కాదేదీ కథకనర్హం-12

 ఈ తరం అమ్మాయిలు

-డి.కామేశ్వరి 

         “డోంట్ బి సిల్లీ మమ్మీ” రోజుకి పదిసార్లు తల్లితో అనే ఆ మాట ఆ రోజూ అంది ప్రీతి. డ్రస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ.

         రోజులా వోరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతుంది. ప్రతీదానికి డోంట్ బి సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్ధం, ఇంగ్లీషు నీకా కాదు వచ్చు! నీవేం చేస్తున్నా వూరుకుంటే సిల్లీ కాదన్నమాట! ఆవేశంగా అంది.

         తల్లి కోపానికి కాస్త తగ్గినా, ఏమిటి మమ్మీ ఇప్పుడేమయిందని ఈ గొడవ విసుగ్గా అంది ప్రీతి.

         “శలవు వచ్చేసరికల్లా ఏమిటీ తిరుగుడు అంటున్నాను. ప్రతీసారీ ఈ పిక్నికులు, పార్టీలు, సినిమాలు వీటికి అంతులేదా —-ఎప్పుడో ఏదో ఓసారి సరదాగా వెళ్ళడం సరే, వారంవారం ఏమిటీ తిరుగుడు . పోనీ ఆడపిల్లలతో అంటే సరే, ఈ మగపిల్లలతో ఈ తిరుగుళ్ళు నాకిష్టం లేదు. ఖచ్చితంగా తన అఇష్టాన్ని చెప్పింది.

         “ఓహో , అదీ నీ అసలు గొడవ — ఆడపిల్లలతో తిరిగితే నీకేం అభ్యంతరం లేదన్నమాట నేనెక్కడికి వెళ్ళినా! హేళనగా అంది ప్రీతి.

         ఆడపిల్లతోనైనా సరే అస్తమానూ ఇలా తిరగడానికి వీలులేదు . శలవు వస్తే కాస్త చదువుకోడం లేదు. ప్రతి ఆదివారం పిక్నిక్కులు, సినిమాలు ఏమీటిదంతా. ఇదంతా చాలదన్నట్టు బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరుగుతుంటే అభ్యంతరం కాకపొతే ఏమిటి?

         “ఎందుకట అభ్యంతరం’ తల్లితో రెట్టించింది.

         ‘ఆడపిల్లవు వయసు వచ్చిన పిల్లవి కాబట్టి” సుజాత కోపంగా అంది.

         “తిరిగితే ఏమవుతుంది ఏం” ప్రీతి మాటల్లో వ్యంగ్యం.

         “ఏమనకూడదనే వద్దనడం నీవేం చిన్న పిల్లవనుకుంటున్నావా– ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుళ్ళు పనికిరాదని చెప్తున్నాను.

         “మమ్మీ డోంట్ బి సిల్లీ! ఐనో మైలిమిటేషన్స్, నా జాగ్రత్తలు నాకు తెలుసు. సరదాగా తిరిగితే చెడి పోయినట్టే అనడం …..ఇట్స్ యువర్”

         “ఆగిపోయావెం అను. ఇట్స్ యువర్ స్టుపిడ్ టి పులిష్ నెస్…..నీకొచ్చిన పదాలన్నీ వాడి —

         ప్రీతి ఇంకేం అనేదో వాదించేదో కాని బయట నించి హరన్ విన్పించింది. దాంతో పాటు ‘స్మృతి’ హాయ్ ప్రీతి ఆర్ యు రెడీ అనుకుంటూ బాబ్డు హెయిర్ ఎగదోసుకుంటూ లోపలికి వచ్చింది హాయ్ అంటీ అంటూ సుజాతని పలకరించి ఓ నవ్వు పారేసింది. బయట నిలబడ్డ మారుతీ వేన్ లో శర్మద, లావణ్య అపూర్వలతో పాటు నిక్కీ నిఖిల్, డ్రైవింగ్ సీట్ ముందు సంజయ్ ఉన్నాడు. అయిదుగురు అమ్మాయిలూ, ముగ్గ్రురు అబ్బాయిలన్న మాట! విక్కీ స్మృతి అన్న …..నిఖిల్ లావణ్య కజిన్ — సంజయ్ శర్మద అంకుల్ —-అంతా ఒకే కాలేజీలో చదువుతున్న వారే. ఇంటికి వచ్చిపోతుండే వాళ్ళే!

         ఆయామ్ రెడీ, కమాన్ లెటజ్ గో! అంటూ భుజాన పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఓ చేతిలో గాగుల్స్ మరో చేతిలో తల్లిని వేధించి చేయించుకున్న పూరి, కూర వున్న హాట్ క్యారియర్ తో తల్లి వంక చూడకుండానే బయటికి నడిచింది ప్రీతి.

         ‘బై అంటీ’ అంటూ పరుగెత్తింది స్మృతి.

         నిస్సహాయంగా చూస్తూ నిలబడింది సుజాత గుమ్మంలో. ఎర్రబడ్డ మొహంతో నిలబడ్డ భార్యని చూస్తూ లోపల్నించి పేపరుతో వచ్చిన కేశవరావు ఏమిటలా నిలబడ్డావు ఏం చేస్తున్నావు అన్నాడు.

         “మీ అమ్మాయి వేషాలని” విసురుగా అంది.

         “ఏం చేసింది మా అమ్మాయి” నవ్వాడు.

         “అలా నవ్వండి. ఏదో గొప్ప అనుకుంటున్నారు పిల్లల్ని అలా ఎంకరేజ్ చెయ్యడం, ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఆ నవ్విన దాని ఫలితం ” కోపంగా అంది.

         ‘గోరంతని కొండంతలుగా ఊహించకోయ్, ఇప్పుడెం జరిగిందని అంత భయపడ్తు న్నావ్. ఈ ఏజ్ లో కాకపోతే యింకేప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. రెస్పాన్స్ బిలీటీస్ లేని ఈ రోజులు మళ్ళీ వస్తాయా జీవితంలో. నీ చిన్నతనం గుర్తు తెచ్చుకో.”

         ‘ఆ గుమ్మం దాటితే మా నాన్నాగారి చెవిలో ఊదేది మా బామ్మ. కాలేజి నుంచి రావడం అరగంట ఆలశ్యమైతే సవాలక్ష ప్రశ్నలు వేసేవారు. ఇలా అబ్బాయిలతో పిక్నిక్కులు వెళ్ళడం కూడా మాకు.’

         “నీకూ, ఈ తరానికి ముప్పై ఏళ్ళ డిఫరెన్స్ వుందన్నమాట మర్చిపోకు అయినా అందరూ కల్సి సరదాగా తిరుగు తున్నారు కానీ, ఇదొక్కటే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళడం లేదుగా. ఏదో పెళ్ళయ్యే వరకే ఈ ఫ్రీడం . పొనిద్దూ…..”

         ‘అలా అంటూ మీరు దాన్ని సైడ్ చేస్తుండబట్టే నా మాటంటే దానికి అసలు లెక్క లేకుండా పోయింది. ఏం అన్నా డోంట్ బి సిల్లీ, డోంట్ బి స్టుపిడ్ అంటూ వెధవ మాటలు….

         నవ్వేశాడు కేశవరావు, “మరి బోలెడు ఖర్చు పెట్టి కాన్వెంటు చదువులు చదివించు కున్నందుకు ఆమాత్రం ఇంగ్లీషు మాట్లాడొద్దు” హాస్యంగా అన్నాడు. “అయినా నీవూరికే వర్రీ అవకు సుజా. ఈ కాలం పిల్లలు మీకాలం అమ్మాయిలా తెలివి తక్కువవాళ్ళు కాదు. ఎంతవరకు గార్డు చేసుకోవాలో తెల్సు వాళ్ళకి.”

         “సరే మీకంత నిశ్చింత అయితే నాకేం పోయింది. ఇలా తిరగడానికి ఫ్రీడం ఇచ్చి అది రేపు ఏ తలమాసినవాడినో కట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు” సుజాత కోపంగా అని వెళ్ళిపోయింది. కేశవరావు నవ్వుకుని పేపర్ లో తల దూర్చాడు.

***

         కూతురి ధోరణి చూస్తుంటే సుజాతకీమధ్య భయంగా వుంటున్నది. యూనివర్శీటీలో చేరిం దగ్గర నించి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువై పోయారు. బిఏ వరకు ఉమెన్స్ కాలేజీలో చదవడం వల్ల యిన్నాళ్ళు ఆడపిల్లలతోనే స్నేహాలు, ఇళ్ళకి రావడాలు పోవడాలు ఉండేవి. ప్రీతి ఈ కాలం పిల్లలకి ఏం తీసిపోదు ఏ విషయంలోనూ, రోజుకోరకం డ్రస్సులు, మిడీలు, స్కర్టులు , చుడీదార్ , కమీజులు , జీన్స్ ఫ్యాట్ బాబ్డు హెయిర్ , మాటకోసారి హాయ్, యా అనడాలు, ఫ్రెండ్స్ పార్టీలు పిక్నిక్ లు ఓ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా వుంటుందో అలా స్మార్టుగా వుంటుంది. తయారవడం, మాట ఐడియా అన్నీ కాస్త వున్న వాళ్ళ అమ్మాయికి ప్రతీకగా వుంటుంది. స్మార్టు నెస్ మాటల్లోనే కాక చదువులో, గేమ్స్ లో అన్నింటిలో చూపించడంతో తల్లిదండ్రులు కూతురి గురించి అంత పట్టించుకోలేదు. తెలివిగా చదువుతుంది. స్మార్టుగా వుంటుంది. ఈ కాలం  పిల్లల్లో కల్సి మేల్సి వుండాలంటే ఇవన్నీ తప్పవు అనుకునేది సుజాత. కేశవరావు ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అవడం, యిద్దరే పిల్లలు అవడంతో పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. బంగళా – కారు. ఇంట్లో టీవీలు , ఫ్రిజ్ లు , వీడియోలు, ఎయిర్ కండిషనుల మోడర్న్ లైఫ్ కి కావాల్సిన హంగులు ఇంట్లో అమరడం, తల్లి దండ్రులు తమ కోరికలు తీర్చగలిగిన స్థాయిలో , హోదాలో వుండడంతో ప్రీతి ముందు నుంచి జాలీ లైఫ్ కి అలవాటు పడింది. తెలివైనది కావడం వల్ల ఒక్కసారి చదవడంతో సరిపోయేది. మిగతా టైము నవల్సు, వీడియోలు, ఫ్రెండ్స్ పార్టీ అంటూ తిరిగేది. చదువు నిర్లక్ష్యం చేయ్యకపోవాడంతో ఇన్నాళ్ళూ సుజాత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాదిగా యునివర్శీటీలో చేరిం దగ్గరనించి మగపిల్లల స్నేహాలు, మగ పిల్లలతో తిరగడాలు సుజాతకి నచ్చలేదు. ఎంత ఆధునికత అయినా ఇంకా ఈ దేశంలో బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే ఎవరూ హర్షించరు అని సుజాత కి తెలుసు. అంతేకాక ఇలా స్నేహాలతో మొదలుపెట్టి , తరువాత లవ్ ఎఫైర్ల కి దిగి తరువాత తమ కులం గోత్రం లేనివాడిని, ఏ ఉద్యోగం సద్యోగం లేనివాడినో కట్టుకుంటానంటే —- అదీ సుజాత  భయం! ఒక్కగానొక్క పిల్ల — బాగా చదువు , ఉద్యోగం పెద్ద హోదా అంతస్తు అన్నీ వున్న ఇంట్లో పడేయాలని తల్లిదండ్రులుగా తమ కోరిక! ప్రీతి చక్కగా స్మార్టుగా వుంటుంది. చదువుంది. తండ్రికి హోదా వుంది. మంచి సంబంధాలు రాక ఏం చేస్తాయి . ఇప్పుడిలా ప్రీతిని యిష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏ తలమాసిన వాడినో కట్టుకుంటానంటే అప్పుడేం చేసేట్టు! ఎప్పుడేక్షణంలో ఏదన్నా వీక్ మూమెంట్ లో జరగరానిది జరిగితే! సుజాత అందుకే కూతుర్ని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రీతి ఇన్నాళ్ళు అలవాటుపడిన ఫ్రీడం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో తల్లి కూతుళ్ళ మధ్య వాగ్యుద్దాలు తలెత్తుతున్నాయి ఈమధ్య తరచూ. సుజాత ఏదో అనడం — ప్రీతి నిర్లక్ష్యంగా దులపరించడం మామూలు అయ్యింది. కేశవరావు చూసీ చూడనట్టు వూరుకోడం. మరో సారి భార్యకి నచ్చచెప్పడం, మరీ మితి మీరిందన్నప్పుడు కూతుర్ని కాస్త మందలిం చడం చేస్తూ సర్దుకోస్తున్నాడు.

         ప్రీతికి తల్లిదంతా చాదస్తంగా , తల్లి భావాలు సిల్లీగా తల్లి ఆలోచనలు స్టుపిడ్ గా, క్రోడ్ గా అనిపిస్తున్నాయి. తమ కాలంలోలా ఇంట్లో పడి వుండాలి. కాలం మారినా మనుష్యులు మారరేం! డిగ్రీ వున్న అమ్మాయిలా ఆలోచిస్తుందేం. బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే తప్పా! నలుగురు సరదాగా ఏ సిన్మాకో వెళితే అంత రాద్దాంతం ఎందుకు? సినిమాకి అబ్బాయిలతో వెళ్ళితే కొంపలు మునిగిపోతాయా , ఎంజాయ్ చెయ్యకుండా పుస్తకాల పురుగుల్లా ఇంట్లో కూచుని చదవాలా ఇరవై నాల్గు గంటలు! అప్పుడే బుద్ది మంతురాలి కింద లెక్క—ఈ మమ్మీలంతా ఇంతే ఎప్పుడూ – డాడీనే నయం కాస్త! ప్రీతి ఆలోచనలలా వుంటాయి!

***

         ఆ రోజు టేబిల్ మీద గుట్టలా పడివున్న పుస్తకాలు సర్దుతుంటే ఓ పుస్తకం లోంచి జారిపడ్డ రెండు మూడు ఫోటోలు చూసి చాకితురాలైంది సుజాత. మొన్న పిక్నిక్ వెళ్ళినపుడు తీసుకున్నవి కాబోలు. ఓ ఫోటోలో అందరూ గ్రూప్ గా అమ్మాయిల మధ్య అబ్బాయిలూ , అబ్బాయిల పక్కన అమ్మాయిలూ కూర్చుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని తీయించుకున్నారు. మిగతా రెండు ఫోటోలు విక్కీ, ప్రీతీ ఇద్దరూ, ఒకదాన్లో ఒకరి నడుం ఒకరు పట్టుకుని , రెండో దాన్లో విక్కీ, ప్రీతి భుజాల చుట్టూ చెయ్యి వేసి చాలా దగ్గరగా , క్లోజ్ గా కనిపిస్తూ తీయిన్చుకున్నవి. సుజాత మొహం ఎర్రబడింది. ఎంత ధైర్యం దీనికి! ఇంత క్లోజ్ గా ఇంత చనువుగా ఇలా ఫోటోలు తీయించుకునే వరకు వెళ్ళిందన్న మాట వీళ్ళ పరిచయం— పరాయి మగపిల్లలతో భార్య భర్తలు తీయించుకున్నంత చనువుగా ఫోటోలు తీయించుకుంటుందా! విసవిస ఫోటోలు పట్టుకుని ఆఫీసుకి తయారవుతున్న కేశవరావు దగ్గరికి వచ్చింది.

         చూడండి …..ఇవి చూడండి నే చెబితే నా మాట తేలిగ్గా కొట్టి పారేస్తారు — దీని వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూడండి ఆవేశంగా అంది ఫోటోలు విసురుగా అతని ముందు పడేసి.

         ఏమిటీ ఏమయింది టై బిగించుకుంటూ ఫోటోల కేసి చూశాడు.

         చూశారా ఎంజాయ్ చేయనీ, చిన్నపిల్లలు, ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు సరదాలు అంటూ నానోరు మూయించారు. ఇప్పుడేమంటారు. కోపంగా నిలేసింది. ఫోటోలు చూసి ఒక్క క్షణం కేశవరావు నుదురు చిట్లించాడు. అతనికి కూతురు అలా అబ్బాయిలతో అంత క్లోజ్ గా ఫోటోలు తీయించుకున్నందుకు కాస్త షాక్ లాంటిది కల్గింది. ఏదో ఒక్క ఫేమీలీలా మసులుతున్నారు వాళ్ళ గ్రూప్ అందరూ. సరదాగా తీయించుకుని వుంటారు. అనవస రంగా మరీ టూమచ్ గా అలోచించి వర్రీ అయ్యేందుకు నాకేం కనపడలేదు. మొహంలో భావం ప్రసన్నంగా మార్చి అన్నాడు. తేలిగ్గా తీసుకున్నట్టు. భార్య దగ్గర తన భావం బైటపడితే ఇంకా సాధిస్తుందని అతని భయం.

         ఇంకా కూతుర్ని వెనకేసుకోస్తున్నారా? ఈ ఫోటోల్ని ఎవరన్నా ఏ మొగుడు పెళ్ళాలనో అనుకుంటారు గాని ఫ్రెండ్స్ ని , సరదా అని ఎవరూ అనుకోరు. మీకు కూతురి మీద ప్రేమతో కళ్ళకి పొరలు కమ్మేశాయి. ఇలాగే వూరుకోండి . నాకేం బాధ మధ్య.

         అబ్బ, సరే వేల్దువు. వూరికే గొడవ చేయకు. రాత్రి ప్రీతిని పిలిచి అలా చెయ్యకూడ దని చెప్తాను. నీవూరికే దాంతో గొడవపడకు. బూట్స్ లేస్ బిగించి లేచి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు.

         రాత్రి భర్త ప్రీతితో మాట్లాడేవరకూ ఓపిక పట్టే ఓర్పూ లేకపోయింది సుజాతకి. సాయంత్రం విక్కీ మోపెడ్ మీద నించి దిగి ఉషారుగా ఇంట్లోకి వస్తోన్న ప్రీతిని చూసే సరికి ఆవేశం పట్టలేకపోయింది. చరచరా ప్రీతి వెనకాతల ఫోటోలు పట్టుకుని ఆమె గదిలోకి వెళ్ళింది. ప్రీతి! గట్టిగా పిలిచింది సుజాత కోపంగా.

         ప్రీతి వెనక్కి తిరిగి, తల్లి కోపం అర్ధం కానట్టు చూసింది . అంతలోనే తల్లి మంచం మీదకి విసిరిన ఫోటోలు చూసి కాస్త గతుక్కుమంది.

         “ప్రీతి , ఏమిటీ ఫోటోలు – సిగ్గులేకుండా మగపిల్లలతో ఈ ఫోటో లేమిటి విక్కి మోపెడ్ మీద ఎందుకు వచ్చావు?” కోపంతో మాట తడబడింది సుజాతకి.

         “ఏం వస్తే! లిప్ట్ యిస్తానన్నాడు. తనకిటే ఏదో పనివుండి వస్తున్నానంటే వచ్చాను తప్పా. ఎందుకలా చూస్తావు?” ప్రీతి విసురుగా జవాబిచ్చింది.

         “ఈ ఫోటోలేమిటి?”

         “మొన్న పిక్నిక్ లో సరదాగా తీసుకున్నాం” ప్రీతి నిర్లక్ష్యంగా అంది.

         “మగపిల్లలతో కౌగలించుకుంటూ ఫోటో తీయించుకోడం సరదానా?”

         ‘అబ్బ ఏమిటి మమ్మీ! ఫ్రెండ్స్ తో తీయించుకుంటే తప్పేం వుంది. విక్కీ ఏం కొత్తవాడా” విసుగ్గా మొహం పెట్టి అంది.

         “నీకు ఏళ్ళు వస్తున్నాయిగాని బుద్ది రావడం లేదు. చెపుతున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. వయసు వచ్చిన పిల్లవి. మగపిల్లలతో ఈ స్నేహలేమిటి? ఈ తిరుగుల్లెమిటి? ఈఫోటోలు ఎవరన్నా చూస్తె ఏమనుకుంటారు?’ తీక్షణంగా అంది.

         “ఏం అనుకుంటారు ‘ రెట్టించింది తల్లి వంక హేళనగా చూసి.

         సుజాత కూతుర్ని మింగేసేట్టు చూసింది. “ఏం అనుకుంటారా నిన్నో మొన్నో పెళ్ళయిన జంటో, రేపో మాపో చేసుకోబోయే జంటో అనుకుంటారు.”

         ‘పోనీ అనుకోనీ నాకేం నష్టం లేదు.”

         “నీకెందుకు నష్టం. ఎవరేం అనుకుంటే నీకేం బాధ – నిన్ను కన్నందుకు మాకు బాధ, అవమానం గాని ఇవాళ ఫోటోలు. మోపెడ్ మీద తిరగడం వరకూ వచ్చింది . రేపు ఇంకా ఏం చేస్తావో.’

         “ఏం చేస్తానని నీ ఉద్దేశం!” ప్రీతి తల్లి వంక చురచుర చూసింది. సుజాత కాస్త తడబడింది.

         “ఏమన్నా చేస్తావు. అన్నింటికి తెగించిన దానివి. మన కులం, గోత్రం లేని వాడిని తీసుకొచ్చి పెళ్ళాడుతానంతావు.’

         ప్రీతి నిర్లక్ష్యంగా నవ్వింది. “నే పెళ్ళాడాలంటే కులం గోత్రం చూడను. నే చేసుకోవాలంటే మీ దగ్గర కొచ్చి అడగను లే – చేసుకునే తీసుకువస్తాను. “పొగరుగా అంది” బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంటూ.

         సుజాత పెదాలు అదిరాయి. కూతురలా కుండబద్దలు కొట్టి చెప్తుంటే యింకేం అనాలో తెలీలేదు. విక్కీ పంజాబీ, తల్లి క్రిస్టియను వాడిని పెళ్ళాడుతుందా కొంపదీసి. అందుకే అంత చనువు పెంచుకుంటుందా. ప్రేమిస్తుందా వాడిని. ఈ తిరుగుళ్ళు యింతవరకు వెళతాయని తనకు తెలుసు. అందుకే ముందే జాగ్రత్త పడాలంటే అయన మాట నిర్లక్ష్యం చేసి పారేశారు. కానీ, ఇప్పుడు ఏం జవాబు చెబుతారో.

         “నేను వచ్చి సాయంత్రం మాట్లాడుతానంటే నీకెందుకు అంత తొందర. దాన్నేదో అని వుంటావు. అది నోటి కొచ్చినట్టు వాగి వుంటుంది. “కేశవరావు విసుగ్గా అన్నాడు పెళ్ళాం కంప్లయింట్ విని.

         “తొందరేమిటండి — మోపెడ్ మీద నడుం చుట్టూ చేతులు వేసుకు కూర్చుని వస్తే చూస్తూ వూరుకోమంటారా”

         “నీవూరికే గొడవ చెయ్యకు నేను దానితో మాట్లాడుతానులే.’

         “నా గొడవ కాదు. చేతులు కాలాక ఆకులూ పట్టుకుని లాభం వుండదని గ్రహించి మేల్కోండి.”

         “ప్రీతి” అసహనంగా పిల్చాడు కేశవరావు భార్య యిచ్చిన “కీ” తో కిర్రెక్కింది అతనికి.
టీవీ చూస్తున్న ప్రీతి తండ్రి రెండుసార్లు పిలిచాక లేచి వెళ్ళింది. తల్లి దండ్రుల మొహాలు గంబీరంగా వుండడం చూసి తల్లి తండ్రితో కంప్లైంట్ చేసిందని అర్ధం చేసు కుంది. కాస్త మనస్సు చెదిరింది.

         తండ్రి మొహం అలా ఎప్పుడూ చూడలేదు.

         “ప్రీతి అలా కూర్చో — నీతో కొంచెం మాట్లాడాలి” గంబీరంగా అన్నాడు కేశవరావు. ‘చూడు ప్రీతీ నీకు చిన్నప్పటినించి అన్ని విషయాలలోనూ ఫ్రీడం ఇచ్చాం అవునం టావా.’

         “ఎస్ డాడీ” ప్రీతి ఈ సంభాషణ ఎటు దారితీస్తుందా అనుకుంటూ బుద్దిగా అంది.

         ‘మరి నీ మీద మేము నమ్మకం వుంచి యిచ్చిన స్వేచ్చని నీవు దుర్వినియోగం చేయొచ్చా. నీకు ఏది కావాలంటే అది కొన్నాం. ఏం చదువుతానంటే అదే చదవమన్నాం—- ఏ బట్టలు కావాలంటే అవే కొన్నాం. గిటార్ నేర్చుకుంటానంటే సరే అన్నాం. మా కిష్టం లేకపోయినా చక్కని జుట్టు కత్తిరించుకున్నా వూరుకున్నాం. నీ ఫ్రెండ్స్ తో పార్టీలు, షికార్లు, తిరిగినా ఎప్పుడూ వద్దనలేదు. అవునా, కానీ ప్రీతి దానికీ ఒక లిమిట్ ఉంటుంది. నీవిప్పుడు ఆ లిమిట్ దాటిపోయావు అనిపించడం లేదా నీకు” శాంతంగా స్థిరంగా అడిగాడు.

         “నేనేం చేశాను డాడీ” అమాయకంగా చూసింది.

         “ఈ ఫోటోలేమిటి మరి” ఇలా మగపిల్లలతో ఇంత క్లోజ్ గా మూవ్ అవడం తప్పు కాదనుకుంటూన్నావా! మీ అమ్మ చెప్తుంది. ఇవాళ విక్కీ మోపెడ్ మీద వచ్చావుట.’

         “ఫ్రెండ్లీగా ఫోటోలు తీయించుకోవడం తప్పేనా? విక్కీ యిటు వస్తుంటే బస్సు కోసం వెయిట్ చేయడం ఒకరోజన్నా తప్పుతుందని వచ్చాను. అదీ తప్పేనా” కళ్ళనీళ్ళు తిరుగుతుండగా ఉక్రోషంగా అంది.

         “ఫ్రెండ్లీగా వుండొచ్చు ప్రీతీ! కానీ ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య స్నేహనికి కొన్ని లిమిట్స్ వున్నాయి. అబ్బాయి, అమ్మాయి ఇలా క్లోజ్ గా తిరిగితే జరిగే అనర్ధం నీకు తెలియనంత చిన్నదానివి కావు కదా. మేం కన్నవాళ్ళం కనక నీవు తప్పడగు వేయకూడ దని నీ బాగుకోసమే కొన్ని అంక్షలు పెడతాం. అది గుర్తించకుండా మీ అమ్మతో ఏవేవో ఇష్టం వచ్చినట్లు అన్నావుట.”

         “మమ్మీ నన్ననవసరంగా ఇరిటేడ్ చేసింది. ‘తల్లి వంక చురచుర చూస్తూ అంది.

         “ఏమిటే అనవసరంగా ఇరిటేడ్ చేయడం. ఎందుకని అడగడం తప్పా” సుజాత గయ్యమంది.

         “అబ్బ నీ వుండు సుజా! నే మాట్లాడురున్నాగా . మమ్మీ ఏం అన్నా నీ మంచి కోసమేగదా. చూడు విక్కీ మంచి పిల్లాడే అవొచ్చు కాని మనది వాళ్ళది భాష, కులాలు, మతాలూ అన్నీ వేరు. మనకి వాళ్ళకి కలియదు. ఇంతకీ విక్కీ చదివేది బి.కాం ఏం చదువుతాడో , ఏం ఉద్యోగం చేస్తాడో .”

         “డాడీ విక్కీ తో ఫోటో తీయించుకుంటే పెళ్ళి చేసుకుంటాననేనా అర్ధం” సూటిగా చూసింది.

         “ఆ అర్ధం లేకపోతే మంచి మాటే. కాని మీ అమ్మతో ఏదో అన్నావట.’

         ‘అవసరమైన ఐడియాలు మమ్మీయే ఫీడ్ చేస్తుంది. నాకు ఇప్పుడసలు – నేనేం పెళ్ళి చేసుకుంటాననలేదు” ప్రీతి కోపంగా అంది.

         “సరే నీవు చదువుకున్న పిల్లవి వయసు వచ్చింది నీ మంచి చెడ్డా ఆలోచించు కోవాలి ఓ స్టెప్ వేసేముందు నీ మనసులో ఏ చెడ్డ ఆలోచనలు లేకపోయినా ఇంత స్వేచ్చగా మగపిల్లలతో తిరిగితే మన సొసైటీ హర్షించదు. సొసైటీ సంగతి అలా వుంచి ఓ వయస్సులో వున్న అబ్బాయి అమ్మాయి మరీ క్లోజ్ గా తిరిగితే పరిణామాలు ఎలా మారతాయో చెప్పలేం. నీ మంచి కోసమే తల్లిదండ్రులుగా చెప్పడం మా బాధ్యత. సో యూ కీపిట్ అల్ దిస్ ఇన్ యువర్ మైండ్  “ఈ కాలం పిల్లతో ఇంతకంటే చెప్పనవసరం లేదు. కొట్టి తిట్టి చెప్పే రోజులు కావని తెల్సిన కేశవరావు అంతటితో ముగించాడు. తల్లి వంక చురచుర చూసి బయటికి వెళ్ళిపోయింది ప్రీతి.

         “మనం ఇంక ప్రీతికి సంబంధాలు చూడ్డం మంచిది. ఈ ఎమ్మే అయ్యేలోగా చూస్తుంటే పరీక్షలవగానే చేసేద్దాం. పరిస్థితి చెయ్యి దాటకముందే మనం మన బాధ్యత తీర్చుకుంటే మంచిది. మీ దగ్గర భయానికి అలా అంది కాని దాని ధోరణి చూస్తె ఏ నిమిషంలో ఏం చేస్తుందో అని భయంగా వుంది నాకు.”

         ‘సుజా నీతో వచ్చిన ప్రాబ్లం అనవసరంగా వర్రీ అయిపోవడం, ఏదేదో ఊహించు కుని…..ఇంక ఇరవై ఇకటన్నా నిండలేదు. ఎమ్మే అవనీ ఆలోచిద్దాం పెళ్ళి సంగతి’ కాస్త అసహనంగా అన్నాడు.

         సుజాత అప్పటికి ఊరుకున్నా కూతురి పెళ్ళి ఈ ఏడాదిలోగా చేసెయ్యడం మంచిదన్న ఆలోచన ఆమె మనసుని తొలుస్తూనే వుంది. అక్కకి అన్నకి కూతురికి మంచి సంబంధాలు చూడమని ప్రీతి ఫోటోలు డిటైల్స్ పంపింది.

         నెలరోజుల తర్వాత వీళ్ళ వాళ్ళు రాసిన ఆరేడు సంబంధాలలో ఇద్దరు అన్ని విధాల బాగున్నవి సెలక్టు చేసి భర్తకి చూపింది. “ఇప్పుడే మొదలుపెట్టావా దాని చదువవనీ అన్నానా. దాన్ని ఫైనల్ ఇయర్ లో డిస్ట్రబ్ చేయడం నా కిష్టం లేదు.”

         ‘అబ్బ మంచి సంబంధాలండి. ఈ అబ్బాయి ఐఏఎస్ ఎంత పొడుగ్గా స్మార్టుగా వున్నాడో చూశారా. ఫాదర్ మదర్ ఇద్దరూ డాక్టర్లు” మంచి ఫామిలీ. ఈ రెండో అబ్బాయి ఏమ్ టెక్ చేసి ఎంబీయే చేసి డిల్లీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు. తండ్రి మంచి హోదాలో వున్నాడు. ఇద్దరూ ఎంత బాగున్నారో , మన ప్రీతికి ఈడూ జోడు బాగా కుదురుతుంది. సంబంధం చూసి నిశ్చయం అయితే, పెళ్లి పరీక్షలయ్యాక చేయొచ్చు. అసలు ముందు మీ అమ్మాయి గారు ఏమంటుందో . ఇంత మంచి సంబంధాలు కావాలన్నప్పుడు దొరుకుతాయా అసలే తిక్కది ఏం అంటుందో అని భయంగా వుంది.

         “ఫోటోలు చూపించి అభిప్రాయం అడుగు. అది ఇప్పుడే చేసుకోనంటే మనం బలవంతంగా చెయ్యలేం కదా అడిగి చూడు.”

         “మీరే అడగకూడదా. నాకు తిక్క సమాధానాలు ఇస్తుంది. వీళ్ళెం నచ్చలేదు నాకు అనేస్తుంది పొగరుగా.”

         ‘అబ్బ అన్నింటికి నీకు అనుమానాలే —- తల్లివి నీవడగాలి కూతుర్ని — అది అలా అంటే నేచేపుతాలే. అడిగి చూసి తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

         “ప్రీతీ , ఇదిగో ఇలారా. ఈ రెండు ఫోటోలు చూడు మామయ్యా పంపించాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక” డ్రాయింగు రూములో కూర్చుని సౌమ్యంగా పిల్చింది కూతుర్ని సుజాత. “ఏం ఫోటోలు మమ్మీ’ ప్రీతి కుతూహలంగా దగ్గరికి వచ్చి కూర్చుని ఫోటో చేతిలోకి తీసుకుంది.

         “మమాయ్య నీ కోసం ఈ పెళ్ళి కొడుకుల ఫోటోలు పంపాడు. ఇదిగో ఈ అబ్బాయి ప్రీతమ్ ఐఏఎస్ . రెండోది అజయ్ శర్మ ఇంజనీర్” తల్లి వివరాలు చెప్తుంటే ప్రీతి ఇంటరెస్టు గా పొటోలు చూస్తూ వింది.

         “ఓ యింటరెస్టింగ్ , బొత్ ఆర్ స్మార్టు గైస్. ఎస్ ఫేషన్ల ఈ ఇంజనీరు బాగున్నాడు కదూ” మమ్మీ వైట్ స్మార్టు.”

         ‘నీకు నచ్చాడా , అయితే మామ్మయ్యని వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మనమని చెప్పమంటావా” కూతురు అంత సుముకంగా మాట్లాడుతుందని ఎదురు చూడని సుజాత సంబరంగా అంది.

         “ఐ డోంట్ మైండ్ సీయింగ్ హిమ్ ప్రీతి” అంది.

         ‘అమ్మా తల్లీ బతికించావు ఇంకా ఏమంటావో ఒప్పుకోకపోతే ఇంత మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు గదా అనుకుంటున్నాను” పెద్ద బండరాయి దిగినంత తేలిగ్గా నిట్టూర్చి ఆనందంగా అంది.

         “ఏం ఎందుకు ఒప్పుకోను నాకు నచ్చితే” ప్రీతి సందేహంగా చూసింది.

         “ఏమో నీవు నీ బాయ్ ఫ్రెండ్స్, నీ ధోరణి చూసి అనుమానం వచ్చింది.’

         డోంట్ బి స్టుపిడ్ మమ్మీ” తన మామూలు ధోరణిలో అంది ప్రీతి ఎప్పటిలా నవ్వి.

         ఈసారి ఆమాటకి కోపం రాలేదు సుజాతకి. తను నిజంగా స్టుపిడే! ఈ కాలం పిల్లల తెలివి ముందు తమ తరం వాళ్ళు నిజంగా స్టుపిడ్స్ , ఈ కాలం పిల్లలకి తమకేం కావాలో తమకి తెలుసు! వీలున్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చెయ్యడమూ తెలుసు! లైఫ్ లో సుఖపడడానికి తమకేం కావాలో కూడా తెలుసు. బాయ్ ఫ్రెండ్స్ తిరగాడానికేనని పెళ్ళికి గావాల్సింది జీతం, హోదా , సుఖం అన్న సంగతి ఈకాలం పిల్లలకి ఎంత బాగా తెలుసు తను స్టుపిడ్ అయినా కూతురు స్టుపిడ్ కానందుకు ఆ తల్లికి ఆనందమే కల్గింది ఆ క్షణంలో.

(ఉదయం వారపత్రిక )

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.