దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

         అక్కడ ప్రఫుల్లకి శిక్షణ మొదలయ్యింది. నిశికి అక్షర జ్ఞానం వుంది. అంతకు క్రితమే తనను దొంగలు రాజుకి అమ్మివేసినప్పుడు, అంతఃపురంలో కొంత నేర్పించారు. తరువాత భవానీ పాఠక్ నేర్పించాడు. ఇప్పుడు నిశి ప్రఫుల్లకు అక్షరమాల, రాయటం చదవటం నేర్పించిందివ్యాకరణం భవానీ పాఠక్ వచ్చి నేర్పించసాగాడు. ఒక ఆకలిగొన్న పులి వలె, ప్రఫుల్ల విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ప్రఫుల్ల పట్టుదల, చురుకైన బుద్ధి చూసి నిశి ఎంతో ఆశ్చర్యపోయింది. రాత్రీ పగలూ చదువుతూ వుండేది. వ్యాకరణం చదవటం పూర్తి అయ్యింది. ప్రఫుల్ల కావ్యాలు చదవటం మీద ధ్యేయం పెట్టింది. రఘువంశం, కుమారసంభవం, నైషధం, శాకుంతలం ఇత్యాది కావ్యాల మీద పట్టు సాధించింది. తరువాత యోగ శాస్త్రం అధ్యయనం చేసింది. ఆఖరకు భగవద్గీత చదివింది. భవానీ పాఠక్ న్యాయ శాస్త్రం, గణిత శాస్త్రము కూడా నేర్పించాడు. అయిదు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ప్రఫుల్ల పరిపూర్ణ విద్యావంతురాలయ్యింది

         ప్రఫుల్లకు ఇంటి పనుల చేయటానికి మాత్రం పెద్ద సహాయమేమి లభించలేదు. పేడకళ్లోడి తల్లికి సంతకు పోయి వస్తుండేది తప్ప వేరే పనులు అందుకునేది కాదు. దివ కూడా అంత పనిమంతురాలు కాదు. ప్రఫుల్లకు ఇందువల్ల ఏమీ కష్టం అనిపించలేదు. తన ఇంటి దగ్గర పనులు చేసుకున్న అలవాటుతో ఇక్కడ కూడా చేసుకున్నది. వెచ్చాలు భవానీ ఠాకూర్ పంపుతూ వుండేవాడు. ముతక బియ్యం, కాస్త ఉప్పు, పచ్చి అరటికాయలు. ప్రఫుల్ల వీటికే చాలా సంతోషపడింది, తన తల్లి దగ్గర వున్నప్పుడు మాత్రం కూడా దొరికేవి కాదు కదా. నిశి కూడా అవే తినేది. తీపి పదర్ధాలు, వెన్న తినటం నిషేధించాడు. ప్రఫుల్ల భవానీ ఠాకూర్ చెప్పినట్లు పూర్తిగా నడుచుకునేది, ఒక్క విషయంలో తప్ప. ఏకాదశి నాడు తప్పనిసరిగా చేపలు వండుకుని తినేది. ఒకవేళ పేడకళ్లోడి తల్లికి సంత నుండి చేపలు తేకపోతే, తనే దగ్గరలో వుండే సెలయేటికి వేళ్లి చేపలు పట్టి తెచ్చుకునేది

         భవానీ పాఠక్ రెండవ సంవత్సరం ప్రఫుల్లకి ఇచ్చే ఆహార భత్యంలో బియ్యం, ఉప్పు, మిర్చితో బాటు ఏకాదశికి ఒక చేపను కూడా ఇచ్చే ఏర్పాటు చేసాడు. మూడవ సంవత్సరా నికి వెన్న, కొన్ని మిఠాయిలూ కూడా ఇవ్వటం జరిగింది. కానీ ప్రఫుల్ల ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు. పేడకళ్లోడి తల్లికి వెన్న, మిఠాయిలు ఇచ్చి, తను నిశితో బాటు కూర్చుని తినేది. నాల్గవ సంవత్సరానికి ఇచ్చే వెచ్చాలు పెరిగాయి, కానీ ప్రఫుల్ల తను ఎప్పటిలాగే తింటూ మిగిలినవి పేడకళ్లోడి తల్లికి ఇచ్చేది. ఐదవ సంవత్సారానికి ప్రఫుల్ల తన ఇష్టం వచ్చినట్లు తినవచ్చు అని భవానీ పాఠక్ ఆజ్ఞ జారీ చేసాడు.

         కట్టుబట్టుల విషయంలో కూడా ఇలాంటి ఏర్పాటే జరిగింది. మొదటి సంవత్సరం రెండు ముతక చీరలు ఇచ్చారు, ఒకటి కట్టుకోవటానికి, రెండవది ఉతికి ఆరేసుకోవటానికి. పనులు చేసుకోవటానికి తేలికగా ఉంటుందని భవాని పాఠక్ ఇచ్చిన చీరలని కూడా కొంత చించి కట్టుకునేది. రెండవ సంవత్సరానికి నాలుగు చీరలు ఇచ్చాడు. మూడవ సంవత్సరానికి వేసవికి పలచటి చీరలు, చలికి దళసరి చీరలు ఏర్పాటు చేసాడు. నాల్గవ సంవత్సరానికి ఢాకా చీరలు తెప్పించి ఇచ్చాడు. ఐదవ సంవత్సరానికి ప్రఫుల్ల తన ఇష్టం వచ్చినట్లు చీరలు కట్టుకోవటానికి ఏర్పాటు చేసాడు.

         కేశ సంస్కారం కూడా అలానే. మొదటి సంవత్సరం తలకి నూనె పెట్టుకోవటం నిషేధించాడు. ప్రఫుల్ల ఎండిన జుట్టునే కొంత దువ్వుకుని ముడివేసుకునేది. రెండవ సంవత్సారానికి జుట్టు ముడివేసుకోవటం కూడా నిషేధించాడు, జుట్టు అలానే విప్పార్చు కునేది. మూడవ సంవత్సరం గుండు చేయించాడు. నాల్గవ సంవత్సారానికి కొత్త జుట్టు వచ్చింది, అప్పుడు సౌగంధికా తైలం తెప్పించి కేశ సంస్కారానికి ఇచ్చాడు. ఐదవ సంవత్సరం ప్రఫుల్ల తన ఇష్టం వచ్చినట్టు కేశసంరక్షణ చేసుకోవటానికి అనుమతి ఇచ్చాడు. కానీ, ఐదవ సంవత్సరం వచ్చే సరికి ప్రఫుల్ల తన జుట్టుని చేతితో సవరించుకో వటం కూడా మానివేసింది.

         ప్రఫుల్ల అప్పటికి తన శరీరాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకుంది. గాలి, ఎండా, వేడి, చల్లదనం వంటి వాటినుండి విముక్తి చేసుకుంది. మంచం మీద పడుకోవటం మానివేసి కటిక నేల మీద పడుకోసాగింది. శిక్షణ అంతా ఏదో ఉన్నతమైన ధ్యేయం కొరకే అని అనుకుందేమో, ఒక ఉత్తమ విద్యార్ధి లాగా గురువు ఆజ్ఞలను పాటించేది. ఒకసారి భవానీ పాఠక్ ఇంకొక రకం శిక్షణ కూడా ప్రారంభిస్తాను అంటూ, “మల్ల యుద్ధం నేర్చుకుంటావా అన్నాడు.”

         ప్రఫుల్ల చిన్నగా నవ్వి, “ఇది మాత్రం నేర్చుకోలేనుఅన్నది.

         “నేర్చుకోవాలి, లేకపోతే పని జరగదు.”

         “పాఠక్ గారూ, ఆడవాళ్లు మల్ల యుద్ధం నేర్చుకుంటారా?”

         “ఇంద్రియాల పైన విజయం సాధించాలంటే నేర్చుకోవాల్సిందే.”

         “నాకు మల్ల యుద్ధం ఎవరు నేర్పించుతారు? మగవాళ్లతో నేను నేర్చుకోనుఅన్నది ప్రఫుల్ల.

         “నిశి నేర్పుతుంది. నిశిని దొంగల ముఠా వాళ్లు ఎత్తుకుపోయినప్పుడు వాళ్లేమీ ఊరికే కూర్చోబెట్టలేదూ. వాళ్లకి కుడా గట్టి మనుష్యులే కావాలి, ఆడా మగా తేడా లేదు. వాళ్లు నిశికి కుస్తీలూ కొట్లాటలూ బాగానే నేర్పించారు. దుండగల నుంచి కూడా తనకి ఏమీ అవాంతరాలు రాకుండా తనను తాను రోజువారి కాపాడుకోవటానికి నిశి మల్ల యుద్ధం బాగానే సాధన చేసింది. గట్టిగానే ఎదుర్కొనేదిఅన్నాడు భవానీ పాఠక్

         ఆయన చెప్పినట్లే నిశి మల్ల యుద్ధం, కర్ర సాముల్లో ప్రచండురాలు. ప్రఫుల్ల నిశి దగ్గర యుద్ధ విద్యలు బాగానే నేర్చుకున్నది. అలా నాలుగు సంవత్సరాలపాటు ప్రఫుల్ల మల్ల యుద్ధం కూడా నేర్చుకున్నది.

         మొదటి సంవత్సరం భవానీ పాఠక్ ప్రఫుల్ల దగ్గరకి పురుషుడినీ రానివ్వలేదు. రెండవ సంవత్సరం ఎవరైనా మగవాళ్లు కనబడితే, వాళ్లతో మాట్లాడటానికి అనుమతి ఇచ్చాడు. మూడవ సంవత్సరం భవానీ పాఠక్ తను ఎంచుకున్న శిష్యులు కొందరిని ప్రఫుల్ల దగ్గరకి తీసుకువచ్చి న్యాయ తర్క శాస్త్ర చర్చలువాద ప్రతివాదాలూ జరిపిం చాడు. నాల్గవ సంవత్సరం తన శిష్యులలో కొందరితో కలిపి ప్రఫుల్లతో కర్రసాము, కత్తిసాము చేయించాడు. ప్రఫుల్ల వారందరితో సోదర భావంతో మెలిగేది

         ప్రఫుల్ల ఏకాదశి రోజున చేపల కూర తినటం తప్ప మిగిలిన అన్ని విషయాలలోనూ భవానీ పాఠక్ చెప్పినట్లు చేసేది. ఇదీ, ప్రఫుల్లకు, భవానీ పాఠక్‌కూ ఉన్న పరిచయం, బంధం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.