జంట కవులు పింగళి-కాటూరి ‘సంక్రాంతి’ ని వర్ణిస్తూ ఇలా చెబుతారు:
‘పచ్చపూల జనుప చేలకు ముత్యాలసరులు గూర్చి
మిరపపండ్లకు కుంకుమ మెరుపు దార్చి
బంతిపూల మొగములు అల్లంత విచ్చి
మన గృహమ్ముల ధాన్య సంపదలు నిల్పి
సరసురాలైన పుష్యమాసము వచ్చే’ .
సాతాని జియ్యరు మేలుకొలుపు పాట పాడుతూవుంటాడు . కుంకుమ పసుపుతో గొబ్బెమ్మ ను అలంకరించి మొక్కుకోమని, దీవెనను అందుకోమని కూతురును మేలుకో మంటారు. అన్ని పండుగల్లోని ఇది ముఖ్యమైంది కనుక అత్తవారింటికి వెళ్ళమని కొత్త పెళ్లి కొడుకుకి ఆదేశిస్తారు. తెలుగునాటన కనులపండువుగా కనపడే సంక్రాతి పండుగ దృశ్యాలకు ఒక శాశ్వతత్వం కల్పించడం కోసం మాటల్ని రంగులుగానూ, కలాల్ని కుంచెలు గానూ వాడిన విచిత్ర చిత్రకారులు అంట్యాకుల పైడిరాజు.
‘రండు మాయింటికి మీరు పేరంటమునకు
బొమ్మలెత్తును మా పిల్ల అమ్మలారా!’ అని పరమ కల్యాణి, మా తల్లి, పౌష్యలక్ష్మి’ ని పింగళి-కాటూరి ఆహ్వానిస్తే, దానికి సమానంగా పైడిరాజు చిత్రాన్ని గీశారు.
ఈ చిత్రం తెలుగుతనాన్ని చాటి చెప్తోంది. పైడిరాజు చిత్రాల మీద పాశ్చాత్త్య చిత్రకారుల ప్రభావం లేదు, దేవీప్రసాద్ రాయ్ చౌదరి సంప్రదాయాన్ని పాటించే వారు. లేపాక్షి చిత్ర సంపద ఆయన పై చెరిగిపోని ముద్ర వేయడంతో జానపద శైలిలోకి మళ్ళారు. వారి చిత్రాలకు వివరణ అనవసరం. జామినీరాయ్ స్త్రీ మూర్తుల్లో బెంగాలీ వనితలూ , ‘చందమామ’ శంకర్ బొమ్మల్లో తమిళ మొహాలూ కనిపించినట్లే – పైడి రాజు బొమ్మల్లో అచ్చమైన తెలుగు స్త్రీలు కనిపిస్తారు. తెలుగు వారి కట్టూ బొట్టూ కనిపిస్తాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. మనం మరచిపోతున్న గ్రామ జీవిత కళా శోభను తెలియబరుస్తాయి ఇవి . పల్లెటూరి ఇంటి నేపథ్యం, ఇరువైపులా పచ్చని అరటి చెట్లు , పసుపు పూసిన ద్వారబంధం ముందు వయ్యారంగా నిలబడ్డ భంగిమలో ఇంటి ఆవిడ, పేరంటానికి పిలవడానికి కుంకుమ భరిణెతో వచ్చిన ముత్తైదు వు.. మనకు ప్రత్యక్షమవుతారు. కళింగాంధ్ర కళా వైభవానికి అంట్యాల ప్రామాణం. ఆయన కి రేఖల మీదగల అభిమానం, రంగుల మీదగల పట్టూ కొట్టవచ్చినట్లు ఈ చిత్రంలో కనిపిస్తాయి.