేయించుకోవాలని అందరినీ లైన్ లో నిలబెట్టి మరీ వేయిస్తున్నాడు. నేనూ పరిగెత్తుకుని ఇంటికొచ్చేసినా! అమ్మేమో స్కూల్ కు పొమ్మంటూ ఉంది, టీకా వేయించుకోమని..’!

          ఇంతలో కాఫీ గ్లాస్ చేతిలో పట్టుకుని వచ్చింది కనకవల్లి.  

          ‘అదేనే తల్లీ!! టీకాలు మంచిదే కదా వేయించుకుంటే! వేయించుకోవాలమ్మా!! అని అప్పట్నుంచీ చెబుతూ ఉన్నా! ఆ రామసుబ్బలక్ష్మీ వాళ్ళమ్మ మంచిపనే చేసింది. రెండు తగిలించి తీసుకు వచ్చి వేయించింది.

          పోలియో వంటి జబ్బులు రాకుండా వేస్తున్నారు స్కూల్ లోనే  యీ రోజుల్లో! వినియోగించుకోవాలంతే! మనకు చిన్నప్పుడివన్నీ అందుబాటులో లేవు. మన చిన్నతనంలో యీ పోలియో వంటి జబ్బులొస్తే, ఇక జీవితమంతా బాధపడవలసిందే అన్నట్టుండేది! మా శాంతను చూస్తున్నాం కదా ఎంత బాధ పడుతూ ఉంది తను? అందుకే, ‘నొప్పి ఉండదులే! ఉన్నా  ఫరవాలేదు. నేను దగ్గరే ఉంటా కదా, నేనే వేయిస్తానే అంటే, యీ నాగ వినటం లేదు. అందుకే రెండు తగిలించాను.’ నుదుటి చెమటను కొంగుతో తుడుచుకుంటూ అందామె.

          ‘మరింకేమి తల్లీ? అమ్మతో పోయి టీకా వేయించుకునిరాపో!’ కాఫీ గ్లాస్ అందుకున్నారు పుట్టపర్తి.

          ‘నాకు చేతకావటం లేదు. సమయానికి ఆ అరవిందుడూ, తులజా కూడా లేరింట్లో! దీన్ని తీసుకు పోయి టీకా వేయించుకుని రావాలంటే!!’

          కనకమ్మ ముఖంలో అలసట బాగా కనిపిస్తూ ఉంది. జాలి వచ్చేసింది వారికి ఆమె పట్ల!

          పుట్టపర్తి కాఫీ తాగటం అయింది. పోనీ తానే ఆ స్కూల్ కేదో పోయి యీ ఉత్సవం చూసొస్తే?

          తానింతవరకూ విహరించి వస్తున్న విజయనగర చరిత్రకూ, నేడు ఇప్పుడిక్కడ అనుభవంలోకి వస్తున్న వాస్తవానికీ ఎంత దూరం? అక్కడ గడిచిపోయిన చరిత్రకు కాస్త సృజనాత్మకత తోడై రసవత్తర సాహిత్యం ఆవిష్కృతమౌతుంది. ఇప్పుడిక్కడి యీ వాస్తవం, రేపటి భావికి పునాది కాబోతుందా? అవుననే అనిపిస్తున్నది పుట్టపర్తికి.  

          అందుకే ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే నవ్వు తెప్పించాయేమో, పుట్టపర్తి పెదవులు విచ్చుకున్నాయి.

          ‘తానూ వాస్తవ జీవితంలోకి  అప్పుడప్పుడైనా వెళ్ళి వస్తుండవలె.’ అనుకుంటూ, నాగ చెయ్యి పట్టుకుని బయలుదేరారు పుట్టపర్తి సీతారామయ్య స్కూల్ కు!

          ఎన్నడూ లేనిది, యీ విధంగా భుజాన తువ్వాలుతోనే కూతురు చెయ్యి పట్టుకుని బైటికి వెళ్తున్న భర్తను చూసి ఆశ్చర్యపోవటం కనకవల్లి వంతైంది.

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.