డాక్టర్‌ ఫాస్టస్‌ నాటక పరిచయం

(క్రిస్టఫర్‌ మార్లో రాసిన ఆంగ్ల విషాదాంత నాటకం *డాక్టర్‌ ఫాస్టస్‌”)

-వి.విజయకుమార్

          మానవ జాతి మనుగడకు జ్ఞానమే అంతఃసారం. నిస్సారమై బీడువారి, బీటలు వారిన చీకటి సీమల్లో, అడుగు ముందుకు పడక, నడక తడబడినప్పుడల్లా, ఋజుపధికు డెవరో, తన సమాజమిచ్చిన యావత్తూ అనుభవాల, జ్ఞాన సమిధల్ని పేర్చి, వెలుగు దివ్వెగా వెలిగించి, ముందుకు నడిపిస్తాడు! వెంటే మానవజాతి నిబ్బరంగా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లిపోతుంది! ఇది సమాజ గమనం. మానవ చారిత్రిక గమన మంతా చరిత్రాత్మకమే, సమిష్టి అనుభవాల నుంచి, చిదుగుల్ని పేర్చి, తన జ్ఞానపు నిప్పురవ్వని చేర్చి, రగిలించి, జ్ఞాన దీపాల్ని వెలిగించిన అసాధారణ మహామహు లెందరో చరిత్ర గమనాన్ని శాశించారు. ఒక అరిస్టాటిల్‌… ఒక ఫ్రాన్సిస్‌ బేకన్‌… ఒక కారల్‌ మార్క్స్‌!

          శతాబ్దాలుగా సాగిన నిర్భేధ్యమైన మధ్యయుగాల అజ్ఞానాంధకారానికి గండి కొట్టిన బేకన్‌, సాంస్కతిక పునరుజ్జీవన పునాదుల్ని పటిష్టపర్చడంలో అవిరళ కృషి చేశాడు. మత యుద్ధాల కంపుతో, బూటకాలే సామాజిక సత్యాలై, అజ్ఞానమే జ్ఞానమై, సత్యం కొరరానిదై, ప్రశ్నించే ప్రతి కుత్తుకా కత్తిరించబడి, నడిబజార్లో శిలువెక్కి, అగ్నికీలల్లో చిక్కుకొని, ఆర్తనాదాలు చేసిన ఆ ఉన్మాదచరిత్రకు, మంగళం పాడేందుకు, ఎందరు బ్రూనోలు శిలువెక్కి దహనమయ్యారో, ఎందరు కోపర్నికస్‌లు, ఎందరు వెశాలీయస్‌లు, ఎందరు గెలీలియోలు… శిలవెక్కకుండానే దహించబడ్డారో తెలుసుకుంటే, గుండె తరుక్కుపోతుంది. సత్యం కోసం వేసే ప్రతి అడుగూ ఒక ముందడుగే, జ్ఞానం కోసం చూసే ప్రతి చూపూ ఒక మేలిమలుపే! 

          సాంస్కృతిక పునరుజ్జీవన తొలివేకువలో కఠినమైన మతోన్మాద నిషేధాజ్ఞల నీడలో సైతం మృత్యుదండనకు సైతం వెరువకుండా సత్యం కోసం ఎంతగా ప్రాకులాడేవారో చరిత్ర తెలిసినవారికి తెలియనిదేమీకాదు. జ్ఞానం ఎక్కడ వికసించే ప్రయత్నం జరిగినా మతం ఉలిక్కిపడింది! నిర్భేధ్యపు అజ్ఞానమే పూలై పూచిన మతానికి, కుక్కమూతి పిందెలే ఫలసాయం. ఈ విత్తనాల్నే తరతరాలుగా విస్తరింపజేసుకోవడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంది మతం. సాహిత్యరంగంలో సైతం పవిత్ర గ్రంథాలే కర దీపికలు. పవిత్ర గ్రంథపు పరిధులు దాటివెళ్లే సృజనాత్మక ఆలోచనల తోకల్ని నిర్ధాక్షిణ్యంగా కత్తిరించింది మతం! కొంగ్రొత్త ఆలోచనలకు సంకెళ్లువేసే మధ్యయుగాల మతోన్మాద భావజాలాన్ని నేటికీ పదిలంగా భద్రపరుచుకోవాలని చూడటం అనుభవంలో వున్నదే!

          జర్మన్‌ సాహితీ దిగ్గజం గోథేని ఆకర్షించిన ‘ఫాస్ట్‌’ అనే జ్ఞాన పిపాసి, అప్పుడప్పుడే ఆంగ్ల నాటకరంగంలోకి అడుగుపెడుతోన్న క్రిస్టఫర్‌ మార్లో అనే ఒక యువకుడిపై తీవ్రప్రభావం చూపడం యాదృచ్ఛికం కాదు! స్వతహాగా నాటక కర్త మార్లో ఒక విజ్ఞ్యాన తపస్వి. వుడుకు రక్తం, జ్ఞానం కోసం ఆత్మబలిదానం గావించిన ఫాస్ట్‌ గాథ క్రిస్టఫర్‌ మార్లోని నిలవనీయలేదు! ఇంకేం, మార్లో చేతిలో ఫాస్ట్‌, ”డాక్టర్‌ ఫాస్టస్‌” గా మారి, ఇంకా షేక్స్పియర్‌ నాటక రంగంపై తనదైన ముద్రకోసం తంటాలు పడుతున్న సమయానికే క్రిస్టఫర్‌ మార్లో, డాక్టర్‌ ఫాస్టస్‌ నాటకంతో అగ్ని రగిలించి అజేయంగా నిలిచిపోయాడు. ఫాస్ట్‌ అనే ఒక యువకుడు మతం నిషేధించిన జ్ఞానం కోసం ఒక భూతానికి తన ప్రాణాన్ని ఫణంగాపెట్టి ఆత్మబలిదానం కావించుకోవడమే స్థూలంగా కధాంశం.

          క్రిష్టఫర్‌ మార్లో స్వతహాగా ఒక రెబెల్‌. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదువుకున్న వాడు. ఒక నాస్తికుడిగా, దేన్నయినా ప్రశ్నించే ధీరుడిగా, రైటర్‌గా, (ఫైటర్‌గా కూడా!) సత్తా చాటుకున్నవాడు. ఆంగ్లనాటకరంగానికి రొటీన్‌ మతగాథల నిస్సారమైన మూస కథల సామూహిక బృందగానాల రసహీనమైన పోకడలకు భిన్నంగా ఒక చెలరేగిన ఉప్పెన లాంటి గాధని పరిచయం చేయబూనడం మామూలు విషయం కాదు! అదొక సాహసం, దేవుణ్ణి వెక్కిరించే సాహసం, పోప్‌ ని గేలి చేసే నిర్భీకత! మతం నిషేధించిన సత్యాన్వే షణ! మతం నిరోధించిన జ్ఞానం కోసం తపన! సత్యాన్ని శోధించడం దైవదూషణగా భావించింది మతం, మహాపరాధంగా కొరత వేసింది మతం, సజీవ దహనాలు చేసింది మతం. అహమే అన్ని అనర్ధాలకు మూలం అంటాడు సేంట్‌ అగస్టీన్‌. అహానికి ఆజ్యం పోసే అహంకారం తోడై దేవుడి దిశగా సాగే మానవ ప్రయాణాన్ని పతనానికి దారితీయించే ఉత్సుకతా, అనవసరపు ”వినాశకర” ఆసక్తీ పాపం వైపు నడిపిస్తాయంటాడు. వినాశకర మంటే మరేం కాదు! మతం చెప్పినదాన్ని కాదనే చైతన్యమే!

          డాక్టర్‌ ఫాస్టస్‌ కథానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నాటకకర్త క్రిస్టఫర్‌ మార్లో, సెయింట్‌ అగస్టీన్‌ చెప్పిన ఆ ”వినాశకర ” పాపం చేయడానికీ, తన ఆకాంక్షల్నీ, తన భావాల్నీ, తన రాగద్వేషాల్నీ ప్రకటించుకోవడానికీ నాటకం ఆద్యంతం ప్రయత్నించడం గమనార్హం!

          డాక్టర్‌ ఫాస్టస్‌ అనే ఈ నాటక కథానాయకుణ్ణి అసంతృప్తి పీడిస్తూ వుంటుంది. తీరని వేదనేదో దహించి వేస్తుంది. ఎంత చదివినా తనివితీరదు, ఎన్ని శాస్త్రాలు ఔపోసన పట్టినా యింకా ఏదో వెలితి. ఇంకా ఏదో తీరని దాహం. 

          అందుబాటులో వున్న సర్వశాస్త్రాల్లో పాండిత్యం సంపాదించాక ఒక తుంటరి కోరిక హృదయాన్ని నిలవనివ్వదు! ఇంకేం మతం నిషేధించిన, దైవానికి వ్యతిరేకంగా వున్న జ్ఞానం వైపు దృష్టి సారిస్తాడు ఫాస్టస్‌. నిషేధిత గ్రంథ పఠనం దైవదూషణే కాదు మరణ దండనకు సైతం మార్గమే. ఎందరు వద్దన్నా వినకుండా, ఎవరు వారించినా పట్టించు కోకుండా భూతప్రేతాల ఆవాహన చేస్తూ దైవాన్ని తృణీకరిస్తూ మతాన్ని అవహేళన చేస్తాడు. మతం నిర్మించి పటిష్టపరచుకున్న మహా వ్యవస్థల్ని ఎద్దేవ చేయడం కోసం ఎంతదాకా తెగిస్తాడంటే నాకు నచ్చిన జ్ఞానమిస్తే ప్రాణమిస్తానంటాడు. చివరికి మెఫిస్టోఫ లిస్‌ అనే భూతాన్ని ఆవాహన చేస్తాడు! భూతం వస్తుంది! ఫాస్టస్‌ ని భయపెడుతుంది, అదిరిస్తుంది, బెదిరిస్తుంది, నయానా,భయానా నచ్చచెప్పచూస్తుంది. అయినా వినడు ఫాస్టస్‌. నిషేధించిన జ్ఞానమే కావాలంటాడు ఫాస్టస్‌. 

          మెఫిస్టోఫలిస్‌ భూతం ఒక షరతు విధిస్తుంది. అదేమిటంటే ‘నీకు ఆ అవకాశం కలిగించడానికి నువ్వు నాకు నీ ఆత్మని ఇరవై నాలుగేళ్ళ తర్వాత అర్పించాలని’ చెబుతుంది. ఒకటేమిటి నక్షత్రాల్ని మించిన ఆత్మలున్నా అవన్నీ అర్పిస్తానంటాడు ఫాస్టస్‌! నమ్మలేనంటున్నది భూతం! ఎలా నమ్ముతావంటాడు ఫాస్టస్‌. నీ రక్తంతో హామీ పత్రం రాసివ్వు అంటుంది భూతం. ‘సరిగ్గా ఇరవైనాలుగేళ్ల తర్వాత అర్ధరాత్రి లూసిఫర్‌ (నరకానికి అధిపతి)కి నీ ఆత్మ నైవేద్యమౌతుంది గుర్తుంచుకో’ అంటుంది భూతం.

          ఎటువంటి తడబాటు లేకుండా, నిర్భయంగా, జరగబోయే విపరీత, విపత్కర, విపత్తుల స్పృహ లేకుండా, అత్యుత్సాహంతో, భూతం కోరిన విధంగా, రక్తంతో హామీ పత్రం రాసిస్తాడు ఫాస్టస్‌. అంతులేని అధికారం, అనంతమైన సంపదలు, అపరిమిత మైన జ్ఞానకాంక్ష అన్నింటికీ మించి నిషేధించిన జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలన్న తాపత్రయం ఆ సాహసిని ఆలోచించకుండా చేస్తారు!

          ఇంక ఇక్కడ నుండి ఫాస్టస్‌ అనుభవాలన్నీ ఒక నిర్భీకతని ఆలింగనం చేసు కుంటారు. మతాన్ని పరిహసిస్తూ సాగిపోతారు. దేవుణ్ణి ధిక్కరించిన ఫాస్టస్‌, మతం నిషేధించిన మాంత్రిక శాస్త్రాల్ని అధ్యయనం చేస్తాడు, కట్టుబాట్లను హేళన చేస్తాడు, సామాజిక సంస్థల్ని అవహేళన చేస్తాడు, నరకం ఒక కట్టుకథ అని కొట్టిపారేస్తాడు, ప్రార్థనల్ని వెక్కిరిస్తాడు, పవిత్ర గ్రంధాల్ని అధిక్షేపిస్తాడు, భూత ప్రేత పిశాచ గణాల్ని చూసి భయపడకండని భరోసా ఇస్తాడు. మతమొక మూఢత్వం అని ప్రకటిస్తాడు. ఖండాంతరాలు తిరుగుతాడు, ఖండాలు చుట్టబెడతాడు, రాజుల్ని దర్శిస్తాడు, ప్రభువుల్ని ప్రశ్నిస్తాడు. రోమ్‌ నగర ప్రవేశం చేస్తాడు, పోప్‌ ని ఆటపట్టిస్తాడు, విందులో ఉన్న పోప్‌ చేతి పళ్లెం లాక్కుంటాడు, హేళనగా చెవి మీద కొడతాడు!… సప్త మహా వ్యసనాల అంతు చూస్తాడు! అదొక అసాధారణ జీవితపు దశ! స్వేచ్ఛ నియంత్రించబడే ప్రతిదాన్నీ ప్రశ్నించాలన్న ఉబలాటం, ఉత్సుకత, మానవుడు స్వేచ్ఛని ప్రేమించ డంలో అంతర్లీనంగా వుండే ఒక పునరుజ్జీవన స్ఫూర్తి! తలెత్తి నిలబడాలన్న ఒక నిలవ నీయని అంతర్మథనం!

          అన్ని కట్టుబాట్లని యథేచ్ఛగా దాటుతాడు, సర్వ భోగాల్నీ అనుభవిస్తాడు! ప్రశ్నించడం నేరమన్న ప్రతిదాన్నీ నిలవరిస్తాడు! ఇంతేనా జీవితం? ఇంతకన్నా ఏమీ లేదా ? అనుకుంటూ వెనుదిరిగి చూసుకునే లోపే ఇరవైనాలుగేళ్ళు కరిగిపోతారు! అలెగ్జాండర్‌ లాంటి జగజ్జేతల్ని, హెలెన్‌ లాంటి జగన్మోహినీలనీ, పోప్‌ లాంటి ధార్మిక ద్రష్టల్ని అవలోకించి చూసి ఏ అనుభూతుల్ని ప్రోది చేసుకోవాలనుకున్నాడో ఏమో, ఇంకా చదవని విటెన్‌బర్గ్‌ల ఆలోచనలు నుంచి ఇంకా మేల్కొనక మునుపే మృత్యువు ద్వారం ముందు హఠాత్తుగా ప్రత్యక్ష మౌతుంది!

          ఇరవై నాలుగేళ్ళ జీవితం గిర్రున తిరిగి, హారతై కరిగి, మృత్యువు సజీవమై, ఎదురు గా సాక్షాత్కరిస్తుంది! నేను సాధించాలనుకొనే దానికి ఎన్ని ఆత్మలనైనా సమర్పిస్తానని డాంబికాలు పలికిన ఫాస్టస్‌ అనే సాహసి, మెఫిస్టోఫలిస్‌ భూతం హఠాత్తుగా ద్వారం దగ్గర ఎదురొచ్చి, ఆత్మని సమర్పించే వేళ దగ్గరైందని చెప్పగానే ఫాస్టస్‌ ఒక్కసారిగా ఉలికి పడతాడు! భీతిల్లిపోతాడు, ఒక్కసారిగా భయ విహ్వలుడౌతాడు! చల్లని మృత్యు స్పర్శ తలచుకోగానే వళ్ళు జలదరిస్తుంది. భయంతో వజవజ వణికి పోతాడు!

          అర్ధరాత్రి పదకొండు గంటలు! నెత్తుటితో రాసిచ్చిన హామీ పత్రం గడువు ఇంకో గంటలో ముగిసిపోనుంది!

          నిండుజీవితాన్ని కబళించడం కోసం లూసిఫర్‌ (నరకాధిపతి)తరపున మెఫిస్టోఫలిస్‌ భూతం కాచుకు కూచుంది! ‘నీ గడువు తీరింది. నీ బలిదానానికి వేళ ఐంది, లూసిఫర్‌ నించి పిలుపువచ్చింది. సిద్ధంగా వుండు. ముగింపులేని నరకలోకపు యాతనలకు నీ ఆత్మని సిద్ధంగా వుంచు’ అంది కఠినంగా.

          ఇంక అదొక విషాదం, గుండెలు పిండేసే ఆ ఘట్టం, ఎంతటి వాడినైనా కంటతడి పెట్టిస్తుంది. సరిగ్గా ఇరవైనాలుగేళ్ల క్రితం, ఇదే సమయానికి, అత్యంత సాహసోపేతంగా, మరణ శాసనం మీద నెత్తుటి సంతకం పెట్టిన ఫాస్టస్‌, ఇలా బేలగా, మృత్యువు చేరువ కాగానే, విలపించే ఫాస్టస్‌ ఒకరేనా అనిపిస్తుంది! మరణ భయం ఊపిరాడనివ్వదు. ఏ క్షణంలో గుండె విచ్చిపోతుందేమోనన్న వేదన. కరిగి పోయే కాలం ముందు మోకరిల్లి, గుండెలు పగిలేలా రోధిస్తాడు. భయంతో విలవిల లాడిపోతాడు, ఆగిపోని కాలచక్రాన్ని కాసేపైనా నిశ్చలమైపొమ్మని ప్రాధేయ పడతాడు. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. వొద్దు! ఓ కాలమా నిలిచిపో! అలా ఉండిపో… కొద్దిసేపు.. అలా ఆగిపో… హే భగవాన్‌! ఈ నరకయాతన నేను భరించలేను! గుండెలు ప్రిదిలి పోతున్నారు! ముగిసిపోయే మరణాన్ని ప్రసాదించు! నా ఆత్మకొక విముక్తి ప్రసాదించు!

          అనంత కాలాల పాటూ నిరంతర వేదనతో కొనసాగే ఆ నరకం నుంచి తప్పించు! గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు ఫాస్టస్‌, గాలం ముల్లుకి చిక్కిన చేపలా విలవిల లాడుతున్నాడు ఫాస్టస్‌. కాలం సమీపిస్తుంది.. గంటలు నిమిషాలౌతు న్నారు.. నిమిషాలు… క్షణాలుగా కరిగిపోతున్నారు… ఓ నా ప్రాణమా!… త్వరగా కరిగిపో… జల బిందువులుగా మారిపోయి సింధువులో కలిసిపో త్వరగా… లూసిఫర్‌ కి దొరక్కుండా నీలో కలిపేసుకో! హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు.. గుండెల్ని మెలిపెట్టే బాధ.. పగవాడికి కూడా వద్దనుకునే మరణ వేదన… దేవుడా!!!

          అదిగో వచ్చేస్తున్నారు భూతాలు… బాబోయ్! అలా… అంత భయానకంగా చూడొద్దు!.. ఓ భీకర సర్పాల్లారా! దయవుంచి అలా చూడొద్దు… నా చేరువకు రావొద్దు! కొద్దిసేపు నన్నిక్కడ వుండనివ్వండి!

          ఓ వికృత నరకమా! నీ ద్వారాలు తెరవొద్దు! దయ ఉంచి నన్ను తీసుకెళ్లొద్దు! లూసిఫర్‌ ! రాకు…దగ్గరకు రాకు! వదిలేరు నన్ను!..ఇవిగో, నా పుస్తకాలు తగలబెడతాను! దయుంచి రావొద్దు లూసిఫర్‌! వెళ్లిపో

          సమయం సరిగ్గా పన్నెండు గంటలు!

          ఏది జరగాల్సివుందో అది జరిగిపోతుంది!

          మెఫిస్టోఫలిస్‌ చల్లని మత్యుహస్తం మెల్లగా తాకుతోంది!

          ఓ వీరా! వచ్చావా… మెఫిస్టోఫలిస్‌!

          గుండెలవిసేలా దుఃఖిస్తున్నాడు ఫాస్టస్‌… వచ్చేశావా నువ్వు! అయ్యో! అయ్యో!! వద్దు..వద్దు…వద్దు…నన్ను కబళించకు… వెళ్లిపో… వెళ్లి…పో… వెళ్లి.. పో… ద.. య.. ఉం.. చి.. వెళ్లి…. పో… మె… ఫి… స్టో…ఫ… లి. స్‌ స్‌ స్‌…

          మరునిమిషంలోనే ఫాస్టస్‌ ప్రాణాన్ని, అత్యంత కర్కశంగా, దయనీయంగా ఆక్రమించుకుంది మెఫిస్టోఫలిస్‌!

          విశ్వసాహిత్యంలో ఫాస్టస్‌ గాధ ఒక మరపురాని మహా విషాద కావ్యం! మధ్య యుగాల ఒక సజీవగాధని అత్యంత భయానకంగా నాటకరూపం కల్పించిన క్రిస్టఫర్‌ మార్లో తన 29 యేట మరణించడమే కాదు, తను నమ్మిన భావజాలాన్ని తెలివిగా, నాటకరూపంలో చొప్పించే సాహసం చేయడం మామూలు విషయం ఏమీ కాదు! అర్ధశతాబ్దపు వెనుకటి గాధని, అందునా మధ్యయుగాల చారిత్రక నేపధ్యంలో, సాహిత్యరంగాన్ని సైతం మతం శాసించే రోజుల్లో, ఫాస్టస్‌ ఒక సాహసం!

          ఫాస్టస్‌ గాధ ఇప్పుడెందుకన్న ప్రశ్న ఉదయించవచ్చు! ఈ దయ్యాలూ, భూతాలూ, నరకాలూ, మాంత్రిక శాస్త్రాలు కట్టుకథలే కదా అనుకోవచ్చు! నిజమే, అభూత కల్పనలో కూడా సత్యాన్వేషణ దిశగా ఫాస్టస్‌ మత మూర్ఖ్వాన్ని ప్రశ్నించిన స్ఫూర్తి వుంది! నిలదీసిన సాహసం వుంది! జ్ఞానం కోసం తపించడం వుంది! మార్పుని కోరే హదయం వుంది! మతం విధించిన పరిమితుల్ని అపహాస్యం చేస్తూ కూడా పాత్రోచిత ఔచిత్యంతో క్రిస్టఫర్‌ మార్లో ఆడిన నాటకం ఒక అసాధారణ శిల్పం! నాలుగైదు శతాబ్దాల కిందటి మాట… అయితేనేం… కల్పిత గాధల్లో తారసిల్లే పవిత్ర మూర్తుల పాదాలముందు ప్రణమిల్లే కోటానుకోట్ల నేటి మహా మేధావుల కంటే కూడా ఫాస్టస్‌ అత్యంత ఆధునికుడు! అజ్ఞానపు చీకటి తెరని సాహసమనే కాంతి ఖడ్గంతో చీల్చు కుంటూ, ఒక సమున్నత మార్గంలో పయనించిన ఒక రియల్‌ హీరో! ఫాస్టస్‌ ఒక స్ఫూర్తి జ్వాల! మధ్య యుగాల మతోన్మాదపు అంధకారంలో పొద్దుపొడిచిన ఒక కాంతి రేఖ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.