జీవితం అంచున -27 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
క్వశ్చనేర్ పూర్తయ్యాక మొట్టమొదటగా విద్యార్థులను డోనింగ్ అండ్ డోఫింగ్ చేసి చూపమన్నారు.
డోనింగ్ ఆఫ్ PPE అంటే హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను ధరించే వరుస క్రమం అలాగే డోఫింగ్ ఆఫ్ PPE అంటే మళ్ళీ హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను విసర్జించే వరుస క్రమం.
మనం చేసే డెమోలో డోనింగ్ మరియు డోఫింగ్ల వరుస క్రమంలో తేడా రాకూడదు.
డోనింగ్ చేతి పరిశుభ్రతతో ప్రారంభమయి, మొదటగా షూ కవర్లు(అవసరమైతేనే) తొడుక్కోవటం, ఆ పైన గౌను తొడుక్కోవటం, తరువాత మాస్క్/రెస్పిరేటర్, ఆ తరువాత రక్షిత కళ్ళజోడు/ముఖ కవచం (faceshield) ధరించటం, ఆఖరుగా చేతి తొడుగులు (glouses) వేసుకోవటంతో ముగుస్తుంది.
డోఫింగ్ షూ కవర్లు (వేసుకుని వుంటే) తీసివేయటంతో ప్రారంభమవుతుంది. తరువాత గౌను, గ్లౌజులు ఒకేసారి తీసేసి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. తరువాత రక్షిత కళ్ళజోడు/ముఖ కవచం (faceshield) తీయాలి. ఆ పైన మాస్క్/రెస్పిరేటర్ ని తీసేసి చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి.
చేతుల పరిశుభ్రత (Handhygiene) ను ఇరవై సెకండ్ల పాటు పాటించవలసి వుంటుంది. ఈ ఇరవై సెకండ్లలో చేతులను ఏడు దశల్లో పరిశుభ్రంగా కడగాలి. అనుభవం వున్న ఏ నర్సయినా సహజంగానే ఏడు దశల్లో చేతులు శుభ్రం చేసుకుం టుంది. ముందుగా చేతులు తడిపి, ద్రవ సబ్బుతో బాగా నురుగును సృష్టించటం, అరచేతులను కలిపి రుద్దటం, చేతుల వెనుక భాగాన్ని రుద్దటం, చేతి వేళ్ళను ఇంటర్ లింక్ చేయటం, వేళ్ళను కప్ చేయటం, బ్రొటన వేళ్ళను శుభ్రం చేయటం, మిగిలిన వేళ్ళతో అరచేతులను రుద్దటం… ఈ క్రమంలో సరిగ్గా చేసి డెమోన్స్ట్రేట్ చేయాలి.
తరువాత పేషెంట్ బెడ్ పైన దుప్పటి పరచి చూపమన్నారు. ఖాళీ బెడ్ పైన ఒకసారి, పేషెంట్ (డమ్మీ) వుండగా ఒకసారి. పేషెంట్ ఉండగాపేషెంట్ని పెద్దగా కదిలించకుండా పక్క మీద దుప్పటి మార్చటం కూడా ఒక కళే అనిపించింది.
సిమ్యులేషన్ అంటే ఫేకింగ్… అంటే లేనిది వున్నట్టుగా నటించటం.
మేము ఒక పెద్ద ఆసుపత్రిలో ఉన్నాము. అనుకోకుండా ఆసుపత్రి గదిలో నిప్పు అంటుకుంది. అది రాజుకుని దావానలంలా కమ్ముకుంటోంది. నర్సుగా ఏం చేస్తానో నన్ను చేసి చూపించమంది కేట్.
నేనేమో ఎన్ని రకాల ఫైర్ ఎక్స్టిన్గిషర్స్వున్నాయి, ఏది ఏ సందర్భంలో వాడతారని చదివిన థియరీ గురించి ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా కేట్ గట్టిగా కేకలు వేయటం మొదలెట్టింది. దాదాపు డెబ్బయేళ్ళకేట్మమ్మల్ని అందరినీ రఫ్గా రెండు పక్కలకు తోసేస్తూ, మధ్యలో మార్గం చేస్తూ, పేషెంట్లను పట్టుకున్నట్లు, వాళ్ళను సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్టు అభినయిస్తూ రచ్చరచ్చ చేసేసింది. త్రొక్కిసలాటలో కొందరు పేషెంట్లు కింద పడిపోయినట్లు, వాళ్ళ మీదుగా మరికొందరు నడుస్తూ వారిని గాయపరుస్తున్నట్టు, తను అడ్డుకుంటున్నట్టు… వహ్… ఏమి అభినయం. ఇందులో పాసవటానికి నాకయితే ఇక్కడ విషయ పరిజ్ఞానం కన్నా ఏక్టింగ్ స్కిల్స్ అవసరమనిపించింది.
మొత్తం పదిహేను మంది విద్యార్థులం ఉన్నాము. ఆ ల్యాబ్లో ఎనిమిది సినారియోలు ఎనిమిది బెడ్స్ పక్కన కేస్ షీట్స్ లా పెట్టి వున్నాయి. ఆ ఎనిమిది సినారియోలు పాత్రలు మార్చుకుంటూ విద్యార్థులందరినీ చేయమన్నారు.
మా పదిహేను మందిలో కొందరు మహానటులు వాళ్ళ నటనా కౌశల్యంతో నన్ను అబ్బుర పరిచారు. ఇట్ వాజ్ ఫన్.
కాలికి ఫ్రాక్చర్ అయిన పేషెంట్ గా మంచం మీద ఒకరు, నర్సుగా మరొకరు. ఆ పేషెంట్ ని టాయిలెట్ కి తీసుకు వెళ్ళి వెనక్కి తీసుకురావటం ఒక సినారియో. తరువాత పేషెంట్ నర్సుగా, నర్సు పేషెంట్ గా పాత్రలు మార్చుకోవటం.
ఒక పేషెంట్ నర్సు నడిపిస్తూండగా కుప్పకూలిపోతాడు. వెంటనే స్లింగ్ తెప్పించి స్పృహ తప్పిన పేషెంట్ ని బెడ్ పైకి నర్సు చేర్చటం ఒక సినారియో.
ఒకమ్మాయి నిజంగానే స్పృహ తప్పినట్టు అమాంతం దబ్బున పడిపోతే నేను దిమ్మెర పోయాను. నర్సుగా సీరియస్సుగా కంగారు పడుతూ, ఫస్ట్ ఎయిడ్ చేయటం, స్లింగ్ లోకి మార్చటం… గొప్పగా నటించారు ప్రతి ఒక్కరూ.
ఏ మాటకా మాటే… I’m a poor actress.
స్త్రీ పురుష జననాంగాల నిర్మాణ వివరణ ఇస్తూ, ఆడ మగ బొమ్మల జననాంగాలలో కేతెటర్ పెట్టటం చూపించి మా అందరితో డెమో చేయించారు. కొందరు మగ విద్యార్థుల అమాయక చిలిపి అనుమానాలను తోటి ఆడ విద్యార్థులే తీర్చారు. ఎటువంటి సిగ్గు, బిడియం లేకుండా నిర్మొహమాటంగా టీచర్, విద్యార్థులు జననాంగాల గురించి, సెక్స్ గురించి కూడా చర్చించుకోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఒక మానసిక రోగి గదిలోకి నర్సు వెళ్ళి ఆమెకు మాత్రలు వేయాలి. ఆ మానసిక రోగి ప్రమాదకరమైనది. ఇక్కడ నర్సు తన రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేషెంట్ ని అప్ప్రోచ్ అయ్యే పద్దతి డెమోన్స్ట్రేట్ చేయాలి… ఇది ఒక సినారియో. మా టీచర్ మిస్. కేట్ నన్ను నర్సుగా రమ్మని తాను స్వయంగా మానసిక రోగి పాత్ర పోషించింది. నేను రూములోకి వెళ్ళగానే కేట్ వెర్రి వెర్రి కేకలు వేస్తూ, అక్కడ వున్న వస్తువులను చెల్లాచెదురుగా విసిరేస్తూ, పక్కనే ప్లేటులో వున్న నైఫ్ తో నా మీద మీదకు వచ్చింది. విషయం అర్ధం చేసుకోలేని నేను దిమ్మెర పోయాను. ఈ సినారియోలో నా పర్ఫార్మెన్స్ జీరో.
షేవ్ చేయటం, స్నానం చేయించటం, ఇంజక్షన్ ఇవ్వటం, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయటం, బ్లడ్షుసుగర్ చెక్ చేయటం, పల్స్ చూడటం, ఐవికేన్ల పెట్టటం అన్నీ డమ్మీల పైన డెమోలు అయ్యాయి.
షేవింగ్ కి మటుకు గుబురు గడ్డంతో వున్న ఒక విద్యార్థి బలయిపోయాడు. అందరం అతని గడ్డాన్ని తలా కాస్తా గీకాము. పాపం అతను తన లేత గులాబీ రంగులో వున్న అందమైన మొహాన్ని మాకు అప్పగించేసాడు.
కొందరు అమ్మాయిలు ప్రాక్టీసు కోసం ఇంట్లో వాళ్ళ పార్టనర్స్ కి షేవ్ చేశామన్నారు.
ఇక్కడ అమ్మాయిలు రేజర్ తో షేవ్ చేసుకోవటం నేను చూడలేదు. ఒళ్ళంతా వాక్సింగ్ లేదా వేరు వేరు శరీర భాగాల వాక్సింగ్.. అప్పర్ లిప్, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ అని రకరకాలుగా చేయించుకుంటారు. కొందరయితే ఒళ్ళంతా లేజర్ చేయించుకుని నున్నగా నిగనిగలాడుతుంటారు.
ఈ వారం రోజుల్లో కనీసం రోజుకి పాతిక ముప్పయిసార్లయినా హ్యాండ్ హైజీన్ పాటించి వుంటాను. పేషంట్ అమ్మయినా పద్దతి పద్దతే. మొత్తం మీద వారం రోజుల సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ జీవితంలో ఒక మెమొరబుల్ అధ్యాయం.
*****
(సశేషం)